Sunday, July 10, 2016

మంచి మాట

మంచి మాట 
---------------
భావరాజు పద్మిని - 16/7 /15

మంచి మాట - ఒక రాజు కధ 
------------------------------
అనగనగా ఒక రాజుగారు. ఆ రాజు గారికి తరచుగా తన నోటిలోని పల్లన్నీ ఊడిపోతున్నట్టు కల వస్తోంది. వెంటనే జోతిష్య పండితుడిని పిలిపించి , తన కలకు అర్ధం చెప్పమన్నాడు.
అతను, 'రాజా! ఈ కల అశుభ సూచకంగా అనిపిస్తోంది. మీ వాళ్ళంతా, మీ కాళ్ళ ముందే రాలిపోతారు...ఇదే, ఈ కలకు అర్ధం' అన్నాడు.
రాజుకు వెంటనే బోలెడంత కోపం వచ్చేసింది, మరి రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? వెంటనే ఆ జ్యోతిష్కుడిని చెరలో వేయించాడు.
మరొక జ్యోతిష్కుడు వచ్చి, 'రాజా! కొంత కటువుగా అనిపించినా, వాస్తవం చెప్పక తప్పదు. త్వరలోనే నీవు నీ ఆప్తులను కోల్పోతావని, ఈ కల తెలియజేస్తున్నది,' అన్నాడు.
ఈ జ్యోతిష్కుడికి కూడా చేరసాలే గతి అయ్యింది... ఇలా రాజు గారి కల మహిమ వల్ల చాలా మంది శిక్షలు అనుభవించారు. అప్పుడు, లౌక్యం, మాటకారితనం కలబోసిన ఒక పండితుడు రాజ సభకు వచ్చి, ' రాజా! నీవు ఎంతో అదృష్టవంతుడివి. దీర్ఘాయువువి. మీ వంశం మొత్తంలోకీ నీవే చిరకాలం బ్రతుకుతావు. పూర్ణాయువుతో , ఆరోగ్యంతో, చల్లగా ప్రజలను పాలిస్తావు. ఇదే నీ కలకు అర్ధం...' అన్నాడు.
రాజు ఉప్పొంగిపోయి, ఆ జ్యోతిష్కుడికి అనేక మాన్యాలు, బహుమతులు ఇచ్చి పంపాడు.
అంతరార్ధం ఆలోచిస్తే, జ్యోతిష్కులంతా చెప్పింది వొకటే! కాని, చెప్పిన విధానంలో తేడా!

                                               

చివరి జ్యోతిష్కుడు రాజు మనసును, ప్రవర్తనను తెలుసుకుని, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేసి, విషయాన్ని చెప్పాడు. అందుకే, తనకు కావలసిన సంపదలని, రాజు మెప్పును పొందాడు.
ఎవరయినా మాట్లాడే ముందు ఇలాగే ఆలోచించి, ఎదుటి వారి స్థితి అంచనా వేసి మాట్లాడితే, అసలు మనుషుల మధ్య విభేదాలే ఉండవు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థాయికి దిగి మాట్లాడాలి, స్త్రీలతో సున్నితంగా ప్రస్తావించాలి, పెద్దలతో, వారి స్థాయికి ఎదిగి మాట్లాడాలి. తొందరపాటు, దూకుడు మాటలతో కొందరు ఇతరుల మనసులు చప్పున నొప్పించేస్తారు. వీటికే పుల్లవిరుపు మాటలని పేరు. ఇటువంటి వారికి అందరూ దూరమవుతారు. మంచి మాటతో మీరు మనసులు గెలుచుకుంటారు. మంచి మాట, చెప్పే పద్ధతిలో మీరు చెప్పగలిగితే, ఎవరినయినా మెప్పించగలరు. ఏమయినా సాధించగలరు. ఇది సత్యం.

Saturday, July 9, 2016

నా పాటలు

నా పాటలు 
భావరాజు పద్మిని 
నేను రాసిన వివిధ గేయాలు ఇందులో పొందుపరుస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే అంతే చాలు .
 ద్వారకామాయి వాసా సాయి 
నీదరి చేరితి దయగనవోయి 
సాయి రూపమే పరమశివం 
సాయి నామమే పరమపదం 

నిన్ను కన్నంతనే కలుగును హాయే 
నిను నమ్మి కొలిచితె కలతలు పోయే 
నీ కృప కలిగితే తొలగును మాయే 
నీ చరణమ్ములే వరములు వేయే // ద్వారకామాయి //

మది నీ మందిరం సాయి దేవా 
శ్రద్ధ సబూరి నిరతమునీవా 
ప్రేమతో పిలిచితి కావగ రావా 
భక్తుల పెన్నిధి నీవే కావా ? / / ద్వారకామాయి //

*********************************************************************************************************************
కార్లలో తిరుమల చాలామందే చేరుకుంటారు, కానీ మెట్లదారిలో వెళ్తే నిజమైన భక్తి కనిపిస్తుంది. అలా వెళ్తూ చూసినవే పాటగా పల్లవించాయి
మెట్టుమెట్టున పసుపు కుంకుమలు అలదుచు
పట్టెడి హారతుల పూవుల పూజ చేయుచు
మెట్టుమెట్టుకు మ్రొక్కి నీదిక్కు చేరెడి
భక్తుల జన్మల గట్టు దాటించగరావయా
రాయిని రప్పన నిన్నె కాంచి భజియించుచు
రాతిమీద రాతిని పేర్చి ఇల్లిమ్మని వేడుచు
రాళ్ళ తుప్పల దాటి నిన్ను చేరెడివారి
రాతల మార్చి చేయూతనివ్వు తిరుమలరాయా
గోవింద గోవిందని ఎలుగెత్తి పిలచుచు
పిల్లపాపల నెత్తి ఊరేగింపుగ దెచ్చుచు
ఆటల పాటల శంఖనాదాల గంటల
నీకు వేడుక జేయు దాసులగాచు వేంకటరాయా
కాలు లేకున్నను నడవ లేకున్నను
భక్తియె దన్నుగ జేసి కర్రల మొకాళ్ళ పాకి
పాపలవలె పారాడె నీ నిజబంటులను బ్రోచి
పదిలముగ నీ ఒడిలో పొదువుకొనగను రావయా
భావరాజు పద్మిని - 2/6/16.

**********************************************************************************************************************
                                                    

ఈ సారి ఆ తిరుమలవాసుని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఒక ఉదయం చెట్టు నీడన చల్లగాలిని ఆస్వాదిస్తూ కూర్చుంటే, ఆ గాలిలోనే ఏదో మాయ ఉందనిపించింది. ఆ భావన లోంచి జనించిన పాటే ఇది.
భావరాజు పద్మిని - 4/6/16
ఏడు లోకాలే ఏడుకొండలు కాగ
ఏడేడు జన్మల పాపాలు కడుగగ
ఎట్టెదుట కొలువైన వేంకటేశ్వరుడా
ఎటులైన దరిజేర్చు వాత్సల్య హృదయుడా
ఏ మునులు తపముకై ఈ తరువులయ్యిరో
ఏ ఋషులు నినుగొల్చి శుకపికములయ్యిరో
ఈ ఉడుత లీచిరుత లీజీవజంతులు
నెలకొనిరి ఈ విధము నీ కడనె నిలువగ
ఏ దివ్య తీర్ధములు ఇట సరసులైనవో
ఏ స్వర్గ ధామములు ఇట నెలవులైనవో
ఏ దివిని వీవెనలు పవనమ్ములైనవో
ఈ శాంతి నిలనెచట పొందలేమోస్వామి
దేవతలె నిటనిలవ నదృశ్యరూపున
నీ విమానమ్ముకడ కొలువయ్యి ఉందురట
యంతంత వారలె నింతచోటుకు వెదుకు
ఈ తిరుమలాయెను కలియుగ వైకుంఠము

*****************************************************************************************************************
december 12,2015
పల్లవి:
కొండంత ఎదిగినా కోరేదీ ప్రేమ
అచ్చంగా తెలుగు పంచు వెచ్చనైన ప్రేమ
చరణం1:
ఆత్మీయ బంధాలు ఆ దేవుని రూపాలు
అన్నదమ్ములక్కచెళ్ళెలంతా మణిపూసలు
చిరుచిరు కోపాలైనా చిటపట రుసరుసలైనా
సర్దుకుపోతేనే కదా మమతల మాధుర్యాలు // కొండంత//
చరణం2:
ఎగసిపడే భావాలను శ్రుతిచేసి మేళవిస్తే
తలపుల కుసుమాలన్నీమాలికగా జతచేస్తే
మదిలో పరిమళములే మహికే నందనములై
కొత్తచరిత కాద్యమై చరితార్ధం చెయ్యవా // కొండంత//

*******************************************************************************************************************
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం

ప. కరుణాంతరంగ లక్ష్మి నృసింహ
కలుష విదారా పావన నృసింహ

చ.౧. కంభమున బుట్టిన ఉగ్ర నృసింహ
హిరణ్య కశిపు ధ్వంసి వీర నృసింహ
మహావిష్ణు జ్యోతియె జ్వాలా నృసింహ
సర్వతోముఖుడవీవు సుందర నృసింహ //కరుణాంతరంగ//

చ.౨. దుష్టుల దునిమేటి భీషణ నృసింహ
భక్తుల గాచేటి భద్ర నృసింహ
మృత్యుమృత్యుడవు నీవు అభయ నృసింహ
నమోనమో అహోబిల నృసింహ //కరుణాంతరంగ//

*****************************************************************************************************************

nov 15, 2014
మొట్టమొదటిసారి... ఒక పాట రాసాను. ఒక్క పాట రాయడం యెంత కష్టమో తెలిసింది. 2 రోజులు పట్టింది. తర్వాత ట్యూన్ కట్టాను... పాడాను. ఈ పాట నా అభిమాన దర్శకులు, రచయత అయిన Filmdirector Vamsy గారికి అంకితం... ఎందుకంటే... ఈ పాట వారికి ఇష్టమైన గోదావరిపై రాసాను. వినండి... చూడండి... చదవండి...మీ అభిప్రాయం చెప్పండి...
రచన, సంగీతం, గానం : భావరాజు పద్మిని
పాట సాహిత్యం :
పల్లవి :
వెండి వెల్లువయ్యింది వెన్నెల్లో గోదారి
నిండు పున్నమయ్యింది గుండెల్లో గోదారి
చరణాలు :
వేకువన గోదారి విరిసే మందారం
వెలుగుల్లో గోదారి మెరిసే బంగారం
సందెల్లో గోదారి సొగసే సింగారం
వెన్నెల్లో గోదారి మురిసే వయ్యారం || వెండి ||
పాపికొండల నడుమ పరవళ్ళు తొక్కింది
భద్రగిరి రామయ్య పాదాలు కడిగింది
కోనసీమన పచ్చని చీర చుట్టింది
కడలికై ఉరికింది కలల గోదావరి || వెండి ||
పాయలేన్నింటినో పాపిట దిద్దింది
జీవులన్నింటినీ కడుపులో కాచింది
చరితలెన్నో చెప్పి చల్లగా నవ్వింది
కవుల కవనాలలో కళకళలు ఆడింది ||వెండి ||
*****************************************************************************************************************
jan 11, 2015
నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టమండి, మీరు ఒక పాట రాస్తారా ? అని అడిగారు Pullati Rajesh గారు. ఆ దైవకృపతో రాసి, పాడాను. మీరూ వినండి... చదవండి.
శ్రీరామ రామ జయ రామ రామ కోదండ రామ రణరంగ ధీమ
శ్రీరామ రామ జయ రామ రామ సుగుణాభిరామ హనుమంత సోమ
పల్లవి :
హనుమ హృదయమే రామాలయము
హనుమ స్మరణమే మంగళకరము
చరణాలు :
1.
మారుతాత్మజుడు అంజనీసుతుడు
సూర్యుని శిష్యుడు అతిబలవంతుడు
సుగ్రీవుని హితుడు సుందరరూపుడు
వాక్కున చతురుడు వానరయోధుడు
వీర మారుతి ధీర మారుతి విజయ మారుతి వరద మారుతి
నిత్య మారుతి సత్య మారుతి అభయ మారుతి అక్షయ మారుతి // హనుమ హృదయమే //
2.
కామరూపమును పొందు వజ్రాంగుడు
అసురుల దునిమెను లంకను గాల్చెను
సీత జాడ గనెను వారధి గట్టెను
లకష్మణుకై సంజీవని తెచ్చెను
రామదూత రామ దాస రామభక్త రామభ్రాత
రామనామ జప పావన గాత్ర రామ పాదుకా సేవన సూత్ర // హనుమ హృదయమే //

*****************************************************************************************************************
nov 29, 2014

నాల్రోజుల క్రిందట ఉదయాన్నే టీ తాగుతూ ఉంటే , ఉదయంలో కూడా ఒక ముగ్ధ మౌన రాగం ఉంటుంది కదా, అనిపించింది. వెంటనే ఏ రాగాలు ఉంటాయో ఆలోచించి రాయాలని అనిపించింది. అదండీ సంగతి... అప్పటి నుంచి పగలూ రాత్రీ పాట గోలే ! పాట రాయడం ఓ రోజు పడితే, వీణ మీద ట్యూన్ కట్టడం, అది రికార్డు చేసి, కంప్యూటర్ లో ప్లే చేస్తూ, మళ్ళి పాట పాడి రికార్డు చెయ్యడం... వెరసి... 5 రోజులు పట్టింది... మీరూ వినండి, చదవండి, చూడండి ...
-------------------------------
ప్రకృతి రాగమే సంగీతం
హృదయ భాషయే సంగీతం
ఉదయభానుడి భూపాలరాగం
కొండగాలుల మలయమారుతం
విరిసే పూవుల వసంత రాగం
యేటి గలగలలె గమనప్రియగా
కువకువ ధ్వనమే కోకిలప్రియగా
నెమలి నాట్యమే మయూరధ్వని
ప్రేమ భావనే కేదారముగా
ఇంద్రధనస్సులా రాగమాలిక \\ప్రకృతి\\
వేద పఠనమే హంసధ్వనిగా
వెన్నెల గానం పూర్ణచంద్రిక
మేఘరాగమే మేఘరంజని
వానజల్లులా అమృతవర్షిణి
వేల వన్నెల కాంచు మనసులు
మురిసి పాడేను మోహన రాగం
వెండి అలలపై రాజహంసలా
ఆత్మ ఆడెను ఆనందభైరవై \\ప్రకృతి\\
*****************************************************************************************
నేడు గరుడపంచమి... గరుత్మంతుని స్మరణ మాత్రం చేత సర్వ విషాలు తొలగిపోతాయి. రామలక్ష్మణులకు నాగబంధ విముక్తిని, తల్లికి దాస్య విముక్తిని కలిగించిన అమితబలశాలి ఇతడు. గరుడుని మహిమను చక్కని పాటగా రాసి, గరుడధ్వని రాగంలో స్వరపరచి, అందిస్తున్నాను. నొటేషన్ ఇచ్చేముందు ఇష్టమున్నవారు, జన్మజన్మల విషాలు, పాపాలు తొలగేందుకు , శ్రేయస్సును పొందేందుకు, ఒక్కసారి ఈ పాటను చదవమని మనవి.

గరుడా గరుడా పరమానందకరుడా
వినతసుతుడ మాతృభక్తి పరాయణుడా

మాయోపాయము చేతను కద్రువ
సవతుల పందెము గెలిచినది
పందెపు నియమము కొగ్గిన వినత
దాసిగ బ్రతుకును ఈడ్చినది
దాసి పుత్రుడని వీపున తమ్ముల
ఊరేగించుచు మింటి కెగయగా
భానుని వేడికి మాడిన పుత్రుల
కాంచి కద్రువ అవమానించెను
ఏమిచ్చిన ఈ దాస్యము వీడును?
యని అడుగగ అమృతమె కోరెను  //గరుడా//

దివి నుండి సుధను తెచ్చు త్రోవలో
సురపతి వలదని అడ్డగించెను
ధర్మము కాదిది సుధనెల్లరు గ్రోలుట
మాయకు మాయయె తగుననెను
అమృత భాండమును దర్భల బెట్టి
నాగులు శుచికై స్నానము సేయగ
ఇంద్రుడు సుధగొని తనపురి జేరెను
వినత దాస్యము వీడిపోయెను
గరుడుని భక్తికి మెచ్చిన హరియె
తన వాహనముగ యతని గైకొనెను // గరుడ//

ఇంద్రజిత్తుని నాగబంధమున
చిక్కి నల్లాడిరి రామలక్ష్మణులు
గరుడుని రాకతొ బెదరిన నాగులు
పాశము వీడి పారిపోయెను
స్మరణ మాత్రమున సర్వవిషముల
రూపుమాపెడు 'విషదహారి' తడు
బలశాలియైన వినయశీలుడు
తల్లిమాటకై దాస్యము జేసెను
మాతృభక్తికి మచ్చుతునకగా
నిలచిన గరుడుని భజియించెదను //గరుడ//

**********************************************************************************************************
కృష్ణా పుష్కరాలు 2016 సందర్భంగా నేను రాసిన ఈ పాటను, శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ఆలపించారు.

పుష్కర శుభవేళ వచ్చె రావమ్మ కృష్ణమ్మ
దుష్కర్మలు బాప వడిగ రావమ్మ కృష్ణమ్మ
మాబలేశ్వరాన పుట్టి వేలమైళ్ళు పయనించి
బంజరు బంగరుగ మార్చ బిరబిరా పరువులెత్తి
ఆకలిదప్పుల దీర్చే అన్నపూర్ణ నీవమ్మ
ఆదరించు మము చల్లగ మాతల్లి కృష్ణమ్మ  //పుష్కర//
శ్రీశైలాన మల్లన్న అలంపురం జోగులాంబ
వేదాద్రిన నృసింహ అమరావతి అమరేశ
బెజవాడన దుర్గమ్మ మోపిదేవి సుబ్రమణ్య
వెలసితిరి నీ తటినే భువిని దివిని జేయ  //పుష్కర//
రాజుల రాజ్యాలనెన్నొ కన్నది నీ తీరం
వివిధ కళల పుట్టుకకు కృష్ణ ఆలవాలం
బౌద్ధ సంస్కృతులకు నీ ఒడియే ప్రాకారం
చరితలు చరితార్ధమవగ కృష్ణచుట్టె శ్రీకారం //పుష్కర//     
           
కనులార నినుగాంచిన పాపాలే పోవునట
గంగయె పునీతమవగ నీలోనే మునుగునట
శివకేశవ రూపిణివై అలరారే అమ్మవట
కలిబాధల కడుగనొక్క మునకేసిన చాలునట //పుష్కర//

ఈ పాటను క్రింది లింక్ లో వినగలరు 

*************************************************************************
గురూపదేశంతో లభించిన అస్త్రమంత్రాలలోని అస్త్రాలను సులభంగా పాడుకునేందుకు వీలుగా దైవానుగ్రహంతో ఈ విధంగా రాయడం జరిగింది. ఈ పాటలో ప్రస్తావించినవి అన్నీ విష్ణుమూర్తి అస్త్రాలు. వీటి స్మరణతోనే మనకు రక్షణ లభిస్తుంది. 


//అస్త్ర మంత్రాల పాట //

ప. తలచినంత రక్షనిచ్చు నీ దివ్య అస్త్రాలు. 
శౌరి నీదు అస్త్రాలే భక్తకోటి కవచాలు 

చ.౧. దుష్టుల దునిమేను నీ సుదర్శన చక్రము 
శిష్టుల గాచేను నీ గదా శాంగ ఆయుధాలు 
వైరి గుండె లదిరేలా నీ శంఖ నాదము 
హలముసలాయుధాలు హరించును భయాలు //తలచినంత //

చ.౨ హరిహర రూపము నీ త్రిశూలాయుధము 
దండ కుంత అస్త్రాలు దనుజ విదారణాలు 
శక్తి అంకుశాలు నీదు శౌర్య ప్రతిబింబాలు 
విపత్తులను గాచేను నీ వజ్రాయుధము  //తలచినంత //

చ.౩. కులిశ పరశు అస్త్రాలు కలిమలహరణాలు 
శతముఖాగ్ని కాల్చును శతజన్మల పాపాలు 
వరాహ కోరల రక్ష నృసింహ నఖాల రక్ష 
గరుడ రక్ష హనుమ రక్ష మాకు సర్వ రక్ష //తలచినంత //

*********************************************************************************
ఆమె కృష్ణారాధిక... కృష్ణ ధ్యానంలో లీనమై జగమే మరచింది. అలంకారాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే తన రాధిక ఇలా వెలవెలబోతూ ఉండడం చూసిన కృష్ణుడు, ఆమెను సింగారించాలని కోరుతున్నాడు. కానీ ఆవిడకి కావలసింది అలంకారములు కాదట...

బంగరు మెరుగుల చెలియకు మురిపెము దీర
సింగారము సేతునే ఓ చక్కని రాధ

వెన్నెల వేల్పువు చూపుల మది తడపంగ
సింగారము లేలనాకు చల్లని కృష్ణా

కలువల కళ్ళకు కాటుక తీరుగ దిద్ది
చెవులకు కమ్మలు తొడిగెద చక్కని రాధ

నల్లనయ్య కనునిండిన కాటుక కాదా
వేణునాదమె వీనుల విందగు కృష్ణా

ఎర్రని చందనపు బొట్టు నుదుటను బెట్టి
అత్తరు గంధపు పూతలు పూసెద రాధ

కస్తురి తిలకపు గురుతులె అంటిన చాలు
వనమాలల గంధమలదు కౌగిట కృష్ణా

సన్నని నడుముకు వడ్డాణమునె బెట్టి
కురులను జాజుల సరములు పెట్టెద రాధ

నీ కరముల చుట్టగ నా నడుముకు సిరిలె
సరములేల నీ ఊర్పులె ముసురుగ కృష్ణా

పదములకెర్రని లత్తుక పారాణలది
బంగరు మువ్వలు తొడిగెద ముద్దుగ రాధ

కన్నుల కాంక్షల కెంపులె పారాణవగా
పండిన చెమటలె మేనికి మువ్వలు కృష్ణా

***************************************************************************************************
తెలుగు భాష మీద నేను రాసిన పాట ...

 తేట తెలుగు తియ్యనైన తేనెవాగు కదవోయ్
కోటిమంది గొంతుకలిపి చాటుదాము పదవోయ్

రమ్యమైన అక్షరాల రాచమాల తెలుగు
శ్రావ్యమైన శబ్దాల రాగాధార తెలుగు
ఇంపైన శిల్పంతో సొంపులొలుకు తెలుగు
ముచ్చటైన భావంతో ముద్దులొలుకు తెలుగు

రాజులే గులాములైరి తెలుగుతల్లి పంచన
కవులే ధృవతారలైరి తెలుగుకావ్య సొబగున
కళలెన్నో వెల్లివిరిసె తెలుగుతోట వసంతాన
తెలుగు వైభవమును తెలియ భాష నీవు నేర్వవోయ్

నదులతోనె పుట్టినట్టి నాగరికత మనదిలే
మణులవోలె మెరిసినట్టి కీర్తిచరిత మనదెలే
తెలుగులోన మాట్లాడుట లోకువేమి కాదులే
మాతృభాష మనకుజన్మ హక్కని నువు చాటవోయ్

ఉన్నభాష లెన్నియైన అమ్మభాష అనగా
జీవనాడులన్ని వీణ మీటినట్లు మ్రోగవా
బ్రతుకుతెరువు కోసమని భాషలెన్ని నేర్చినా
బ్రతుకుతీపి తెలియచేయు తెలుగుమాట మరువకోయ్

*******************************************************************************************************************






మిస్ కాకండి !!!


మిస్ కాకండి !!!
భావరాజు పద్మిని - 3/7/16

అకారణంగా ఎవరైనా మనపై కురిపించే ప్రేమని, అభిమానాన్నితట్టుకోవడం చాలా కష్టం. మర్చిపోవడం ఇంకా కష్టం. అందుకే చాలామంది, తమ చుట్టూ గిరి గీసుకుని, బంధాలు పెంచుకోవడం ఇష్టంలేనట్లు స్పష్టం చేస్తూ ఉంటారు. కాని, మనమెంత ప్రయత్నించినా, దైవం తన దీవెనలని, ప్రేమని, ఆశీస్సులని, మనకి ఎవరి రూపంలోనైనా అందించాలని అనుకున్నప్పుడు, మనం తప్పించుకోలేము. అలాంటి పరిస్థితే నిన్న నాకు ఎదురైంది.
నెల సరుకులు కొనాలని, బిగ్ బజార్ వెళ్ళాము. మా వారు బిల్ వేయిస్తుంటే, నేను వెనుకవైపున ఉన్న కుర్చీల వద్దకు వెళ్లి, కూర్చున్నాను. పక్కనే పెద్దావిడ ఒళ్లో చిన్న బాబు. ఓ 7 నెలలు ఉంటాయేమో. నన్ను చూడగానే, నోరారా బోసినవ్వు నవ్వేసి, 'తొందరగా ఎత్తుకో' అన్నట్టు, ఓదూకు దూకాడు. నా మొహం మీదనుంచి రెప్ప వాల్చడే. మళ్ళీ నోరారా అదే బోసినవ్వు... మనసు నిండేలా... అలా చిట్టి చేతులతో, నన్ను గట్టిగా హత్తుకుని, అలాగే ఉండిపోయాడు. వాళ్ళ బిల్ అయిపోయి, వాళ్ళమ్మ వచ్చి, వాడిని తీసుకుని వెళ్ళిపోతోంది. దూరంగా వెళ్ళేదాకా, మళ్ళీ అదే చూపు, అదే నవ్వు, ' నన్ను గుర్తుపట్టలేదా...?" అన్నట్టు. మామూలుగానే నాకు చిన్న పిల్లలలంటే ప్రాణం. ఇక వీడి నవ్వు మరీ ముద్దుగా ఉంది.
ఆ ఆనందంలో వాడినే తలచుకుంటూ ఒక్క నిముషం గడిచిందో లేదో, ఓ ముసలావిడ అటుగా వచ్చింది. చాలా సాధారణంగా ఏ నగలూ, ఆభరణాలూ లేకుండా మామూలు చీర కట్టుకుని ఉంది. ఆవిడ కూర్చోబోతూ ఉండగా, పలకరింపుగా నవ్వాను. "వెన్నెల కురిసినట్టు ఎంత చక్కగా నవ్వావు?" అంటూ చనువుగా నా బుగ్గలు లాగింది. "చూడమ్మా, సమస్యలు లేని మనిషంటూ ఉండడు, అలాగని నవ్వడం మానేసి, ప్లాస్టిక్ పువ్వుల్లా ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని తిరుగుతున్నారు అంతా. కాని సహజమైన పువ్వుకి ఉండే పరిమళం, అందం, ప్లాస్టిక్ పూలకి ఉండదుగా! అందుకే నవ్వడం మర్చిపోకూడదు, నీలా నవ్వాలి..." అంది ఆవిడ. నేను "నిజమేనండి," అంటూ మళ్ళీ నవ్వాను. ఈ లోపున ఆవిడ దృష్టి నా మట్టి గాజుల మీద, నాచేతికి ఉన్న గోరింటాకు మీద పడింది. "చాలా బాగుంది, ఇప్పుడు ఇలాగ ఎవరూ వేసుకోవట్లేదు," అంటూ, ఎందుకనో మళ్ళీ మమత ఉప్పొంగి, నా వీపు తట్టి, నా తలమీద చెయ్యి ఉంచి ఆశీర్వదించింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే... ఓసారి గతంలో నా పుట్టినరోజున మాగురూజీ దీవెనల కోసం వెళ్తే, ఆయన సరిగ్గా అలాగే వీపు తట్టి, దీవించారు. నన్ను దీవించడానికి, ఏ సద్గురువులో ఈ రూపంలో వచ్చారేమో, అనుకుని, ఆవిడనే చూస్తూ ఉన్నాను.
                              
కాసేపు అలా కూర్చోగానే, మా బిల్లింగ్ అయిపొయింది. వెళ్తూ, వెళ్తూ వినమ్రంగా నమస్కారం చేసాను. మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం చేస్తున్నాము అంటే, వారిలో మనం దైవాన్ని చూస్తున్నామని అర్ధమట! అందుకు బదులుగా వారు ప్రతినమస్కారం చేస్తే, వారూ మనలో దైవాన్ని చూస్తున్నారని, అర్ధమని, మా గురూజీ చెబుతూ ఉంటారు. అలా నమస్కరిస్తూ వెళ్తుంటే, మరో చిత్రం... ఆవిడా, సరిగ్గా మా గురూజీ లాగే నవ్వుతూ, కల్లార్పి తెరిచింది. ఆశ్చర్యంగా ఇంటికి చేరి చూడగానే... గురూజీ పోస్ట్ ఒకటి కనిపించింది.
"సద్గురువు మీలోనే ఉన్నారు, అన్నింటా, అంతటా ఆయన్ను అనుభూతి చెందగలిగితే, మీరు ఎన్నడూ గురువులను 'మిస్' కారు..." అన్న భావన ధ్వనించేలా. అంతా, సద్గురువుల దయ, అనుగ్రహం... దైవప్రేమ ఈ రూపంలో నిన్న వర్షించింది. చరాచర వస్తువుల్లో ప్రతీదీ దైవమే ! మనం పీల్చే ఊపిరితో సహా ! వారి దీవెనలు ఎప్పుడు ఏ రూపంలో అందుతాయో తెలీదు. ఇవే జీవితంలో అమృతమయమైన క్షణాలు ! మరికొంత కాలానికి సరిపడా మనకి ఉత్తేజాన్ని ఇస్తాయి. మిస్ కాకండి !!!