Saturday, February 21, 2015

అండగా నిలబడండి

అండగా నిలబడండి 
- భావరాజు పద్మిని 21/2/15 

మా వారి ఉద్యోగరీత్యా, మేము బెంగుళూరుకు రెండు సార్లు వెళ్ళటం జరిగింది. మొదటి సారి ఉన్నప్పుడు, మహాలక్ష్మి లేఔట్ లో ఒక మూడంతస్తుల ఇంట్లో రెండవ అంతస్తులో ఉన్నాము. అప్పుడు క్రింది రెండు వాటాల్లో ఉన్నవారితో మాకు మంచి స్నేహం ఉండేది. అంతా, దాదాపు సమవయస్కులమే !ఏడాది తిరిగేసారికి, కాన్పూర్ బదిలీ అయ్యి, వెళ్ళిపోయాము. తర్వాత విజయవాడ లో ఉండగా, మళ్ళి బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది. అందరికంటే క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు, అప్పటినుంచి అక్కడే ఉంది. అంతేకాక, మునుపు మేమున్న పైవాటా నే మళ్ళీ ఖాళీ అవుతోందని తెలిసింది. ఆ కాలనీ లో ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడి కన్నడం వారంతా నా వద్దకు వచ్చి, ఆత్మీయంగా పలకరిస్తుంటే, మా వారు ఆశ్చర్యంగా చూసారు,నిన్నుఇంత మంది అభిమానిస్తారా, అనుకుంటూ !
మళ్ళీ రెండవసారి అదే ఇంట్లో దిగాము. క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు సుమన్ గత 5 ఏళ్ళుగా అక్కడే ఉంది. మేము వెళ్ళాకా, తను ఉద్యోగాలకై ప్రయత్నిస్తుంటే, అక్కడి 'ప్లానెట్ కిడ్స్' అనే స్కూల్ లో తనకు ఉద్యోగం వచ్చింది. అప్పటిదాకా సాధారణ గృహిణిగా ఉంటూ, వెన్నెల్లా నవ్వే ఆమెలో మార్పు వచ్చింది. వాతావరణం మారేసరికి అందరిలాగే... ఆమెకు డబ్బుజబ్బు చేసింది. ఎక్కువ మాట్లాడేది కాదు, కాస్త టెక్కు చూపేది. నేనూ, అర్ధం చేసుకుని, కాస్త దూరంగానే ఉండేదాన్ని. అయితే, మొదటి అంతస్తులో ఉన్న 'ముక్త' అనే స్నేహితురాలు ఒకసారి ఆసుపత్రిపాలైతే, నేను వారి కుటుంబానికి, పిల్లలకు కాస్త సాయం చేసాను. అందుకే ఆమెకు నేనంటే మనసు నిండా ప్రేమ. అక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఎక్కడున్నా, ఆమె నాతో మాట్లాడుతూనే ఉండేది. సుమన్ మాత్రం నా నెంబర్ ఆమెకు తెలిపినా, దూరంగానే ఉండేది.
కొన్నేళ్ళకి మేము హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడి నుంచి చండీగర్ వచ్చాకా, నా నెంబర్ మారి వారితో సంబంధాలు తెగిపోయాయి. అయినా, వాట్స్ ఆప్ లో ముక్త నెంబర్ కనిపిస్తే, పలకరించాను. ఆమె చాలా సంతోషించిది. నాతో మాట్లాడాలని ఉందని, మనసారా ప్రార్ధించానని, దైవమే మరలా మార్గం చూపారని, మురిసిపోయింది. తనే నా నెంబర్ సుమన్ కు ఇచ్చింది. అయినా, సుమన్ పెద్దగా మాట్లాడేది కాదు. ఒక సారి హై అంది, అంతే. తర్వాత మధ్య మధ్య మాత్రం ఇటువంటి మెసేజ్ లు వచ్చేవి.
'సాయి బాబా దీవెనలు. ఇది సాయి బాబా ఒరిజినల్ ఫోటో. ఇది 50 మందికి షేర్ చెయ్యకపోతే, మీకు చెడు జరుగుతుంది. లేకపోతే మంచి జరుగుతుంది...' నన్నే ఎంచుకుని మరీ పంపాలా ? భేతాళుడు 'రాజా ! నీ తల వెయ్యి ముక్కలౌతుంది' అనే డైలాగు గుర్తు తెచ్చుకుని, నవ్వి ఊరుకునేదాన్ని.


రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 3 రోజుల క్రితం తన నుంచి మెసేజ్ వచ్చింది. 'పద్మిని, ఎలా ఉన్నావ్, పిల్లలు ఎలా ఉన్నారు...' అని. నేను ఆశ్చర్యంగా బాగున్నారు, అనగానే... 'నాకు ఆరోగ్యం బాలేదు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటల్ లో ఉన్నాను. నా కోసం ప్రార్దిస్తావా ?' అంది. తప్పకుండా, అంటూ తనతో మాట్లాడుతూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా మాట్లాడుతూ... 'ఏవిటో ఇప్పుడు మనుషులకు ఒకరికోసం ఒకరికి టైం లేదు, ముక్త ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది, అంతా బిజీ, అంది. వెంటనే నేను తనతో ఇలా అన్నాను...
'సుమన్ ... నీకో సంగతి చెప్పనా, నేను ఇప్పుడు రచనా రంగంలో స్థిరపడ్డాను. నాకంటూ కాస్త చోటు సంపాదించుకున్నాను. ఒక పత్రిక పెట్టాను. 3 రోజుల్లో వార్షిక సంచిక విడుదల. రోజుకి కేవలం 6 గంటలు నిద్రపోతూ పనిచేస్తున్నాను. అయినా, నీకు ఇదంతా చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ?
మా గురుజి దయ వలన నాకు మనుషుల్ని మేధతో, కళ్ళతో చూసి అంచనా వెయ్యకుండా, మనసుతో చూసే గుణం అలవడింది. తను చిన్న సమస్యే అని చెప్పినా... తను ఆగాగి మాట్లాడుతుంటే, తన కంట్లోని కన్నీరు నా మనసుకు గోచరిస్తోంది.నువ్వు చాలా అవసరంలో ఉన్నావు. నీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. కేవలం డబ్బు, వస్తువులు ఇవ్వటమే దానం కాదు... అవసరమైనప్పుడు కాస్తంత ఆత్మీయత, వాళ్లకు నీ సమయం, నీ ప్రేమ, నీ ఓదార్పు, ఇవన్నీ ఇవ్వటం కూడా దానమే అని చెప్పారు మా గురూజి. ఆయన మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఒకవేళ నాకు దైవం ఇటువంటి అవకాశం ఇస్తే, ఖచ్చితంగా వదులుకోను. అండగా నిలబడతాను, ప్రార్ధిస్తాను, మీరు కోలుకుని బాగుంటే, నన్ను మర్చిపోయినా, ఆనందంగా చూస్తుంటాను.
ముక్త , ఇంకా ఇతరులు ఎలా ఉన్నా, మనుషుల తప్పొప్పులు ఎంచకుండా బేషరతుగా మనం ప్రేమించాలి. వారు ఆనందంగా ఉన్నప్పుడు పార్టీ లకు వెళ్లి డాన్సులు చెయ్యకపోయినా సరే, దుఃఖం లో, అవసరంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ చెయ్యి గట్టిగా ఒడిసి పట్టుకోవాలి. నీది ఎంతో మంచి మనసు, అపురూపమైన వ్యక్తిత్వం, నిన్ను అందరూ ప్రేమిస్తారు. ధైర్యం కోల్పోవద్దు. నీ సమస్య పెద్దదే కావచ్చు ! కాని, దైవానుగ్రహం అపారమైనది. ఇది గుర్తుంచుకో. ప్రేమను పంచుతూ మసలుకో !'
'నిన్ను చూస్తే, నాకు గర్వంగా ఉంది పద్మినీ !'
' ఇందులో నా గొప్ప ఏమీ లేదు. గర్వపడాల్సింది అంతకంటే లేదు... అంతా గురుఅనుగ్రహం అంతే ! మనిషిలో అంతర్గత మార్పు కేవలం సద్గురువే తీసుకురాగలరు. నీ అభినందనలు ఆయన పాదాలకు సమర్పిస్తున్నాను. సుఖంగా ఉండు.'
ఈ కధ మీకు చెప్పడంలోని అంతరార్ధం మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఎవరైనా, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నప్పుడు, వాళ్ళు గతంలో చేసిన పనులనే నెమరు వెయ్యకుండా, అన్నీ మరచి, వారికి అండగా నిలబడండి. వారికై ప్రార్ధించండి. ప్రేమగా ధైర్యం చెప్పండి. దైవం మీపట్ల చాలా కృప చూపుతారు. ఇది ముమ్మాటికీ నిజం !

Friday, February 13, 2015

నువ్వు బంగారానివి తల్లీ

'నువ్వు బంగారానివి తల్లీ...' అంటారు.
మట్టిలో పడున్న బంగారం అంతగా మెరవాలంటే , ఎన్ని సార్లు మంటల్లో మరిగిందో... ఇంకెన్ని అగ్ని పరీక్షలకు తట్టుకుంటే వన్నె, మెరుపు తగ్గకుండా ఉండగలదో. తాను పడ్డ బాధనంతా గుండెల్లో దాచుకుని, ఇతరుల సింగారానికి, సంతోషానికీ తన మెరుపును త్యాగం చేసిందో....
బంగారం మెరుపు అందరికీ కావాలి. కాని, అలా అయ్యేందుకు అది పడ్డ కష్టం, వాళ్ళ లెక్క లోకి రాదు. తమకు కావలసినట్టు మలచుకోవడానికి, కాల్చి, కాల్చి తమకు కావలసినట్లు ఇంకెంత వంగదియ్యాలో... 
ప్రతీ రోజూ ఒక కొత్త పోరాటం . అడుగడుగునా సవాళ్లు. ఇదే జీవితం. ఇదే నిజమయితే నేను బంగారాన్నే. మంటలు, పరిస్థితులు, మనుషులు, మనస్తత్వాలు మలచిన బంగారాన్ని....

(ఒక ఉద్వేగ క్షణంలో అలవోకగా వచ్చిన మాటలకు అక్షర రూపం - భావరాజు పద్మిని)



తృప్తి ఎక్కడ ?

నేస్తాలూ...

ఆ మధ్యన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు.... ఈ మాటలు నా మనోపధంలో ముద్రించుకు పోయాయి...

"చూడండి... మీరు యెంత కష్టపడి, ఎన్ని కోట్లు సంపాదించి, పిల్లలకు ఇచ్చినా... వాళ్ళు ఏమంటారంటే...
మా నాన్న ఉన్నాడు చూసారా? దొంగ వెధవ... అదిగో ఆ ఎదురుగుండా ఉన్న భవంతి ఉంది కదా, అది నాకు ఇవ్వకుండా పోయాడు, చచ్చినాడు.

మా అమ్మ ఉందే ! ఎంత చాకిరీ చేసాను, చివర్లో కాసులపేరు కోడలికి ఇచ్చి పోయింది..." 

మనిషికి తృప్తి ఎక్కడండి ? ఎంత ఇచ్చినా, ఇచ్చింది గుర్తుండదు. ఇవ్వని దాన్నే చెప్తారు. అందుకే, నేనైతే నా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవట్లేదు. వచ్చిననంత వస్తుంది. ఉన్నంతలో విద్యాబుద్ధులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నేను ముప్ఫై ఏళ్ల నుంచే తీర్థ యాత్రలు చేస్తున్నాను. అదనంగా వచ్చిన సొమ్మంతా దానధర్మాలకు వాడేస్తాను. పిల్లలకు అతిగా ఆస్థులు ఇవ్వడం అంటే, వాళ్ళను కష్టం తెలియకుండా ఇంక్యుబేటర్ కోళ్ళు పంచినట్లు పెంచడమే ! ఈ విధానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. మీకు నిజంగా పిల్లలపై ప్రేమే ఉంటే, వాళ్లకు చదువుసంధ్యలతో పాటు కాస్తంత ఆస్తినే ఇవ్వండి. 

వాళ్లకు బెంజి తెలియాలి... గంజి తెలియాలి. లోకం చూడాలి, అనుభవం పెంచుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. ఇక ఆస్థి తక్కువ ఇస్తే, వాళ్లకు అనుకోని అవసరాలు వస్తే... అంటారా ? నేను ఈ రోజున చేసిన దానధర్మాలు వాళ్ళను అవసరంలో ఆదుకోకపోవు. దైవానుగ్రహం ఉన్న వాళ్లకు జీవితంలో డోకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అతిగా ఆస్థులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టకండి ..."

నేనలా ఆయన చెప్తుంటే చూస్తూ ఉండిపోయాను. ఎంత చక్కగా చెప్పారు... నిజంగా 'వసుధైక కుటుంబకం ...' అన్న వారి సూత్రం అంతా పాటించగలిగితే, ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉండవు కదా !


Thursday, February 12, 2015

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -2

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -
---------------------------------------------
భావరాజు పద్మిని 

మర్నాడు ఉదయం మా అత్తగారు, పిల్లలు, మేము బయల్దేరి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... అక్కడ దారిలో ఎర్రటి ముద్దమందారాలు అమ్ముతున్నారు. అన్ని మందారపూలు ఒక్క చోట దొరకవు. నాలాగా 108 పూల పూజ నోము పట్టిన వాళ్లకి మందారపూల సేకరణ చాలా కష్టం. వెంటనే నాకొక ఐడియా వచ్చింది. 110 ముద్దమందారాలు కొని, జ్వాలాదేవి గుడి బయట ఉన్న మహాలక్ష్మి ఉపాలయంలో పూజ చేసుకోవాలని. అనుకున్నాను. అదృష్టవశాత్తూ... హ్యాండ్ బాగ్ లో లలితా సహస్రం పుస్తకం వెనుక... లక్ష్మి అష్టోత్తరం ఉంది. కాని ఎవరైనా అడ్డగిస్తే... మనసులో చిన్న సందేహం. గురుజి ని స్మరించుకుని, లోపల కూర్చున్నా... ఆయన దయవల్ల, ఎవరూ ఏమీ అనలేదు. చక్కగా పూజ చేసుకుని, ప్రసాదం నివేదించి, బయటకు వచ్చాను. ఇక్కడ వీళ్ళు తెచ్చే ప్రసాదాలు విగ్రహాల నోటి నిండా పులిమి వెళ్తారు. ఎందుకో మరి... అలా అమ్మవారి దయతో ముద్దమందారాల పూజ పూర్తయింది.



తర్వాత జ్వాలాదేవి నుంచి ధర్మశాల కు బయల్దేరాము. దారిలో కాంగ్రా లోని వజ్రేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. 51 శక్తి పీఠాల్లో,ఇది సతీదేవి ఎడమ రొమ్ము పడిన ప్రాంతమని చెబుతారు. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు, అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆదేశించడంతో, నిర్మించారట !  అక్కడినుంచి ధర్మశాల చేరుకొని, మేము ఉన్న హోటల్ కొండమీద ఉన్న ఆలయం దర్శించి, ఎక్కడో కొండల నడుమనుంచి వస్తూ, స్వచ్చమైన నీటితో రాళ్ళతో సయ్యటలాడుతూ ఉరకలేస్తున్న బ్యాస్ నది సొగసులు చూసాము. 

ఆ రోజు సాయంత్రం ధర్మశాల లోని దలైలామా ఆశ్రమం దర్శిద్దామని బయలుదేరితే, కొండ దారిలో విపరీతమైన యాత్రికుల రద్దీ వలన ట్రాఫిక్ జాం అయ్యి, 5 గంటలు అక్కడే ఇరుక్కుని, వెనుదిరిగి వచ్చాము. మర్నాడు ఉదయమే బయలుదేరి, మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న దలైలామా ఆలయానికి వెళ్ళాము. ఆ ప్రాంతానికి ఆ పేరు అక్కడ ఒకప్పటి గవర్నర్ అయిన సర్ డోనాల్డ్ ఫ్రీల్ మెక్ లియోడ్ వలన వచ్చిందట.  1959 లో 14 వ దలైలామా అయిన టెంజిన్ గ్యాట్సో ను చైనా ప్రభుత్వం తరిమి కొడితే, భారత్ మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న భవంతిలో ఆయనకు ఆశ్రయం ఇచ్చిందట. అప్పటి నుంచి అక్కడ దలైలామా ఆశ్రమం ఏర్పడింది.  ఇక్కడ టిబెటన్లు, బౌద్ధ సన్యాసులు ఎక్కువ. ఏమీ తెలియని పసి ప్రాయంలో తెచ్చి, పిల్లల్ని బౌద్ధసన్యాసులుగా మార్చి, వీళ్ళు మఠాలలో వేసేస్తూ ఉంటారు. 

వేర్వేరు పెద్ద మందిరాలలో ఉన్న వీళ్ళ ప్రధాన గురువులైన సఖ్యముని, అవలోకితేశ్వర, పద్మసంభవుడి అద్భుతమైన విగ్రహాలు, చుట్టూ ఉన్న అందమైన చిత్తరువులు, మనకు కనువిందు చేస్తాయి. ప్రతి మందిరంలోనూ ఇరువైపులా, టిబెటన్ల పవిత్ర గ్రంధాలైన కంజుర్(బుద్ధుడి బోధనలు ) , తంజుర్(బుద్ధుడి బోధల వ్యాఖ్యానాలు ) అనేవి ఉంటాయి. వీళ్ళు ఉపాసించేది అవలోకితేశ్వరుడికి సంబంధించిన ఒక్కటే మంత్రం – దీన్ని మణి మంత్రం అంటారు. ‘ఓం మణి పద్మే హుం’ అనే ఈ సంస్కృత మంత్రం . ఈ మంత్ర జపం జ్ఞానోదయానికి దారి చూపుతుందని వీరి నమ్మకం. ఈ మంత్రాన్ని అనేకమార్లు రాసి, సన్యాసులు ఒక ‘ప్రేయర్ వీల్ (ప్రార్ధనా చక్రం లేక మణి చక్రం ) లో వేస్తారు. ఇది ధర్మ చక్రానికి ప్రతీక అని, దీన్ని తిప్పడం వల్ల, ఒక మనిషికి, ఆ చక్రపు పెట్టెలో ఉన్నన్ని మార్లు, ఆ మంత్రాన్ని చదివిన ఫలం దక్కుతుందని, వారి నమ్మకం. ఇటువంటి ఎన్నో మణి చక్రాలు ఆలయం చుట్టూ అమర్చి ఉండగా, వాటిని యాత్రికులు తిప్పుతూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడి నుంచి, ప్రసిద్ధమైన ‘దాల్ లేక్’ ను చూడవచ్చు, ఇది అంత చూడదగ్గ విశేషం కాదు.

మెక్ లియోడ్ గంజ్ నుంచి తిరుగు ప్రయాణంలో కాంగ్రా లో ఉన్న చాముండా దేవి ఆలయాన్ని దర్శించాము. చండముండాసురులను సంహరించినందున దేవికి ‘చాముండా’ అనే పేరు వచ్చింది. ఆలయం పక్కనే పూర్తి వడితో ప్రవహించే ‘బన్ గంగా ‘ నది నయన మనోహరంగా ఉంటుంది. ఈ నదిలో స్నానం సకల పాపహరమని నమ్మే భక్తులు, నది వడికి కొట్టుకుపోకుండా, ప్రభుత్వం నదిలో ప్రవేశాన్ని నిషేధించి, నది పక్కనే, యాత్రికుల స్నానాలకు , నది నీటితో ఒక కొలను ఏర్పాటు చేసింది. అక్కడి మనోజ్ఞమైన వాతావరణం, దేవి ఆశీస్సులతో, మా యాత్ర ముగించుకుని, అర్ధరాత్రికి తిరిగి చండీగర్ చేరుకున్నాము. నవదుర్గలను దర్శించాలని భావించే వారికి, ఆ ఆలయాల జాబితా -

వజ్రేశ్వరి దేవి - కాంగ్రా 
బగాళాముఖి - బన్ ఖండి 
చాముండా దేవి - కాంగ్రా 
చింతపూర్ని దేవి - చింత్పూర్ని 
జ్వాలా దేవి - జ్వాలాముఖి 
నైనా దేవి - బిలాస్పూర్ 
శీతల దేవి - ధర్మశాల మహంతన్ 
వైష్ణో దేవి  - జమ్ముకాశ్మీర్.
మానసా దేవి - పంచకుల, హర్యానా .

ఈ వ్యాసం మొదటి భాగం క్రింది లింక్ లో చదవండి...

“అమ్మ దయ ఉంటే, అన్నీ ఉన్నట్లే ! శ్రీ మాత్రే నమః “ శుభం భూయాత్. 



Sunday, February 1, 2015

పదివేల లెక్క ఎలా ? - ప్రసాద్ కట్టుపల్లి


పదివేల లెక్క ఎలా ? 
- ప్రసాద్ కట్టుపల్లి 

పదివేల తలలు కల ఆదిశేషుడు మిమ్ములను ధన్యుల చేయుగాక అని ఒక చాటుకవి తన ప్రతాపాన్ని ఇలా చూపించాడు అట...
పదియునైదు పదునైదు పదునైదు
నిఱువదైదు నూటయిఱువదైదు
నెలమి మూడునూరు లిన్నూరు మున్నూరు
తలలవాడు మిమ్ము ధన్యుజేయు
ఈపద్యంలో పదివేల లెక్క ఎలా వచ్చిందో చెబుతున్నారు ప్రసాద్ కట్టుపల్లి గారు...

పదియునైదు,,,అనగా 10+5*15
పదునైదు పదునైదు 15*15*15....3375
నిరువదైదు నూటనిరువదైదు 25*125......3125.
నెలమి మూడునూరులు ,,.నెల అనగా స్థానము,,,పున్నమ.చంద్రుడు నెలవంక మాసము స్త్రీ శిరో భూషణము అను అర్ధములుకలవు...ఇక్కడ నెలమి స్థానము జరిపి,,లేదా పున్నమ అనేఅర్ధం తీసుకొని 300లకు మరో 0 చేర్చినచో,,,3000
ఇప్పటికి 3375+3125+3000****9500
ఇన్నూరు,,,,200
మున్నూరు,300
9500+200+300**10.000..సరిపోయిందా .,,,మిత్రులూ,.,.



‘రాతి మనసు చదివిన ‘ శిల్పి

‘రాతి మనసు చదివిన ‘ శిల్పి 
-----------------------------------
భావరాజు పద్మిని – 1/2/15 

ఒక స్వప్నంలో... అతనికి ఒక అడవిలో ఒక గొప్ప రాజ్యం గోచరించింది. అది గోచరించిన చోట చూస్తే, ఇప్పుడు అడవి ఉంది. ఆ అడవినే తన స్వప్నంలో కనిపించిన విధంగా మలిచేస్తే... అనుకున్నాడు. అతని వెనుక ఉన్న సైన్యం... అతనొక్కడే ! పోనీ అతను శిల్పా , అదీ కాదు. అయినా, పట్టువిడని అంతటి ఉక్కు సంకల్పం ఎలా కలిగిందో తెలీదు. అడవులు నరికాడు, రాళ్ళు తొలగించాడు... చక్కటి ఆకృతి ఉన్న రాళ్ళను తన సైకిల్ పై మోసుకొచ్చాడు. వ్యర్ధ పదార్ధాలు సేకరించాడు. అడవిలో తానుండి, పనిచేసుకునేందుకు ఒక రాతి పలకల గూటిని నిర్మించుకున్నాడు.  ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే, సాయంత్రం తన బాధ్యతలు ముగియగానే, మొదలుపెట్టి, చేసేవాడు... అదీ, “రహస్యంగా !” ఇలా దాదాపు 18 ఏళ్ళు కష్టపడ్డారు...

ఫలితం... కష్టమైనా, ఇష్టమైన పనిని ఒక తపస్సులా, యోగనిష్ట లా చేసినందుకు... ఒక అద్భుతమైన రాతి సామ్రాజ్యం అక్కడ ఏర్పడింది. అతని శ్రమకు ఫలితంగా , అతనికి ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ని బహుకరించింది. ఆయనే ‘నెక్ చంద్’. 

నెక్ చంద్ ‘బెరియన్ కలాన్’ అనే గ్రామంలో 1924 లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్ లో ఉంది. భారత విభజన సమయంలో వారి కుటుంబం భారత్ కు వచ్చేసింది. అయినా, అతని స్మృతి పధంలో అతని గ్రామం, అక్కడి ఇళ్ళు, జలపాతాలు అన్నీ అలాగే ఉండిపోయాయి. 



                            

చండీగర్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ‘నెక్ చంద్’ కు  ఒకరోజున ఒక మంచి కల వచ్చింది... ఒక గొప్ప ‘సుఖ్రాని’ అనే సామ్రాజ్యం ఒక అటవీప్రాంతంలో ఉన్నట్లు గోచరించింది. సభాస్థలి, సంగీతకారులు, నాట్యకారులు, ఆకాశ హర్మ్యాలు, సుందర జలపాతాలు... ఓహ్, అద్భుతం ! అయితే, ఆయన కలే కదా, అని దాన్ని, మర్చిపోలేదు, నావల్ల ఏమౌతుంది, అని వదిలెయ్యలేదు... తాను స్వప్నంలో కాంచిన ఆ గొప్ప రాజ్యాన్ని, అతను అక్కడే నిర్మించాలని అనుకున్నాడు. తన ఉద్యానవనానికై చాంద్ ,సుఖ్నా సరస్సు దగ్గరలోని అరణ్యాన్ని ఎంచుకున్నారు. ఆ సంకల్పం ఎట్టకేలకు , ఆయన 1957 లో రహస్యంగా, వ్యర్ధపదార్ధాలతో ఒక ఉద్యానవనం మొదలుపెట్టేలా చేసింది.

ఆయన ఉద్యోగ విధులు ముగిసాకా, శివాలిక్ కొండల దిగువన తిరుగుతూ, పక్షి ఆకృతిలో , వివిధ జంతువుల ఆకారాల్లో, మనిషి ఆకారంలో ఉన్న రాళ్ళను ఏరి, తన సైకిల్ పై తీసుకు వచ్చేవారు. తాను ఉండి, పని చేసుకునేందుకు వీలుగా ఒక రాతి గుడిసెను ఏర్పరచుకున్నారు. మొదటి ఏడేళ్ళు గృహాల నుంచి, ఇండస్ట్రీ ల నుంచి, వీధుల నుంచి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపారు. విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బుల్బ్ లు, బాటిల్స్, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో  ‘సుఖ్రాని’ అద్భుత సామ్రాజ్యం నిర్మించారు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి ఒస్తుందో తెలియని ఉద్విగ్నత ! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం... ఇలా సాగుతుంది చండీగర్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?’, అని ఆశ్చర్యపోనివారు ఉండరు. 

18 ఏళ్ళు చాంద్ మౌనంగా నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని, 1973 లో అడవిలో ఆంటి – మలేరియా టీం లో పనిచేస్తున్న ఎస్.కె. శర్మ గుర్తించారు. ఇది అటవీ ప్రాంతం కనుక, చాంద్ నిర్మాణాలు అన్నీ అక్రమమైనవని, తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చాంద్ ప్రజాభిప్రాయం సేకరించి, ఇదొక గొప్ప పర్యాటక స్థలం కాగలదని నిరూపించాడు. 1975 లో దీన్ని అధికారికంగా గుర్తించారు. 1976 నుంచి ఇది సందర్శకుల కోసం తెరిచారు. తర్వాత ఈ  వనాన్ని మరిన్ని శిల్పాలతో విస్తృత పరిచారు. అటుపై,  చాంద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పలు విదేశీ సంస్థలు ఆయన్ను సత్కరించాయి. విదేశీ మ్యుసియం లలో చాంద్ శిల్పాలు చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు 90 ఏళ్ళ వయసులో, రాళ్ళతో రాగాలు పలికించిన ఆ మౌనశిల్పి, నవ్వుతూ, అప్పుడప్పుడూ, తన ‘సుఖ్రాని’ సామ్రాజ్యం లోనే దర్శమిస్తారు.
ఆయన్ను చూస్తే, ఎవరికైనా అనిపిస్తుంది. “మనిషి తలచుకుంటే, ఏమైనా చెయ్యగలడు !” అని. మీరూ చండీగర్ వస్తే, వ్యర్ధాలతో నిర్మించిన ఈ అర్ధవంతమైన  సుందర ఉద్యానవనం తప్పక సందర్శించండి !