Thursday, April 20, 2017

జస్ట్ ఫర్ టీ లవర్స్

జస్ట్ ఫర్ టీ లవర్స్
భావరాజు పద్మిని – 20/4/17
కాఫీ సరస్సు లాంటిది... నిర్ణీత పాళ్ళలో పాలు, చెక్కెర, డికాషన్ కలిస్తేనే దానికి రుచి. కాని, టీ సముద్రం లాంటిది. తనతో ఏ ఫ్లేవర్ నైనా కలుపుకు పోతుంది. ఆ పరిమళాన్ని ఆపాదించుకుని, కొత్త రుచిని సంతరించుకుంటుంది. అలా చేసుకోగల వివిధ రకాల టీ ల గురించి నాకు తెల్సింది చెప్తాను, ట్రై చెయ్యండి. టీ టిప్స్ : • టీ అంటే నీళ్ళు కాదు. ఎక్కువమంది చేసే తప్పు ‘టీ పెట్టు’ అనగానే గిన్నెలో సగం నీళ్ళు పోస్తారు. ఆ టీ కి, నీళ్ళకి తేడా ఉండదు. అందుకే పాలు కాస్త ఎక్కువ పోస్తేనే టీ కి రుచి. • టీ లో పంచదార బదులు బెల్లం పొడి వేస్తే ఆ రుచే వేరు. ఆరోగ్యానికీ మంచిది. ఇప్పుడు బెల్లం పొడి అన్ని సూపర్ మార్కెట్ లలో దొరుకుతోంది. లేకపోతే చేసుకోవచ్చు. • టీ లో మాటిమాటికీ వేసేందుకు ఏలకులు నూరడం ఒక పెద్ద పని. పైగా ఏలకులు చాలా ఖరీదు ఐపోయాయి కూడా కదా. అందుకే కొన్ని ఏలకులు తొక్కతో సహా మిక్సీ వేసి, మెత్తగా పొడి చేసి, ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే... స్వీట్స్ లోకి, టీ లోకి, ఇతర వాడకాల్లోకి కావలసినప్పుడు, మూత తీసి, కాస్త పొడి వేసుకుంటే చాలు. • కాఫీ ఫార్ములా లాగా టీ పెట్టేందుకు పెద్దగా ఫార్ములా లు లేవు, అవన్నీ అపోహలే. పాలు, నీళ్ళు, చెక్కెర/బెల్లం పొడి, టీ పొడి, అన్నీ కలిపి, ఒకేసారి స్టవ్ మీద పెట్టచ్చు. పుదీనా టీ : టీ మరుగుతూ ఉండగా కాసిని పుదీనా ఆకులు వేసి చూడండి, అదిరిపోతుంది. తులసి టీ: టీ మరుగుతూ ఉండగా కాసిని తులసి ఆకులు వేసి చూడండి, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆరోగ్యానికీ మంచిది. చాక్లెట్ టీ: చిన్న బోర్నవిటా/ బూస్ట్ ప్యాకెట్లు మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతున్నాయి. మరుగుతున్న టీ లో కాస్త వీటి పొడిని, ఏలకు పొడిని కలిపితే చాలా బాగుంటుంది. రోజ్ టీ : తాజా గులాబి రెక్కలు, కాస్త ఏలకు పొడి టీ లో వేసి చూడండి. చాలా వైవిధ్యంగా అనిపిస్తుంది. అల్లం టీ : టీ లో కాస్త అల్లం దంచి వెయ్యడమే ! ఏలకు పొడి, మిరియాల పొడి స్పెషల్ టీ: అలసిన వేళ ఈ టీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. టీ మరుగుతూ ఉండగా కాస్త ఏలకు పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. లంసా టీ: ఈ ప్యాకెట్ మార్కెట్ లో దొరుకుతుంది. టీ మరుగుతూ ఉండగా కాస్త లంసా పొడి కూడా వేస్తే, హైదరాబాదీ ఇరానీ చాయ్ తాగుతున్న అనుభూతి కలుగుతుంది. లవంగాల టీ: ఇది నోరు బాగోనప్పుడు కాస్త ఘాటుగా బాగుంటుంది. టీ మరుగుతూ ఉండగా ఓ నాలుగు లవంగాలు దంచి వెయ్యడమే. స్పెషల్ జలుబు టీ: జలుబు చేసినప్పుడు వేరేవీ మనకు రుచించవు. అలాంటప్పుడు టీ మరుగుతూ ఉండగా కాస్త అల్లం, మిరియాలు, వాము, జీలకర్ర, తులసి ఆకులు కలిపి దంచిన మిశ్రమాన్ని వేసుకుని తీగితే, చాలా రిలీఫ్ గా ఉంటుంది. స్పెషల్ టీ మసాలా : సాధారణంగా చాయ్ మసాలా షాప్స్ లో కొంటూ ఉంటారు. కాని, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. 3,4 – దాల్చిన చెక్కలు, చెంచాడు మిరియాలు, నాలుగు లవంగాలు, 6 ఏలకులు, కాస్త వాము, కాస్త జీలకర్ర ,చెంచాడు ధనియాలు నూనె లేకుండా దోరగా వేయించి, మిక్సీ లో మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఎప్పటి కప్పుడు ఓ చిటికెడు పొడి టీ మరుగుతూ ఉండగా వేస్తే, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ప్రయత్నించండి !

Wednesday, April 19, 2017

పాట సాగుతూనే ఉంటుంది...


  ఊపిరాగిపోతుంది... కానీ పాట సాగుతూనే ఉంటుంది...

----------------------------------------------------------------
భావరాజు పద్మిని - 18/4/17
“పద్మిని గారు... నాకు పాటలంటే చాలా ఇష్టం, ఇక్కడ నేర్పేవారు ఎవరూ దొరకరు కదా ! వీలయితే, ఓ నాలుగు పాటలు నేర్పిస్తారా?”
ఏమని చెప్పాలి ఆవిడకి? జీవితం అందించిన బాధ్యతలతో చేసే అష్టావధానం వంటి విన్యాసాలతో నలిగిపోతూ, మధ్య మధ్య ఏ ప్రకృతి ఒడిలోనో సేద తీరుతూ, నాలో తిరిగి నిండిన జీవాన్ని అందరికీ అక్షరాలతో పంచే అన్వేషినని చెప్పాలా? కాలానికి -వేగానికి, దూరానికి – గమ్యానికి మధ్య నలిగిపోతూనే నాలోని అస్తిత్వాన్ని బ్రతికించుకునేందుకు అనుక్షణం నేను పడే తపన గురించి చెప్పాలా? గతంలో కొంతమందికి పాటలు నేర్పాను, కాని ఇప్పుడు... ‘వీలు కాదు’ అని చెప్పాలా? అసలు నేను పాటలు ఎలా నేర్చుకున్నాను? ఒక్కసారిగా అంతర్మధనం...
డిగ్రీతో పాటే శాస్త్రీయ సంగీతం, వీణ క్లాసులకు వెళ్ళేదాన్ని. ఉదయం కాలేజి, సాయంత్రం సంగీతం, ట్యూషన్లు. అప్పట్లో కళను గంటల్లో, కాసుల్లో లెక్కకట్టి కొలిచేవారు కాదు. విద్య నేర్పే గురువులు కేవలం విద్యనే కాక, విద్యార్ధి మానసిక స్థితిని, ఒత్తిడిని కూడా గమనించి, తగిన విధంగా మార్గదర్శకులై ఉండేవారు. తెనాలిలో నా మొదటి సంగీతం టీచర్ కామేశ్వరి గారు, సాయంత్రం కాలేజి నుంచి ఇంటికి వెళ్తే, పిల్ల ఎండనపడి వేళ్ళాడుతూ వచ్చిందని, ఏదో ఒకటి పెట్టేవారు. ఆవిడ పెట్టిన వంకాయ ఉప్మా, జన్మలో మర్చిపోలేను. వారమంతా క్లాసులు ఉండేవి, కాని ఆవిడ తీసుకున్న జీతం 30 రూపాయిలు. దురదృష్టవశాత్తూ, ఆవిడ చిన్న వయసులోనే(సుమారు 50సం.) చనిపోయారు. కాని, ఆవిడ నేర్పిన పాటలు, నా వీణ మీద, నా మానసవీధిలో ఇంకా మార్మ్రోగుతూనే ఉంటాయి. ఆ పాట పలికించినప్పుడు ఆవిడ తలపులూ అలా నన్ను అల్లేస్తూ ఉంటాయి.
అలాగే నేను ఎం.ఎస్.సి కెమిస్ట్రీ చదువుతూ ఉండగా, నా రెండవ సంగీతం టీచర్ బాపట్లలో కామేశ్వరి గారని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్య నేర్పారు. డబ్బు తీస్కోకూడదు అన్నది ఆవిడ నియమం. ఇక నాకు వీణలో సర్టిఫికేట్ కోర్స్ కు శిక్షణ ఇచ్చిన శారద గారు, వీణని మనసులు మీటేలా పలికించడం నేర్పుతూనే నాకు ఇంట్లోని వారితో సమానంగా వండి ప్రేమగా వడ్డించిన హేమాంబుజ గారు... వీరందరూ నాకు అత్యంత ఆప్తులు. వారు దూరంగా ఉన్నా, వారు అందించిన పాటల రూపంలో నాతో వారూ జీవిస్తూనే ఉంటారు. ఏ కళ అయినా శారదా మాత భిక్ష. కళాకారుడి ఊపిరి ఆగినా, ఆ కళ రూపంలో తన శిష్యులలో, అనేక మంది జ్ఞాపకాలలో, జీవిస్తూనే ఉంటాడు. ఆ భాగ్యం కళాకారుడికి మాత్రమే అందిన గొప్ప అనుగ్రహం. ఇటువంటి మహాద్భాగ్యాన్ని నేనెందుకు ఒదులుకుంటాను?
జీవితమే ఒక పాటగా పల్లవించండి... సుదూర తీరాలలో ఏదో ఒక గళంలో మ్రోగే పాటగా కుసుమించండి... బ్రతుకే ఒక పాటగా జీవించండి...
“మీ నంబెర్ ఇవ్వండి, వీలైనప్పుడు కాల్ చేస్తాను... అయితే ఒక నియమం, నేను ఊరికే నేర్పుతాను, మీరు నాకేం ఇవ్వద్దు.” అన్నాను. ఇవ్వాళే ఆవిడకో నాలుగు పాటలు నేర్పి, ఈ పోస్ట్ రాసే అర్హత సంపాదించుకున్నాను.
నేడు తమకు వచ్చినదంతా ఇతరులకు నేర్పేస్తే, వారు తమకు పోటీగా తయారౌతారన్న చిన్న స్వార్ధం నేడు కళాకారుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. “పంచితే కళ తరిగిపోదు... వారందరి రూపంలో అజరామరంగా జీవిస్తూ, ముందు తరాలకు అందుతుంది...” అందుకే వచ్చిన ఏ చిన్న విద్యనైనా, కాస్త తీరిక చేసుకుని, ఇతరులకు నేర్పండి. “ఇచ్చుటలో ఉన్న హాయిని” మీరూ అనుభూతి చెందండి...