Sunday, July 14, 2013

పంచతంత్ర కధలు - మిత్రలాభం


పంచతంత్రకధలు 

పంచతంత్రం అంటే ఐదు తంత్రాలు. 'తంత్రం' అనే మాటకు అనేక అర్ధాలు ఉన్నా, ఇక్కడ ముఖ్యమైన ప్రణాళిక ఏర్పరచుకునే దారి అని అర్ధం . ఈ కధల్లో మనకు బోధించినది రాజ పాలనా పరమయిన కర్తవ్యతా తంత్రం. అందుకే ఈ గ్రంథానికి పంచతంత్రం అని పేరు పెట్టారు. పంచతంత్రంలో 1. మిత్ర భేదం 2. మిత్రలాభం 3. కాకోలూకీయము లేక సంధి విగ్రహం 4. లబ్ధ ప్రణాశం 5. అసమీక్ష్య కారిత్వం అనేవి ప్రధాన కథలు. ఇది సామాన్య గ్రంధం కాదు...అర్థశాస్త్ర సారం, నీతిశాస్త్రం రాజనీతి శాస్త్రం కలిపి మానవాళికి మార్గదర్శనం చేయగల్గిన మహనీయ గ్రంథం.

విష్ణుశర్మ సంస్కృతంలో రచించిన పంచతంత్రం ప్రపంచ ఖ్యాతి గన్న గ్రంథం. మహిళారోప్యనగర పాలకుడు అమరశర్మ . ఆయనకు ముగ్గురు మూర్ఖులయిన కుమారులు కలిగారు. ఒక రోజు ఆయన, తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, ' కొడుకులు పుట్టకపోయినా పర్వాలేదు, మూర్ఖులుగా పుట్టి, కళ్ళముందే పదుగురి ముందూ నా కుమారులు నవ్వులపాలు అవుతున్నారు. చదువుసంధ్యలు లేక పాడయి పోతున్న నా కుమారులను విజ్ఞులను చేసే ఉపాయం సెలవియ్యమని, ' విద్వాంసులను వేడుకొన్నాడు. అపుడు విష్ణుశర్మ అనే పండితుడు, ఆరునెలల్లో వారు 'ధారుణి పాలించు నేర్పు దవిరెడి విద్య' పొందేలా చేయగలనని రాజుకు మాటయిస్తాడు. దానికి ఆయన 'కథ' అనే అపూర్వమైన ఆయుధం లేక ఔషధం ఉపయోగించాడు. నిండు హృదయంతో , ఎటువంటి ఫలాపెక్షా లేకుండా, ఎనభై ఏళ్ళ వయసులో 'పంచతంత్రం' రచించి, రాకుమారులకు నేర్పించాడు. 

ఈ కధల్లో మనిషి ఎలా బ్రతకాలో, ఏ సమయాల్లో ఎటువంటి తంత్రం ప్రయోగించాలో, రాకుమారులకు బోధించాడు. సర్వశాస్త్రాల సారం ఈ కధల్లో ఉంది. ఓర్పుగా ఈ కధలు చదివిన వారికి కీడు కలుగదు. అడవిలోని జంతువుల్లా మెలిగే రాజ పుత్రులకు అడవిజంతువుల చేత, పశుపక్షాదుల చేత నీతులతో కూడిన కథలు చెప్పిస్తూ క్రమంగా వారిని పరిపూర్ణ మేదస్సు కల మానవుల్లోకి తెచ్చి పడేశాడు. ఈ కథలన్నీ విన్న రాజ కుమారులు కర్తవ్య జ్ఞాన నిష్ఠులై ప్రకాశించారు.

పంచతంత్రంలో విష్ణుశర్మ రాజపుత్రులకు చెప్పేది వారికి అవసరమైన విద్య. కౌటిల్యుడు అర్థ శాస్త్రంలో రాజులకు అవసరమైన విద్యలు నాలుగు అని చెప్పాడు. అవి త్రయీ, వార్తా, దండనీతి, అన్వీక్షకీ అనేవి. త్రయి అంటే వేదాలు, ఇవి ధర్మ పాలనకు అవసరం. వార్త అంటే తన చుట్టూ జరుగుతున్నవి, అంటే ఈ సమాచారం సేకరించే యంత్రాంగం ఉండాలి.( intelligence gathering). దండనీతి అంటే శత్రువులను, నేరస్థులను శిక్షించ గల బలం. అన్వీక్షకి అంటే logic. సమాచారంనుండి కర్తవ్యం దాకా మార్గదర్శనం చేసే శాస్త్రం. దీని వలన మనకు లభించేవి తంత్ర, యుక్తులు. తంత్రం అంటే strategy, యుక్తి అంటే tactic. ఒకటి దూరాలోచన, ఒకటి తక్షణ కర్తవ్యం. అందుకు పంచతంత్రంలో కథలరూపంలో ఐదు ముఖ్యమైన తంత్రాలను గురించి చెబుతాడు. మొదటిది మిత్రభేదం - ఎప్పుడూ మిత్రుల కన్నా శత్రువుల విషయం ముఖ్యం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని గమనిస్తూ ఉండాలి. వారి స్నేహ సంబంధాలు భగ్నం చేయాలి. ఇది priority item. ఇది offence.రెండవది మిత్ర లాభం, లేదా మిత్ర సంప్రాప్తి,ఇది defence .. శత్రువును ఎదుర్కోడానికి మిత్రకూటమిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలి. మూడవది కాకోలూకీయం. కాకులు, గుడ్లగూబలు (ఉలూకం) అని మనుష్యులు రెండు రకాలు. మనుష్యుల తత్త్వాలను అర్థంచేసుకునే ప్రయత్నం. నాలుగవది లబ్ధ ప్రణాశం. అంటే ఉన్నది నాశనం కాకుండా చూసుకోవడం, అంటే క్షేమం ఉండాలి. ఐదవది అసమీక్ష (అపరీక్ష) కారికం. పరిస్థితిని సమాచారాన్ని సమీక్షించకుండా నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం. ఇవి ప్రమాదాలను తెచ్చిపెడతాయి ఇవి ఐదు తంత్రాలుగా కథలతో చెప్పాడు.

మంచి స్నేహితులని కలిగి ఉంటే ఆపదలలో వాళ్ళు ఆదుకుంటారు అది గ్రహించి  కాకి, తాబేలు, లేడి, ఎలుక ఆపదలనుండి గట్టెకాయి, ఆ కథల వలన మంచి మిత్రుల వలన కలిగే  లాభం ఏమిటో తెలుస్తుంది  అంటూ విష్ణుశర్మ  మిత్రలాభం కథలు చెప్పటం ప్రారంభించాడు.  విలాసాల బారిన పడిన రాజకుమారులను దారిన పెట్టేందుకు విష్ణుశర్మ పంచతంత్రాన్ని బోధించాడు.అందులోని మిత్ర లాభం , మిత్ర భేదం విభాగాల్లోని కథలు స్నేహితుల వల్ల, స్నేహాల వల్ల కలిగేలాభాలను, స్నేహ్తితులతో వైరం వల్ల కలిగే పర్యవసానాలను చక్కగా వివరించాయి.

 ఒక రోజు విష్ణుశర్మ రాకుమారులతో "మీకు ఈ రోజు మంచి విఙ్ఞానము, వినోదము కలిగించే మంచికధలను కూడా చెప్తాను శ్రధగా వినండి. ముందుగా మీకు "మిత్రలాభం" అనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంతమేలు చేస్తుందో తెలియచేసి మన బుద్ధి వికసింపచేస్తుంది. మంచివారి మైత్రి వల్ల మనకు గౌరవం చేకూరి సర్వ శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సామాన్యుడు కానీ, రాజ్యాధికారి కానీ, తన జీవితకాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తోడేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి, ఒకరికొకరు సహకరిస్తూ, ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురు ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి" అని కథ ప్రారంభించాడు విష్ణుశర్మ .

బోయవాడు -పావురాలు.
 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటకాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుతూ భూమిపై నూకలు చూసాయి. వెంటనే క్రిందకు దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు "వద్దు తొందరపడవద్దు. మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఎదో మోసం ఉంది కనుక, మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోటబడి మరణించాడు. మీకా కథ చెపుతాను వినండి" అని చెప్పసాగాడు... 



 పంచతంత్రం - మిత్రలాభం


   ఒక రోజు విష్ణుశర్మ రాకుమారులతో "మీకు ఈ రోజు మంచి విఙ్ఞానము, వినోదము కలిగించే మంచికధలను చెప్తాను శ్రధగా వినండి. ముందుగా మీకు "మిత్రలాభం" అనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంతమేలు చేస్తుందో తెలియచేసి మన బుద్ధి వికసింపచేస్తుంది. మంచివారి మైత్రి వల్ల మనకు గౌరవం చేకూరి సర్వ శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సామాన్యుడు కానీ, రాజ్యాధికారి కానీ, తన జీవితకాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తోడేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి, ఒకరికొకరు సహకరిస్తూ, ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురు ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి" అని కథ ప్రారంభించాడు విష్ణుశర్మ .

బోయవాడు -పావురాలు.
-------------------------
 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటకాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. ఇదంతా కాకి చూసింది . తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుతూ భూమిపై నూకలు చూసాయి. వెంటనే క్రిందకు దిగి తిందామని ఆశపడగా, లఘుపతనకము వాటిని వారించి, ' నూకలకు ఆశపడి అక్కడికి పోవద్దు, ఇదంతా, వేటగాడి వల. నా మాట వినకుండా, మీరు అక్కడకు వెళ్ళారో, మీకింక భూమిపై నూకలు చేల్లినట్టే!' అంది. ఈ లోపల పావురాల నాయకుడయిన చిత్రగ్రీవుడు , కాకి మాటలను లెక్కపెట్టక, నూకలపై ఆశతో, తన పరివారంతో సహా అక్కడ వాలి, వలపై చిక్కుకున్నాడు . క్షణంలో కలకలం బయలుదేరింది. పక్షులన్నీ విలవిలా గింజుకోసాగాయి.
  
వలలో చిక్కుకుని, దిగులుపడిన కపోతాలతో, చిత్రగ్రీవుడు, ' కష్టాలు వచ్చినప్పుడే గుండె ధైర్యంతో ఎదురుకోవాలి. అంతే కాని, భయపడకూడదు. ఇప్పుడు మనమంతా కలిసికట్టుగా లేచి, ఈ వలను మొత్తం ఎత్తుకొని పోదాము, ' అన్నాడు.

రాజాజ్ఞ మేరకు పక్షులన్నీ ఉవ్వెత్తున లేచి, ఒక్కసారిగా పైకి ఎగిరాయి. బోయవాడు పరిగెత్తుకు వచ్చేలోపే, ఆకాశానికి ఎగిరిపోయాయి. బోయవాడు వల వలా ఏడ్చాడు. కుయ్యో, మొర్రో అని మొత్తుకున్నాడు . తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ, వెళ్ళిపోయాడు.

ఆ పావురాలన్నీ యెగిరి ఎక్కడికి పోతాయో, ఎలా విడిపించుకుంటాయో చూడాలని, లఘుపతనకం (కాకి) ఆ గుంపు వెంటే ఎగురుకుంటూ వెళ్ళింది. 

చిత్రగ్రీవుడు సాటి పావురాలతో, 'వేటగాడు తిరిగి పోయాడు, ఇంక మనకు మరేమీ భయం లేదు. ఉత్తరం దిక్కుగా బయలుదేరండి. అక్కడ హిరణ్యకుడని, నాకొక ఎలుక మిత్రుడు ఉన్నాడు. ఆ ఎలుకరాజు వద్దకు వెళితే, మన బంధనాలన్నీ కొరికి అవతల పారేస్తాడు,'  అంటూ వాటికి ధైర్యం చెప్పాడు.

కపోత బృందం హిరణ్యకుడి బిలం వద్దకు చేరింది. అప్పుడు చిత్రగ్రీవుడు, 'మిత్రమా! చెడిపోయి వచ్చాను, నీవే ఆదుకోవాలి, ' అంటూ ఎలుగెత్తి పిలిచింది. మిత్రుని గొంతులోని ఆర్తిని విన్న ఎలుక వెంటనే వచ్చి, స్నేహితుడి పరిస్థితిని చూసి, 'అయ్యో, ఇది ఎలా జరిగింది?' అని అడిగింది.

'మిత్రమా! గింజల కోసం ఆశించి, నా పరివారంతో సహా ఇలా ఇరుక్కున్నాను. ముందుగా, నా వారయిన వీరందరి బంధనాలు తొలగించి, చివర్లో నా కాళ్ళకు ఉన్న తాళ్ళను కోరికివేద్దువుగాని,' అంది. 

'ముందు రాజు, తరువాత సహచరులు కదా, మిత్రమా!', ఆశ్చర్యంతో అడిగింది మూషికం.

' కాదు మిత్రమా! తనను నమ్ముకున్న వాళ్ళ క్షేమం చూసి, తరువాత తన సంగతి చూడడం, రాజ ధర్మం. సహ్రుదయులేప్పుడూ ధర్మం తప్పరాదు. ఆలస్యం చెయ్యక, నా వారి బంధనాలు తొలగించు, మళ్ళీ ఆ బోయ మమ్మల్ని వెతుక్కుంటూ ఇటుగా వస్తాడేమో,' అన్నాడు చిత్రగ్రీవుడు. 

  చిత్రగ్రీవుడి మాటలు విన్న హిరణ్యకుడు, 'రాజ ధర్మాన్ని చక్కగా వినిపించావు మిత్రమా, ' అంటూ, తన బలమంతా చూపి, చిటుకు పటుకుమని, ఆ పక్షులు చిక్కుకున్న తాళ్ళను ఒక్కొక్కటే కొరికి వేసింది. పావురాలన్నీ ఎగిరిపోయాకా, చివరగా చిత్రగీవుడి బంధనాలు తొలగించింది. ఇలా ఎలుక తన స్నేహితుడిని, అతని పరివారాన్ని చిక్కు నుంచీ విడిపించి, ఎంతో తృప్తిగా కలుగులోకి వెళ్ళిపోయింది.

ఇదంతా వెనుక నుండీ చూస్తున్న లఘుపతనకము , 'ఆహా, స్నేహమంటే ఇదే కదా, ' అంటూ ఎంతో పొంగిపోయింది. ఎలాగయినా హిరణ్యకుడితో స్నేహం చెయ్యాలని నిర్ణయించుకుంది.

కలుగు ముందు చేరి, 'ఓహో మూషికరాజా !' అని పిలిచింది. ఆ పిలుపు విన్న హిరణ్యకం, ' నీవెవరవు ? నాలాంటి వాడితో నీకు కావలసిన పని ఏమి?' అని అడిగింది.

'నీ బలం తెలిసే నేను ఇలా వచ్చాను. నీ మిత్రుని పట్ల నీవు కనబరచిన మైత్రి చూసి, నీతో స్నేహం చెయ్యాలని వచ్చాను. నీవెంతో మంచివాడివి. నాకు నిన్ను చూసే అదృష్టాన్ని ప్రసాదించవూ...' అంటూ వేడుకున్నది లఘుపతనకము.

' నీవు నన్ను తినేవాడివి, సృష్టి ధర్మం ప్రకారం నేను నీకు ఆహారం కావలసిన వాడిని. పగవారి మధ్య మైత్రి ఎలా సంభవం? స్నేహం ఎప్పుడూ, తగిన వారి మధ్యనే సాధ్యం, ' అంది ఎలుక. 

'నీతో స్నేహం చెయ్యకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, దయ చేసి నీ పట్టు వదిలి పెట్టు,' అంది లఘుపతనకం. 

'శత్రువులతో మైత్రి ప్రమాదకరం, కాగిన నీళ్ళయినా అగ్నిని ఆర్పేస్తాయి . కాబట్టి శత్రువుల మధ్యన మైత్రి అసాధ్యం!'

' అసలు నీవు బయటకు వచ్చి, నన్ను చూడనయినా లేదే! నేను నీ శత్రువును అని ఎలా అనుకుంటున్నావు ? మన మధ్య పగ ఏమిటి?'

' వైరం రెండు రకాలు... అవి ఏవిటో చెప్తాను విను....'


  
హిరణ్యకుడు లఘుపతనకం తో ఇలా చెప్పసాగాడు...

'వైరం రెండు విధాలు. పుట్టుకతోనే వచ్చేది సహజ వైరం. ఏదో సరిపడక వచ్చేది మామూలు వైరం. ఈ రెండిటిలోనూ సహజంగా వచ్చే వైరాన్ని ఎవ్వరూ తొలగించలేరు. నీటికి, నిప్పుకీ మధ్య నేస్తం కుదురుతుందా, కుక్కా పిల్లీ కలిసి ఉండగలవా? సింహం -ఏనుగూ మధ్య స్నేహం సాధ్యమేనా? మన మధ్య ఉన్నది పుట్టుకతో వచ్చిన అటువంటి పగ, కనుక శుష్క వాదం మాని, వెళ్ళిపో,'

'ఏడు మాటలతోనే స్నేహం ఏర్పడుతుందని అంటారు. నీ మైత్రి ఎటువంటిదో, నీవెంతటి మంచి వాడివో తెలుసుకున్నాను. నీవు కలుగులోనే ఉంది, రోజూ నన్ను పలుకరించేందుకు వప్పుకుంటే చాలు. నీ బిలంలో కాలు పెట్టనని మాట ఇస్తున్నాను. బయట నుంచే పలకరిస్తాను, దయ చేసి కాదనకు,' అంది కాకి.

'సరే, దానికేమి, ఇంతవరకయితే నేను సమ్మతిస్తాను , మంచి వారితో గోష్టి ఎప్పటికయినా మంచిదే కదా,' అన్నాడు హిరణ్యకుడు.

ఆ నాటి నుంచీ కాకి, ఎలుక ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ మంచి స్నేహితులు అయిపోయాయి. రోజురోజుకూ వారి స్నేహం బలపడ సాగింది. కాకి, ఎక్కడెక్కడి నుంచో చిరు తిళ్లు తెచ్చి, ఎలుకకు పెట్టసాగింది. హిరణ్యకం కూడా తనకు దొరికిన ఆహారాన్ని కలుగులో నుంచి బయటకు తోసి, చెలికాడా, తిను అనేది. 

ప్రేమ సామాన్యంగా ఆరు లక్షణాలు కలది...( ఈ వెలలేని ముత్యాల వంటి మాటలు చూడండి..)

తనకు కలిగింది ఇవ్వడం.
ఇచ్చిన వాటిని తీసుకోవడం.
తన రహస్యాలేవో చెప్పడం .
చెప్పిన దానిని వినడం.
తినడానికి ఇవ్వడం.
ఇచ్చిన తిండిని తినడం.
ఇవే ప్రేమను, ప్రీతిని తెలిపే గుణాలు.

 కానుకలిస్తే దేవతలే సంతోషిస్తారు. గడ్డి వేసినంత మాత్రాన సంతోషించి, తన దూడ సంగతయినాచూడకుండా, ఆవు పుష్కలంగా పాలిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పుడే నిజమయిన ప్రేమ మరింత శోభిస్తుంది .

ఇలా లఘుపతనకం పై హిరణ్యకానికి తిరుగులేని గురి కుదిరింది. అసలు కలుగు బయటకే రాను, అని చెప్పినది, ఇప్పుడు ఆ కాకి రెక్కల్లో దూరి ఆనందించసాగింది.

ఇలా ఉండగా, ఒక రోజు కాకి ఏంటో దుఃఖ పడుతూ వచ్చింది. తానూ ఇక అక్కడ ఉండలేనంటూ ఘొల్లు మన్నది .

'మిత్రమా, వానలు కురవక కరువు వచ్చింది. నాలుగు గింజలు దొరకక, ప్రజలు కాకబలులు ఇవ్వడం మానివేశారు. గంజికి కూడా లేక అల్లాడుతున్నారు. వలలు తీసుకుని, పక్షులను పట్టుకు తినాలని, గుంపులు గుంపులుగా వచ్చి పడుతున్నారు. నేను వలలో చిక్కి, ఎలాగో తప్పించుకుని వచ్చాను. ఇకపై ఇక్కడ ఉంటే, నా ప్రాణాలు దక్కవు, వెంటనే ఎటయినా పోవాలి, ' అన్నది. 

'ఏ గమ్యం లేకుండా, ఆపదలో తొందరపడి ఎక్కడికి పోతావు మిత్రమా ?' అన్నది ఎలుక.

' దక్షిణ భారతంలో ఒక కీకారణ్యం ఉంది. అందులో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో మంధరకం అనే తాబేలు ఉంది. అది అన్ని విధాలుగా నిన్ను పోలినదే! ఎంతో స్నేహంగా ఉంటుంది. అక్కడికి వెళితే, ఇంత తిండి పెట్టకపోడు. మిత్రుడితో మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యవచ్చు. తన దేశం పర దేశం అని కాదు, సురక్షితంగా ఉండడం ముఖ్యం. తలపు బలంగా ఉంటే, దూరాన్ని అధిగమించి ఎగరడం పెద్ద సమస్య కాదు, నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది ' అన్నది. 

'నువ్వు వెళితే నేనూ వస్తాను, నీవు లేకుండా నేనూ ఇక్కడ ఉండలేను, ' అన్నది హిరణ్యకం.

'నిన్ను వదిలి వెళ్ళాలంటే, నాకూ చాలా బాధగా ఉంది. నేను పైపైన యెగిరి పోతాను. నీవు కొండలూ గుట్టలూ దాటుకుంటూ, నా కోసం అంత దూరం రాగలవా?' అడిగింది కాకి.

 ' నేస్తమా, నన్ను నీ మీద ఎక్కించుకుని తీసుకుపో, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, ' అన్నది హిరణ్యకం. 

'అలాగయితే సరే, నేను ఆకాశంలో గిరికీలు కొట్టగలను, యెంత దూరమయినా ఎగరగలను, చీకూ చింతా లేకుండా, యెగిరి పోదాం రా!' అండి కాకి.

అలా హిరణ్యకాన్ని తన వీపు మీద ఎక్కించుకున్న లఘుపతనకం తిన్నగా అడవిలో, తన మిత్రుడు ఉండే చెరువు వద్దకు చేరుకున్నది. అదేదో మామూలు కాకి అనుకుని, గుర్తుపట్టక, మంధరకం (తాబేలు) గభాలున భయపడి, నీటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కాకి, ' ఓ మంధరకా! కాస్త పైకిరా! నీ స్నేహితుడిని వచ్చాను. అంత దూరం నుండీ నీ ఒడిలోకి  వాలాలని వచ్చాను. మిత్రుడి స్పర్శ కర్పూరం కలిపిన గంధపు పూత అంత హాయిని ఇస్తుంది కదా!' అంది.

ఆ మాట వినగానే ఆ గొంతును గుర్తుపట్టిన మంధరకం, ఎంతో ఆత్రుతతో బయటకు వచ్చి, తన మిత్రుని ఆదరంగా కౌగిలించుకున్నది. కాసేపు ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకున్నాకా, తాబేలు, ' ఈ ఎలుకను తీసుకు వచ్చావేమిటి ? ఇది మీ జాతికి ఆహారం కావలసినది కదా! తినకుండా, నీ వీపు మీద ఎందుకు ఎక్కించుకు వచ్చావు?' అని అడిగింది.

'ఏమీ ఎరుగని ఈ అమాయకమయిన ఎలుక నా ప్రియ నేస్తం. నా కోసం దిగులుపడి, నన్ను విడిచి ఉండలేక, ఇలా నాతొ వచ్చింది,' అన్నది కాకి.

'మిత్రులారా, నా మనసు నిండా దిగులే, నా వాస్తవ కధను మీతో చెప్తాను, వినండి

హిరణ్యకం తన పూర్వ కధను ఇలా చెప్పసాగింది. 

దక్షిణాదిలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి వెలుపల ఉన్న ఆలయం వద్ద ఒక చండీ మఠం ఉంది. అందులో తామ్రచూడుడు అనే సన్యాసి ఉండేవాడు. అతను రోజూ పట్టణానికి భిక్షాటనకు వెళ్లి, వచ్చిన ఆహారంలో తనకు సరిపడా తిని, మిగిలింది ఒక పాత్రలో పెట్టి, ఉట్టికి తగిలిస్తూ ఉండేవాడు. 

మర్నాడు ఉదయం ఆ ఆహారం అంతా తన సేవకులకు ఇచ్చి, వాళ్ళతో తనకు కావలసిన చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉండేవాడు. ఇదంతా గమనించిన ఆ సేవకులు, నా వద్దకు వచ్చి, రోజూ ఆ ఆహారం మాకు అందించు. కాస్త ఆహారం కోసం అంత కష్టపడాలంటే, ప్రయాసగా ఉంది, అన్నారు.

నేను సరేనని, ఉట్టికి తగిలించిన ఆహారం ఆ సేవకులకు అందించి వేల్లిపోయే దాన్ని. ఇలా రోజూ జరుగుతుండడం చూసిన సన్యాసి, ఒక వెదురు కర్రను తెచ్చి, ఏ కాస్త చప్పుడు వినిపించినా, అది నెలకు వేసి కొడుతూ ఉండేవాడు. నేను అతను కొట్టినప్పుడు వెళ్లి, మరలా తిరిగి వచ్చేదాన్ని. 

కొన్నాళ్ళు ఇలా సాగింది. ఒక రోజు, ఒక భిక్షువు, సన్యాసితో పాటు మఠానికి వచ్చాడు. కొత్త సన్యాసి, పాత సన్యాసికి తానూ తిరిగిన ఊళ్ళను గురించిన వింతలూ - విడ్డురాలూ చెబుతూ ఉన్నాడు. కాని పాత సన్యాసి పరధ్యానంగా, ఎలుకలు వస్తాయేమో అన్న బెంగతో అటువైపే ఆలోచిస్తూ ఉన్నాడు. 

అందుకు కోపించిన కొత్త సన్యాసి, ' ఓయీ! ఒక్క మాట వినవు, జవాబు చెప్పవు .అతిధి వచ్చిన వేళ దిక్కులు చూస్తూ ఇలా అవమానిస్తావా? నీ వద్దకు వచ్చి, నేను ముళ్ళ చెట్టు వద్దకు వచ్చిన అనుభూతి కలుగుతోంది. అతిధి కష్ట సుఖాలు వినని వాణి వద్ద ఉండరాదు. కనుక నేను వెంటనే ఇక్కడినుంచీ వెళ్ళిపోతాను, ఈ గుళ్ళో ఇక చస్తే కాలు పెట్టాను, ' అన్నాడు.

వెంటనే తేరుకున్న పాత సన్యాసి, ' అయ్యయ్యో, అపచారం స్వామీ! మీ విషయంలో నాకు ఎటువంటి వ్యతిరేక భావాలూ లేవు. నా పర ధ్యానానికి కారణం-- ఎలుకలు. కొన్ని రోజుల నుంచీ రోజంతా నేను కష్టపడి బిచ్చమెత్తుకుని తెచ్చిన అన్నమంతా అవి తినిపోతున్నవి. ఏదో, ఆ తిన్దినే ఆశ చూపించి, శక్తి లేని నేను సేవకులతో పని చేయించుకుంటున్నాను. అది కాస్తా ఆ ఎలుకల పాల పడిపోతే, నేను ఎలా బ్రతికేది? అందుకే, ఈ కర్ర తీసుకుని, ఎలుకలను తరుముతూ ఉంటాను, ' అన్నాడు. 

'ఓస్, ఇంతేనా ? ఈ మాత్రానికే దిగులు ఎందుకు? అవి ఏ కలుగులో నుంచీ వస్తున్నాయో చూసారా?'

'అదేమీ నాకు తెలియదు. చీకటి పడితే చాలు, గుంపుగా వచ్చి పడతాయి.'

' అయితే, అక్కడ ఖచ్చితంగా ఏదో నిధి ఉంది ఉంటుంది. దాని మీదనే కలుగు ఉంది ఉంటుంది. లేకపోతే, ఆ కలుగులోని ఎలుకకు ఎగిరెగిరి పడేంత దమ్ము ఉండదు. ఆ విషయం నీకు అర్ధం కావాలంటే, నీకొక కధ చెబుతాను విను, ' అంటూ చెప్పసాగాడు కొత్త సన్యాసి.

అతిధి సత్కార కధ(కధలో కధ)
-------------------------------------

ఒక వర్షాకాలంలో నేను దేశాటన మాని, ఒకే చోట ఉండాలని నిశ్చయించుకున్నాను. ఒక బ్రాహ్మణుడు నన్ను ఆదరించి, తన ఇంట్లోనే ఉండమన్నాడు. ఆయన పెట్టింది తింటూ, దేవతార్చన చేసుకుంటూ, అక్కడే ఉండసాగాను.

ఒక రోజు తెల్లవారుఝామున ఆ బ్రాహ్మణుడు ఎక్కడికో వెళుతూ, 'ఇవాళ కటక సంక్రాంతి. కాబట్టి నేను అలా వెళ్లి వస్తాను, దానాలు తీసుకునేందుకు ఇదే సదవకాశం. నీవు అతిధికి ఏ లోటూ రాకుండా చూసుకో, ' అని చెప్పాడు.

బ్రాహ్మణుడి మాటలు విన్న అతని భార్య కోపించి, 'మనకే తిండికి గతి లేదు, చేతిలో దమ్మిడీ లేదు. ఇక అతిధికి ఏమి పెట్టాలి?' అంటూ నిష్టూరాలు పలికింది. అందుకు ఆ బ్రాహ్మణుడు 'మనకు యెంత లేకపోయినా, ఉన్నంతలో అతిధికి పెట్టడం ధర్మం. దాని వల్ల మనకు పుణ్యం వస్తుంది, ' అని చెప్పి దానాలు స్వీకరించేందుకు వెళ్ళాడు. 

ఆ తరువాత ఆ స్త్రీ, ఇంట్లో ఉన్న నువ్వులను తడిపి, పొట్టు తీసి నా పొట్ట నింపాలని, అవి ఎండలో నానబెట్టింది. ఇంతలో ఒక కుక్క వచ్చి దానిలో మూతి పెట్టి

వెంటనే ఆమె బాధ పడి, ఒక ఉపాయం ఆలోచించింది. చుట్టుపక్కల ఇళ్ళకు వెళ్లి, 'నేను ఈ పొట్టు తీసిన నువ్వులు ఇస్తాను, మీరు అవి తీసుకుని, ముడి నువ్వులు ఇస్తారా? అంటూ తిరగసాగింది. ఆమె మాటల్లో ఏదో మెలిక ఉందని వాళ్ళెవ్వరూ ముందుకు రాలేదు.

కాబట్టి, ఓ సన్యాసీ! ప్రతీ చర్య వెనుకా ఒక బలమయిన కారణం ఉంటుంది. ఎలుక అంతగా యెగిరి పడుతోంది అంటే, అది ఉండే బిలం కింద నిధి ఉండి తీరాలి. మనం ఆ నిధిని తవ్వి తీసామో, ఆ దుష్ట మూషికం నాశనమై పోతుంది, ' అంటూ, ఇరువురూ కలిసి ఆ కలుగును తవ్వ సాగారు. మేము బయట పడలేక బాధ పడుతుండగా, ఒక బావురు పిల్లి వచ్చి నా మిత్రులు అందరినీ తినేసింది. నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. 

సన్యాసులిద్దరూ తవ్వి, తవ్వి ఆ నిధిని బయటకు తీసారు. దానితో ఆ బిలం వన్నె, వాసి తప్పి, వెలవెల పోయింది. దానితో నా బలమూ క్షీణించిపోయింది . అయినా, ప్రయత్నిద్దామని, మళ్ళి ఆ సన్యాసి ఉట్టి పైకి యెగిరి ఆహారం సేకరించాలని ప్రయత్నించాను. కాని ఆ ఉట్టిని తాకలేకపోయాను. 

నేను ఉట్టిని అందుకోలేకపోవడం చూసిన కొత్త సన్యాసి హేళనగా ఇలా అన్నాడు .. 

కోరలు తీసిన పాము ఏమి చేస్తుంది? బలం లేని ఏనుగుతో ఫలం ఏముంది? సూర్యుడు లేకపోతే ఎలా కనిపిస్తుంది? ధనం లేని దరిద్రుడు కూడా అంతే ! ఇక ఈ ఎలుక పని అయిపోయినట్టే! 

'నేను ఇంకా నిధి మీద ఆశ చావక, సన్యాసి నిద్రిస్తూ ఉండగా తిరిగి అక్కడకు వెళ్లి, అతని తల క్రింద ఉన్న పెట్టెను పళ్ళతో కొట్టేయ్య  సాగాను. ఇంతలో ఆ సాధువు లేచి, కర్రతో బలంగా నన్ను కొట్టాడు . నేను గిరగిరా తిరిగి, పడిపోయి లేచి, ఎలాగో బయట పడ్డాను  . దేనికయినా, ప్రాప్తం ఉండాలి కదా, మన సోత్తయితే మనకు దక్కుతున్ది. లేకపోతె ఆశలు వదులుకోవాల్సిందే! ' అంది యెలుక. 

ఆ మాటలు విన్న కాకి, తాబేలు, ' అదెట్లా కుదురుతుంది? ఏది ఎవరిదో వారికే దక్కడం ఎలా సంభవం ?' అని అడిగాయి . 

అది మీకు అర్ధం కావాలంటే , మీకొక చక్కటి కధను చెబుతాను వినండి, అంటూ ఇలా చెప్పసాగింది ఎలుక . 

వర్తక కుమారుడి కధ 
-------------------------

సాగరదత్తుడనే వర్తకుడు ఒక పట్టణంలో ఉన్దెవాదు. అతని కొడుకు వీధిలో వెళుతూ, వంద రూపాయలు పెట్టి, ఒక పుస్తకం కొనుక్కున్నాడు . అందులో ఒక్కటే శ్లోకం ఉంది తప్ప మరేమీ లేదు . 

' ప్రాప్తం ఉంటె మనిషికి ధనం లభిస్తుంది . ఏది ప్రాప్తమో అది తప్పించడం బ్రహ్మదేవుడికి కూడా వీలు కాదు. తనది కానిది తనకు దక్కదు. ఏది ప్రాప్తమో అదే లభిస్తుంది .'

వర్తకుడు కుమారుడు తెచ్చిన ఒక్క శ్లోకం ఉన్న పుస్తకం చూసి, 'మూర్ఖుడా! ఇది నూరు రూపాయలు ఏవిటి?ఇలా అయితే నీకు సంపాదించడం ఎలా తెలుస్తుంది? ఇదేమి పని?' , అంటూ బాలుడిని బయటకు గెంటేసాడు .

పాపం ఆ చిన్న వాడు దేవుడిని తిట్టుకుంటూ, అక్కడ ఉండకుండా, ఊరు దాటి వెళ్లి, ఏదో పట్టణానికి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరేమి అడిగినా ఆటను, ' తనకేది ప్రాప్తమో అదే లభిస్తుంది, ' అన్న మాట తప్ప, ఇంకొక మాట మాట్లాడేవాడు కాదు. 

ఆ నగరం రాజు గారి కూతురు చాలా అందగత్తె, గుణవతి. ఆమె పేరు చంద్రమతి. ఏదో ఉత్సవం జరుగుతూ ఉండడంతో అది చూసేందుకు చెలికత్తెలతో బయలుదేరింది. దారిలో ఒక రాకుమారుడయిన యువకుడిని చూసి, మనసుపడింది. తన చెలికత్తెతో ఆ విషయం చెప్పి, అతనిని తన వద్దకు తీసుకు రమ్మని చెప్పింది. రాత్రి తాము కోట గోడ నుంచీ విడిచే లావుపాటి తాడు సాయంతో, పైకి ప్రాకి, మా రాకుమారి మందిరానికి రమ్మని, చెలికత్తె, ఆ యువకుడితో చెప్పింది. అందుకు ఆ రాకుమారుడు, సరేనని పంపేశాడు, కాని, రాకుమారి వలలో చిక్కేందుకు సిద్ధపడక, ఆ పక్కకయినా వెళ్ళలేదు. 

ఆ రాత్రి వర్తక కుమారుడు ఆ వైపు తిరుగుతూ, తాడు వేళ్ళాడుతూ ఉండడం చూసి, ఆశ్చర్యంతో, అది పట్టుకుని, పైకి ఎక్కాడు. చీకటిలో అతనే రాకుమారుడని అనుకుని, అతనితో గడిపింది. 'ప్రియా, ఏదయినా మాట్లాడు,' అని అడుగగా, ఆ వర్తక యువకుడు, ' ఏది ప్రాప్తమో అదే లభిస్తుంది, ' అన్నాడు అలవాటుగా. 

 వర్తక కుమారుడి మాటలు వినగానే, రాకుమార్తె, అతన్ని తేరిపారా చూసి, తోసి వేసింది. వెంటనే చెలికత్తెలు అతన్ని తరిమేశారు. చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియక, ఆటను ఒక గుడికి వెళ్లి, ఒక మూలగా పడుకోబోయాడు . ఆ పురరక్షకుడి కూతురు, చీకట్లో తన ప్రియుడే వచ్చాడనుకుని, అతన్ని చేరదీసింది. ' ఓ ప్రియుడా! మాట్లాడు, ' అనగానే, యువకుడు మరలా, ' ఏది ప్రాప్తమో, అదే దక్కుతుంది, ' అన్నాడు. వెంటనే వీడెవడో కొత్త వాడని, ఆమె అతన్ని తరిమేసింది. తన ప్రాప్తం ఇంతే, అనుకుని, వాడు పట్నం లోకి వెళ్ళిపోయాడు. 

రాజ మహలులో మదమెక్కిన ఏనుగు అందరినీ తొక్కుకుంటూ, చంపేసింది. ఆ హడావిడికి అటుగా వెళ్ళిన యువకుడు, భయంతో ఒక మూల దాగి ఉన్న రాకుమారిని రక్షించాడు. ఆమె వెంటనే అతన్ని, కౌగిలించుకున్నది. ఆశ్చర్యపోయిన రాజు, కారణాలు అడుగగా, జరిగిన సంగతంతా తెలిసింది. చేసేది లేక , రాజు తన కూతురును వర్తక కుమారుడికి ఇచ్చి, పెళ్లి చేసి, అతడిని ఆ దేశానికి రాజును చేసాడు. ఈ లోగా దండనాయకుడి కుమార్తె కూడా, జరిగింది చెప్పి, అతడినే పెళ్ళిచేసుకుంది. ఇలా వర్తక కుమారుడు వంద రూపాయలకు కొన్న పుస్తకం లోని శ్లోకం అతడిని రాజును చేసింది. 

కాబట్టి మిత్రులారా! విధిని ఆపడం ఎవరి తరమూ కాదు, అన్నది హిరణ్యకం. అప్పుడు కాకి, తాబేలు ఎలుకను వోదార్చారు. అప్పుడు తన మిత్రులతో, తాబేలు ఇలా చెప్పసాగింది.

' నీ కధ వింటే మాకు జాలి, ప్రీతి కలుగుతోంది. నీవు ఈ చెరువు వద్దనే మాతో కలిసి ఉండవచ్చు. ఏ విధమయిన భయమూ అక్కర్లేదు. ధనమూ, యవ్వనమూ శాశ్వతం కాదు. 
తెలివి ఉంటె, ఏ దేశంలో అయినా నెగ్గుకు రావచ్చు. దానం వాళ్ళ వొక్కొక్క సారి మనిసి పాడయిపోతాడు. ' అంది. 

మంధరకం మాటలకు ఆశ్చర్య పోయిన హిరణ్యకం, ' అదేమిటి మిత్రమా! ధనమున్న వాడికి వేరే పాట్లు ఏముంటాయి?' అని అడిగింది.

'అదంతే ! ధనముండీ అనుభవించేందుకు ఒక్కోసారి వీలు పడదు. దాన్ని వాడే అవకాశం లేకుండా, కేవలం కాపలా కాయడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ విషయం నీకు అర్ధం కావడానికి ఒక కధ చెబుతాను, విను. '

సోమిలకుని కధ 
(కధలో కధ)

సోమిలకుడనే ఒక బుద్ధిమంతుడయిన నేత గాడు ఉండేవాడు. రకరకాల బొమ్మలు వేసి, వేగంగా అందమయిన బట్టలు నేయ్యడంలో నేర్పరి. ఎన్నో రకాల పట్టుబట్టలు, అందమయిన జరీ అంచులు, ఎంతో వైవిధ్యంగా చేస్తాడు.

ఇన్ని చేసినా అతని వద్ద డబ్బు నిలవ ఉండేది కాదు. అంతా ఖర్చు అయిపోయేది. ఇలా ఉండగా ఒక నాడు, ఆటను భార్యను పిలిచి, ఇలా అన్నాడు. ' పని యెంత బాగా వచ్చినా, ఈ ఊరిలో దమ్మిడీ మిగాలట్లేదు. అందుకే నేను వేరే ఊరు వెళ్లి వస్తాను...'

' ఈ మాత్రం ధనం మనకు చాలు. ఇంకా సంపాదించి ఏమి చెయ్యాలి? ఉన్న ఊరు వదిలి, సంపాదించేందుకు దేశాలు పట్టి పోవాలా?' అడిగింది భార్య.


'నా మాట విను. ఏ పూటకు ఆపూతే బ్రతికే బ్రతుకు ఎందుకు ? కాస్త దానం వెనుక ఉంటె, హాయిగా బ్రతకచ్చు,' అని చెప్పి, వర్ధమాన పట్టణం చేరుకున్నాడు. అక్కడ ఎంతో శ్రమించి, చెమటోడ్చి, కష్టాలకు వార్చి, బంగారు వరహాలు కూడగట్టుకున్నాడు. అదంతా ఒక గుడ్డలో మూట గట్టి, తన భార్యకు చూపాలన్న ఆరాటంతో, వేగంగా నడవసాగాడు.

అలా అడవిలో వడివడిగా నడుస్తూ సోమిలకుడు చాలా అలిసిపోయాడు. కాళ్ళ నొప్పితో నడవడమే కష్టం అయిపొయింది. చీకటి పడిపోయింది. ఇక ప్రయాణం చెయ్యలేక, ఒక చెట్టు కొమ్మపై ఎక్కి, సొమ్ము మూట గట్టిగా పట్టుకుని నిద్రపోయాడు. అప్పుడతనికి కలలో దైవం కనిపించి, 'సోమిలకా, తుచ్చమయిన డబ్బు కోసం భార్యా పిల్లలను వదిలి ఎందుకు ఇంత ఆరాటపడతావు ?నీకు సరిపడా ధనం నేను ఇస్తూనే ఉన్నాను కదా. నీవు యెంత సంపాదించినా, నీకు యెంత అవసరమో అంతే దక్కుతుంది, అందుకే, నీ ధనం అటుకులుగా మార్చేసాను. '

'ఓ కర్తా! నీకు ఇది భావ్యం కాదు. ఉత్తి చేతులతో నా భార్యాపిల్లలకు మొహం చూపించలేను. అంత కంటే, ఈ చెట్టుకే ఉరేసుకు చస్తాను,' అన్నాడు సోమిలకుడు. 

'ఆగు సోమిలకా, నీ పట్టుదలకు మెచ్చాను. నీకు ఒక వరం ప్రసాదిస్తాను. అయితే, అంతకంటే ముందు నీవు తిరిగి పట్టణం వెళ్లి, అక్కడ గుప్తధనుడనే వాడిని, ఉపభుక్తార్ధుడు అనే వాడిని కలువు. అప్పుడు నీకు అవసరానికి పనికిరాని దానం నిరుపయోగం అని తెలుస్తుంది. నీవు వచ్చాకా, నీకు కావలసిన వరం ఇస్తాను, ' అన్నాడు దేవుడు. 

సోమిలకుడు తిరిగి ప్రయాస పడి  పట్నం వెళ్లి, అక్కడ గుప్తధనుడి ఇంటిలోని వాళ్ళు యెంత చీదరించుకున్నా, మొండిగా ఇంటి ముందే కూర్చున్నాడు. పోనీలేమ్మని, ఆ ఇంటి వారు అతనికి పట్టెడు అన్నం పెట్టారు. తెల్లవారుతుండగా, సోమిలకుడు లేచి చూడగా, గుప్తధనుడు అతిసార వ్యాధితో బాధ పడుతూ, రాత్రంతా అన్నం తినక, తపించిపోతూ కనిపించాడు. 'యెంత సొమ్ము ఉండీ ఏమి లాభం? ఈ గుప్తధనుడికి హాయిగా తిండి తినే యోగం లేదు కదా, అనుకుంటూ బయటపడ్డాడు సోమిలకుడు. ఇక భుక్తార్ధుని ఇంటి దారి పట్టాడు....
మర్నాడు ఆ నేత పని వాడు భుక్తార్ధుని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు . అతనెంతో సంతోషిస్తూ, అతిధికి ఆదరపూర్వకంగా మర్యాదలు చేసాడు. స్నానానంతరం రుచికరమయిన భోజనం చేసి, మంచి పరుపు మీద మాగన్నుగా నిద్రపోయాడు సోమిలకుడు. 

అప్పుడు దైవ సంభాషణ ఇలా వినిపించింది...' పాపం ఈ యోగ్యుడయిన గృహస్థు తన సంపదను అంతా వెచ్చించి, అతిధి మర్యాదలు చేసాడు. రేపటి వెచ్చాల కోసం ఇతనికి నేను దానం సమకూర్చాలి...' అంటుండగా, ఎవరో బిలబిలా వచ్చి, ఆ గృహస్తుకు కాసుల సంచీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన నేత పనివాడు, ' యెంత డబ్బు ఏ కుండలో దాచితే మాత్రం లాభం ఏముంది? అవసరానికి తగినంత సొమ్ము దైవమే సమకూర్చుతున్నారు . ఇక చీకూచింతా లేకుండా యితడు ఖర్చు పెట్టి, తిరిగి సంపాదించుకుంటున్నాడు. పాపం ఆ ధన గుప్తుడు యెంత సంపాదించినా, ఏమి లాభం? పిడికెడు తిండి తినే యోగం లేదు కదా!

అనుకుని, అతడు తన ఊరు వెళ్లి, దొరికింది తింటూ తృప్తిగా జీవించాడు. ఈ కధను చెప్పి, మంధరకం ఎలుకతో, దిగులు పడవద్దని చెప్పింది. ఇలా కబుర్లు చెప్పుకుంటూ మిత్రులు ముగ్గురూ హాయిగా, సంతోషంగా చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. 

ఒక రోజు ఒక వేటగాడు వెంట పడుతుండగా బెదిరిన జింక అటుగా వచ్చింది. దాని కధను విన్న మిత్రులు దానిని కూడా తమ మిత్ర బృందంలో చేర్చుకున్నారు. ఎలుక, కాకి, తాబేలు, జింక ధైర్యం చెప్పాయి. లఘుపతనకం ఆకాశంలో యెగిరి వెళ్లి, వేటగాడు వెళ్లిపోయాడని, జింకకు చెప్పింది. వారంతా స్తిమితపడి ఒక చోట చేరారు. 
అలా కాకి, జింక, తాబేలు, ఎలుక రోజూ కలిసి, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా, ఒక రోజున జింక వారి వద్దకు రాలేదు. అందుకు మిత్రులు కలతపడి, జింకకు ఏమి ఆపద కలిగిందో చూసి రమ్మని, లఘపతనకమును పంపించారు. 

కాకికి ఒక చోట వలలో చిక్కుకుని, చింతిస్తున్న జింక కనిపించింది, అది కాకిని చూడగానే, ' మిత్రమా, నాకు చావు సమీపించింది. ఇక సెలవు తీసుకుంటాను. మిగతా మిత్రులను అడిగానని చెప్పు, అన్నది దీనంగా.

కాకి జింకకు ధైర్యం చెప్పి, వెంటనే వెళ్లి, ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకుని వచ్చింది. ఇంతలో అటుగా వేటగాడు రావడం చూసిన ఎలుక తన శక్తినంతా ఉపయోగించి, వలను తొందరగా కొరికి వేసింది. జింక చెంగున దూకుతూ పారిపోయింది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక కలుగులోకి పారిపోయింది. 

ఒక రోజున ఒంటరిగా ఉన్న తాబేలును ఒక వేటగాడు ఎత్తుకు పోయాడు. దానిని రక్షించేందుకు మిగతా ముగ్గురు మిత్రులూ కలిసి ఒక పధకం పన్నారు. వేటగాడు పోయే దారిలో, జింక చచ్చినట్టు పడి  ఉంది. అది చచ్చిందని నమ్మించేందుకు కాకి, దాని పై ఎక్కి, పొడవాసాగింది. బోయ ఆ లేడి చచ్చిందని అనుకుని, ఆ తాబేలును క్రింద పడేసి, జింక కోసం పరుగెత్తాడు.
అప్పుడు...

వేటగాడు దక్కరకు రాగానే జింక చెంగున యెగిరి పరిగెత్తింది. కాకి ఎగిరిపోయింది. ఎలుక తాబేలుకు చుట్టిన బంధనాలు కొరికి విడిపించింది. తాబేలు దగ్గరలో ఉన్న మడుగులోకి జారిపోయింది. 

ఇదంతా నా ఖర్మ అనుకున్న బోయ, చింతిస్తూ కాళ్ళీడ్చుకుంటూ, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మిత్రులు ఆనందోత్సాహాలతో ఒక చోట చేరి, ఏ కలతలూ లేకుండా పూర్వం లాగా హాయిగా, తృప్తిగా కాలక్షేపం చెయ్యసాగారు. అందుకే మంచి మిత్రులు ఉండాలి అంటారు. మిత్రుడు అడక్కపోయినా, ఆపద సమయాల్లో తన ప్రాణాలు పణంగా పెట్టి, స్నేహితుడిని రక్షిస్తాడు.



స్నేహమనేది ఎప్పుడూ జీవితానికి మేలు చేస్తుంది. మనకున్న తరగని ధనం స్నేహం. 

మనసిచ్చి, మిత్రుల మనస్సు పుచ్చుకున్న మనిషి ఎప్పుడూ అవమానాల పాలు కాడు . ఆపదలకు గురి కాడు. అందుకే, మంచివారితో స్నేహం చెయ్యాలి, అంటూ ముగించాడు విష్ణుశర్మ పండితుడు.

(పంచతంత్రం లోని మిత్రలాభం సంపూర్ణం....)