Saturday, August 3, 2013

పంచతంత్రం -- మిత్రభేదం

పంచతంత్రం -- మిత్రభేదం 
--------------------------------

'ఒక అడవిలో ఒక సింహం, ఎద్దు, ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక నక్క అది చూసి వోర్వలేక, ఆ రెండూ శత్రువులు అయ్యేలా చేసింది', అంటూ రెండవ తంత్రమయిన మిత్రభేదం కధను ప్రారంభించాడు విష్ణుశర్మ. రాకుమారులు ఆశక్తిగా, ఆ కధను చెప్పమని, బ్రతిమాలారు. ఆ కధను చెప్తాను, ఎలాగో వినండి, రాకుమారులారా, ఈ కధను ఎప్పుడూ మనసులో పెట్టుకోండి, అంటూ, ఇలా చెప్పా సాగాడు విష్ణుశర్మ. 

ఒక పెద్ద పట్టణంలో వర్ధమానకుడు అనే వర్తకుడు ఉన్నాడు. అతడు ఒకరోజు అధికంగా దానం సంపాదించడానికి ఉపాయం ఆలోచించసాగాడు. " ధన మూలమిదం జగత్ ...' అన్నారు, దానం ఉన్న వాడే విద్వాంసుడుగా చెప్పబడతాడు . అతని వద్దకే చుట్టాలు, బంధువులు, చేరతారు . మనసు యెంత మంచిది అయినా, దానం లేని వాడిని అడవి మనిషిగా జనులు భావిస్తారు. కలిగిన వాడికి పగవారు కూడా చుట్టాలే. పేదవారు యెంత పెద్దవారయినా అందరికీ దూరం అయిపోతారు. యెంత వృద్ధుడయినా, మూట ఉంటె, పదహారేళ్ళ బాలాకుమారుడు అయిపోతాడు. కాబట్టి నేను ఎలాగయినా, డబ్బు సంపాదించాలి.

ధనార్జనకు ఆరు మార్గాలు ఉన్నాయని, పెద్దలు చెప్తారు. అవి...

౧. రాజసేవ.
౨. యాచన .
౩. వ్యవసాయం.
4. పాండిత్యం .
౫. వ్యవహార దక్షత. 
6. వ్యాపారం.

అన్నింటిలోకీ వ్యాపారం ఉత్తమమయినది. అదెప్పుడూ వ్యర్ధం కాదు. మిగిలిన వాటిలో చాలా అడ్డంకులు, సమస్యలను అధిగమించాలి. మంచి, చెడుగులు ఉన్నాయి. అందుకే, నేను వ్యాపారం చేసి, డబ్బు సంపాదిస్తాను, "అని తీర్మానించుకున్నాడు, వర్ధమానకుడు.

వర్ధమానకుడు దొరికిన సరుకులు అన్నీ కుండల్లో నింపుకుని, విదేశాలకు వెళ్లి, విక్రయించి, సొమ్ము చేసుకు రావాలని, నిర్ణయించుకున్నాడు . 

ఒక మంచి రోజున, పెద్ద వాళ్ళ దీవెనలు తీసుకుని, ప్రయాణమయ్యాడు. తమ ఇంటిలో ఉన్న నందకం, సంజీవకం అనే రెండు గిత్తలను బండికి కట్టాడు. అవి యెంత బరువునయినా ఈడ్చుకుని పోగలవు. అలా వెళ్తుండగా, యమునా నదీ తీరంలో గిత్తలు బండి లాగడానికి గిలగిల లాదిపోయాయి. సంజీవకం ఇసుకలో దిగబడి, కాడి తప్పించింది. కాలు వనకడంతో, బండి ఈడవలేక , చతికిల పడింది. 

ఆ గిత్త అవస్థ చూసి, వర్ధమానకుడు బాధపడ్డాడు. మూడు రోజులు అక్కడే ఉండిపోయాడు. అతనితో ప్రయాణించే బాటసారులు ,' క్రూర  మృగాలు తిరిగే ఈ అడవిలో, నీవు ఉండిపోవడం తగదు. ఒక్క ఎద్దు కోసం ప్రాణాలు పణంగా పెడతావా! గొప్ప కార్యాలు చెయ్యాలంటే, అల్పమయిన వాటిని వదులుకోక తప్పాడు, ఇది శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక బయలుదేరు,' అన్నారు.

వర్ధమానకుడు ఆ పడి పోయిన ఎద్దు వద్ద, డబ్బిచ్చి కొందరిని కాపలా పెట్టి, ముందుకు సాగిపోయాడు. అతనటు వెళ్ళగానే, వాళ్ళంతా, సంజీవకాన్ని వదిలి, వెళ్ళిపోయారు. అది చచ్చిపోయిందని వర్ధమానకుడికి చెప్పారు. పాపం అతడు ఆ ఎద్దు కోసం ఎంతో దుఃఖించి, దానికి అపరకర్మలు చేసి, దిగులుతో ముందుకు సాగిపోయాడు.

ఇసుకలో చిక్కుపడిన పసిగిత్త , యమునా నది పై నుంచీ వచ్చే చల్లని గాలికి సేద తీరి, మెల్లిగా లేచి, మెడ చాచి నిల్చుంది. చుట్టుపక్కల ఉన్న గడ్డిని కడుపారా మేసి, విచ్చలవిడిగా తిరుగుతూ, శివుడి వాహనం అయిన నంది లాగా ఆరోగ్యవంతం అయ్యింది.

మూపురం పెరిగింది, కళ్ళలో వాడి కనిపించింది. వొళ్ళంతా నునుపెక్కి తళతళ లాడింది. పుట్టలను, గుట్టలను కొమ్ములతో పొడుస్తూ, గట్టిగా రంకెలు వెయ్యసాగింది. గిట్టలు గట్టిగా నెలకు తాటిస్తూ, నిర్భయంగా ఆ అడవిలో తిరగసాగింది.

దేవుడి దయ ఉంటే , బాల హీనుడు కూడా బలవంతుడయ్యి, హాయిగా జీవిస్తాడు. కానికాలంలో పువ్వులతో పూజించినా వికటిస్తుంది. అడవిలో వదిలివేసింది బాగా వర్ధిల్లుతుంది. గుడిలో దాచింది, పాడుబడి పోతుంది. ఈ పెద్దల మాట సత్యం అనడానికి రుజువు ఆ వృషభమే !

ఇలా ఉండగా పింగళకుడు అనే మృగరాజు పరివారంతో యమునా నదికి విహారానికి వచ్చాడు. అక్కడ ఉన్న మడుగులో దిగాబోయాడు. అదే సమయంలో సంజీవకుడు దిక్కులు పిక్కటిల్లే లాగా రంకె వెయ్యగా, అది విన్న సింహం గుండె గుబగుబలాడింది. సైన్యం అంతా, నివ్వెర పోయింది. సింహం భయపడి ఒక చెట్టు క్రింద దాక్కుంది. 

సంజీవకుడి రంకేలకు బెదిరిన సింహం, దాని పరివారం, అన్నీ ఒక్క చోట చేరి, బిక్కుబిక్కు మంటూ చూడసాగాయి. వాటి వెంక పక్షులూ, మిగతా మృగాలన్నీ చేరి, అడవిరాజు వెనుక దాక్కుని చూడసాగాయి.

ఇదంతా చూసిన కరటకుడు, దమనకుడు అనే రెండు జిత్తులమారి నక్కలు అక్కడకు చేరాయి. అవి మృగరాజు తిని పారేసిన ఎంగిళ్ళు తింటూ ఉంటాయి. అవి రెండూ తమలో తాము ఇట్లా గుసగుస లాడుకోసాగాయి.

" కరటకా ! మన దొర సంగతి చూసావా!"

"దమనకా! దారిన పోయే సంగతులు మనకు ఎందుకు? 'ఉడుతకెందుకు ఊళ్ళో పెత్తనం...' అన్న సామెత వినలేదా? అనవసరంగా ఇతరుల సంగతుల్లో జోక్యం కల్పించుకుంటే, చివరికి కధలోని కోతి లాగా, అసలుకే మోసం రావచ్చు."

" కరటకా! అది ఏమి కధ? ఆ కోతి ఎవరు? ఇతరుల పనుల్లో తల దూర్చి, అది ఎలా పాడయ్యింది ?"

"చెప్తాను, విను దమనకా..."

కోతి కధ 
------------

అనగనగా ఒక ఊరి వద్ద కల వనంలో వర్తకుడు ఒక గుడి కట్టిస్తున్నాడు. అక్కడ వందల మంది పని చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ భోజనానికి వారంతా పని ఆపేసి వెళ్ళారు. అదే సమయంలో వేలాది కోతులు అక్కడ చేరి, కోతి చేష్టలు చేయ్యసాగాయి. వాటిల్లో ఒకటి, తుంటరిగా, ఆ గుడి కట్టే చోటకు వెళ్ళింది. ఒక స్థంబం మధ్యలో ఒక గూటం కొట్టి, ఆ పని వాడు భోజనానికి వెళ్ళాడు. కోతి ఆ గూటం లాగింది. ఆ సందులో కాలు చిక్కుకుని, శివ శివా అంటూ, పక్కకు తప్పుకోలేక ప్రాణాలు విడిచింది.

అందుకే, ఇతరుల పనుల్లో తల దూర్చకూడదు. అది కోతి వెర్రితనం కింద లెక్క. మిగిలిన నంజుళ్ళు మనకు చాలవా?, అంది కరటకం .



కరటకుడు చెప్పిన కధ విన్న దమనకుడు ' అలా అంటే ఎలా మిత్రమా ! బ్రతుకంతా జానెడు పొట్ట కోసం ఎంగిళ్ళు తిని బ్రతకడమేనా ? తెలివితేటలతో వెలిగుతూ ఒక్క నిముషం బ్రతికినా చాలు . బలి కూడు తిని కాకి కూడా చిరకాలం బ్రతుకుతుంది. 

తన వంశానికి ప్రతిష్ట తేని బ్రతుకు ఎందుకు? ఏటి గట్టున ఉన్న గడ్డిపోచ కూడా, మునిగిపోయే వాళ్లకు చేయూతను ఇస్తుంది. మన శక్తి చూపక, చేతులు ముడుచుకు కూర్చునే కంటే, కార్య వాదులం కావాలి,' అంది.

కరటకుడు మరలా, 'మనం ఇక్కడ రాజ్య సభలో ముఖ్యులం కాదు. తన వారి మాటలనే రాజు వింటాడు. ఉపయోగం లేనప్పుడు మాట్లాడకూడదు. తెల్లని బట్టకే రంగులు వెయ్యాలి. అప్పుడే అది అతుకుతుంది, ' అన్నాడు.

'తన వద్దకు వచ్చిన వాళ్ళను పలకరించడం రాజులకు అలవాటు. వాడు విద్యావంతుడయినా , మూర్ఖుడయినా ఒకటే! 'స్త్రీలు, రాజులూ, లతలు, దగ్గర ఉన్న వానినే పెనవేసుకుంటాయి ' అని వినలేదా?' అన్నాడు దమనకుడు.

'ఇంతకీ నీవు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పు, ' అన్నాడు కరటకుడు . 

'మన రాజు భయపడి, చెట్టు కింద చేరాడు. చుట్టూ ఉన్న పరివారం తత్తర పడుతున్నారు. వద్దకు చేరి మంత్రాంగం నడిపేందుకు ఇదే మంచి సమయం, రాజుకు ధైర్యం చెప్పి, ప్రధాన మంత్రి పదవిని సంపాదిస్తాను,' అంది దమనకం.

'ప్రభు సేవ అంటే నీకు తెలియదే! నీవు ఎన్నడూ రాచ కొలువులో పని చెయ్యలేదే! మరి రాజును ఎలా మెప్పిస్తావు?' అడిగింది కరటకం.

'చిన్నతనంలో మా నాన్న వద్దకు వచ్చే పోయే పెద్దలు చెప్పిన నీతిశాస్త్రాన్ని నా మనసులో దాచుకున్నాను. మాట మీద మనుగడ నడుస్తుంది. మాట తీరులో ఎన్ని రకాలో ! నాలుక పైనుంచీ చిలుక పలుకులు పలికేవారు కొందరు. మూగావారిలా మాటలను గుండెల్లో దాచుకునేవారు కొందరు. ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని, పూవులో దారంలా వారితో మేలిగేవాడే పురుషుడు. ఆ విధంగా రాక్షసుడిని అయినా, వశం చేసుకోవచ్చు. '

ప్రభువుల వద్ద మెలిగే కిటుకులు చెప్తాను, విను, మిత్రమా!

అనుచరులను విడిచి రాజు ఉండలేడు. ప్రభువు చిత్తం తెలిసి మెప్పు పొందాలి . ప్రభువు కోపించినప్పుడు ప్రస్తుతించాలి . ప్రభువు మెచ్చినప్పుడు ఇష్టం చూపితే చాలు . ప్రభువు ఎవరి మీదనయినా కోపిస్తే, మనం కూడా వారిపై కోపం చూపాలి . ఆయన దానధర్మాలు చేసినప్పుడు బ్రహ్మాండం అంటూ పొగడాలి . ఇవే వశీకరణ మంత్రాలు . సరే , ఇక రాజ దర్శనానికి వెళ్లి వస్తాను , అంటూ దమనకుడు మృగరాజు కొలువున్న మఱ్ఱి చెట్టు వద్దకు మెల్లిగా వెళ్ళాడు . మృగరాజుకు దణ్ణం పెట్టి, దగ్గరగా వెళ్లి, కూర్చున్నాడు . 

'ఏమోయ్ దమనకా ! ఏమిటి సంగతులు,  మధ్య కనిపించట్లేదు , ' అడిగాడు మృగరాజు . 
' ప్రభూ! నా వంటి అల్పుడితో దొరవారికి పెద్దగా పని ఏమీ ఉండదని కనిపించత్లెదు. కాని, ఒక్కోసారి, వంటి వారే పనికి వస్తారు. తరతరాలుగా మేము రాజ సెవకులమ్. నక్కే కదా, అని  చిన్న చూపు చూడకండి .  పురుగులలోనే పుట్ట పుడుతుంది . కరకు రాళ్ళలోనే అపరంజి బొమ్మ పుడుతుంది . బురద లోనే పద్మం పుడుతుంది . చందమామ సముద్రం నుంచే ఉదయిస్తాడు . కర్ర లోనే అగ్గి పుడుతుంది . పాము పడగలో మణి, నీటిలో కలువ పుడుతుంది . 
కాబట్టి గుణాలకే ప్రాదాన్యత కాని, పుట్టుకకు కాదు . భక్తీ, రక్తి, శక్తి కల ఈ సేవకుడిని తిరస్కరించకండి . నాకు ఏకాంతం ఇప్పిస్తే తమతో ఒక విషయం మనవి చేసుకుంటాను ,' అంది దమనకం . 
ఆ మాట విని, రాజు ఆంతర్యం తెలుసుకుని, పరివార జంతువులు అన్నీ ప్రక్కకు వెళ్ళిపోయాయి . 
'తమరు ఇలా భయపడి ఎందుకు వచ్చారు?' అడిగింది దమనకం . 
' ఇందులో విశేషం ఏముంది , ఊరికే వచ్చాము,' అన్నాడు మృగరాజు . 
'చిత్తం , చెప్పా కూడనిది ఐతే చెప్పకండి . భార్య తోనూ, సొంతవారితోనూ, మిత్రులతోనూ, పుత్రులకూ, ఇలా ప్రతీ ఒక్కరితోనూ చెప్పకూడని విషయాలు ఉన్తాయి. కాబట్టి బలవంత పెట్టను , ' అంది దమనకం . 
వీడు చాలా తెలివయిన వాడిలా ఉన్నాడే , అనుకుని, పింగళకుడు , ' కొండలు పగిలేలా వినబడిన గర్జన విన్నావా?' అని అడిగాడు . 

' అదేదో వెర్రి గర్జన, అందులో భయపడ వలసింది ఏముంది ప్రభూ!' అన్నాడు దమనకుడు.

' ఆ రంకెలు వింటే, సమీపంలో ఏదో ఘోర మృగం చేరినట్టు అనిపించింది. ఆ అరుపు వింటే దాని బలసత్వాలు తెలుస్తున్నాయి. అందుకే, ప్రాణ రక్షణ కోసం ఈ చెట్టుకింద దాక్కున్నాము ,' అన్నాడు మృగరాజు.

ఆ మాటలు విన్న దమనకుడు , ' ప్రభూ! మోతలకేమి, ఎన్నో రకాలు, ఆపదల్లో హడలి పోరాడు. రణ రంగంలో వణికిపోరాదు . గడగడ లాడించే శత్రువును అయినా, దడదడ లాడించే గుండె బలం కావాలి. అగ్గిని చూచి, లక్క కరిగిపోయినట్లు ఎదుటి వారి దర్పం చూసి జారిపోరాదు .మరింత కుదురుకోవాలి , నాకొక కదా గుర్తుకు వస్తోంది, చెప్తాను, వినండి, ' అంటూ ఇలా చెప్పసాగాడు .

నక్క కధ 
-------------
(కధలో కధ )

అడవిలో ఒక నక్క ఆకలిదప్పులు తాళలేక ,తిరుగుతూ,  ఒక యుద్ధభూమికి చేరింది. అక్కడ ఒక యుద్ధ భేరి పడి  ఉంది. గాలికి చెట్ల కొమ్మలు తగిలినప్పుడు అది శబ్దం చెయ్యసాగింది. ఆ శబ్దానికి భయపడి, ఒక ప్రక్కన దాక్కుంది. అంతలోనే, 'సుఖదుఃఖా లలో తెలివి తేటలతో మెలిగితే, సుఖపడవచ్చు , 'అనుకుని, మెల్లిగా వెళ్లి, ఆ భేరి ఆకారం చూసింది. ఏదో కూరి పెట్టారు, అనుకుని, కొరికి చూసింది. అందులోని కర్ర పంటికి తగలగా, నిండుగా మేత ఉందనుకుని, లోపల చూస్తె, దీని బండారం బయట పడింది, బయట తోలు, లోపల కర్ర, ' అనుకుని, వెళ్ళిపోయింది.

కాబట్టి దేవరా, చప్పుడుకే బెదిరిపోకూడదు.... అన్నాడు దమనకుడు.

'ప్రభూ! మృగరాజే బెదిరిపోతే, మృగాలు కూడా బెదిరిపోతాయి. మీరు ఇక్కడే ధైర్యంగా ఉండండి. నేను వెళ్లి, ఆ ధ్వని సంగతి చూసి వస్తాను. మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను ఇప్పుడే వెళ్లి ఆ సంగతి తేల్చుకు వస్తాను...' అన్నాడు దమనకుడు.

'సరే వెళ్లిరా, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను , 'అన్నాడు మృగరాజు.

ఆ దమనకుడు రాజుకు దణ్ణం పెట్టి, శబ్దం విన వచ్చిన దిశగా పరుగెత్తి వెళ్ళాడు. అక్కడ సంజీవకుడు తప్ప, ఏ మ్రుగామూ లేదు.

'అరెరే, ఇది వట్టి ఎద్దే , ' అని నక్క బహు సంతోష పడిపోయి, రాజును లోబరుచుకునేందుకు ఇదొక మంచి అవకాశం అనుకుని, తనలో తానూ మురిసిపోయింది. తన ముఖ కవళికలు దాచుకుని, రాజు వద్దకు వచ్చి, దండం పెట్టి కూర్చున్నది.

'రాజా! ఆ పిశాచ మృగాన్ని చూసి వచ్చాను, దాన్ని మీ కాళ్ళ వద్ద సేవకుడిగా తెచ్చి పడేస్తాను, ఎంతటి వారినయినా తెలివితో లోబరుచుకోవచ్చు. కత్తులు, కటారులు, ఏనుగులు మొదలయిన ఆయుధాలతో సాధించలేనిది బుద్ధితో సాధించవచ్చు,' అంటూ గొప్పలు చెప్పాడు దమనకుడు.

'సరే, అలా అయితే, నిన్ను మంత్రిని చేస్తాను. సందేహం లేదు, ' అంటూ రాజు ఆ క్షణం లోనే దమనకుడిని మంత్రిగా చేసాడు. నక్క ఎగురుకుంటూ సంజీవాకం ఉన్న చోటుకు వెళ్ళింది.

' ఓ పలుగాకీ ! తన కొలువుకు వెంటనే రావలసినదిగా రాజాజ్ఞ . రంకె వేస్తె లాభం లేదు, నీవు పారిపోయే వీలు లేదు, నాతొ తలవంచుకుని రా!' అంటూ ఎలుగెత్తి అరిచింది నక్క.

సంజీవకుడు ఆశ్చర్యపోయి, 'ఎవరా రాజు, నన్నెందుకు పిలుస్తున్నాడు? నాకెవ్వరూ తెలియదే,' అన్నాడు.

'ఓహో, ఏమి తెలివి, ఈ అడవికి రాజు పింగళకుడు అనే సింహం.మర్రి చెట్టు క్రింద కొలువుదీరి ఉన్నాడు, అతడే నిన్ను పిలిచాడు,' అన్నాడు దమనకుడు.

ఆ మాటలకు సంజీవకుడు వణికిపోయాడు. సింహం పిలిచిందంటే మాటలా! మెల్లిగా దమనకుడితో '  నీవు చూస్తే మంచి వానిలా కనబడుతున్నావు. కీడెంచి మేలెంచమన్నారు. అక్కడకు వస్తే నా ప్రాణాలకు ముప్పు లేదని మాట ఇస్తేనే వస్తాను...' అన్నాడు.

' నీ మాట నిజమే, రాజుల మనసు తెలుసుకుని కాని, వారి వద్దకు పోరాడు. సముద్రం వద్దకు, కనుమలలోకి కూడా పోవచ్చు. కాని, రాజుల దగ్గరకు వెళ్లేందుకు మాత్రం ముందూ వెనుకా ఆలోచించాలి. నీవు ఇక్కడే ఉండు, నేను మా రాజు మనసు తెలుసుకు వస్తాను, ' అని చెప్పి, వెళ్ళిపోయాడు.

దమనకుడు పింగళకుడి వద్దకు వెళ్లి,' స్వామీ! ఆ జంతువూ సామాన్యమయినది కాదు. స్వయానా శివుడి ఆబోతు. శివుడి అనుమతితో యమునా నది వడ్డున విహారానికి వచ్చింది. శివుడు ఈ అడవిని దానికి ధారాదత్తం చేసినాడట . ఆయన ఆజ్ఞ మీరగాలమా చెప్పండి, ' అన్నాడు.

'అదే అనుకున్నాను, లేకపోతె, గడ్డిమేసే గిత్త కీకారణ్యంలో కాలు పెట్టి, రంకె వెయ్యడం ఏమిటి? భయం లేకుండా విహరించడం ఏమిటి? మరి నీవు నీటి శాస్త్ర విశారదుడివి కదా, ఏమి మాట్లాడి వచ్చావు?' అడిగాడు మృగరాజు.

' ఈ కీకారాణ్యానికి రాజయిన పింగళకుడు పూర్వం దుర్గా దేవికి వాహనం. ఓ సంజీవకా! నీవు ఈ అడవికి వచ్చావు కనుక ఆయనకు అతిధివి. మా డోరా కొలువులో చేరి, ఇక్కడే హాయిగా ఉండవచ్చు. అన్నదమ్ముల్లా, మీరు కలిసి తిని తిరగచ్చు, అని చెప్పగా ఆ ఎద్దు అంగీకరించింది, మృగరాజు అభయాన్ని కోరింది ' అంటూ లేనిపోని గొప్పలు కొట్టాడు దమనకుడు.

ఆ మాటలు నమ్మిన మృగరాజు , సెబాస్ , మంచి పని చేసావు. తెలివయిన వాడివి. నేను ఇదే అభయమిస్తున్నాను, అలాగే ఆ ఎద్దు చేత నాకు అభయం ఇప్పించే బాధ్యత నీదే! పోయి వానిని తీసుకురా. శత్రువులను మిత్రులు చెయ్యటంలోనే మంత్రి బుద్ధిబలం తెలుస్తుంది. పొద్దు పోతోంది, త్వరగా వెళ్ళు,' అంటూ ఆజ్ఞాపించాడు.

దమనకుడు ఉపాయంగా పని చేసుకు వస్తానని చెప్పి, నమస్కరించి వెళ్ళాడు. 'మిత్రమా, నేను ఎంతో  కష్టించి, మృగరాజు వద్ద నీకు అభయం తీసుకు వచ్చాను. అయితే, నీవు మృగరాజును చేరిన తరువాత, నా చేయి విడువకూడదు. నేను మంత్రిగా ఉంటూనే, నీతో స్నేహంగా ఉంటాను. దొర నీవాడు అయ్యాడు కదా, అని నన్ను త్రోసిపుచ్చరాదు. అలా చేసిన దంతిలుడు తన సర్వస్వం కోల్పోయాడు కదా!' అన్నాడు సంజీవకుడితో .

'దంతిలుడు ఎవరు? ఆ కధ చెప్పవా?' అడిగాడు సంజీవకుడు.

చెప్తాను, శ్రద్ధగా విను, అంటూ చెప్పసాగాడు దమనకుడు.

దంతిలుడి కధ 
-----------------
(కధలో కధ)

వర్ధమాన పట్టణంలో దంతిలుడు అనే సంపన్నుడయిన వర్తకుడు ఉండేవాడు. పరోపకారి, అటు రాజుకు, ఇటు ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు. ఆయన తన కూతురికి పెళ్లి చేసి, ఊరందరినీ పిల్చి మర్యాద చేసాడు. రాజు గారిని ఆహ్వానించి, కానుకలిచ్చాడు .

అందరికీ అన్ని మర్యాదలూ చేసిన దంతిలుడు రాజుగారి ఇంటి మనిషి అయిన గోరంభకుడు అనే వాడిని సభా వేదిక ముందు నుంచీ గెంటి వేసాడు. దానితో అతడు దంతిలుడి మీద ఎలాగయినా కక్ష్య తీర్చుకోవాలని అనుకున్నాడు. 

రాజు గారు నిద్ర మేల్కొనే సమయంలో, కసువు చిమ్ముతూ, తనలో తానూ అనుకున్నట్లుగా, 'అయ్యో, దంతిలుడు మహారానికే ఎసరు పెట్టాడే! ఇదేమి న్యాయం...' అన్నాడు. అది విన్న రాజు, 'ఏమిట్రా అంటున్నావ్ ?' అంటూ గద్దించాడు.

గోరంభకుడు 'దొరా! రాత్రి నిద్ర చాలక ఏదో టూలు వచ్చింది. ఆ మత్తులో నేను ఏమన్నానో, ఏమో!' అన్నాడు.

కాని, రాజుకు దంతిలుడి మీద అనుమానం కలిగింది. ఇక దంతిలుడు రాజు కోటలో అడుగు పెట్టకూడదని ఆజ్ఞాపించాడు. ఇదంతా ఎందుకో తెలియని దంతిలుడు దుఃఖించాడు. ద్వారపాలకుల వద్ద ఉన్న గోరంభకుడు గుట్టుగా నవ్వడం చూసి, అదంతా వాని పనే అని తెలుసుకున్నాడు దంతిలుడు. వెంటనే వాడిని పిలిచి బహుమతులు ఇచ్చి,గౌరవించి  పంపాడు.

మరునాడు గోరంభకుడు రాజు లేచే సమయంలో, ' ఆచారమా పాడా! ఈ రాజు లేవగానే దొరికింది తినేస్తాడు...' అన్నాడు.

అది విన్న రాజు, ఏంటని రెట్టిన్చగా, ' మగతలో ఏమన్నానో తెలీదు దొరా! ' అన్నాడు.

అప్పుడు రాజు, వీడికి నిద్రలో మాటలు మామూలే కావచ్చు, అనుకుని, భటులను పంపి, దంతిలుడిని పిలిపించి గౌరవించాడు. 

కాబట్టి మిత్రమా! దొర నీ వాడు కదా, అని నన్ను విడిచిపెట్టద్దు, అంటూ కధ ముగించాడు దమనకుడు.

దమనకుడు చెప్పిన కధను విన్న సంజీవకుడు, నిజమే మిత్రమా! నిన్ను పోగొట్టుకునే అంత దుర్మార్గుడిని కాదులే,' అన్నాడు.
అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ మర్రి చెట్టు వద్ద ఉన్న దొర వద్దకు వెళ్ళారు. సంజీవకుడు మృగరాజుకు నమస్కరించాడు. మృగరాజు చెయ్యెత్తి , గిత్త సొగసయిన మూపురాన్ని దువ్వుతూ, కుశల ప్రశ్నలు వేసాడు. ' ఏమిటిలా అడవిలోకి వొంటిగా వచ్చినావు మిత్రమా,' అని అడుగగా, సంజీవకుడు తన కధను సాంతం చెప్పాడు.
అది విన్న సింహం, 'నీకు మరేం భయం లేదు, నా రాజ్యంలో నీవు నిర్భయంగా సంచరించు. ఒకటి మాత్రం మనసులో పెట్టుకో, నన్ను వదిలి వొంటరిగా బ్రతకకు. ఈ అడవిలో ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి. పెద్ద మ్రుగాలే ఇక్కడ భయపడుతూ బ్రతుకుతాయి. ఇక నీ వంటి సాధు జీవి సంగతి చెప్పనక్కర్లేదు, ' అన్నాడు.
సింహం, ఎద్దు, నక్క , మిగతా జంతువులు అన్నీ కలిసి యమునానది లోని చల్లని నీటిని త్రాగి, అడవిలోకి వెళ్ళిపోయాయి.
సంజీవక, పింగళకులు చక్కగా కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేయ్యసాగాయి. రాజు ఆజ్ఞ పై కరటక దమనకులు మంత్రులుగా అటవీ రాజ్య భారాన్ని వహించసాగాయి.
క్రమంగా సంజీవకుడు సింహానికి సకల శాస్త్ర సారం బోధించగా, సిమ్హంలోని క్రూరత్వం అంతా పోయి, వారి స్నేహం ఇనుమడించ సాగింది.
ఇదిలా ఉండగా...

కరటక దమనకులకు కొన్నాళ్ళకు కష్ట కాలం మొదలయ్యింది.దొర వేటకు వెళ్ళడు , మాంసం ముక్కలకు కడుపు దహించుకుపోసాగింది. కడుపు నింపలేని సాధు సింహం వారి దృష్టిలో హీనమైపోయింది . తిండి పెట్టని రాజును సేవకులు అసహ్యించుకుంటారు. 

రెండు నక్కలూ ఒక చోట చేరి, తిండికి కరువు ఏర్పడగా, కర్తవ్యం ఏమిటని ఆలోచించసాగారు. 'ఆ ఎద్దును తెచ్చి పెట్టి, చేతులారా అడవికి చిచ్చు పెట్టాము. దొర దారి తప్పితే, మంత్రి దోషమే అని జనం దూషిస్తారు. 

"ఎవరు చేసుకున్నది వారు అనుభవిస్తారు, ఆ కధ నీవు వినలేదా?", అన్నాడు దమనకుడు .

' ఏమా కధ దమనకా, చెప్పు, ' అన్నాడు కరటకుడు.

ఆషాడభూతి కధ 
--------------------

ఒక నిర్జన ప్రదేశంలో ఒక మఠం ఉంది. అందులో దేవశర్మ అనే అతను ఉండేవాడు.అతను వారూ వీరూ ఇచ్చిన బట్టలు అమ్ముకుని, జీవించేవాడు. అలా కాస్త సొమ్ము కూడబెట్టుకున్నాడు. ఆ డబ్బు మూట గట్టుకుని, తన చంకలోనే ఉంచుకునేవాడు. 

ధనం మనిషిని వేధిస్తుంది. ధనం సంపాదించడం కష్టం. దాన్ని రక్షించుకోవడం ఇంకా కష్టం. ధనం వచ్చినా, పోయినా బాధే !

ఇలా ఉండగా ఆ సన్యాసి వాలకం చూసి, ఎలా అయినా అతని ధనం అపహరించాలని తలచి, ఆషాడభూతి అనే అతను సన్యాసి వద్దకు చేరాడు. వాడు నటనలో పేరొందిన మోసగాడు.

ఆషాడభూతి దేవశర్మ వద్దకు చేరి, సాష్టాంగ నమస్కారం చేసి, ఈ సంసారం కష్టమయం అని, తనకు మోక్ష మార్గం చూపమని, పాదాలు పట్టుకుని, విడవకుండా వేడుకున్నాడు.

అవి నమ్మిన సన్యాసి అతని భక్తికి మెచ్చి, ' చిన్న వయసులో ఈ ఆశక్తి కలగడం గొప్ప సంగతి. వయసు మళ్ళాకా, ఎవరికయినా విరక్తి కలుగుతుంది. మంచి వారికి దేహం ధృడంగా ఉన్నా, మనసులో వృద్ధాప్యం వస్తుంది. చెడ్డవారికి శరీరం ముసలిది అయినా, పాడు మనసు ఎదగాడు,' అని అతన్ని మెచ్చుకున్నాడు.

అతడిని శిష్యుడిగా చేసుకుని, గొప్ప మంత్రం ఉపదేశిస్తానని చెప్పాడు. మఠానికి దగ్గరలోనే అతను ఉండే ఏర్పాటు చేసాడు. అతనికి మంత్రోపదేశం చేసి, అతని కోసం ఒక పూరిల్లు వేయించాడు. 

రాత్రి పూట మాత్రం దేవశర్మ అతడిని, యతులు నిస్సంగులని, వొంటరిగా పడుకోవాలని,  చెప్పి, పంపెసేవాడు. ధనం అపహరించే సందు దొరక్క, ఆషాడభూతి విచారించేవాడు.

ఒకనాడు శిష్యుడి ఇంటిలో ఏదో దేవకార్యం అని చెప్పి, దేవశర్మ బయటకు వెళ్ళాడు. ఇదే సమయం అని ఆషాడభూతి కూడా అతని వెంట పడ్డాడు. దారిలో ఒక యేరు అడ్డం వచ్చింది. ఆ తీరంలో వారు ఆగారు.

ఆషాడభూతి సన్యాసి వెంట వెళుతూ నది ఒడ్డున స్నానానికి గురువు వెళ్ళగా, తీరంలో కాచుకు కూర్చున్నాడు. సన్యాసి శిష్యుడిని నమ్మి మూట ఇచ్చి వెళ్ళాడు .గురువు అటు వెళ్ళగానే,డబ్బుల మూటతో ఉడాయించాడు. గురువు స్నానానికి వెళ్ళిన వైపు ఒక సంఘటన్ జరిగింది.

అక్కడ రెండు మేకపోతులు డీ కొట్టుకుంటున్నాయి. వాటి నుంచీ రక్తం కారసాగింది. ఆ రక్తానికి ఆశపడిన ఒక బడుగు నక్క, మధ్యన చేరి, నాకసాగింది. అయ్యో, పాపం ఆ నక్క చస్తుందే అని సన్యాసి చూస్తూ ఉండగానే, మేకపోతులు డీ కొట్టుకోవడం, నక్క చనిపోవడం జరిగింది. పాపం నక్క చచ్చిందే, అనుకుంటూ, ఆ మేకల పోరు చూచి, వినోదించి వచ్చిన సన్యాసికి తన శిష్యుడు, డబ్బు మూటా కనిపించలేదు. 

డబ్బు కట్టిన బొంతను వదిలి సొమ్ము దొంగలించి, ఆషాడభూతి వెళ్ళిపోయాడు. కొంప తీసావురా పాపీ, అనుకుంటూ ఏడ్చాడు దేవశర్మ.

కాబట్టి, కరటకా , ఈ చేత్తో చేసిన పాపం ఆ చేత్తో అనుభవించక తప్పాడు. సమయం చూసి దెబ్బ కొట్టాలి. సంజీవకుడితో స్నేహాన్ని పాడుచేసి, రాజును తిరిగి వేటకు పంపాలి. ఈ కార్యం మాయోపాయంతో ధైర్యంగా జరపాలి. సముద్రంలో పడవ పగిలిపోతే, బెస్తవాడు భయపడి పోతాడా? నీళ్ళలో ఈదుకు వస్తాడు కదా.

పూర్వం ఒక సాలెవాడు విష్ణు  రూపంతో రాకుమారుడిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ కధ చెప్తాను విను...


పూర్వం ఒక గ్రామంలో మంచి స్నేహితులయిన ఒక వడ్రంగి, ఒక నేత పనివాడు ఉండేవాళ్ళు. ఆ ఊరి దేవాలయంలో ఒకసారి జరిగిన ఉత్సవానికి, రాకుమార్తె వచ్చింది.ఏనుగును ఎక్కి వైభవంగా వచ్చిన రాకుమార్తెను చూడగానే, ఆ సాలె వాడు ఆమెను ప్రేమించాడు. తమ మధ్య ఉన్న అంతరం తలచుకుని, మిక్కిలి దుఃఖంతో మూర్చపోయాడు. అతని స్నేహితుడు అతన్ని ఇంటికి తీసుకు వచ్చి, పరిచర్యలు చేసాడు. అతనికి తెలివి వచ్చాకా, 'ఎందుకు అలా పడిపోయావు?' అని అడిగాడు.

'మిత్రమా! ఏమి చెప్పమంటావు? మనసుకు నచ్చిన కన్నెను అందుకోలేకపోవడం కంటే, నా ప్రాణం పోయినా బాగుండేది. ఆ రాకుమారి చూడగానే నా మనసులో నిలిచిపోయింది. ఆమె అందాల భరిణ . ఆమెను చూసేందుకే మనవంటి సామాన్యులకు సాధ్యం కాదు, ఇక పెళ్లి దాకా ఎందుకు? ఆమె లేకుండా నేను బ్రతకలేను,' అన్నాడు నేతగాడు ఆవేదనగా.

'మిత్రమా! దీనికి ఇంత దుఃఖం ఎందుకు? నీవామేను కలుసుకునేలా చేస్తాను. ఈగ కూడా దూరలేని అంతఃపురంలోకి నీవు వెళ్ళే ఉపాయం చెప్తాను. ఆలోచన ఉంటే, కాని పని ఉంటుందా?' అన్నాడు వడ్రంగి వాడు. 

వెంటనే అతను తన ప్రతిభను ఉపయోగించి, అతడు రధకారుడు కనుక, గరుడ వాహనం, శంఖచక్రాలు, గద , కిరీటం, గబగబా చేసి మిత్రుడికి ఇచ్చాడు. వాటి సహాయంతో తన మిత్రుడిని విష్ణుమూర్తిలా తయారుచేసి, గరుడ వాహనం ఎలా నడపాలో, ఏ కీలు ఎటు తిప్పాలో చెప్పాడు. మిత్రుడి ఆత్మీయతకు మురిసిపోయి, అతన్ని ఆలింగనం చేసుకుని, ఆ పక్షి వాహనం ఎక్కి, రాకుమార్తె బంగారు మేడ పైనుంచీ, ఆమె కేళికా మందిరంలోకి ప్రవేశించాడు సాలెవాడు. 

ఆ రాత్రి ఆమెను కలుసుకుని, ' ఓ పుత్తడి బొమ్మా, లక్ష్మిని త్రోసిపుచ్చి, నిన్ను వారించేందుకు ఇంత దూరం వచ్చాను,' అన్నాడు.

రాకుమారి ఆశ్చర్యపోయి, ' స్వామీ!నేను సామాన్యురాలిని. మీరు ముల్లోకాలకూ ఏలికలు,' అంది.

మాయావిష్ణువు, ' తరుణీ, నీవు పూర్వం రాధవు. ఈ జన్మలో నా కొరకు నారా లోకంలో జన్మించావు,' అన్నాడు.

తన తండ్రి అనుమతి ఉంటే, పెళ్లి చేసుకుంటాను , అంది రాకుమారి. అందుకు నేత పని వాడు, ' నేను మనుషులకు కనిపించను, కనుక, నన్ను గాంధర్వ పద్ధతిలో పెళ్ళాడు, మీ తండ్రి కాదంటే, శపించి భస్మం చేస్తాను,' అంటూ, ఆ కన్య మనసు మార్చి, ఆమెను తన దాన్ని చేసుకున్నాడు. అది మొదలు ప్రతీ రాత్రి ఆమె వద్దకు గరుడ వాహనం పై వెళ్లి, సుఖించి, తెల్లవారకుండా ఇల్లు చేరుకోసాగాడు.

కొన్నాళ్ళకు వేగుల ద్వారా ఈ వార్తను తెలుసుకున్న రాజు, రాకుమార్తెను నిలదీశాడు. ఆమె, ' నా తప్పేమీ లేదు, శ్రీమన్నారాయణుడే రాత్రికి వచ్చి, పొద్దుటే వెళ్ళిపోతున్నాడు. ఆయనను నేను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాను, ఆయన దేవుడు,' అన్నది. 

ఆ రాత్రికి రాజు, రాణి రహస్యంగా దాక్కుని, గరుడ వాహనం పై వచ్చిన మాయా విష్ణువును చూసారు. ఇదంతా తమ తపః ఫలమని, ఊరుకున్నారు.

ఆ రాజు విష్ణువే తనకు అల్లుడైనాడు అన్న దర్పంతో, తన రాజ్యం ఇష్టం వచ్చినట్లు విస్తరించాసాగాడు. పొరుగు రాజ్యాలపై దండెత్తాడు. ఇరుగు పొరుగు రాజులంతా కూడి, ఈ రాజు పైకి దండెత్తి వచ్చారు.

అప్పుడు...

అందరు రాజులూ ఒకేసారి తన మీదకు దండెత్తి రావడంతో, రాజు తన కూతురితో ఇలా అన్నాడు. " అమ్మాయీ! చిల్లర రాజుల అల్లరి బలిసిపోతున్నది. అల్లునితో ఒక మాట చెప్పు, నారాయణుడే నా అల్లుడు కాగా, నేను ఇలా భంగపడడం ఏమిటి?" 

ఆ రాత్రి మాయ విష్ణువు రాగానే రాకుమార్తె అతడిని ఇలా ప్రార్ధించింది. ' స్వామీ! మీరుంది కూడా మా నాన్న శత్రు రాజులకు చిక్కడం ఏమి బాగుంటుంది? ఆయనను కాపాడండి. ఆ ప్రార్ధనకు తానె దేవుడయినట్లు తల ఊపాడు సాలె వాడు.

ఇరుగుపొరుగు రాజులు కోటను ముట్టడించారు. రాజు కలతపడి, కూతురిని తిరిగి వేడుకున్నాడు,' ఎందరో చనిపోయారు, సైనికులు గాయపడ్డారు. కోటలోని ఆహారం అంతా అయిపొయింది, ఇక మీరే కాపాడాలి,' అన్నాడు.

మాయా వేల్పు రాకుమారి మాటలు విని, మనసులో, ' ఇక వేరు మార్గం లేదు, నేను ఈ వేషంతోనే శత్రు రాజులకు కనిపిస్తాను. వారు పోరు చాలించి, వెళ్ళిపోతారు. కోరలలో విషం లేకపోయినా, పడగెత్తి ఆడే పామును చూస్తె, భయపడతారు కదా!' అని, తెగించి, ఆమెతో, 
'ఉదయాన్నే మీ నాన్నను యుద్ధానికి వేల్లమను, నేను గరుడ వాహనం ఎక్కి ఆకాశం నుంచే పరుల సేనను ధ్వంసం చేస్తాను,' అన్నాడు. ఆ మాటలు విన్న రాజు తెల్లవారుతూనే భళ్ళున రానా రంగంలోకి దూకాడు.

అప్పుడు, అసలు విష్ణువు తన మనసులో, ఇలా అనుకున్నాడు. ' ఈ అమ్మయకుడు కనుక యుద్ధంలో పడిపోతే, ప్రజలకు నాపై నమ్మకం పోతుంది. నా మీద భక్తీ తగ్గిపోతుంది. ఇప్పుడు అతనికి సాయం చెయ్యాలి, ' అనుకుని, శత్రువులతో పోరాడి, ఓడించాడు. 

ఇదంతా చూసిన సాలెవాడు, ఇక దాచి ప్రయోజనం లేదని, జరిగిన సంగతి అంతా రాజుకు మనవి చేసాడు. రాజు మాయా విష్ణువు బుద్ధిబలాన్ని  కొనియాడి, అతనికి పట్టం కట్టి, తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసాడు.

కాబట్టి కరటకా, తెలివి ఉండాలే కాని, ఎలాగయినా విజయం సాధించవచ్చు, అన్నాడు.


రాకుమారి కధను శ్రద్ధగా విన్న కరటకుడు, అది సరే గాని దమనకా, సింహం, ఎద్దు ప్రాణమిత్రులు. వారికి వైరం కల్పించడం ఎలాగా?' అని అడిగాడు.

'యుక్తితో ఏ పనిని అయినా సాధించవచ్చు. బంగారు తీగతో పాడే పామును కాకి ఓడించడం వినలేదా?' అని అడిగాడు, దమనకుడు.

"ఆ కధ ఏమిటో వివరంగా చెప్పు మిత్రమా!"

కాకీ పాము కధ 
(కధలో కధ)

పూర్వం ఒక మఱ్ఱి చెట్టు మీద ఒక కాకి జంట చాలా కాలంగా ఉంటూ వచ్చింది. ఆ చెట్టు తొర్రలో ఒక పాము వచ్చి చేరింది. కాకి గూటిలోని గుడ్లను, చీకటి పడగానే పాము వచ్చి, తిని పోసాగింది. ప్రతీ సారి ఇలాగే చేస్తుంటే, కాకి దంపతులు బెంగ పడ్డారు. ఈ పామును తరిమేందుకు ఏదయినా ఉపాయం ఆలోచించాలి, అనుకుని, ఒక నక్కను ఆశ్రయించాయి. 

అంతా విన్న నక్క, 'దిగులుపడకండి, కత్తితో కాని కార్యాలు కూడా యుక్తితో సాధించవచ్చు, అంటూ, వాటి చెవిలో ఒక ఉపాయం చెప్పింది.

వెంటనే రెండు కాకులూ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాయి . అక్కడ రాకుమారి జలకాలు ఆడుతోంది.

అలా కాకులు రెండూ పట్టణానికి వెళ్లి, రాకుమార్తె జలకాలు ఆడే కొలను వద్దకు చేరుకున్నాయి. ఆమె నగానట్రా తీసి, గట్టు మీద పెట్టగానే, వాటిలో ఒక వజ్రాల హారం ముక్కున కరుచుకుని, ఒక కాకి పారిపోయింది. వెంటనే రాజభటులు ఆ కాకి వెంట పడగా, అది తన చెట్టును చేరి, హారాన్ని,పాము ఉన్న చెట్టు తొర్రలో పడేసి, పారిపోయింది.

భటులు తొర్రను వెతుకగా, పాము వారి కంట బడింది.వారు దాన్ని కొట్టి చంపి, హారం తీసుకుని, వెళ్ళిపోయారు. పాము పీడా వదిలిందని, కాకులు సంతోశాపడ్డాయి. కాబట్టి తెలివితో పనులు జరుగుతాయి, అంటూ,  దమనకుడు ఈ కధను వివరించి చెప్పాడు. 

అది విన్న కరటకుడు, సరే అయితే, నీవు వెళ్లి, సంజీవక పింగాలకులను నెమ్మదిగా వేరుపరుచు, అన్నాడు .

దమనకుడు ఆ మాటలకు సంతోషించి, సింహం గుహ వద్ద కాపేసి, మృగరాజు ఒంటరిగా ఉన్న సమయం చూసి, అక్కడకు వెళ్లి, దణ్ణం పెట్టి, కూర్చున్నాడు. 

" మీకు మాతో ఇప్పుడు పని లేదు, కాని, దొరకు ఏమయినా ఆపద వస్తుందేమో, అన్న శంకతో ముందే ఇలా వచ్చాను. మతిమంతులయిన మంత్రులు రాజు హితవు చెప్తారు కదా, ' అన్నాడు.

' ఏదయినా విన్నపం ఉంటే, చెప్పుకో, మాకు ఆపద ఏమిటి?' అన్నాడు మృగరాజు.

అటుచూచి, ఇటుచూచి, వినయం నటించి, దమనకుడు ఇలా చెప్పసాగాడు...

'రాజా! ఈ ఘోరం చెప్పాలంటే నోరు రావటంలేదు. సంజీవకుడు మీకు హాని తలపెట్టాలని చూస్తున్నాడు. మిమ్మల్ని నమ్మించి, చంపి, ఈ అడవికి తానె రాజు కావాలని అతని ఆశ,' అన్నాడు దమనకుడు మెల్లిగా....

ఆ మాటలు విన్న సింహానికి నెట్టి మీద పిడుగు పడినట్లు అయ్యింది. కాసేపటికి తేరుకుని,
'సంజీవకుడు నా మిత్రుడు. మిత్రుడిని నమ్మకపోవడం ఎలాగా?' అన్నాడు.

'అదే తప్పు రాజా! స్నేహం అధికంగా ఉన్న చోట మరేదీ కనిపించదు. ద్రోహబుద్ధిని కనిపెట్టి, తొలగించాలి. మిత్రుడని ఆలోచిన్చరాదు ,అతను గడ్డితినే పశువు, మీరు అతని కోసం మాంసాహారం వదిలేసి, బలహీనులు అయ్యారు. ఎలాంటి మిత్రునితో ఉంటే, అలాగే అయిపోతారు దుష్టులను ఉపెక్షించరాదు ,'అన్నాడు దమనకుడు.

'ఏ కారణం చేత నేను ఇప్పుడు అతని స్నేహం వదలాలి?' అడిగాడు రాజు. 

'అతని మనసంతా విషమయం అయ్యింది, అడవంతా గొప్పలు కొట్టాడు, మీరే చూడండి, రేపు వాడు మీ ప్రక్కన మామూలుగా కూర్చోలేడు,' అంటూ రాజుకు అనుమానం కలిగించి, మెల్లిగా సంజీవకుడి వద్దకు చేరాడు దమనకుడు.

'నా మాటలు నమ్మి వచ్చిన నీ మంచి కోరడం నా ధర్మం. దొర వారు ఇచ్చిన అభయం మరచి, నిన్ను చంపాలని చూస్తున్నారు. రేపు పొద్దుటే నీకు చావు ఖాయ, ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు, అన్నాడు.

ఆ మాటలు విని మూర్చపోయాడు సంజీవకుడు. 

కాసేపటికి తెప్పరిల్లిన సంజీవకుడు, 'దొర నన్ను చంపదలచుకున్నాడు అన్న మాటను నిర్ధారణ చేసుకోవడం ఎలా?' అని అడిగాడు.

'దానిదేముంది, నీవు వెళ్ళగానే కన్నెర్ర చేసి చూస్తాడు, దాన్ని బట్టి ఆలోచించుకో,' అంటూ వెళ్ళిపోయాడు దమనకుడు.అప్పుడు సంజీవకుడు ఎంతో బాధ పడి, 'ఇక నాకు దిక్కెవరు? ఆ సింహాన్నే ఆశ్రయించి, చూస్తాను,' అనుకుంటూ, మెల్లిగా అక్కడకు చేరాడు.

సింహం కోపంగా చూస్తోంది, ఎలాగూ బెడిసిందని , ఒక్క గెంతులో సంజీవకుడి పైకి దూకింది. గిత్త కూడా పోరాడసాగింది. చివరకు, సింహం ఎద్దును చంపి, ఆ రక్తం కాళ్ళ చూస్తూ, ఏడవసాగింది. 
'యెంత పాపం చేసాను, నమ్మిన స్నేహితుడిని నాశనం చేసాను. మేలు చేసిన వాడిని మింగేసాను, సమర్దుడయిన మిత్రుడు పొతే, తిరిగి దొరకడు ,' అంటూ బాధపడసాగాడు.

అందుకు దమనకుడు 'రాజా! ద్రోహిని చంపడం రాజ ధర్మం. గడ్డి తినే పశువులకి, క్రూర జంతువులకి సామాన్య విరోధం. భయంతోనే ప్రజలు ప్రభు భక్తీ పరాయణులు అవుతారు, విలపిస్తే వచ్చీ లాభం ఏమిటి,' అంటూ ఆ సింహాన్ని అనేక విధాలా ఓదార్చి, పక్కకు తీసుకుపోయింది. అలా రాజు మనసు గెలుచుకుని, ఆ దుర్మార్గుడయిన దమనకుడే అందరిచేత సరయిన మంత్రి అనిపించుకుని,రాజ్యం చేయ్యసాగాడు. 

తన శత్రువులను వేరు చేసి, తన కోరిక తీర్చుకునే తంత్రం ఇదే!

అంటూ, విష్ణుశర్మ, పంచతంత్రం లోని 'మిత్రభేదం ' అనే తంత్రాన్ని ముగించాడు.