Thursday, January 21, 2016

అహోబిల సార్వభౌమా

ఇవాళ అహోబిల వాసుడు అనుగ్రహించిన పద్యం.

వసంత తిలక ఛందస్సు :
శ్రీగోమినీశ/ నిజచిన్మయ/క్రోడరూపా
రాగానులోల/ శ్రికరంజన/ యుగ్రజ్వాలా
వాగీశవంద్య/ జనపావన /భర్గపూజ్యా
యోగానురక్త/ శ్రియహోబిల/ సార్వభౌమా



పద్య విశేషాలు : గోమిని -లక్ష్మి(మాలోల నృసింహ స్వామి), క్రోడరూప(వరాహ నృసింహ స్వామి), రాగానులోల( ఛత్రవట నృసింహ స్వామి ), శ్రికరంజన (కారంజ నృసింహ స్వామి), ఉగ్రజ్వాలా(జ్వాలా నృసింహస్వామి), జనపావన (పావన నృసింహస్వామి), భర్గపూజ్యా - పరశురాముడి చేత పూజింపబడిన భార్గవ నృసింహ స్వామి, యోగానురక్త - యోగానంద నృసింహస్వామి, అహోబిల సార్వభౌమా - అహోబిల నృసింహ స్వామి.
పద్య విశేషాల కంటే, ఈ పద్యం పుట్టుక గురించి కాస్త చెప్పుకోవాలి. ఈ సారి గురూజీ నిర్వహిస్తున్న మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా నృసింహ స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించింది. ఒక రోజున మాలోల నృసింహస్వామి వరకూ వెళ్ళినా, జ్వాలా వెళ్ళే అదృష్టం దక్కలేదు. మర్నాడు పిల్లలతో వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా చూడాలని ఉందని మా వారితో అన్నాను. 'పిల్లలతో కష్టం' అన్నారు. పిల్లలూ వెళ్దామని మారాం చేసారు. నేనూ బుంగమూతి పెట్టేసాను. మావారు, 'సరే పదండి' అంటూ బయల్దేరారు.
ఎప్పుడూ, ఏ.సి లేక హీటర్ లో బ్రతికే నా ఇంక్యుబేటర్ కోళ్ళు (పిల్లలు), ఎలాగో నడుస్తున్నాయి. చేతిలో కర్రలు, ముందు రాళ్ళు, రప్పలు తప్ప దారి లేదు. అలాగే సెలయేరు మధ్యనుంచి నడుస్తూ, రాళ్ళపైనుంచి పాకుతూ, ముందున్న వారిని అనుసరిస్తూ వెళ్ళసాగాము. కాసేపటికి ఓ బ్రిడ్జి, పక్కన మెట్లు వచ్చాయి. మెట్లు ఎక్కుతూ, ఆ కొండల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, జ్వాలానృసింహ స్వామి కొండపై ఉన్న అమృతతుల్యమైన భవనాశిని జలపాతంలో నీటిని త్రాగి, ఆడి పాడుతూ ఉండగా, 'ఈ సువిశాలమైన అహోబిలం అనే సామ్రాజ్యానికి రారాజు ఆ స్వామే కదా, అనిపించింది. అనిపించగానే, వెనువెంటనే - అహోబిల సార్వభౌమా అన్న మకుటం స్ఫురించింది. 'ఎప్పటినుంచో శతకం రాస్తానని, గోల పెడుతున్నావ్ కదా, ఓ చండీరాణి, ఈ మకుటంతో రాయి,' అన్న ఆజ్ఞ వినవచ్చింది. నేనలా స్వామితో మనసుతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నన్ను, నేను ఆయన్ను ఆటపట్టించుకుంటూ ఉంటాము. అసలు నిజమైన భక్తిలో ఆ మాత్రం చనువు ఉండాలట !
సరే, స్వామి మకుటం చెప్పారు. నేనా ఛందస్సు అనే సముద్రంలో పిల్ల చేపను. ఈ మకుటం ఏ ఛందస్సుకు సరిపోతే, అందులోనే పద్యాలు రాస్తాను, అని నిశ్చయించుకున్నాను. ఈ లోగా రేడియోలో 'మన దేవాలయాలు' అనే కార్యక్రమానికి అహోబిలం గురించి చెప్తుండగా, ఆహోబిలాన్ని దర్శించిన ఇదే మకుటంతో తిరుమంగై అనే ఒక తమిళ ఆళ్వారు 'నాలాయిర దివ్య ప్రబంధం' లో పది పాశురాలు రచించారని తెలుసుకుని, ఆశ్చర్యపోయాను. ఇక ఛందస్సు పుస్తకం ముందేసుకుని, ఈ అహోబిల సార్వభౌమా అనే మకుటం ఏ ఛందస్సుకు సరిపోతుందో చూసాను. అదే - వసంత తిలక. పేరు గొప్పగా ఉంది కదూ, ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని తొలి పద్యాలు అన్నీ ఇదే ఛందస్సులో రాయబడ్డాయి. ఇది రీసెర్చ్ లో తెలిసింది. పేరు యెంత బాగుందో, ఛందస్సు కూడా అంత బాగుంది, నాకైతే భలేగా నచ్చింది.
కాని ఈ పద్యం రాసేందుకు పడ్డ తిప్పలున్నాయి చూసారూ... ఒక్క పద్యం స్వామి పాదాల దగ్గర పెట్టేసి, 'స్వామి, ఇదే శతకం అనుకోండి,' అని పారిపోయేంత కష్టం ఉంది. అదీ, నాలాంటి పిల్ల చేపకి - ఎందుకంటే - ఈ ఛందస్సులో 8/11 వ అక్షరం యతి. నన్నయ్య 8 వాడారు, వెంకటేశ్వర సుప్రభాతంలో 11 వ అక్షరం వాడారు. పెద్దల్ని కనుక్కుంటే, ఈ సుప్రభాతం సంస్కృతంలో ఉంది కనుక, 8 తో జతకట్టమన్నారు. ఇక్కడ మొదలైంది అసలు తిరకాసు. అహోబిల లో హో - అనే అక్షరానికి సరిపోయేలా ముందు పదం తయారు చేసుకోవాలి, తర్వాత ఆ పదం ప్రాసని బట్టి, పై పాదాల యతులు, ప్రాసలు. హో - అనే అక్షరానికి యో, యూ,హూ,హో(ఈ ఛందస్సులో తోలి అక్షరం గురువు కనుక) మాత్రమే సరిపోతాయి. యో, యూ,హూ,హో - వీటితో పదాలా , ఉన్నా ఎన్నుంటాయి, శతకం అవుతుందా లేదా ? హ. హ హ ... అని ఓ వెర్రి నవ్వు నవ్వడం తప్ప, నాకూ తెలీదు. సస్పెన్స్, ఈ దేవుడితో ఎప్పుడూ ఇంతే లెండి.
హా, హా , హూ, హూ - అనే గంధర్వుల గానాన్ని మెచ్చి వారికి శాపవిమోచనం కలిగించిన ఛత్రవట నరసింహ స్వామీ - మీరే కాస్త కనికరించి, ఎలా శతకం రాయిస్తారో రాయించుకోండి. యతి 11 తో అడ్జస్ట్ అవమంటారా లేక మకుటం మార్చేసి, ఆటవెలదితో ఆడుతూ, పాడుతూ ప్రొసీడ్ ఐపోమంటారా తర్వాత మనం మనం ఒక ఒప్పందానికి ఒద్దామే. 'నృసింహ స్వామిని వదలద్దు' అని గురూజీ ఈసారి చెప్పారు. పద్యం కుదరనంతసేపూ, స్వామిని తలచుకునే ఛాన్స్ దక్కుతుంది కదా ! ఇదీ మంచిదే కదా. " మేజిక్ బెగన్స్ వేర్ లాజిక్ ఎండ్స్'
తరవాయి భాగం దైవ నిర్ణయం మరి. జయజయ నృసింహ.

స్వామి గతంలో అనుగ్రహించిన ఈ పాటను వినండి.

Friday, January 8, 2016

కాగులో నీళ్ళు

ఇక్కడ గత ఏడాది ఉన్నంత చలి లేదు. అయినా, ఉదయం పాపను స్కూల్ కి దింపేందుకు వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ వేసుకున్న చలిమంట వద్ద కూర్చున్నాము. మమ్మల్ని చూసి, అతను మర్యాదతో కూడిన మొహమాటంతో పక్కకి తప్పుకున్నాడు. ఇక నా ఆగడాలు మొదలు. పక్కనున్న ఎండుటాకులు, కట్టె పుల్లలు, మంటలో వేస్తూ ఆడుకుంటుంటే, మా అమ్మాయి,"ఏంటమ్మా ? చెయ్యి కాలుతుంది కదా ?" అంది. వెంటనే నేను ఓ 32 ఏళ్ళు వెనక్కి దూకి, నీ వయసులో నేనూ... అంటూ మొదలుపెట్టాను.

"మా చిన్నప్పుడు గీజర్లు లేవే. ఇలాగే మంట మీద నీళ్ళు కాచుకుని, పోసుకునేవాళ్ళం. అసలు స్టవ్ కూడా లేదు తెల్సా, వంట కూడా ఇలాగే చేసేవారు." అని చెబుతుండగా, దాని స్కూల్ బస్సు వచ్చి, అది వెళ్ళిపోయింది. నేను మాత్రం అలాగే జ్ఞాపకాల్లో ఉండిపోయాను.

ఏడాది అంతా చెట్లూ, చేమల నుంచి రాలిన పుల్లలు, కొట్టేసిన కొబ్బరి మట్టలు, ఎండుటాకులు, ఒలిచిన కొబ్బరి చితుకులు, కొబ్బరి చిప్పలు, పిడకలు, అన్నీ ఒక చోట పోగేసి, పెట్టేవాళ్ళు. ఇక అమ్మమ్మలు, బామ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఒకటే సూత్రం చెప్పేవారు. 'కాచుకున్న వాళ్ళవే వేన్నీళ్ళు.'

ఒక కాగు నిండా నీళ్ళు పోసి, ఒక విసనకర్ర ఇచ్చి, పక్కన దహన సామాగ్రి పెట్టి, మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టేవారు. ఒక పావుగంటలో నీళ్ళు కాచాలి అన్నమాట. కాని, మా మర్కట మంద ఊరికే ఉంటుందా ? కాగితాలు, ఆకులు, జడపిన్నులు, గుడ్డ ముక్కలు, అన్నీ తెచ్చి, అందులో వేస్తూ, నానా హడావిడి చేసేసరికి మంట ఆరిపోయేది. మళ్ళీ పెద్దవాళ్ళని తెచ్చి, వెలిగించి, కూర్చున్నాకా, ఇంకాసేపటికి, కాగులో నీళ్ళు పొయ్యిలో ఒలికిపోయి మళ్ళీ పొయ్యి ఆరిపోయేది. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చుట్టూ ఉన్న 5-6 మంది పిల్లలు, శరవేగంతో పోటీలు పడుతూ విసనకర్రలు ఝులిపించగానే, మళ్ళీ వెలగబోతున్న మంట కాస్త, ఆరి కూర్చునేది.  ఇలా ఒక గంట పాటు ట్రయిల్ అండ్ ఎర్రర్ పధ్ధతి కొనసాగాకా, కాస్త గోరువెచ్చగా నీళ్ళు కాగేవి అన్నమాట.

ఆ తర్వాత, బాయిలర్లు వచ్చాయి. ఆ గొట్టం మధ్యలో, దాని ముక్కుకి ఊపిరాడకుండా, చితుకులు కూరేస్తే, మండలేక ఆరిపోయేది. అప్పుడు కింద ఉన్న జల్లెడ లాంటి ప్లేట్ లాగి, చితుకులు బయటికి లాగి, మాకో మొట్టికాయ బహుమతిగా ఇచ్చి, వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇదంతా ఒక సందడి, ఒక సరదా. మగ్ తో వయ్యారంగా స్నానం చేసామా ? ఏకంగా గంగాళంలోకి దిగిపోయేవాళ్ళం. మా ఇళ్ళల్లో పిల్లల కోసం నేల మీద కాకుండా, గోడల మీద, చెట్ల మీద వెతుక్కునేవారు. మేము చాలా మంచి పిల్లలం అని మీరు నమ్మి తీరాలి మరి.


ఈ తరానికి ఇన్ని జ్ఞాపకాలేవి, ఇంత సమయం ఏది ? లేస్తే, ప్రతి పనికి ఒక స్విచ్, బటన్, అందుబాటులో ఉంటుంది కదా. ఎంతైనా, ఈ గాడ్జెట్ యుగం కంటే, ఏమీ లేనప్పుడు - ప్రకృతితో, మనుషులతో ఒక అనుబంధం కలిగిఉన్నప్పుడు గడిపిన  నా బాల్యం, నా జ్ఞాపకాలే గొప్పగా అనిపిస్తాయి. మీకూ ఇటువంటి అనుభూతులు ఉన్నాయా మరి ?