Sunday, October 27, 2013

శ్రీనాధుని శృంగారనైషధం

శ్రీనాధుని శృంగార నైషధం 

ఈ కావ్యం శ్రీహర్ష సుకవిచే సంస్కృతంలో రచింపబడిన 'నైషదీయ చరిత్ర' కు శ్రీనాధుని తెనిగీకరణ. మామిడి సింగన్న కోరికపై తెలుగులో వ్రాసిన ఈ కావ్యానికి శ్రీనాధుడు 'శృంగార నైషధం ' అని పేరు పెట్టాడు. శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది క్రింది పద్యం.

సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు
కానదిప్పుడు; మూఁడుకాళ్ళ ముసలి
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెఱుఁగదు
పరమ పాతివ్రత్య భవ్య చరిత;
వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి ఎంతేని జీవనంబు;
గానక కన్న సంతానమ్ము శిశువులు,
జీవనస్థితి కేన తావలంబు
తే. కృపఁ దలంపఁ గదయ్య యో నృప వరేణ్య
యభయ మీవయ్య యో తుహినాంశు వంశ
కావఁ గదయ్య యర్థార్థి కల్పశాఖి
నిగ్రహింపకుమయ్య యోనిషధ రాజ

తల్లికి ఒక్కడనే కొడుకుననీ, ఆమె చూపు కూడా లేని ముసలి తల్లి అనీ, ఇల్లాలు అమాయకురాలనీ, చుట్టాలెవరూ లేరనీ, పిల్లలు పసివారనీ, కుటుంబానికి తానే ఆధారమనీ, ఆ హంస చేత శ్రీనాధుడెంత స్వభావ సిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులూ, తెలుగు జాతీయాలూ, వీటన్నిటితో పద్యం ఎంతో కాంతివంతంగా ఉంది. పైగా సీస పద్యం శ్రీనాథుడి ప్రత్యేకత గదా!

పెద్ద పెద్ద సంస్కృత సమాసాలను పక్కన బెట్టి వాడుక భాష లోని తెలుగు పదాలనే వాడాడు శ్రీనాథుడీ పద్యంలో. కన్నుల్ కానదు, మూడు కాళ్ళ ముసలి, వెనుక ముందర లేరు, కానక కన్న సంతానము – ఇలాంటి, జీవద్భాషలోంచి ఉబికి వచ్చిన పలుకుబళ్ళూ, ముఖ్యంగా ఒక గొప్పవాడిని వేడుకునేటప్పుడు సామాన్యుడు తన బాధలను ఎంత దయనీయంగా ఏకరువు పెడతాడో ఆ వైనమూ, ఒక చిన్న గీత పద్యంలో చెప్పగలిగిన భావాన్ని వివరంగా సీస పద్యం లోకి విస్తరించి చెప్పి, చక్కటి శ్రవణ పేయతనే గాక, ఆర్ద్రానుభూతిని సాధించిన నేర్పూ, దీనిని ఒక మంచి పద్యం గా తయారు చేశాయి.

‘‘అనలసంబంధ వాంఛనాకగునయేని
అనల సంబంధ వాంఛనా కగునుజూవె’’
ఇది శ్రీనాథుడు ‘శృంగార నైషధం’లో వాడిన భాషా చమత్కారం. నలుడ్ని దమయంతి వరించింది. అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంది. దమయంతీ స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా ఈ స్వయంవరానికి బయలుదేరారు. దారిలో నలుడ్ని కలిశారు. ‘‘ఓ నలమహారాజా, నువ్వు వెళ్లి దమయంతికి నచ్చచెప్పి మాలో ఒకర్ని వివాహమాడమని చెప్పు’’ అన్నారు. నలుడు వెళ్ళి దమయంతికి ‘దిక్పాలకులలో ఒకర్ని పెళ్లిచేసుకోమని’’ చెప్తాడు. దమయంతి వినదు. అప్పుడు శ్రీనాథుడు పై పంక్తుల్ని రాశాడు- రెండూ ఇంచుమించు ఒకే వాక్యం- కానీ అర్థాలు వేరు:
మొదటి పాదం- అనల సంబంధం- అంటే నలుడు కాని వానితో సంబంధం!
రెండవ పాదం- అనల సంబంధం- అంటే అగ్నితో సంబంధం (అనల అంటే అగ్ని).
నలుడుకానివాడితో నాకు సంబంధం ఏర్పడి (పెళ్ళి అయితే)- నాకిక అగ్నితోనే సంబంధం! అంటే ఆత్మాహుతి తప్పదు అని భావం. సంస్కృత పదాలు తెలుగులోకి ఒదిగిపోయి శబ్ద చమత్కారాన్ని కలగజేశాయి.

పెరుగన్నంలో ఆవకాయ నంజుకుని భుజిస్తుంటే మంట నషాళానికి అంటినప్పుడు కలిగే అనుభవం శ్రీనాథుని శృంగార నైషధం లోనిదైన ఈ పద్యంలో స్ఫష్ఠంగా కనిపిస్తుంది.

“మిసిమిగల పుల్ల పెరుగుతో మిళితములుగ
ఆవపచ్చళ్ళు చవిచూచిరాదరమున
జుఱ్ఱుమని మూర్ధములుదాకి యెఱ్ఱదనము
పొగలు వెడలంగ నాసికాపుటములందు” (శృం.నై.6-130)

                                        

2 comments:

  1. శ్రీనాథుని తెనిగీకరణ=ఆంధ్రీకరణ లేదా తెనుగుసేత
    తెనిగీకరణ(అనిష్టం?) మరోసారి చూడమని ప్రార్థన

    ReplyDelete
  2. అలనాటి మేటి ఇల్లాలు చేసే ప్రతిపనిలో అలసట,ఆలోచన,వయ్యారం,సాంప్రదాయం అన్ని శ్రీనాధుని కావ్యాలలో కనిపిస్తాయి.

    ReplyDelete