Monday, October 14, 2013

'ప్రబంధ పరమేశ్వరుడు ' ఎఱ్రాప్రగడ 1

ఎఱ్ఱన యుగము : 1320 - 1400
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని బాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.

సంస్కృతం లో రాసిన మహాభారతాన్ని తెలుగు లోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మద్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఏఅయనను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడ వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు కలదు.

నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీ ఘటీ
ఘనకోటీశ కటీకటీ తటిపటీ గంధేభ వాటీపటీ
రసటీ హారకటీ సువర్ణమకుటీ ప్రఛ్ఛోటికాపేటికల్”
కన దామ్నాయ మహా తురంగ! శివలింగా !నీలకంఠేశ్వరా!  (ఎర్రా ప్రగడ)


తాను నివశిస్తున్న గుడ్లూరు లోని నీలకంఠేశ్వర స్వామిపై ఎర్రన గారు బాల్యంలో చెప్పిన పద్యం. చాలా జటిలమైన సమాసకల్పనలు ఈ చాటువులో కనిపిస్తాయి. 
ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని అనువదించడానికి బహుశా మహాకవి తిక్కన వెనుకంజ వేశాడు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు.

ఇంకా ఎఱ్ఱన హరివంశమును, రామాయణాన్ని సంస్కృతం నుండి అనువదించి ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణము అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. పురాణం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కధ, విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది.

నన్నయ్య గారి అరణ్యపర్వం లో ఆఖరి పద్యానికి కొనసాగింపుగా ఎర్రన గారు వ్రాసిన మొట్ట మొదటి పద్యం చూడండి....

స్ఫురదరుణాం శురాగరుచి బొంపిరి వోయి నిరస్త నీరదా
వరణ ములై దళత్కమల వైభవ జృంభణ నుల్లసిల్ల ను
ద్ధరతర హంసారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళల జూడగన్

ఇంత ఆహ్లాదంగా శారద రాత్రుల వర్ణనచేసిన ఎర్రన గారు “హరివంశం” లో “శమంతకోపాఖ్యానం” లో వ్రాసిన మరో పద్యంలో భీభత్సాన్ని కూడా అంటే ప్రతిభావంతంగా వర్ణిస్తారు. ఈ పద్య సందర్భం : తనపై వచ్చిన అపవాదు తొలగించుకోవటానికి ప్రసేనుడిని,శమంతకమణి ని వెతుకుతూ వెళ్ళిన శ్రీకృష్ణుడు అరణ్యంలో ప్రసేనుడి కళేబరాన్ని చూసిన దృశ్యం .

బలవచ్ఛింహ చపేట పాటిత తనుప్రభ్రష్ట భూషాంబరా
కులకేశ ప్రకరున్ కరస్ఖలిత ఖడ్గున్ ముక్తపల్యాణ సం
వలిత గ్రీవ వికీర్ణ కేసరి మృగాశ్వప్రాంత సంస్థున్ రజః
కలుష శ్మశ్రుముఖున్ ప్రసేను గనియెన్ గ్రవ్యాద సంవేష్టితున్

మన ఊహకు అందేటట్లు ఈ పద్యంలో ప్రతిపంక్తి ద్వారా ప్రసేనుడికి సింహానికి జరిగిన పోరాట భీభత్సాన్ని, దాని పర్యవసానాన్ని మన కళ్ళకి కట్టినట్లు కవి చెప్పకనే చెప్పటం జరిగింది. చివరలో “గ్రవ్యాద సంవేష్టితున్ “ అనగానే మనకి అతని అంతిమ స్థితిని చూసి ఒక జలదరింపు,జాలి కలుగుతాయి.

కొల్లూరు విజయ శర్మ అక్కయ్య అందించిన పద్యాలు 

స్ఫురదరుణాంశురాగరుచి( బొంపిరి వోయి నిరస్తనీరదా 
వరణములై దళత్కమల వైభవజ్రుంభణ ముల్లసిల్ల ను 
ద్ధురతరహంససారస మధువ్రతనిస్వనముల్ సెలంగగా(
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ( జూడగన్ 

శారద రాత్రులలో నే (వర్ణన లోనే)నన్నయ గారి లేఖిని ఆగిపోయింది. మరి నన్నయ మహాకవి శైలిలో రచనకి అంటే మాటలు కాదు..నన్నయ గారి శైలిలో ప్రారంభించి తిక్కన గారి శైలిలో మేళవించాలి..నిజానికి ఎర్రన గారి కవితామూర్తిమత్వం మహాభారతం లో కంటే హరివంశంలోనే ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకంటే భారతం లో ఆయన నన్నయ,తిక్కన ల శైలిని అనుసరిస్తూనే తన విలక్షణ త చూపవలసి వచ్చింది. ఎంత రమ్యమైన శరత్కాలపు వర్ణన కదా .. అచ్చం నన్నయగారే రాశారా అన్నట్లుగా.. . 

భూతహితంబుగా( బలుకు బొంకును సత్యఫలంబునిచ్చు(ద 
ద్భూతభయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రా 
ణాతురు(డైనచో (బరిణయంబునయందును బల్కుబొంకు స 
త్యాతిశయంబ యండ్రు మహితాత్మక యిట్టివి ధర్మసూక్ష్మముల్ 

నన్నయ గారి శైలినే కాదు.ఽఅయన నానా రుచిరార్ధసూక్తి నిదిత్వాన్ని కూడా స్వంతం చేసుకున్నారా అన్నట్లు ఉంది కదా ఈ పద్యం.. .. సత్యాసత్యాలకి సంబంధించిన ధర్మ సూక్ష్మాలను ఎంత బాగా వివరించారు.



లీలా ప్రసాద్ గారు అందించిన పద్యాలు 

ఎఱ్ఱా ప్రగడ వారి కొన్ని రమ్యమైన పద్యాలు పరికిద్దాం.

** "నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ
ఘనకోటీశ కటీకటీ తటిపటీ గందేభవాటీ పటీ
రనటీ హారికటీ సువర్ణమకుటీ ప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!

( ఇది వారి పేరుతో ప్రచారంలో ఉన్న చాటువు )

భాస్కర రామాయణం :: అయోధ్యా పురవర్ణన:

**చెఱకుందోటల(బెంచి శాలిమయ సుక్షేత్ర స్థలుల్నించియ
క్కఱ లేకుండగ(బూగనాగ లతికా కాంతారము ల్ర్పోచియే
డ్తెఱ నంతం గుముదోత్పలాళివనవాటీకోటి ( బాటించిపె
న్జెఱువుల్ వొల్చె( బురంబు నల్దెసల( బ్రస్ఫీతాంబు పూర్ణ స్థితిన్...

శ్రీ రాముని అయోధ్యా పుర ప్రవేశ సందర్భం::

**నిరుపమమూర్తిరామధరణీపతి శోభనవేళ నాడిర
చ్చరపువు( బబోoడ్లు కిన్నరులు సారెకు ( బాడిరి దేవదుందుభుల్
మొరసెనుధాత్రి సస్యములుమోహనలీలవహించె వృక్షముల్
వరసురభి ప్రసూన ఫలవర్గములన్విలసిల్లె ( నెంతయున్ ...

ఎఱ్ఱా ప్రగడ వారి మరి కొన్ని పద్య రాజాలు ------
పంచ భూతాలు సీత సౌశీల్యాన్ని గురించి చెప్పే పద్యం:

క: "విను ముత్తమురాలు సుమీ
జననాయక! జనకతనయ, సందేహపడం
బనిలేదు, మాకుc దెల్లము
జనులకు మము మొఱcగరాదు సకలక్రియలన్"....
నన్నయ్య గారి హృదయాన్ని ఎంతగా సందింపజేసుకున్నారో చెప్పటానికి ఈ పద్యం ఒక ఉదాహరణ:

మ: పఱచున్ దవ్వుగc జేయలంతి నిలుచుంబట్టీకయాసాసవం
బిఱువోవుం బొదలందు డిందుcబొడమున్ బిట్టుల్కి వేదాcటుcగ్ర
మ్మఱిచూచుంజె విదార్చి నిల్చుమలయున్ మాట్టాడుc గోరాడునే
మఱినట్లుండుc ద్రుణంబు మేయు నెలయుం మాయా మృగంభిమ్మలన్ .....

కథావసరమైన వర్ణనలను కడు రమణీయంగా వర్ణించే స్వాభివికత వారిది. ఈ పద్యంలో భయంతో పరుగెత్తుతున్న లేడిని ఎంతో స్వభావ సుందరంగా వర్ణించారు.

పంపా సరోవర వర్ణన:: రామలక్ష్మణులు చూచిన పంపా సరోవర వర్ణన -----

సీ: కమనీయ కమలినీ కహ్లార దళ కేస 
రాన్విత జలముల నర్ఘ్య విధియుc
దరళతరంగ హస్తములc బాద్వంబు ను
న్మదచక్ర సారస మధుప హంస
రుతలc బ్రియోక్తులు రుచిరవానిరని
వేశనచ్ఛాయల విశ్రమంబు
మందసంచారిత మారుతంబుల నురు
తాపనోదనమును దగిలి యెపుడు

ఆ: నాచరించుచును సమంచితా తిథి జన
సేవనమునc దనరు జేవనంబు
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం
బెదురc గాంచి రన్నరేంద్ర సుతులు ......

ఆ పంపాసరోవరం సతతం అతిథి సత్కారం చేస్తూ తన జీవనం ధన్యమయ్యేట్లు అతిథులకు అర్ఘ్యం సమకూరుస్తూ ఉంటుంది. ఆ అర్ఘ్యంజలం మనోహరములైన తామరల చేతను, ఇంచుక తెలుపు, ఎఱుపురంగు గల రేకులతో శోభిల్లే సౌగంధిక పుష్పాల కింజల్కాలతో పుప్పొడులతో పరమళిస్తూ  ఉంటుంది.ఇక మెరిసే కెరటాలు అనే 'చేతులతో' అతిధులకు కాళ్ళు  కడిగే నీరు. అలాగే చక్రవాకాలు, హంసలు మొదలైన జల పక్షుల  ధ్వనులనే ప్రియోక్తులతో ఆదరిస్తూ ఉంటుంది. తీరాల లోని పొదరిండ్ల నీడలనేవిశ్రామ స్థలాలుగా నిర్దేశిస్తున్నది. మందమారుతాలచే 
తాపశ్రమను తొలగిస్తూ ఉన్నది. ఈ రీతిగా అతిథి సేవయే తన జీవన ధ్యేయంగా ధన్యత కలిగి ఉన్నది. ---------

హరివంశ వైశిష్ట్యం:

ఎఱ్ఱనగారు సంపూర్ణoగా హరివంశాన్ని అనువదించి, పరిపూర్ణ భారతాన్ని తెలుగువారికిచ్చినారు. ఎఱ్ఱనగారి హరివంశం చదువుతుంటే లేకవినిన చాలు పంచభక్ష్య పరమాన్నాలతో  భోoచేసినట్టు కడుపునిండిపోతుంది.శ్రీ కృష్ణుని బాల్యక్రీడల  ప్రతి పద్యo ఒక రేఖాచిత్రంగా గీయదగిందనిపిస్తుంది.

క: "ఏనిక కొదమకరంబున
మానుగ వెలిదమ్మిమొగడమాడ్కిc బొలుచున
ద్దానవరిపు చేతంబొలు
పై నవనీతంపుcగబళ మనుపమ కేళిన్".....

శ్రీ కృష్ణుని చేతిలోని వెన్నముద్దను, ఏనుగు తొండంపై నున్న వెలిదమ్మితో పోల్చటం హృద్యమైన సహజ సుందరమైన పోలిక.** తెలుగు తల్లులు పిల్లలకు ఉగ్గు పెట్టేటప్పుడు ఎన్నెన్ని కష్టాలు పడేవాళ్ళో? కాళ్ళ పై పడుకో పెట్టి, నోట్లో వేలు పెట్టి పసిపిల్లల కడుపులోకికాస్త ఎత్తు పంపాలంటే ఎన్ని ఉపాయాలు వెతుక్కోవాలో? తల్లులకుఎంత సమస్యో? పాపం! యశోదమ్మ కూడా అట్లాంటి అవస్థలే పడ్డది. చూడండి!

క:"చాలcగ నిచ్చెలు వెన్నయుc
బాలుcగుడుకలcగొని తల్లి పట్టికి సెలవిన్
వ్రేలిడి యింతింతియకా
గ్రోలించును వెరవుతోడ రుచిగొలుపుక్రియన్ ....

** కడుపుకు పెట్టాక మూతిజిడ్డు ముఖానికి, శరీరానికి కలయ రుద్దడం అందరి తల్లుల అనుభువంలోనిదే. అదే పని యశోదమ్మ కూడ చేసింది.

తే;గీ: "ముదముతోc గడ్పునకు పెట్టి మూతిజిడ్డు
మోమునకు మేనcజమిరి యమ్ముదితయక్కు
గలయ నిమిరి యేనుగుదిన్న వెలగపండు
నాcగ నొప్పుcగృష్ణుడు సాశ్రునయనుడగుచు".... 

** బలరామ కృష్ణులు ఎనిమిదేళ్ళ వయసులో తన ఈడు గోపాల బాలకులతో కూడి ఆడుతూ, గో పాలనం చేస్తూ వినోదించిన తీరు చూడండి.

తే: "చిరుతకూకట్లు దూలాడc జేతిచల్ది
చిక్కములు సెలగోలలు చెలువుమిగుల
గిఱ్ఱు చెప్పులు దొడినున్న గఱ్ఱితడుపు
లెలమితోcగట్టి చేరువ పొలములందు"....

చ: "వృకములcదోలి యార్చుచును వేడుకcబాడుచుc గూకలిచ్చుచుo
బ్రకటమహీరుగ్రములు ప్రాకుచు జున్నులు రేcచి తేనే గో
పకులకుc బోయుచున్ మధుర భక్తము సేకళులారగించుచున్
సకల మనోజ్ఞ ఖేలనరసంబునc దేలిరి బాలయాదవుల్ "....

నెత్తి మీద చిన్న పాటి జుట్టు గాలికి తూలాడుతుంటే, చేతిలో చల్ది మూటలు,పశువుల్ని మేపే కట్టె పట్టుకొని, కిఱ్ఱు చెప్పులు తొడుక్కొని, సమీపపు పొలాలలోని తోడేళ్ళను తోలి, రొప్పుతూ వేడుకతో పాడుతూ, కేకలేస్తూ,చేతి కబళాల నారగిస్తూ మనోజ్ఞంగా క్రీడాస్ఫూర్తితో 
బాలయాదవులు మునిగి తేలుతున్నారు. ....

పల్లె - ప్రకృతి ----- ఎఱ్ఱనవారి వర్ణన::

సీ: మునివర దత్తార్ఘ్యములc గుశాక్షతముల
దెట్టువల్గట్టిన తీరములను
గుండలి కన్యకాకుచ కుంభకుంకుమ
క్షాళనcగెంపారు సలిలములను
సిద్దసంయమిసమర్చిత సైకతాలింగ
భూషితాగ్రములగు పులినములను
శబరకుటుంబినీ కబరికావనమాల్య
వలితంబులైన శైవాలములను
తే:గీ: నచట నచట నొప్పారు ఫ్రౌఢాబ్జ ముఖియుc
గమ్ర మీనేక్షణ యురధాoగస్తనియును
హంస రుచిరాసలాపయునగచు గ్రాలు
యమునc జూచుచు దవ్వుగా నరగి విభుcడు ....

మునులిచ్చిన అర్ఘ్యాలవల్ల తీరంలో కుశలు-అక్షతలు తెట్టి గట్టి కనిపిస్తున్నాయి. నాగ కన్యకల కుచాలకంటిన కుంకుమను కడగటంచే
ఆ నదీజలాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. సిద్దులు,మునులు సేవించిన సైకత లింగాలతో ఇసుకతిన్నెలు కనిపిస్తున్నాయి. శబరకాంతల తలలో
దాల్చిన వనమాలిల్లో చుట్టబడినట్లుగా నీటినాచు ప్రకాశిస్తోంది. అక్కడక్కడ ఫ్రౌఢాoగనలాగ, కొన్నిచోట్ల మీనాక్షణలాగ, మరికొన్నిచోట్ల
చక్రవాకస్థనిగా, హంసధ్వనితో ప్రకాసించే ఆ యమునను చుచాడుట.

ఆశ్రమ వర్ణన:

సీ:"తరువిట పాసక్త ధౌతవల్కల పంక్తి
కమనీయ తోరణ కల్పనముగ
హూయమానంబులై యొండొండ వెలిగెడు
త్రేతాగ్నులభినవదీపములుగ
దుగ్ధపానమ్ములcద్రుళ్లు పెయ్యల నోరి
నురువులు సితపుష్పవిరచనలుగ
గోరి నీడంబులు నేరెడి ఖగముల
వాసితంబులు జయధ్వానములుగ ....

చెట్లపై ఆరవేసిన ధౌతవస్త్రములు తోరణములుగా, ప్రజ్వలిస్తున్నత్రేతాగ్నులు సంజదీపాలుగా,పాలు త్రాగి గంతులు వేస్తున్న దూడల
నోటి నుండి నురుగులు తెల్లని పూలుగా, గూళ్ళకు చేరుతున్న పక్షుల అరుపులు జయధ్వానాలుగా ఉన్న ఆశ్రమంలోకి
శ్రీకృష్ణుడు ప్రవేసించాడు. ---- పల్లె, ప్రకృతితో సన్నిహిత పరిచయం వున్న 'వారి' హృదయం, ప్రకృతిని మానవీకరించింది.....

*** చ: ప్రమదములుల్ల సిల్లcదను పారcగ నిద్రలు వోయి, పల్మఱుo
గమియనెమర్చి, మేపఱుగcగాcబోరి 'బెండలు వెట్టిలేచి', వ
త్సముల దలంచి పంచితల చన్నులు చే పొదవంగ, బెంపుతో
గొమరుcగcజారు హుంకృతులcగోవుల చెన్ను వహించె మందలన్ ....

'ఉల్లాసంతో పశువులు తనుపారగ నిద్రపోవటం, ఎన్నోసార్లు నెమరు వేయటం, తిన్నమేత అరిగి పెడపెట్టి లేవటం, పంచతిల్లి దూడల్ని
తలచుకొని చన్నులకు చేపటం, అందంగా హుంకరిస్తూ గోవులు ప్రకాశిస్తున్నాయట....
ఇందులో గోవులు పరుండటంమొదలు ప్రొద్దునే దూడలకు  పాలిచ్చే వరకు వాటి చేష్టలనువర్ణించిన విధానం గమనిస్తే  ఎఱ్ఱనగారి పల్లె వాతావరణ విజ్ఞానం ఎంతో గొప్పదో తెలుస్తుంది.....

( ప్రబంధ పరమేశ్వరుని కవితాతత్వ వివేచన -- ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారి - పుస్తకం నుండి సేకరించడమైనది)

1 comment: