Saturday, July 9, 2016

మిస్ కాకండి !!!


మిస్ కాకండి !!!
భావరాజు పద్మిని - 3/7/16

అకారణంగా ఎవరైనా మనపై కురిపించే ప్రేమని, అభిమానాన్నితట్టుకోవడం చాలా కష్టం. మర్చిపోవడం ఇంకా కష్టం. అందుకే చాలామంది, తమ చుట్టూ గిరి గీసుకుని, బంధాలు పెంచుకోవడం ఇష్టంలేనట్లు స్పష్టం చేస్తూ ఉంటారు. కాని, మనమెంత ప్రయత్నించినా, దైవం తన దీవెనలని, ప్రేమని, ఆశీస్సులని, మనకి ఎవరి రూపంలోనైనా అందించాలని అనుకున్నప్పుడు, మనం తప్పించుకోలేము. అలాంటి పరిస్థితే నిన్న నాకు ఎదురైంది.
నెల సరుకులు కొనాలని, బిగ్ బజార్ వెళ్ళాము. మా వారు బిల్ వేయిస్తుంటే, నేను వెనుకవైపున ఉన్న కుర్చీల వద్దకు వెళ్లి, కూర్చున్నాను. పక్కనే పెద్దావిడ ఒళ్లో చిన్న బాబు. ఓ 7 నెలలు ఉంటాయేమో. నన్ను చూడగానే, నోరారా బోసినవ్వు నవ్వేసి, 'తొందరగా ఎత్తుకో' అన్నట్టు, ఓదూకు దూకాడు. నా మొహం మీదనుంచి రెప్ప వాల్చడే. మళ్ళీ నోరారా అదే బోసినవ్వు... మనసు నిండేలా... అలా చిట్టి చేతులతో, నన్ను గట్టిగా హత్తుకుని, అలాగే ఉండిపోయాడు. వాళ్ళ బిల్ అయిపోయి, వాళ్ళమ్మ వచ్చి, వాడిని తీసుకుని వెళ్ళిపోతోంది. దూరంగా వెళ్ళేదాకా, మళ్ళీ అదే చూపు, అదే నవ్వు, ' నన్ను గుర్తుపట్టలేదా...?" అన్నట్టు. మామూలుగానే నాకు చిన్న పిల్లలలంటే ప్రాణం. ఇక వీడి నవ్వు మరీ ముద్దుగా ఉంది.
ఆ ఆనందంలో వాడినే తలచుకుంటూ ఒక్క నిముషం గడిచిందో లేదో, ఓ ముసలావిడ అటుగా వచ్చింది. చాలా సాధారణంగా ఏ నగలూ, ఆభరణాలూ లేకుండా మామూలు చీర కట్టుకుని ఉంది. ఆవిడ కూర్చోబోతూ ఉండగా, పలకరింపుగా నవ్వాను. "వెన్నెల కురిసినట్టు ఎంత చక్కగా నవ్వావు?" అంటూ చనువుగా నా బుగ్గలు లాగింది. "చూడమ్మా, సమస్యలు లేని మనిషంటూ ఉండడు, అలాగని నవ్వడం మానేసి, ప్లాస్టిక్ పువ్వుల్లా ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని తిరుగుతున్నారు అంతా. కాని సహజమైన పువ్వుకి ఉండే పరిమళం, అందం, ప్లాస్టిక్ పూలకి ఉండదుగా! అందుకే నవ్వడం మర్చిపోకూడదు, నీలా నవ్వాలి..." అంది ఆవిడ. నేను "నిజమేనండి," అంటూ మళ్ళీ నవ్వాను. ఈ లోపున ఆవిడ దృష్టి నా మట్టి గాజుల మీద, నాచేతికి ఉన్న గోరింటాకు మీద పడింది. "చాలా బాగుంది, ఇప్పుడు ఇలాగ ఎవరూ వేసుకోవట్లేదు," అంటూ, ఎందుకనో మళ్ళీ మమత ఉప్పొంగి, నా వీపు తట్టి, నా తలమీద చెయ్యి ఉంచి ఆశీర్వదించింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే... ఓసారి గతంలో నా పుట్టినరోజున మాగురూజీ దీవెనల కోసం వెళ్తే, ఆయన సరిగ్గా అలాగే వీపు తట్టి, దీవించారు. నన్ను దీవించడానికి, ఏ సద్గురువులో ఈ రూపంలో వచ్చారేమో, అనుకుని, ఆవిడనే చూస్తూ ఉన్నాను.
                              
కాసేపు అలా కూర్చోగానే, మా బిల్లింగ్ అయిపొయింది. వెళ్తూ, వెళ్తూ వినమ్రంగా నమస్కారం చేసాను. మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం చేస్తున్నాము అంటే, వారిలో మనం దైవాన్ని చూస్తున్నామని అర్ధమట! అందుకు బదులుగా వారు ప్రతినమస్కారం చేస్తే, వారూ మనలో దైవాన్ని చూస్తున్నారని, అర్ధమని, మా గురూజీ చెబుతూ ఉంటారు. అలా నమస్కరిస్తూ వెళ్తుంటే, మరో చిత్రం... ఆవిడా, సరిగ్గా మా గురూజీ లాగే నవ్వుతూ, కల్లార్పి తెరిచింది. ఆశ్చర్యంగా ఇంటికి చేరి చూడగానే... గురూజీ పోస్ట్ ఒకటి కనిపించింది.
"సద్గురువు మీలోనే ఉన్నారు, అన్నింటా, అంతటా ఆయన్ను అనుభూతి చెందగలిగితే, మీరు ఎన్నడూ గురువులను 'మిస్' కారు..." అన్న భావన ధ్వనించేలా. అంతా, సద్గురువుల దయ, అనుగ్రహం... దైవప్రేమ ఈ రూపంలో నిన్న వర్షించింది. చరాచర వస్తువుల్లో ప్రతీదీ దైవమే ! మనం పీల్చే ఊపిరితో సహా ! వారి దీవెనలు ఎప్పుడు ఏ రూపంలో అందుతాయో తెలీదు. ఇవే జీవితంలో అమృతమయమైన క్షణాలు ! మరికొంత కాలానికి సరిపడా మనకి ఉత్తేజాన్ని ఇస్తాయి. మిస్ కాకండి !!!

Wednesday, March 16, 2016

పట్టుదలతో సాధించిన విజయం

“నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, ఎంతో ప్రేమిస్తున్నావు, కాని చెప్పవు. నాకోసం తపిస్తావు, కాని దాన్ని బైటికి చూపించవు. నా దగ్గరికి రావాలనుకుంటావు, నన్ను హత్తుకోవాలి అనుకుంటావు, గుండెల్లో కొలువుండాలని అనుకుంటావు, కాని ఉండవు. కాని నేను, నీలాగా కాదు, “నువ్వంటే నాకు ప్రేమ” అన్న విషయాన్ని చెప్పకుండా నేను అస్సలు బ్రతకలేను.” అంటాడు హీరో హీరొయిన్ తో.
“నీ లాంటి మగవాళ్ళు మా లాంటి ఆడవాళ్ళకు తరతరాలుగా చేసింది ఇదే. కొన్నిసార్లు కడుపులోనే చంపేస్తే, కొన్నిసార్లు పుట్టగానే చంపేసారు. ఇదేమి విచిత్రమైన సంప్రదాయం? అన్నీ మావి, కానీ ఉండేవి మీపేరుతోనేనా?పాపిడి మాది, ఆ పాపిట దిద్దే సింధూరం మీపేరుతో, మెడ మాది మాంగల్యం మీ పేరుతో , చేతులు మావి, గాజులు మీ కోసం వేసుకునేవి. ఇది ఎంతదాకా అంటే, గర్భం నాది, రక్తం నాది, పాలు నావి, పుట్టే బిడ్డ మాత్రం మీ పేరుతో ఉంటుందా ? అన్నీ మీ పేరుతోనే ఉంటాయి. అయితే, నీ దగ్గర నా పేరుతో ఏముందో చెప్పగలవా ?” తనను చంపబోయిన భర్తను నిలదీస్తుంది ఒక భార్య.
సాధారణంగా ఎవరైనా సినిమా చూసినప్పుడు, తెరమీది బొమ్మలే చూస్తారు. కాని నేను, తెరవెనుక ఉన్న అక్షరాల పదును చూస్తాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు మొదట ఆశ్చర్యం కలిగింది. అక్షరం అక్షరం, నటీనటులు పలికే ప్రతీ పదం, సూటిగా ప్రేక్షకుడి మనసుకు ఎక్కుపెట్టిన బాణం ! ఈ సినిమాకు కధ, డైలాగ్ లు ఎవరు రాసుంటారు? ఆద్యంతం ప్రేమను ఒక అద్భుతంగా, సమున్నతంగా చూపిన ఇంతటి ఔన్నత్యం ఉన్న రచయత ఎవరు ? వెంటనే గూగుల్ సెర్చ్ చేసాను. ఆశ్చర్యం ! సినిమాకు కధ రచయత కాదు, రచయిత్రి. ఆమె గురించి మరిన్ని ఇంటర్వ్యూలు , విశేషాలు చదువుతుంటే మరింత ఆశ్చర్యం వేసింది. ఆమె పేరు – షాగుఫ్తా రఫీక్, ఆ చిత్రం పేరు ‘హమారీ అధూరి కహాని’.
బాణం వెనక్కు ఎంత బలంగా లాగి వదిలితే అంత ముందుకు వెళ్తుందట. బంతిని నేలకేసి ఎంత బలంగా కొడితే, అంతే వేగంతో ఎత్తుకు ఎగురుతుందట ! అలాంటిదే షాగుఫ్తా జీవితం. ఆమె తల్లి(పెంచిన తల్లి, ఆమెను ఎక్కడినుంచో తెచ్చుకుని) ఒక గొప్ప కలకత్తా వ్యాపరస్తుడికి “అజ్ఞాత భార్య”. అతను చనిపోతూ ఈ కుటుంబానికి ఏమీ ఇవ్వలేదు. బాలీవుడ్ లో “వాలే నక్షత్రం” లాంటిది వాళ్ళ అక్క జీవితం. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక, నిరాశతో ఉండగా, షాగుఫ్తా బావ తాగిన మత్తులో సరదాకి ఆమెను షూట్ చేసి, చివరికి మత్తు వదిలాకా తన జీవితాన్నీ ముగించుకున్నాడు. అమ్మ, షాగుఫ్తా... పేదరికం, ఆకలి మిగిలారు.
ఫలితం – పదకండేళ్ళ వయసులో ఒంటికి కప్పుకున్న చున్నీ తీసి, నడుముకి కట్టుకుని, ఆమె బార్ డాన్సర్ అయ్యింది. మొదటిసారి – అయినా చాలా డబ్బులు వచ్చాయి. మనిషి పొందే గౌరవాన్ని డబ్బు ఎలా శాసిస్తుందో, అప్పుడే ఆమెకు తెలిసింది. ఆమెకు నాట్యం తెలిసి ఉండడంతో, సుమారు 6 ఏళ్ళ పాటు ‘బార్ డాన్సర్’ గా కొనసాగిన ఆమె, 17 ఏళ్ళ వయసులో ఓ ధనికుడికి సేవికగా వెళ్లి, అతని వద్ద నరకం చూసింది. అతన్నుంచి తప్పించుకునేందుకు ఆమె వేశ్యగా మారాల్సి వచ్చింది.
“అదొక విషవలయం. అతని నుంచి తప్పించుకోడానికి వేశ్యగా మారాను, ఆ వృత్తి నుండి తప్పించుకోడానికి మళ్ళీ బార్ డాన్సర్ గా మారాను, ముంబై నుంచి తప్పించుకోడానికి దుబాయ్ చేరాను, అలా కొనసాగింది.” అంటుంది ఆమె.
నలిగిన మల్లె లాంటి ఈ జీవనం ఆమెలోని రచనా పటిమను ఆమె గుర్తించేలా చేసింది. వేశ్యలు, బార్ డాన్సర్ ల జీవితాలు, ధనికుల, కాముకుల దాహాలు, స్వార్ధం కోసం అమ్మాయిల్ని అమ్మే బ్రోకర్లు, కళ్ళ ముందే దయనీయమైన చావులు... ఎదురైన ప్రతి జీవితాన్ని కధగా రాసింది. మనసును గుచ్చిన ముళ్ళను, గాయపు ఆనవాళ్ళను తనకొక దారి చూపేలా మలుచుకోవాలని అనుకుంది.
భారత్ కు తిరిగి వచ్చాకా, ఎలాగైనా సినిమా రచయిత్రిగా మారాలని అనుకుంది. టీవీ స్టూడియో లు, ప్రొడక్షన్ హౌస్ లు అనేకం తిరిగింది. ఎక్కడా అవకాశం దొరకలేదు. 2000వ సంవత్సరంలో మహేష్ భట్ ను కలిసి ఆయన ప్రొడక్షన్ హౌస్ లో చేరటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 2006లో ‘వొహ్ లమ్హే’ అనే చిత్రానికి తొలిసారిగా తన  37ఏళ్ళ వయసులో స్క్రిప్ట్ రాసింది. అప్పటినుంచి దాదాపు 11 సినిమాలకు పనిచేసింది. అన్నీ దాదాపుగా విజయాలే, చీకటి బ్రతుకుల లోలోపల వెలిగే మనసు దివ్వెలను ప్రతిబింబించే అద్దాలే !
“దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది” అయినా, పీకూ లాంటి చిత్రాల్లో హీరొయిన్లు ఆధునిక భావాలతో ‘నాకు చాలామందితో సంబంధాలు ఉన్నాయి’ అని చెప్పుకుంటూ విజయాలు సాధిస్తున్న ఈ రోజుల్లో... పాత చింతకాయ పచ్చడి లాగా... ఈ మాంగల్యం, భర్త, సెంటిమెంట్లు ఏమిటి? ఇది నిజంగానే అధూరి (అసంపూర్ణ) కధ లాగా ఉంది.” ఒక ప్రముఖ దినపత్రికలో ఈ చిత్రంపై వచ్చిన రివ్యూ ఇది. చదవగానే కాస్త బాధ కలిగించింది నాకు. వారికి ఇలా సమాధానం ఇవ్వాలని అనిపించింది.
“కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది జీవితం విలువ... ఆమె ప్రేమని, పెళ్లిని పొందలేకపోయింది, అందుకే వాటి విలువని ప్రతిబింబించే కధలని రాసింది. కొత్త చిత్రాల్లో ఎన్ని పోకడలు చూపినా... భారతీయ స్త్రీ ఈ నాటికీ భర్తకూ, మాంగల్యానికి దైవానికి ఇచ్చినంత విలువని ఇస్తుంది. ముళ్ళలో గుబాళించే ఆ గులాబి కూడా, ఆ పరిమళాన్నే ఈ సినిమాలో అందించింది.”
కొండంత ప్రేమను కనీసం జీవితంలో ఒక్కసారైనా పొందాకా, ఆ వ్యక్తి ఇక ఆ ప్రేమించినవారిని తలుచుకుంటూ, ఆనందంగా తనను తాను చావుకు అర్పించుకోవచ్చు. దీన్నే క్లైమాక్స్ లో అద్భుతంగా రాసి, హిమేష్ చేత పండింపచేసారు. రెప్ప వెయ్యకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ సినిమా.
“ఇప్పటికీ నన్ను పార్టీలకు, ‘ఆమె బార్ డాన్సర్ అట, ఏ వేషంలో వస్తుందో చూద్దాం,’ అన్న ఉత్సుకతతో పిలుస్తారు, నన్ను చూసాకా నిరాశ చెందుతారు,” అంటుంది షాగుఫ్తా. ఇటువంటి సమయాల్లోనే గతాన్ని నిజాయితిగా చెప్తూ, అదే తన బలానికి మూలమని చెప్పిన ఆమెలో అపవిత్రత ఉందా, లేక ‘అలాంటిదట, ఎలా ఉంటుందో చూద్దాం’ అని ఉత్సాహ పడే వారి కళ్ళలో అపవిత్రత ఉందా అన్న సందేహం కలుగుతుంది. ఎక్కడ పుట్టినా, ఎలా పెరిగినా షాగుఫ్తా లో ప్రవహించేది భారతీయ రక్తం. ఆమె అక్షరం అక్షరంలో ఉన్నది సత్యం. ఆమెకు గురువు జీవితం. అందుకే, ఆమె నిజాయితీతో కూడిన రచనా పటిమతో మున్ముందుకు సాగిపోతోంది. వీలుంటే, ఈ చిత్రాన్ని తప్పక చూడండి.



Thursday, February 11, 2016

ది లైఫ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ

 ది లైఫ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ
--------------------------
భావరాజు పద్మిని - 11/3/16

ఒక్కమాటలో చెప్పమంటే - సెలబ్రిటీ జీవితం అంటే - త్యాగం అంటాను నేను. అదేంటి? అంటారా. అయితే, ఈ పూర్తి వ్యాసాన్ని చదవాల్సిందే !

"వాడికేంట్రా బాబూ, పెట్టి పుట్టాడు, అడుగు తీస్తే కారు, అడుగేస్తే పనివాళ్ళు," అని తేలిగ్గా అనేస్తాము. కాని, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సెలబ్రిటిలలో దాదాపు 70% మంది స్వయం కృషితో పైకి వచ్చిన వారే. మిగతా వారు తాతలు, తండ్రుల పరపతి, పలుకుబడితో పైకొస్తారు. అయితే వీరి పునాదులు గట్టిగా ఉండవు కనుక, వీరు తాత్కాలికంగా పేరుప్రతిష్ఠలు పొందినా, చాలా మంది దాన్ని నిలుపుకోలేరు. అడుగులో అడుగు వేసుకుంటూ, ముందూ-వెనుకా చూసుకుంటూ నడిచేవారు, దారి తప్పినా, నడిచే సత్తా తనలో ఉంది కనుక మళ్లీ సర్దుకుంటారు. కాని గాడ్ ఫాదర్ ల గొడుగు క్రింద నడిచేవారు, మధ్యలో వదిలేస్తే తికమకపడతారు కదా. అలాగే ఇదీను.

స్వయం కృషితో పైకొచ్చిన ఏ సెలబ్రిటీ అయినా ముందుగా ఆర్జించేది... నలుగురి కళ్ళల్లో అభిమానం. కళ్ళతో మొదలయ్యే ఆ అభిమానం, క్రమంగా మనసుల్లోకి ప్రాకుతుంది. వారికోసం ఇతరులు ఏ పనైనా చేసేందుకు సిద్ధపడేలా చేస్తుంది. ఆ స్థితిలో మనిషి పొందినది, బహుశా ఈ ప్రపంచంలోనే అమూల్యమైన పెన్నిధి - ఇతరుల మనసులో తనకు కాస్తంత చోటు.

ఇక్కడే, ఈ స్ధాయికి చేరాకే మరో గొప్ప చిక్కు మొదలవుతుంది... ఈ ప్రేమాభిమానాల రుచి అన్నది ఒక్కసారి చూసాకా, ఇక ఎన్ని విలాసాలు వరించినా రుచించవు. నా కోసం, నా మాట కోసం, నా అక్షరాల కోసం, నా చిన్న చిరునవ్వు కోసం, కను సైగ కోసం, కొన్ని వేల మనసులు తపిస్తుంటాయి... అన్న భావన, ఆ వ్యక్తిని నిలువనివ్వదు. ఎక్కడో మారుమూల ఉన్న గుర్తుతెలియని ఆ అభిమాని కోసం ఏదైనా చెయ్యాలి, అన్న తపన ఆ సెలబ్రిటీని దహిస్తుంది. ఆశ్చర్యం ... అదే తపన చివరికి వారిని నిద్రాహారాలు సైతం మాని, అహర్నిశలు కృషి చేసేలా చేస్తుంది. వారు చెయ్యలేనిది ఏదో తాను  చెయ్యగలనన్న వారి నమ్మకం కోసం, ఎంతకైనా తెగించాలని అనిపిస్తుంది. వారు తనలో అభిమానించే ఆ కళను వారికి అందించి, మెప్పించాకా... ఇక అంతులేని  తృప్తి స్వంతమవుతుంది. 

అయితే, ఇక్కడే కొంతమంది సెలబ్రిటీలు అనుకున్నవి ఫలించక, నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది సరికాదు. " చచ్చేంత ధైర్యం ఉన్నవారు, అదే ధైర్యాన్ని ఆయుధంగా పెడితే, నిరంతర ప్రయత్నం చేస్తుంటే , ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరని " గుర్తుంచుకోవాలి. నిరాశలో ఉన్నప్పుడు, సేవా మార్గానికి కొన్నాళ్ళు దారి మార్చుకుంటే, దైవం ఇతరుల కంటే తనకిచ్చిన వరాలను గుర్తించి, బ్రతుకు విలువను తెలుసుకుని, మళ్ళీ ఉత్తేజం పొందుతారు.

ఇలా ఇతరుల ఆనందం కోసం నిద్రాహారాలు, కుటుంబం, వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ, తన చుట్టలతో బంధువులతో మాట్లాడే తీరిక వేళలు, ఎండ, చలి తట్టుకుని, ఇష్టమైనవన్నీ వదులుకుని, విశ్రాంతి, విరామం లేకుండా పని చెయ్యడం అనేది ఒక రకంగా త్యాగం కాదంటారా? అలా నిత్యం పరిశ్రమించే ప్రతి ఒక్క సెలబ్రిటీకి నా సలాం. 

" నీకోసం నువ్వు బ్రతికితే అది జంతు జీవనం,

ఇతరుల కోసం బ్రతికితే, అది మానవ జీవనం,

ఇతరులకోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యటమే దివ్యత్వం " అన్న గురుదేవుల వాక్కులు యెంత సత్యమో కదా !

కాబట్టి, ఒకరకంగా ఇటువంటి  త్యాగం చేస్తున్న ఈ  సెలబ్రిటీల జీవన విధానంలో దివ్యత్వం ఉంటుంది. ఈ సారి ఇటువంటి వారిని చూసినప్పుడు, వారి కళ్ళు మీ చూపుల్లోని ఆరాధన కోసం, 'నేను మీ అభిమానిని అండి', అని వారి చెవులు మీరు చెప్పే చిన్నమాటకోసం తపిస్తూ ఉంటాయని, గుర్తుంచుకుంటారు కదూ. కళామతల్లికి ఇదే మనమిచ్చే సిసలైన నీరాజనం.


Thursday, January 21, 2016

అహోబిల సార్వభౌమా

ఇవాళ అహోబిల వాసుడు అనుగ్రహించిన పద్యం.

వసంత తిలక ఛందస్సు :
శ్రీగోమినీశ/ నిజచిన్మయ/క్రోడరూపా
రాగానులోల/ శ్రికరంజన/ యుగ్రజ్వాలా
వాగీశవంద్య/ జనపావన /భర్గపూజ్యా
యోగానురక్త/ శ్రియహోబిల/ సార్వభౌమా



పద్య విశేషాలు : గోమిని -లక్ష్మి(మాలోల నృసింహ స్వామి), క్రోడరూప(వరాహ నృసింహ స్వామి), రాగానులోల( ఛత్రవట నృసింహ స్వామి ), శ్రికరంజన (కారంజ నృసింహ స్వామి), ఉగ్రజ్వాలా(జ్వాలా నృసింహస్వామి), జనపావన (పావన నృసింహస్వామి), భర్గపూజ్యా - పరశురాముడి చేత పూజింపబడిన భార్గవ నృసింహ స్వామి, యోగానురక్త - యోగానంద నృసింహస్వామి, అహోబిల సార్వభౌమా - అహోబిల నృసింహ స్వామి.
పద్య విశేషాల కంటే, ఈ పద్యం పుట్టుక గురించి కాస్త చెప్పుకోవాలి. ఈ సారి గురూజీ నిర్వహిస్తున్న మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా నృసింహ స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించింది. ఒక రోజున మాలోల నృసింహస్వామి వరకూ వెళ్ళినా, జ్వాలా వెళ్ళే అదృష్టం దక్కలేదు. మర్నాడు పిల్లలతో వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా చూడాలని ఉందని మా వారితో అన్నాను. 'పిల్లలతో కష్టం' అన్నారు. పిల్లలూ వెళ్దామని మారాం చేసారు. నేనూ బుంగమూతి పెట్టేసాను. మావారు, 'సరే పదండి' అంటూ బయల్దేరారు.
ఎప్పుడూ, ఏ.సి లేక హీటర్ లో బ్రతికే నా ఇంక్యుబేటర్ కోళ్ళు (పిల్లలు), ఎలాగో నడుస్తున్నాయి. చేతిలో కర్రలు, ముందు రాళ్ళు, రప్పలు తప్ప దారి లేదు. అలాగే సెలయేరు మధ్యనుంచి నడుస్తూ, రాళ్ళపైనుంచి పాకుతూ, ముందున్న వారిని అనుసరిస్తూ వెళ్ళసాగాము. కాసేపటికి ఓ బ్రిడ్జి, పక్కన మెట్లు వచ్చాయి. మెట్లు ఎక్కుతూ, ఆ కొండల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, జ్వాలానృసింహ స్వామి కొండపై ఉన్న అమృతతుల్యమైన భవనాశిని జలపాతంలో నీటిని త్రాగి, ఆడి పాడుతూ ఉండగా, 'ఈ సువిశాలమైన అహోబిలం అనే సామ్రాజ్యానికి రారాజు ఆ స్వామే కదా, అనిపించింది. అనిపించగానే, వెనువెంటనే - అహోబిల సార్వభౌమా అన్న మకుటం స్ఫురించింది. 'ఎప్పటినుంచో శతకం రాస్తానని, గోల పెడుతున్నావ్ కదా, ఓ చండీరాణి, ఈ మకుటంతో రాయి,' అన్న ఆజ్ఞ వినవచ్చింది. నేనలా స్వామితో మనసుతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నన్ను, నేను ఆయన్ను ఆటపట్టించుకుంటూ ఉంటాము. అసలు నిజమైన భక్తిలో ఆ మాత్రం చనువు ఉండాలట !
సరే, స్వామి మకుటం చెప్పారు. నేనా ఛందస్సు అనే సముద్రంలో పిల్ల చేపను. ఈ మకుటం ఏ ఛందస్సుకు సరిపోతే, అందులోనే పద్యాలు రాస్తాను, అని నిశ్చయించుకున్నాను. ఈ లోగా రేడియోలో 'మన దేవాలయాలు' అనే కార్యక్రమానికి అహోబిలం గురించి చెప్తుండగా, ఆహోబిలాన్ని దర్శించిన ఇదే మకుటంతో తిరుమంగై అనే ఒక తమిళ ఆళ్వారు 'నాలాయిర దివ్య ప్రబంధం' లో పది పాశురాలు రచించారని తెలుసుకుని, ఆశ్చర్యపోయాను. ఇక ఛందస్సు పుస్తకం ముందేసుకుని, ఈ అహోబిల సార్వభౌమా అనే మకుటం ఏ ఛందస్సుకు సరిపోతుందో చూసాను. అదే - వసంత తిలక. పేరు గొప్పగా ఉంది కదూ, ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని తొలి పద్యాలు అన్నీ ఇదే ఛందస్సులో రాయబడ్డాయి. ఇది రీసెర్చ్ లో తెలిసింది. పేరు యెంత బాగుందో, ఛందస్సు కూడా అంత బాగుంది, నాకైతే భలేగా నచ్చింది.
కాని ఈ పద్యం రాసేందుకు పడ్డ తిప్పలున్నాయి చూసారూ... ఒక్క పద్యం స్వామి పాదాల దగ్గర పెట్టేసి, 'స్వామి, ఇదే శతకం అనుకోండి,' అని పారిపోయేంత కష్టం ఉంది. అదీ, నాలాంటి పిల్ల చేపకి - ఎందుకంటే - ఈ ఛందస్సులో 8/11 వ అక్షరం యతి. నన్నయ్య 8 వాడారు, వెంకటేశ్వర సుప్రభాతంలో 11 వ అక్షరం వాడారు. పెద్దల్ని కనుక్కుంటే, ఈ సుప్రభాతం సంస్కృతంలో ఉంది కనుక, 8 తో జతకట్టమన్నారు. ఇక్కడ మొదలైంది అసలు తిరకాసు. అహోబిల లో హో - అనే అక్షరానికి సరిపోయేలా ముందు పదం తయారు చేసుకోవాలి, తర్వాత ఆ పదం ప్రాసని బట్టి, పై పాదాల యతులు, ప్రాసలు. హో - అనే అక్షరానికి యో, యూ,హూ,హో(ఈ ఛందస్సులో తోలి అక్షరం గురువు కనుక) మాత్రమే సరిపోతాయి. యో, యూ,హూ,హో - వీటితో పదాలా , ఉన్నా ఎన్నుంటాయి, శతకం అవుతుందా లేదా ? హ. హ హ ... అని ఓ వెర్రి నవ్వు నవ్వడం తప్ప, నాకూ తెలీదు. సస్పెన్స్, ఈ దేవుడితో ఎప్పుడూ ఇంతే లెండి.
హా, హా , హూ, హూ - అనే గంధర్వుల గానాన్ని మెచ్చి వారికి శాపవిమోచనం కలిగించిన ఛత్రవట నరసింహ స్వామీ - మీరే కాస్త కనికరించి, ఎలా శతకం రాయిస్తారో రాయించుకోండి. యతి 11 తో అడ్జస్ట్ అవమంటారా లేక మకుటం మార్చేసి, ఆటవెలదితో ఆడుతూ, పాడుతూ ప్రొసీడ్ ఐపోమంటారా తర్వాత మనం మనం ఒక ఒప్పందానికి ఒద్దామే. 'నృసింహ స్వామిని వదలద్దు' అని గురూజీ ఈసారి చెప్పారు. పద్యం కుదరనంతసేపూ, స్వామిని తలచుకునే ఛాన్స్ దక్కుతుంది కదా ! ఇదీ మంచిదే కదా. " మేజిక్ బెగన్స్ వేర్ లాజిక్ ఎండ్స్'
తరవాయి భాగం దైవ నిర్ణయం మరి. జయజయ నృసింహ.

స్వామి గతంలో అనుగ్రహించిన ఈ పాటను వినండి.

Friday, January 8, 2016

కాగులో నీళ్ళు

ఇక్కడ గత ఏడాది ఉన్నంత చలి లేదు. అయినా, ఉదయం పాపను స్కూల్ కి దింపేందుకు వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ వేసుకున్న చలిమంట వద్ద కూర్చున్నాము. మమ్మల్ని చూసి, అతను మర్యాదతో కూడిన మొహమాటంతో పక్కకి తప్పుకున్నాడు. ఇక నా ఆగడాలు మొదలు. పక్కనున్న ఎండుటాకులు, కట్టె పుల్లలు, మంటలో వేస్తూ ఆడుకుంటుంటే, మా అమ్మాయి,"ఏంటమ్మా ? చెయ్యి కాలుతుంది కదా ?" అంది. వెంటనే నేను ఓ 32 ఏళ్ళు వెనక్కి దూకి, నీ వయసులో నేనూ... అంటూ మొదలుపెట్టాను.

"మా చిన్నప్పుడు గీజర్లు లేవే. ఇలాగే మంట మీద నీళ్ళు కాచుకుని, పోసుకునేవాళ్ళం. అసలు స్టవ్ కూడా లేదు తెల్సా, వంట కూడా ఇలాగే చేసేవారు." అని చెబుతుండగా, దాని స్కూల్ బస్సు వచ్చి, అది వెళ్ళిపోయింది. నేను మాత్రం అలాగే జ్ఞాపకాల్లో ఉండిపోయాను.

ఏడాది అంతా చెట్లూ, చేమల నుంచి రాలిన పుల్లలు, కొట్టేసిన కొబ్బరి మట్టలు, ఎండుటాకులు, ఒలిచిన కొబ్బరి చితుకులు, కొబ్బరి చిప్పలు, పిడకలు, అన్నీ ఒక చోట పోగేసి, పెట్టేవాళ్ళు. ఇక అమ్మమ్మలు, బామ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఒకటే సూత్రం చెప్పేవారు. 'కాచుకున్న వాళ్ళవే వేన్నీళ్ళు.'

ఒక కాగు నిండా నీళ్ళు పోసి, ఒక విసనకర్ర ఇచ్చి, పక్కన దహన సామాగ్రి పెట్టి, మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టేవారు. ఒక పావుగంటలో నీళ్ళు కాచాలి అన్నమాట. కాని, మా మర్కట మంద ఊరికే ఉంటుందా ? కాగితాలు, ఆకులు, జడపిన్నులు, గుడ్డ ముక్కలు, అన్నీ తెచ్చి, అందులో వేస్తూ, నానా హడావిడి చేసేసరికి మంట ఆరిపోయేది. మళ్ళీ పెద్దవాళ్ళని తెచ్చి, వెలిగించి, కూర్చున్నాకా, ఇంకాసేపటికి, కాగులో నీళ్ళు పొయ్యిలో ఒలికిపోయి మళ్ళీ పొయ్యి ఆరిపోయేది. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చుట్టూ ఉన్న 5-6 మంది పిల్లలు, శరవేగంతో పోటీలు పడుతూ విసనకర్రలు ఝులిపించగానే, మళ్ళీ వెలగబోతున్న మంట కాస్త, ఆరి కూర్చునేది.  ఇలా ఒక గంట పాటు ట్రయిల్ అండ్ ఎర్రర్ పధ్ధతి కొనసాగాకా, కాస్త గోరువెచ్చగా నీళ్ళు కాగేవి అన్నమాట.

ఆ తర్వాత, బాయిలర్లు వచ్చాయి. ఆ గొట్టం మధ్యలో, దాని ముక్కుకి ఊపిరాడకుండా, చితుకులు కూరేస్తే, మండలేక ఆరిపోయేది. అప్పుడు కింద ఉన్న జల్లెడ లాంటి ప్లేట్ లాగి, చితుకులు బయటికి లాగి, మాకో మొట్టికాయ బహుమతిగా ఇచ్చి, వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇదంతా ఒక సందడి, ఒక సరదా. మగ్ తో వయ్యారంగా స్నానం చేసామా ? ఏకంగా గంగాళంలోకి దిగిపోయేవాళ్ళం. మా ఇళ్ళల్లో పిల్లల కోసం నేల మీద కాకుండా, గోడల మీద, చెట్ల మీద వెతుక్కునేవారు. మేము చాలా మంచి పిల్లలం అని మీరు నమ్మి తీరాలి మరి.


ఈ తరానికి ఇన్ని జ్ఞాపకాలేవి, ఇంత సమయం ఏది ? లేస్తే, ప్రతి పనికి ఒక స్విచ్, బటన్, అందుబాటులో ఉంటుంది కదా. ఎంతైనా, ఈ గాడ్జెట్ యుగం కంటే, ఏమీ లేనప్పుడు - ప్రకృతితో, మనుషులతో ఒక అనుబంధం కలిగిఉన్నప్పుడు గడిపిన  నా బాల్యం, నా జ్ఞాపకాలే గొప్పగా అనిపిస్తాయి. మీకూ ఇటువంటి అనుభూతులు ఉన్నాయా మరి ?


Wednesday, October 7, 2015

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం
-------------------------------------------------------------------
భావరాజు పద్మిని - 7/10/15 


"రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నాము గురూజీ. మా వారికి ఎప్పటినుంచో కేదారనాథ్ చూడాలని ఉంది. కాని ఒకప్రక్క పిల్లలు, ఒకప్రక్క పెద్దవాళ్ళతో వెళ్ళటం వీలుపడట్లేదు." అన్న సందేశం పంపించాను మా గురువుగారికి. 
బదులుగా చిన్న స్మైలీ వచ్చింది, అంతే. కాని, కనిపించిన ఆ స్మైలీ వెనుక, కనిపించని ఆయన అనుగ్రహం వర్షించడంతో, ఆ క్షణానే మా కేదారనాథ్ యాత్రకు, అన్నీ ఏర్పాటు అయిపోయాయి. క్షణాల్లో అసాధ్యాలని సుసాధ్యం చెయ్యగల ఆ కరుణామూర్తి దయ యెంత అపారమైనదో, నా చిన్ని బుర్రకు అప్పుడు తెలియలేదు.

మర్నాడు అమ్మా, నాన్నగారు, అత్తయ్యగారు, ఇద్దరు పిల్లలు, నేను, మా వారు అంతా కలిసి హరిద్వార్, రిషికేశ్ బయలుదేరాము. రాత్రికి హరిద్వార్ లోని  అవదేశానందగిరి స్వామి వారి ఆశ్రమంలో ముందుగా బుక్ చేసిన రూమ్స్ లో విడిది చేసాము. మేము వెళ్ళిన సమయానికి స్వామిజి అక్కడ లేకపోయినా, శిష్యులు చక్కగా అన్నీ ఏర్పాటు చేసారు. ఆశ్రమంలో ఉన్నవారికి ఉచితంగా భోజనం, అల్పాహార సదుపాయాలు అందించడం వారి ప్రత్యేకత. చక్కటి ఆశ్రమ వాతావరణం మమ్మల్ని ఆహ్లాద పరిస్తే, ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న 150 ఏళ్ళ చరిత్ర గల శివ పంచాయతనం కలిగిన మృత్యుంజయ ఆలయం, స్వామీజీ ఉండే గదిలో ప్రతిష్టించిన అతి పెద్ద పాదరస లింగం, రుద్రాక్ష చెట్టు చుట్టూ ప్రదక్షిణకు అనువుగా ప్రతిష్ట చేసిన శివలింగాలు మాలో భక్తిప్రపత్తులను ఇనుమడింపచేసాయి. మర్నాడు ఉదయమే, గంగా స్నానం, హరిద్వార్ లోని 'హరి కీ పౌడి' దర్శనానికి వెళ్ళాము.



మరకత మణుల ప్రవాహంలా ఆ గంగమ్మది ఏమి రంగో, ఏమి పొంగో. ఆ వేగం, వడి, స్వచ్చత చూసి, ఉప్పొంగిన కవి హృదయాలే వర్ణించడానికి పదాలు వెతుక్కుని, ... 'ఉత్తుంగ తరంగ రంగ...' అంటూ రాసారేమో. స్నానాలు, మా భావరాజు కుటుంబసభ్యుల (మొత్తం సుమారు 500 మంది పైనే ) క్షేమాన్ని కాంక్షిస్తూ, పితృదేవతలను స్మరించుకుని, తర్పణాలు వదిలాకా, దర్శనాలు ముగించుకుని, విడిదికి చేరాము. సాయంత్రం రిషికేశ్ చూసేందుకు వెళ్తూ ఉండగా, మా వారు మళ్ళీ ' నాకు కేదారనాథ్ చూడాలని ఉంది. అసలు ఈ జన్మకు అవుతుందో లేదో, ఇప్పుడే 40 లలో పడ్డాము. ఆనక ఓపిక ఉంటుందో లేదో!' అని మొదలుపెట్టారు. మే లో కాశికి వెళ్లి వచ్చాకా, ఆయనకు కేదారనాథ్ వెళ్లాలని, బలమైన సంకల్పం కలిగింది. అప్పటినుంచి ఆయన ఇలా అనటం బహుశా 30 వ సారేమో ! 

"ఒక్కరోజులో వెళ్లి రాలేమా ? కావలిస్తే, మనం అర్ధరాత్రే బయలుదేరదాము." అడిగాను నేను.

"ఇక్కడినుంచి 6 గంటలు (సుమారు ౩౦౦ కి.మీ ) గుప్త కాశి, లేక ఫాటా వెళ్తే, హెలికాప్టర్ ఉంటుంది. అందులో కేదారనాథ్ కు 10 నిముషాలు ప్రయాణం. ట్రై చెయ్యచ్చు, కాని, హెలికాప్టర్ దొరుకుతుందో లేదో, తీరా అంత దూరం వెళ్ళాకా లేకపోతే, మనం నిరాశగా వెనుదిరగాలి. అయినా, ఇప్పుడు 6 గం.కావస్తోంది, రేపు ఉదయాన్నే వెళ్ళాలంటే, ఎన్నో ఆలోచించాలి." అన్నారు మావారు. 

"ట్రై చెయ్యండి, ఆపై దైవానుగ్రహం." అన్నాను నేను. మా అమ్మా, నాన్నగారు 'పిల్లల్ని మేము చూస్తాము, హాయిగా వెళ్లి రండి' అన్నారు. వెంటనే మావారు కేదారనాథ్ స్వస్థలమైన వారి సహోద్యోగితో మాట్లాడారు. మెరుపు వేగంతో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మామూలుగా కొండ దారుల్లో అప్పుడప్పుడు జలపాతాల పారే నీటివల్ల రోడ్డు పాడయ్యి, ట్రాఫిక్ జాంలు అవుతూ ఉంటాయి. అందుకని, ఒక్కరోజులో  కేదారనాథ్ వెళ్లి రావటం (600km మొత్తం) అంటే కష్టమేమో నని, చీకటి పడ్డాకా, కొండదారుల్లో ప్రయాణానికి అనుమతించక ఆపేస్తారని, రాత్రి ఉండాల్సి వస్తే, అందుకు వీలుగా ఒక్కరోజుకు సరిపడా బట్టలు పెట్టుకోమనీ, వారు చెప్పారు. 

రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝూలా, ఆలయాలు చూసి, రాత్రి 9 కల్లా, ఉదయం 4 గం. లకు మమ్మల్ని ఫాటా దాకా చేర్చాల్సిన వాహనం ముందుగానే ఆశ్రమానికి వచ్చి చేరింది. అప్పుడు పట్టుకుంది మావారికి భయం. స్వతహాగా తను భయస్తులు. కాని, కేదారనాథ్ చూడాలని కొండంత ఆశ. "పోనీ మానేద్దాం.. నాకు ఎందుకో భయమేస్తోంది." అన్నారు తను. 'మళ్ళీ ఇటువంటి అవకాశం మన జీవితంలో వస్తుందో లేదో, వెళ్ళాల్సిందే ' అంటూ నేను ఒప్పుకోక , స్కూల్ కు వెళ్ళను అని మొరాయిస్తున్న పసి పిల్లవాడిని చెవి పట్టుకు తీసుకెళ్ళే తల్లిలా ఆయన్ని తయారుచేసి, కారులో కూర్చోపెట్టి, తన ఒళ్ళో తలపెట్టుకు హాయిగా పడుకున్నా. ఆయన అలాగే చూస్తూ కూర్చున్నారు. కొండదారులు, చీకటి, ఘాట్. ఓ రెండు గంటల తర్వాత నేను నిద్ర లేచాకా నా చెయ్యి పట్టుకు కూర్చున్నారు.

'హిమగిరి సొగసులు' అన్న పాటను గుర్తుచేసేలా ఉన్నాయి పరిసరాలు. మాతో గంగమ్మ ౩౦౦ కి.మీ మేరా ప్రయాణించింది. నదీ గమనాన్ని బట్టి, రోడ్లు వేస్తారా అనిపించింది. దేవప్రయాగలో భాగీరధి, అలకనంద సంగమం, రుద్ర ప్రయాగ లో అలకనంద, మందాకినీ, కర్నప్రయాగలో సరస్వతి, భాగీరధి నదులు కలుస్తాయట. ఇవన్నీ కలిసి, గంగగా హరిద్వార్ కు వస్తాయి. రుద్రప్రయాగ, దేవప్రయాగ లోని సంగమాలు చూసాము. కేదారనాథ్ లో నివసించే మావారి సహోద్యోగి బంధువు, మాకు హెలికాప్టర్ ఏర్పాటు చేసారు, మేము దిగేసరికి అక్కడ సిద్ధంగా ఉంటానని ఫోన్ చేసారు. వారు అక్కడ పండా (పూజారి)గా తరతరాలుగా ఉన్నారు. కాసేపట్లో ఫాటా చేరుకుంటాము అనగా, జరిగిందొక అద్భుతం !

ముందు నాకళ్ళు చూసేది నమ్మలేదు. ఏదో హెలికాప్టర్ ఏమో అనుకున్నాను. కాస్త దగ్గరికి వచ్చాకా తెలిసింది, సుమారు ఐదడుగుల వెడల్పు ఉన్న అతి పెద్ద గరుడ పక్షి, రెక్కలు బారజాపి, మావైపే వచ్చింది. గోధుమ, బ్రౌన్ రంగులు కలగలిపి, యెంత మనోజ్ఞంగా ఉందో ! దానివేనుకే, అటువంటి మరో పక్షి. ఆశ్చర్యంతో నేను తేరుకుని, ఫోటో తీద్దాము, అనుకునే లోపే , వెనుదిరిగి, కొండల్లోకి మాయమయ్యాయి. 




సాధారణంగా గరుడ పక్షుల దర్శనం దుర్లభం. అలా కనిపిస్తే, అది చాలా మంచి శకునమని, పాపాలు అన్నీ పటాపంచలు చేస్తుందని, మింటనున్న దేవతల ఆశీర్వాదం తీసుకువస్తుందని, ఒక నమ్మకం. అటువంటిది... రెండు గరుడ పక్షులను మావైపే ఎగురుతూ వచ్చి, మమ్మల్ని పలకరించి వెళ్లినట్టు చూడడం ఒక మరపురాని అద్భుతం ! నిశ్చయంగా మా దంపతులపై ప్రసరించిన శివానుగ్రహం.

ఫాటా కాసేపట్లో చేరుకుంటాము అనగా, దూరాన కనిపిస్తున్న మంచు కొండలు మాకు కనువిందు చేసాయి. అక్కడికి వెళ్ళగానే, దిగిన పావుగంటలో, హెలికాప్టర్ సిద్ధంగా ఉంది.  విమానాప్రయాణం అలవాటే అయినా, చలిగా ఉన్నప్పుడు, 'ఏమే, ఆ ఫ్యాన్ తగ్గించు, హెలికాప్టర్ కింద పడుకున్నట్టు ఉంది,' అనటం తప్ప, ఎప్పుడూ హెలికాప్టర్ ఎక్కలేదు. సూర్యకిరణాలకు మెరుస్తున్న తళతళ లాడే గుండుతో పైలట్ గారు రంగ ప్రవేశం చేసారు, ఇదో గమ్మత్తు. "ఎక్కడుంటారు?" అన్నారు రాగానే. "చండీగర్" అన్నాము మేము. "ఆహా, నేను పంచకుల లో ఉంటా" అన్నాడు అతను. "మేమూ అక్కడే, సెక్టార్ -20 లో " అన్నారు మావారు. "హబ్బ, నేనూ అక్కడే, " అన్నాడు అతను. "మా ఫ్లాట్స్ లోనే అని కూడా అనకండి, "అన్నాము ఇద్దరమూ నవ్వుతూ. "లేదండి, మీకు దగ్గరలో ఉన్న ఆర్మీ సొసైటీ లో ఉంటాను, ఎప్పుడైనా కలుద్దాము,"అన్నారు ఆయన కూడా మాతో నవ్వుతూ.

  ప్రత్యేక కోటాలో బయలుదేరినట్టు, మేము ఇద్దరం, ఒక పైలట్ మాత్రమే హెలికాప్టర్ లో బయలుదేరాము. ఆ సమయంలో వేరే ప్రయాణికులు లేకపోవడం ఇంకో చిత్రం. బడాబడా హెలికాప్టర్ చప్పుడు చేస్తున్నా, నాకు అసలు భయం అన్నది లేకపోవడంతో, గురుస్మరణతో  ప్రయాణం ఆస్వాదించసాగాను. త్రోవ పొడవునా పైలట్, ప్రక్కనే కూర్చున్న నాకు కేదారనాథ్ కు వెళ్ళే కాలిబాటను చూపారు. అసలు భక్తి అంటే, కొండలూ, గుట్టలూ నడకతో,గుర్రాలపై 14 km ప్రయాణించి, నానాకష్టాలు పడి, శివదర్శనం చేసుకునే వారిదే కదా, అనిపించింది. ఇలా 3 నిముషాలు వెళ్ళగానే, "ఓహ్..!!!" కళ్ళముందు మరో అద్భుతం.



గురువు మీద గురి ఉంటే... గాల్లో తేలచ్చు, అద్భుతాలు చూడచ్చు, చెయ్యచ్చు, మనసారా జీవితాన్ని ఆస్వాదించవచ్చు, అనిపించింది, ఆ క్షణం ! మంచుకొండల మధ్య కైలాశ శిఖరంలా, కళ్ళముందు సాక్షాత్కరించిన భూలోక కైలాశం లాగా, దూరాన కేదారనాథ్ ఆలయం కనిపించింది. మనసు ఆనందంతో ఉప్పొంగింది. సరిగ్గా 10 వ నిముషంలో మేము అక్కడ దిగగానే, పూజారి మమ్మల్ని వచ్చి కలిసారు. మమ్మల్ని గుడి వంక తీసుకు వెళ్ళారు.

విలయానికి మౌనసాక్షిలా మిగిలిన ఆ ఆలయంలో ఎనలేని ప్రశాంతత, అద్భుతమైన శక్తి తరంగాలు. నా ఒళ్ళు దివ్యశక్తి తరంగాలతో ఊగిపోయేలా ఉంది. ఒక ప్రక్క గణపతి రూపులా, మరోప్రక్క అమ్మవారి శ్రీచక్రంలా, మరోప్రక్క శివలింగంలా అనిపిస్తూ, శివ పరివారాన్ని మొత్తంగా ప్రతిబింబించేలా ఉంటుంది కేదారేశ్వర జ్యోతిర్లింగం. పూజాసామాగ్రి తీసుకుని, ఆలయంలోకి వెళ్ళాకా, ఒక ప్రక్కగా కూర్చుని, సుమారు 15 నిముషాల పాటు అభిషేకం చేసుకున్నాము. మా పూజ పూర్తి అయ్యేదాకా, గర్భగుడిలో జనం అట్టే లేరు. మా పూజ అవ్వగానే, బిలబిల మంటూ వచ్చిన జనసందోహంతో కనీసం నిల్చునే స్థలం కూడా లేకుండా అయిపొయింది. ఇదొక విచిత్రం మాకు.

బయటికి వచ్చాకా, మా పూజాపాత్రలో ఉన్న సామాగ్రి చూస్తే, అందులో ఉన్న బ్రహ్మ కమలం అచ్చంగా గణపతి రూపులా అనిపించింది. గుడి వెనుక భాగంలో ఉన్న 'దివ్య శిల' ను చూపించారు పూజారి గారు. 2012 లో వరదలు వచ్చే ముందు, పైన ఉన్న చెరువు గట్టు తెగి, వరద పారే ముందు, సరిగ్గా ఈ ఆలయమంతే  వెడల్పు ఉన్న పెద్ద శిల దొర్లుకుంటూ వచ్చి, గుడి వెనుక భాగంలో అడ్డంగా నిలబడి, వరదలకు ఆలయం కొట్టుకుపోకుండా కాపాడిందట ! ఆలయానికి అటూ, ఇటూ ఉన్న ఇళ్ళు, కొట్లు అన్నీ ఆ ఉధృతికి నామరూపాలు లేకుండా పోయాయట. దైవలీలలు ఎంచడానికి మానవ మేధస్సు సరిపోదు.



పూజారి గారు దూరంగా ఉన్న తమ ఇంటిని చూపి, ఇలా అన్నారు," ఒక అంతస్థు మొత్తం మడ్డిలో కూరుకు పోయింది. మా ఇంట్లో 3 వ అంతస్తులో నేను, మావాళ్ళు , మరో 80 మంది దాకా, 3 రోజులపాటు అలాగే వరద, బురద, వానలో కూరుకుపోయి, ఆలయం వంకే చూస్తూ ఉన్నాము. శివుడి లీలలు విచిత్రమైనవి. వరదలో కొట్టుకు పోతున్నవాడిని ఈవలకు, మావద్దకు పడేసాడు. మావద్దనే కూర్చున్న వాడిని, వరదలో పడేసి, తీసుకుపోయాడు. అదృష్టం, చావో రేవో ఆయన దయ, ఎలాగైనా చేరేది ఆయన్నే అని నమ్మి అక్కడే ఉన్న 80 మందీ బ్రతికిపోయారు. అసలు అప్పటినుంచి నేను ఇక్కడ తక్కువే ఉంటున్నాను. రెండు మూడు రోజుల క్రితమే ఏదో పనిబడి ఇక్కడికి వచ్చాను. ఇదిగో, ఇలా మిమ్మల్ని కలిసి, దర్శనం, అభిషేకం చేయించమని, శివుడే పంపాడేమో !"

ఈ ప్రపంచంలో చెడునడవడి కల బిడ్డలు ఉంటారు కాని, చెడ్డ తల్లులు ఉండరు. అలా తల్లీ, తండ్రీ అన్నీ తామే అయ్యి,అవ్యాజమైన ప్రేమానురాగాలు వర్షించే ఆ దైవానికి ,ఈ చరాచర జగత్తులో మనం ఏమి సమర్పించినా, అది ఆయన సృష్టే తప్ప, మన సృష్టి కాదు కదా ! ధ్యానం, అవాకాశం ఇచ్చినప్పుడు చిన్నపాటి గురుసేవ చేసుకునే భాగ్యం దక్కిన నావంటి వారికి గురుఅనుగ్రహంతో దక్కిన అరుదైన వరం కేదారేశ్వరుడి దర్శన భాగ్యం.

బయటికి రాగానే  అమృతతుల్యమైన కేదారనాథ్ లోని పంపు నీరు మరికొంత తాగి, క్రింద ఉన్న చిన్న హోటల్ లో భోజనం ముగించుకుని, బయటికి వచ్చిన 10 నిముషాల్లో మా తిరుగు ప్రయాణపు హెలికాప్టర్ వచ్చేసింది. మధ్యాహ్నం 2.15 కు బయలుదేరి, తిరిగి, రాత్రి 9 గం. కల్లా, హరిద్వార్ చేరుకొని, మర్నాడు మధ్యాహ్నం చండీగర్ వెనక్కు వచ్చాము. అనుకోకుండా ఆన్నీ సమయానికి ఏర్పాటు కావటం, దుర్లభమైన శివ దర్శనం, అరుదైన అనుగ్రహాలు... కేవలం, గురుకటాక్షం. నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.
//శివాయ గురవే నమః //

Sunday, May 10, 2015

ఈశ్వర తత్త్వం

పరమేశ్వరుడు ఎంతో సాత్వికుడు, బోళా శంకరుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆర్తిగా ప్రార్ధిస్తే అక్కున చేర్చుకుంటాడు. భక్తులను ఇట్టే కరుణిస్తాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా కోరిన వరాలు ఇచ్చేస్తాడు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, ఆయన నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. పండితులైనా, పామరులైనా, మూగ జీవులైనా,శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. అందరిని సమ దృష్టితో చూసే శివుడు అహాన్ని, భేద భావనను సహించడు అని తెలిపే రెండుమూడు కధలు సంక్షిప్తంగా చూద్దాము.

************************************************************************

ఒక‌నాడు శంక‌రాచార్యుల‌వారు గంగాన‌దిలో స్నానంచేసి వ‌స్తున్నారు. జ‌నం ఎవ‌రిక‌వారే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇటూ అటూ జ‌రిగి చేతులు మోడ్చుకుని విన‌యంగా దారి ఇచ్చి నిల‌బ‌డ్డారు. అంద‌రినీ చిరున‌వ్వుతో చూస్తూ ప్ర‌సన్న వ‌ద‌నంతో శంక‌రాచార్యులు ముందుకు న‌డిచారు. అక్క‌డి మాసి చిరిగిన బ‌ట్ట‌ల‌తో, దుమ్ముతో మ‌లిన‌మైన శ‌రీరంతో, చింపిరి జుట్టుతో చేత క‌ఱ్ఱ‌ప‌ట్టుకుని ఒక వ్య‌క్తి అడ్డంగా నిల‌బ‌డ్డాడు అత‌ని క‌ళ్ళ‌ల్లో నిర్ల‌క్ష్యం. అత‌నికి తోడు అత‌ని వెంట దుర్గంధం వ్యాపింప‌చేస్తూ నాల్గు కుక్క‌లు కూడా ఉన్నాయి. అవి కూడా వాటి య‌జ‌మాని స‌ర‌స‌న తోకాడిస్తూ నిలచిఉన్నాయి.


శంక‌రాచార్యుల‌వారి శిష్యుల‌కి ఆగ్ర‌హం వ‌చ్చింది. ఏయ్ ! ఎవ‌రు నువ్వు ? త‌ప్పుకో. ప‌క్క‌కు జ‌రుగు. క‌న్పించ‌డంలా ? మా గురువుగార్ని చూసి మ‌హామ‌హులే దారి ఇచ్చారే. నువ్వు మాత్రం క‌ద‌ల‌కుండా అలా నుంచున్నావ్‌. ఎంత నిర్ల‌క్ష్యం ? జ‌రుగు జ‌రుగు అన్నారు. చూడ‌బోతే ఛండాలుడు లాగా ఉన్నాడు అని వారు గుణుగుకున్నారు. శంక‌రాచార్యుల‌వారు అత‌న్ని చూస్తూ ఆగిపోయారు. అతడిని శిష్యులు ప‌రుషంగా మాట్లాడినందుకు నొచ్చుకుంటున్న‌ట్లుగా నాయ‌నా ! త‌ప్పుకుంటావా ? అని అన్నారు ప్రేమ‌గా. త‌ప్పుకుంటాను. కాని ముందు ఇది చెప్పు. నువ్వు త‌ప్పుకోమ‌న్న‌ది ఆత్మ‌నా ? ఈ శ‌రీరాన్నా ? శ‌రీర‌మా ? అంటే ఇది అస్వ‌తంత్రమైన ఒక కీలుబొమ్మ‌. ఆత్మ నా అంటే ఆత్మ అఖండ‌మ‌నీ అద్వితాయ‌మ‌నీ స‌చ్చిదానంద స్వ‌రూప‌మ‌నీ. నీవే ఉప‌న్యాసాలు ఇస్తున్నావుక‌దా ! నేను బ్రాహ్మ‌ణుడ‌నైనా చండాలుడ‌నైనా అందరిలాగా అన్న‌మ‌య‌మైన దీన్ని గురించి నీకెందుక ఇంత బేధ‌భావ‌ము ? అహంకారం పూర్తిగా న‌శించ‌నిదే అహం బ్ర‌హ్మాస్మి అని ఎలాబోధిస్తావో నాకు చెప్పు. నువ్వూ నేనూ వేరా ? అదీ చెప్పు అన్నాడు.

శంక‌రాచార్యుల మ‌దిలో ఆనంద త‌రంగాలు ఉవ్వెత్తున ఎగ‌సిపడ్డాయి. ఎక్క‌డో గ్రామ‌ల‌కి దూరంగా విద్య‌ల‌కు నాగ‌రిక‌త‌కూ దూరంగా మురికివాడ‌ల‌లో నివ‌సించే మురికి వానిలాగ క‌నిపించే ఈత‌డు మ‌హాజ్ఞాని. ఆత్మ‌విద్య‌ను అవ‌పోస‌న ప‌ట్టిన పునీతుడు. చండాలుడు అయితే అగుగాక‌. ఇత‌డు నాగురుతుల్యుడు అని భావించుకోగానే బ్ర‌హ్మాండ‌మంతా ఒక్క‌టిగా భాసించి అనంద తత్త్వాన్ని అందించిన‌ట్ల‌య్యింది.  

సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి, భ‌క్తి భావంతో  మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

***************************************************************************
పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి ? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే ,  ‘’వ్యాస నిష్కాసనం ‘’చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి, ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును కాశీ ప్రవేశమునకు  వ్యాసునికి  అనుమతి నిచ్చాడు  దయామయుడైన  విశ్వేశ్వరుడు.

*******************************************************************************
కాశీలో 'గవ్వలమ్మ' అనే గ్రామదేవత ఉంటుంది. ఈమెకు ఐదు గవ్వలు కలిపి అల్లిన మాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈమె విశ్వనాధుని సోదరి అని ప్రతీతి.
మడి, ఆచారాలు ఎక్కువగా ఉన్న గవ్వలమ్మ, కాశీ నగరంలో అందరినీ 'తప్పుకోండి, మడి, మడి...' అని ఒకటే విసిగించేదట ! రెండు మూడు మార్లు మందలించి, నచ్చజెప్పబోయిన విశ్వేశ్వరుడి ప్రయత్నం ఫలించకపోవడంతో... కోపించిన స్వామి... ఆమెను మాలపేటలో పడి ఉండమని, విసిరేసారట ! అందుకే, కాశీలో మడి, ఆచారాల పేరుతో ఎవరూ, మితిమీరి వ్యవహరించరాదట !

ఇది శివపురం... కాశీ, కేదార క్షేత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అనుక్షణం శివభక్తులు, అదృశ్య దేవతలు, సకల జీవరాశులు జపించే పంచాక్షరీ మంత్రం మార్మ్రోగే కాశీలో... అహాన్ని, కోపాన్ని, భేద భావనలను  వీడి, అనుక్షణం అత్యంత అప్రమత్తంగా మెలగాలని, గుర్తుంచుకోవాలి ! భక్తితో చేసే ప్రార్దనే శివానుగ్రహానికి రాచమార్గం !ఓం నమః శివాయ.