Tuesday, October 22, 2013

శ్రీనాధుని పల్నాటి వీర చరిత్ర


శ్రీనాధుని పల్నాటి వీర చరిత్ర 

కవిసార్వభౌముడు, ఆగమజ్ఞాననిధి, బహుశాస్త్ర పారంగతుడు అయిన శ్రీనాథుడు రాసిన ద్విపద కావ్యం ‘పలనాటి వీర చరిత్ర’. తెలుగులో ఇది మొట్టమొదటి వీరగాథాకావ్యం. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు బాలచంద్రుడి మృతి వరకూ వ్రాసాడని చెప్తారు. 

పల్నాటి వీర చరిత్ర కావ్యాన్ని శ్రీనాథుడు మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు! మాచర్ల పలనాటిలోదే!

‘జనులెల్ల భక్తిచే చదువుట కొరకు’’ద్విపదలో రాశానన్నాడు. ఈ పలనాటి చరిత్రను పిచ్చుకకుంటులు ప్రచారం చేసారు. శ్రీనాధుడు ‘నారికురుపు’చే బాధపడుతూ మాచెర్లలోని చంద్రికావంక నదిలో స్నానం చేస్తే ఆ రోగం మాయమైందట! కలలో చెన్నకేశవస్వామి కనిపించగా ఈ కావ్యం రాసాడని జనం చెప్పుకునే మాట! పల్నాటి వీర చరిత్రకు మహాభారతానికి పోలికలున్నాయి. దాయాదుల మధ్య పోరు, వ్యసనాలు, అజ్ఞాతవాసాలు, అభిమాన్యుడు బాలచంద్రుల సామ్యం వంటివి సమానమే.అందుకే పల్నాటి వీర చరిత్రను ‘పల్నాటి భారతం’ అంటారు. ఇందులోని బ్రహ్మనాయుడు సంఘ సంస్కర్త. సహపంక్తి భోజనానికి ఆద్యుడు ఇతడే! ఈ పలనాటి చరిత్ర రెడ్డిరాజుల కాలంనాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆనాటి ఆటల విశేషాలు, వధువుల అలంకరణలు, వాద్య విశేషాలు, జానపద గాయకులు మొదలైన సంచారమంతా పలనాటి వీరచరిత్రలో దొరుకుతుంది. ఈ ద్విపద కావ్యంతో ప్రౌఢకవి, పండిత కవి అయిన శ్రీనాధుడు ప్రజాకవి అయ్యాడు.

‘‘బ్రహ్మాండములబట్టి బంతులాడుదును
మృత్యుదేవతనైన మెదిపి వేసెదను
బాలుడనని నన్ను భావింపవలదు
చిన్న మిరియమునందు చెడునె కారంబు?’’
అని బాలచంద్రునినోట శ్రీనాధుడు పలికించడం అతని ప్రతిభకు నిదర్శనం! 

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మెదలయినవారు కార్యమపూడి యుద్ధరంగమునకు బయలుదేరి వెళ్ళసాగారు. ఆ సందర్భంలో వీరులంతా బ్రహ్మ నాయడితో ఇలా అంటున్నారు...

సకలవీరచయంబు సంతతోత్సాహ
పొరుషంబులుమీర బ్రహ్మకిట్లనియె
"మముజూడునాయుడా మాలావుకొలది
మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
సింధూరంబులమీద జెన్నుగాదుమికి
కుంభస్థలంబులు క్రుంగజేసెదము
కొదమసింగబుల గూలద్రోసెదము
గండభేరుండాల ఖండింతుమలుక
వాయువుబోనీక వాడినాపగలము
జాతవేదునుబట్టి చమిరివేసెదము
ఘనసముద్రముజొచ్చి కలుగజేసెదము
కుంభినికాళ్ళతో క్రుంగదన్నెదము
కులగిరిలైనను కొట్టివేసెదము
గురిజాలనేలెడు కువలయేశ్వరుని
కులపగకైపట్టి క్రొవ్వణగించి
చలమునవిడువక చంపగాగలము"

మన 'అచ్చంగా తెలుగు' బృందంలోని శ్రీ Devarakonda Subrahmanyam గారు చాలా చక్కగా ఈ ఈ ద్విపద కావ్యాన్ని తమ బ్లాగ్ లో పొందుపరచారు. చుడండి....
http://sahityasourabham.blogspot.in/2011/12/33.html

No comments:

Post a Comment