Sunday, May 9, 2021

అమ్మయితేనేగా అమ్మంటే తెలిసేది

అప్పటిదాకా అమ్మని అదితిననూ, ఇది తాగనూ అని వేపుకుతిన్న బాపతేగా నేనూనూ.‌ అమ్మయ్యేదాకా ఏ బిడ్డకు మాత్రం అమ్మతనం‌ అంటే తెలుస్తుంది? 21 ఏళ్లకే పెళ్లి, 22 నిండగానే మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు అసలు కష్టం తెలిసింది.‌ తినమంటారు, తిందామంటే హితవుండదు, పైకి తన్నేసినట్టు ఉంటుంది. రకరకాల మందులు, రెగ్యులర్ చెక్ అప్ లు, ఇంజెక్షన్లు. 

23 ఏళ్ల వయసులో నిండు గర్భంతో, గైనకాలజిస్ట్ వద్దకు చెక్ అప్ కు వెళ్లినప్పుడు స్కాన్ చేస్తామని పూర్తిగా నీళ్లు తాగించి కూచోబెడితే, గంటల గంటల వెయిటింగ్ తర్వాత మన వంతు వచ్చేసరికి ఏ మెడికల్ రిప్రసంటేటివ్ లో గదిలో దూరితే, చెప్పద్దూ, ఓ‌పక్క బాధ, ఓ‌ పక్క వాళ్లు దొరికితే ఉతికేద్దామన్న కోపం.‌ మరో పక్క కడుపులో బిడ్డ కదలికలు, తన్నులు, ఓర్చుకుంటూ, డాక్టర్ కు చూపించుకుని, ఇంటికొచ్చేసరికి 'హమ్మయ్య!' అనిపించేది. 

అప్పటిదాకా మామూలు కానుపనుకున్నది, బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చెయ్యాలంటే... ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. కానీ కడుపులో ఉన్న ప్రాణం ఊపిరి పోసుకోవాలంటే నాకీ కోత తప్పదు. అందుకే నాకునేను సర్ది చెప్పుకుని, సిద్ధపడ్డాను. ఏమైందో తెలివి తెలిసే లోపే, ప్రాణం‌ పోయినట్టు విపరీతమైన నొప్పి. కాలు కదిపితే, నడుము నుంచి కాళ్ల దాకా ప్రాణం జివ్వున లాగేస్తోంది. ఈలోపలే, 'బిడ్డకు పాలు పట్టమ్మా!' అంటూ పక్కనేస్తే, కదలలేని, పక్కకు తిరగలేని దశలో, ఎలా పట్టాలో కూడా తెలీని స్ధితి. పడినిద్దరోడం తప్ప చంటిబిడ్డ పాలు తాగదు. వచ్చే పోయే నర్సులు, పట్టకపట్టక పట్టిన మగతనిద్ర కూడా పోనివ్వరు. మూడు రోజుల తిండి లేకుండా సెలైన్ వల్లా, మధ్యమధ్య ఐవి లోకి తోసే ఆంటీ బయొటిక్ ల వల్లా, నీరసంగా పడుండి, అసలీ నొప్పి, నరకయాతన ఏమిటి, నేను లేచి నడవగలనా?' అన్న ఆలోచనలో ఉంటే, అందరూ చెప్పే శుభాకాంక్షలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి.‌ నాలుగోరోజు లేచి నడవమంటే, కడుపు దగ్గర నరాలు కుట్లకు లాగేస్తుంటే, ఓపికుంటేనా, అలా నడవమన్న వారిని ఉతికేద్దామనిపిస్తుంది.‌ ఎలాగో పళ్లబిగువున నొప్పి ఓర్చుకుని, కాస్త తేరుకుని, ఇంటికి చేరే సరికి, మళ్లీ కుట్లు విప్పడానికి రమ్మని‌ పిలుపులు, పురుటి స్నానాలు, బారసాలలు. అసలు తల్లి అవ్వడం అన్న దశ ప్రతి అమ్మాయికి అనూహ్యమైన షాక్ లాంటిదే అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక ప్రాణం ఉన్నపళాన రెండుగా మారిపోతుంది.

తల్లి కోలుకోడానికే నెల పడుతుందంటే, ఈ చంటిబిడ్డలు పాలు తాగరు, పగలంతా నిద్దరోయి, రాత్రి మేలుకుని అల్లరి మెదలు. గుండెలు పట్టేసి, పాలు నైటీలనిండా ధారలుగా కారిపోతున్నా, ఈ పురుటి బిడ్డలు, ఆత్మానందంలో ఓలలాడుతూ నిద్రపోతారేగానీ, అరిచి గీపెట్టినా లేవరు. ఆ తర్వాత వాళ్లకు కాళ్లమీద పడుకోబెట్టుకు స్నానాలు, గోచీలు కట్టడాలు, ఉతుక్కోవడాలు, కంటికి రెప్పలా కాచుకోడాలు‌. చెప్పద్దూ, ఇన్ని కష్టాలు, నొప్పులు చంటిబిడ్డ బోసినవ్వు చూడగానే, ఆ బిడ్డను ప్రేమగా హత్తుకోగానే మాయమౌతాయి.

ఐదు నెల్ల దాకా బానే ఉంటుంది.‌ అన్నప్రాసన అయిందో ఇంకో అంకం మొదలు. ఎన్ని రకాలు తినబెట్టాలని చూసినా తినరే! మరో పక్క పిల్లలు చిక్కిపోతున్నారని పెద్దల వాయింపు. మా పెద్దదైతే గోడసున్నాలు, చమ్కీలు, గౌన్ల బొత్తాలు, దిండుకున్న స్పాంజిలు అన్నీ తుంపుకు తినేది. ఇంట్లో నేలమీద ఎక్కడ ఏ నలక కనబడ్డా, ఏరుకు మింగేసేది‌. ఒకసారిలాగే నా కాంటాక్ట్ లెన్స్ మింగేసింది. 'ఏదే?' అనడిగితే తెల్లారొచ్చి తీస్కో, మింగేసానంది! కాపలా కాసీ కాసీ దాన్ని స్కూలుకు పంపే దశకొచ్చే సరికి చిన్నది కడుపులో పడింది. 

ఇది కడుపులో ఉన్నప్పటినుంచే మరీ అన్యాయం! పరీక్షచేసే డాక్టరమ్మతో సహా అందర్నీ చచ్చేట్టు తన్నేది.‌ ఆ తన్నులతోనే మొదటిసారి పడ్డ కుట్లు ఊడే దశకు వస్తుంటే హనుమజ్జయంతి రోజున కంగారుగా ఆపరేషన్ చేసి తీసారు. రెండోసారి విజయవాడలో పెద్ద హాస్పిటల్ కావడంతో, బలమైన పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో అంతగా నొప్పి తెలీలేదు. కానీ డిస్చార్జ్ అయిన పదిహేను రోజులకు అసలు అంకం మొదలైంది. కుట్ల నిండా పెద్ద పెద్ద బొబ్బలు! పరిగెత్తుకుంటూ, డాక్టరమ్మ దగ్గరకు వెళ్తే, మత్తివ్వకుండానే కత్తెరతో బొబ్బలు కట్ చేసి, చీమంతా పిండి, మళ్లీ డ్రస్సింగ్ చేసేది. ప్రాణం పోయినంత పనయ్యేది. ఇలా రోజూ ఒక పదిరోజుల పాటు తిరిగి, నరకయాతన పడితే గానీ ఇన్ ఫెక్షన్ తగ్గలేదు. 

ఇద్దరు పిల్లలు, అప్పట్లో డైపర్ల వాడకం అంత లేదు, ఉన్నా పిల్లల్నలా హింసించడం నాకూ ఇష్టం లేదు. బకెట్ నిండా నానబెట్టిన గోచీలు డెట్టాల్ లో నానేసి, ఉతికారయ్యడం ఒక పెద్ద అంకం. ఇంటెడు పని, కారేజీలు, పిల్లలు, జ్వరాలు- జాగారాలు, దణ్ణాలు - మొక్కులు, ప్రమాదాలు- ప్రమోదాలు, ఇలా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడే తెలిసింది అమ్మంటే ఏమిటో, అమ్మనెంత వేధించానో!

చిన్నది హైపరాక్టివ్‌. హనుమంతుడే. ఒక్క క్షణం రెప్ప పడేలోపు పారిపోయేది. ఓసారి ఐదడుగుల గోడమీంచి పడి తల బొప్పి కట్టించుకుంది. నాలుగు రోజులు నిద్ర లేదు. ఇంకోసారి మూడో ఫ్లోర్ లో మెట్ల పైనుంచి దూకి పక్కింటి బాల్కనీ సన్ షేడ్ మీద ఎక్కేసింది.‌ అక్కడినుంచి పడితే ఏమైనా ఉందా? 'హాయ్, భలే వెళ్లావే, ఎలా వెళ్లావో అలా రా' అని ముద్దుగా పిలిచి, రాగానే ఉతికేస్తూ, ఏడ్చేసాను. ఓసారి సూపర్ మార్కెట్లో తప్పిపోయి దొరికింది. ఓసారి బంక్ బెడ్ పైన పేద్ద టెడ్డీబేర్ తో ఆడుతూ, దాని కింద దాక్కుని, పడుకుండి పోయింది. వందమందున్న ఫ్లాట్స్ లో ఓ ఇరవై కుటుంబాలని బిల్డింగంతా పరిగెత్తించాకా, ఎవరో ఇది టెడ్డీబేర్ కిందుందని కనిపెట్టారు. ఇలా దాని కథలు, అల్లరీ ఒకటి కాదు. ఇంత పిల్లని అంత చేసేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది.

మాతృత్వంలో దేహాలు వేరుగా ఉన్నా ఆత్మలొక్కటే అనిపిస్తుంది. ఇంకా మాటలు రాని బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే, ఎందుకో తెలీక విలవిలలాడుతున్నప్పుడు, అసహాయత అంటే ఏమిటో తెలుస్తుంది. పిల్ల ఎడం కాలికి దెబ్బ తగిలితే, తల్లి ఎడమకాలు చూసుకున్నప్పుడల్లా ఇక్కడ దెబ్బుంటుంది, జాగ్రత్త, అనిపిస్తుంది. బిడ్డ కడుపు కాలుతుంటే, తను పూర్తిగా తిన్నా తిననట్టే ఉంటుంది. పిల్లలతోనే లోకంగా, వాళ్ల ఆలనా పాలనే ధ్యేయంగా ఒక‌ పదేళ్లు గిర్రున తిరిగిపోతాయి. 

ఈరోజుకీ ఆశ్చర్యమే! ఇంట్లో ఉన్నవారికే తెలీని జలుబు, జ్వరాల గురించి, ఫోన్ లో గొంతు వినగానే 'ఏమే, గొంతలా భారంగా ఉందటి?' అని అమ్మ అడగ్గానే  'అమ్మా, నేను చెప్పకుండానే నీకెలా తెలుసు,' అని అబ్బురపడుతుంటాను. నన్నూ నా పిల్లలు ఇలాగే అడుగుతుంటే, అప్పుడు నేనూ మంచి అమ్మనేనని నిర్ధారించుకుంటాను. అమ్మ గురించి ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అసలు అమ్మయితేగా, అమ్మంటే ఏమిటో తెలిసేది! 

అవయవలోపాలు, మానసిక వికాసం లేని పిల్లల్ని, ఆ తల్లులు కడుపులో పెట్టుకు సాకుతుంటే చూసి, వారికి మనసులోనే దణ్ణాలు పెట్టుకుంటాను. రకరకాల వికారాలతో వెర్రితలలు వేస్తున్న సమాజంలోని ఈ స్ధితిగతుల్లో అహర్నిశలు తమ పిల్లలకు దన్నుగా ఉంటూ, వారి వృద్ధికై పాటుపడే మాతృమూర్తులకు నా వందనాలు!

నిజంగా మాతృత్వం అంటే, పల్ల బిగువున నొప్పిని దాచి, ప్రాణం పొయ్యడానికి తమ‌ ప్రాణాన్నే పణంగా పెట్టి, జరుపుకునే ఒక‌ ఉత్సవమే! 

 ప్రేమ, దయ, క్షమ మూర్తీభవించిన అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

Wednesday, June 14, 2017

పొదుపు, పొదుపు... మాట అదుపు...


పొదుపు, పొదుపు... మాట అదుపు...
---------------------------------------------
భావరాజు పద్మిని - 20/5/17
"నేను నీకు మరీ అంత వెర్రోడిలా కనిపిస్తున్నానా?"
"నేనంటే చులకనా?"
"మా అమ్మాయి పెళ్లి. అయినా పెళ్ళికి మీరెందుకు వస్తారులే."
"నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నాలాంటి వాళ్ళతో వేగలేరు."
"అయినా మీకు నాకంటే వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం..."
"మేవెందుకు కనబడతాంలే. మీ సర్కిల్ పెరిగిందిగా..."
ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొందరు. వీటినే మన పెద్దవాళ్ళు 'పుల్ల విరుపు' మాటలు అంటారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వేసే ముందు వీటికి ఎదుటివాళ్ళు కొంటెగా "ఔను, నిజమే" అన్న జవాబిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా మాట్లాడినప్పుడు, మనం మళ్ళీ అలా మాట్లాడకుండా ఉండాలని, గుణపాఠం నేర్చుకోవాలని, కొందరు కావాలని "ఔనని" జవాబిస్తారు. ఇది మీ మేలు కోసమే ! ఎందుకంటే మనకీ మాటతీరు ఎవరోఒకరు నేర్పాలిగా !
ఇటువంటి ప్రశ్నలకు మూల కారణం ఆత్మ న్యూన్యతా భావం. తమను తాము తక్కువని భావించుకుని, కుమిలిపోవడం. మరి ఇటువంటి ప్రశ్నలకు "ఔను" అని జవాబిస్తే... ఇలా అడిగిన వారు మరింత గాయపడతారు. ప్రపంచం మన ఆలోచనలకు ప్రతిబింబాల వంటివారని అంటూ ఉంటారు. మరి మనమే మనల్ని తక్కువ చేసే అవకాశాన్ని మన మాటల ద్వారా వాళ్లకు ఇచ్చి, తర్వాత వాళ్ళు ఔనన్నారని కృంగిపోయి... నేనన్నది, వారు ఔనన్నారని, నేను ఫీల్ అయ్యానని, వారూ ఫీల్ అవుతారని... అయ్యారని... సినిమాల్లో ఎ.వి.ఎస్ లాగా అందరి వద్దా కుమిలిపోయే ముందు... నాదో ప్రశ్న ! " అసలు మొదలు పెట్టింది ఎవరు?" ఇటువంటి దిగుళ్ళకి కారణం మాట్లాడే విధానం రాకపోవడమే !
"నోరు మంచిదైతే ఊరు మంచిది ఔతుందని" పెద్దలు అంటారు. మనం చెప్పే విషయం ఎంత కటువైనదైనా దాన్ని మెత్తగా, చెప్పే విధంగా చెప్తే ఏ స్థాయిలో ఉన్నవారినైనా మెప్పించవచ్చు. పూర్వకాలంలో మునులు మాట్లాడేముందు తమకు తాము మూడు ప్రశ్నలు వేసుకునే వారట ! మొదటిది "ఇది సత్యమేనా?" అని. అది సత్యమైతే... రెండవ ప్రశ్న... "ఈ మాటలు మాట్లాడడం అవసరమేనా?" అని. మాట్లాడబోయే మాట ఈ రేఖను కూడా దాటితే చివరి ప్రశ్న... " ఈ మాట వలన నేను గాని, ఇతరులు గాని గాయపడతారా ?" అని. తాము మాట్లాడబోయే మాట ఈ మూడు రేఖలు దాటితేనే వారు నోరువిప్పి మాట్లాడేవారట. "వారంటే మునులండి, మేమేంటే మనుషులమండి..." అనకండి. మాటలు నేర్పితే చిలుకలు కూడా తియ్యగా పలుకుతాయి. ఇక మనమెప్పుడు నేర్చుకునేది. మనిషి నిత్యవిద్యార్ధి. రానివి నేర్చుకోవడం, తమను తాము మెరుగు పరచుకోవడం ఒక నిరంతర ప్రక్రియలా జీవితాంతం కొనసాగుతుంది. కనుక, ఇకపై ఇటువంటి ప్రతికూల ప్రశ్నలు మానేసి, మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడడం అభ్యసిద్దామా?

Thursday, April 20, 2017

జస్ట్ ఫర్ టీ లవర్స్

జస్ట్ ఫర్ టీ లవర్స్
భావరాజు పద్మిని – 20/4/17
కాఫీ సరస్సు లాంటిది... నిర్ణీత పాళ్ళలో పాలు, చెక్కెర, డికాషన్ కలిస్తేనే దానికి రుచి. కాని, టీ సముద్రం లాంటిది. తనతో ఏ ఫ్లేవర్ నైనా కలుపుకు పోతుంది. ఆ పరిమళాన్ని ఆపాదించుకుని, కొత్త రుచిని సంతరించుకుంటుంది. అలా చేసుకోగల వివిధ రకాల టీ ల గురించి నాకు తెల్సింది చెప్తాను, ట్రై చెయ్యండి. టీ టిప్స్ : • టీ అంటే నీళ్ళు కాదు. ఎక్కువమంది చేసే తప్పు ‘టీ పెట్టు’ అనగానే గిన్నెలో సగం నీళ్ళు పోస్తారు. ఆ టీ కి, నీళ్ళకి తేడా ఉండదు. అందుకే పాలు కాస్త ఎక్కువ పోస్తేనే టీ కి రుచి. • టీ లో పంచదార బదులు బెల్లం పొడి వేస్తే ఆ రుచే వేరు. ఆరోగ్యానికీ మంచిది. ఇప్పుడు బెల్లం పొడి అన్ని సూపర్ మార్కెట్ లలో దొరుకుతోంది. లేకపోతే చేసుకోవచ్చు. • టీ లో మాటిమాటికీ వేసేందుకు ఏలకులు నూరడం ఒక పెద్ద పని. పైగా ఏలకులు చాలా ఖరీదు ఐపోయాయి కూడా కదా. అందుకే కొన్ని ఏలకులు తొక్కతో సహా మిక్సీ వేసి, మెత్తగా పొడి చేసి, ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే... స్వీట్స్ లోకి, టీ లోకి, ఇతర వాడకాల్లోకి కావలసినప్పుడు, మూత తీసి, కాస్త పొడి వేసుకుంటే చాలు. • కాఫీ ఫార్ములా లాగా టీ పెట్టేందుకు పెద్దగా ఫార్ములా లు లేవు, అవన్నీ అపోహలే. పాలు, నీళ్ళు, చెక్కెర/బెల్లం పొడి, టీ పొడి, అన్నీ కలిపి, ఒకేసారి స్టవ్ మీద పెట్టచ్చు. పుదీనా టీ : టీ మరుగుతూ ఉండగా కాసిని పుదీనా ఆకులు వేసి చూడండి, అదిరిపోతుంది. తులసి టీ: టీ మరుగుతూ ఉండగా కాసిని తులసి ఆకులు వేసి చూడండి, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆరోగ్యానికీ మంచిది. చాక్లెట్ టీ: చిన్న బోర్నవిటా/ బూస్ట్ ప్యాకెట్లు మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతున్నాయి. మరుగుతున్న టీ లో కాస్త వీటి పొడిని, ఏలకు పొడిని కలిపితే చాలా బాగుంటుంది. రోజ్ టీ : తాజా గులాబి రెక్కలు, కాస్త ఏలకు పొడి టీ లో వేసి చూడండి. చాలా వైవిధ్యంగా అనిపిస్తుంది. అల్లం టీ : టీ లో కాస్త అల్లం దంచి వెయ్యడమే ! ఏలకు పొడి, మిరియాల పొడి స్పెషల్ టీ: అలసిన వేళ ఈ టీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. టీ మరుగుతూ ఉండగా కాస్త ఏలకు పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. లంసా టీ: ఈ ప్యాకెట్ మార్కెట్ లో దొరుకుతుంది. టీ మరుగుతూ ఉండగా కాస్త లంసా పొడి కూడా వేస్తే, హైదరాబాదీ ఇరానీ చాయ్ తాగుతున్న అనుభూతి కలుగుతుంది. లవంగాల టీ: ఇది నోరు బాగోనప్పుడు కాస్త ఘాటుగా బాగుంటుంది. టీ మరుగుతూ ఉండగా ఓ నాలుగు లవంగాలు దంచి వెయ్యడమే. స్పెషల్ జలుబు టీ: జలుబు చేసినప్పుడు వేరేవీ మనకు రుచించవు. అలాంటప్పుడు టీ మరుగుతూ ఉండగా కాస్త అల్లం, మిరియాలు, వాము, జీలకర్ర, తులసి ఆకులు కలిపి దంచిన మిశ్రమాన్ని వేసుకుని తీగితే, చాలా రిలీఫ్ గా ఉంటుంది. స్పెషల్ టీ మసాలా : సాధారణంగా చాయ్ మసాలా షాప్స్ లో కొంటూ ఉంటారు. కాని, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. 3,4 – దాల్చిన చెక్కలు, చెంచాడు మిరియాలు, నాలుగు లవంగాలు, 6 ఏలకులు, కాస్త వాము, కాస్త జీలకర్ర ,చెంచాడు ధనియాలు నూనె లేకుండా దోరగా వేయించి, మిక్సీ లో మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఎప్పటి కప్పుడు ఓ చిటికెడు పొడి టీ మరుగుతూ ఉండగా వేస్తే, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ప్రయత్నించండి !

Wednesday, April 19, 2017

పాట సాగుతూనే ఉంటుంది...


  ఊపిరాగిపోతుంది... కానీ పాట సాగుతూనే ఉంటుంది...

----------------------------------------------------------------
భావరాజు పద్మిని - 18/4/17
“పద్మిని గారు... నాకు పాటలంటే చాలా ఇష్టం, ఇక్కడ నేర్పేవారు ఎవరూ దొరకరు కదా ! వీలయితే, ఓ నాలుగు పాటలు నేర్పిస్తారా?”
ఏమని చెప్పాలి ఆవిడకి? జీవితం అందించిన బాధ్యతలతో చేసే అష్టావధానం వంటి విన్యాసాలతో నలిగిపోతూ, మధ్య మధ్య ఏ ప్రకృతి ఒడిలోనో సేద తీరుతూ, నాలో తిరిగి నిండిన జీవాన్ని అందరికీ అక్షరాలతో పంచే అన్వేషినని చెప్పాలా? కాలానికి -వేగానికి, దూరానికి – గమ్యానికి మధ్య నలిగిపోతూనే నాలోని అస్తిత్వాన్ని బ్రతికించుకునేందుకు అనుక్షణం నేను పడే తపన గురించి చెప్పాలా? గతంలో కొంతమందికి పాటలు నేర్పాను, కాని ఇప్పుడు... ‘వీలు కాదు’ అని చెప్పాలా? అసలు నేను పాటలు ఎలా నేర్చుకున్నాను? ఒక్కసారిగా అంతర్మధనం...
డిగ్రీతో పాటే శాస్త్రీయ సంగీతం, వీణ క్లాసులకు వెళ్ళేదాన్ని. ఉదయం కాలేజి, సాయంత్రం సంగీతం, ట్యూషన్లు. అప్పట్లో కళను గంటల్లో, కాసుల్లో లెక్కకట్టి కొలిచేవారు కాదు. విద్య నేర్పే గురువులు కేవలం విద్యనే కాక, విద్యార్ధి మానసిక స్థితిని, ఒత్తిడిని కూడా గమనించి, తగిన విధంగా మార్గదర్శకులై ఉండేవారు. తెనాలిలో నా మొదటి సంగీతం టీచర్ కామేశ్వరి గారు, సాయంత్రం కాలేజి నుంచి ఇంటికి వెళ్తే, పిల్ల ఎండనపడి వేళ్ళాడుతూ వచ్చిందని, ఏదో ఒకటి పెట్టేవారు. ఆవిడ పెట్టిన వంకాయ ఉప్మా, జన్మలో మర్చిపోలేను. వారమంతా క్లాసులు ఉండేవి, కాని ఆవిడ తీసుకున్న జీతం 30 రూపాయిలు. దురదృష్టవశాత్తూ, ఆవిడ చిన్న వయసులోనే(సుమారు 50సం.) చనిపోయారు. కాని, ఆవిడ నేర్పిన పాటలు, నా వీణ మీద, నా మానసవీధిలో ఇంకా మార్మ్రోగుతూనే ఉంటాయి. ఆ పాట పలికించినప్పుడు ఆవిడ తలపులూ అలా నన్ను అల్లేస్తూ ఉంటాయి.
అలాగే నేను ఎం.ఎస్.సి కెమిస్ట్రీ చదువుతూ ఉండగా, నా రెండవ సంగీతం టీచర్ బాపట్లలో కామేశ్వరి గారని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్య నేర్పారు. డబ్బు తీస్కోకూడదు అన్నది ఆవిడ నియమం. ఇక నాకు వీణలో సర్టిఫికేట్ కోర్స్ కు శిక్షణ ఇచ్చిన శారద గారు, వీణని మనసులు మీటేలా పలికించడం నేర్పుతూనే నాకు ఇంట్లోని వారితో సమానంగా వండి ప్రేమగా వడ్డించిన హేమాంబుజ గారు... వీరందరూ నాకు అత్యంత ఆప్తులు. వారు దూరంగా ఉన్నా, వారు అందించిన పాటల రూపంలో నాతో వారూ జీవిస్తూనే ఉంటారు. ఏ కళ అయినా శారదా మాత భిక్ష. కళాకారుడి ఊపిరి ఆగినా, ఆ కళ రూపంలో తన శిష్యులలో, అనేక మంది జ్ఞాపకాలలో, జీవిస్తూనే ఉంటాడు. ఆ భాగ్యం కళాకారుడికి మాత్రమే అందిన గొప్ప అనుగ్రహం. ఇటువంటి మహాద్భాగ్యాన్ని నేనెందుకు ఒదులుకుంటాను?
జీవితమే ఒక పాటగా పల్లవించండి... సుదూర తీరాలలో ఏదో ఒక గళంలో మ్రోగే పాటగా కుసుమించండి... బ్రతుకే ఒక పాటగా జీవించండి...
“మీ నంబెర్ ఇవ్వండి, వీలైనప్పుడు కాల్ చేస్తాను... అయితే ఒక నియమం, నేను ఊరికే నేర్పుతాను, మీరు నాకేం ఇవ్వద్దు.” అన్నాను. ఇవ్వాళే ఆవిడకో నాలుగు పాటలు నేర్పి, ఈ పోస్ట్ రాసే అర్హత సంపాదించుకున్నాను.
నేడు తమకు వచ్చినదంతా ఇతరులకు నేర్పేస్తే, వారు తమకు పోటీగా తయారౌతారన్న చిన్న స్వార్ధం నేడు కళాకారుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. “పంచితే కళ తరిగిపోదు... వారందరి రూపంలో అజరామరంగా జీవిస్తూ, ముందు తరాలకు అందుతుంది...” అందుకే వచ్చిన ఏ చిన్న విద్యనైనా, కాస్త తీరిక చేసుకుని, ఇతరులకు నేర్పండి. “ఇచ్చుటలో ఉన్న హాయిని” మీరూ అనుభూతి చెందండి...

Saturday, February 25, 2017

కవితలు రాయండిలా !

కవితలు రాయండిలా !

కవితలు రాయడంలో నాకు తెలిసిన కొన్ని మెళకువలు చెప్పమని ఒకరు అడిగారు. ఎలాగూ చెప్పాలని అనుకున్నప్పుడు నాకు తెలిసినంత వరకు అందరికీ చెబితే, కొందరైనా, కనీసం ఒక్క అంశమైనా నేర్చుకుంటారు కదా, అన్న చిన్న ఆశ కలిగింది. అందుకే ఈ పోస్ట్ ! అసలు కవిత్వం ఎలా మొదలవుతుంది

ఏదైనా ఒక అంశం మన మనసుకు బాగా హత్తుకున్నప్పుడది, స్పందిస్తుంది. అలా స్పందించిన మనసు ఆయా సందర్భాలను బట్టి, అనేక రకాలైన భావోద్వేగాలకు గురౌతుంది. ఆ 'భావము' అనే ప్రవాహిని, మనసంతా నిండిపోయి, అక్షరాలై ప్రభావించాలని బలంగా అనుకున్నప్పుడు ప్రతి మనిషిలోంచి ఒక కవి పుడతాడు. అయితే, ఆ భావాలను వ్యక్తపరిచే విధానం ఆ వ్యక్తి పెరిగిన విధానం మీద, వాతావరణ పరిస్థితుల మీద, చదివిన పుస్తకాల స్థాయి మీద, విన్న కధల మీదా... వెరసి ఆ వ్యక్తి బాల్యంలో భావాలు సుసంపన్నమయ్యే దశలో అతనికి తారసపడ్డ వివిధ స్థితిగతుల మీదా ఆధారపడి ఉంటుంది. మంచి పాఠకుడే మంచి రచయత అవుతాడన్నది నిశ్చయం !  ప్రస్తుతం ఫేస్బుక్ వంటి మాధ్యమాల ద్వారా అందరికీ రాసేందుకు ఒక 'వేదిక' దొరకడంతో కొత్త కలాలు ఎన్నో రెక్కలు తొడుక్కుంటున్నాయ. అయితే, 'అదిగదిగో గోడ, గోడ పక్కన దూడ' వంటి కవితలకు కూడా ఓ ఇరవై లైక్ లు, ఓ పది కామెంట్లు ... నువ్వస్సలు తగ్గద్దు భయ్యా... రాయి, ఇంకారాయి, అని ప్రోత్సహించేవారు రావడంతో తెలుగు భాష ఒకానొక దీన స్థితికి దిగజారిపోతోంది. ఎవరో పెద్దాయన చెప్పిన మాటలు...  "భాషాదోషం వాఙ్మయానికి ముప్పు. వాఙ్మయదోషం సంస్కృతికి ముప్పు. సంస్కృతిదోషం సత్యస్థితికి ముప్పు." అలా జరిగినప్పుడు ఇక మానవజన్మ వలన ఉపయోగం ఏముంటుంది? అందుకే ఏది చేసినా, రాసినా సరిగ్గా నేర్చుకుని రాస్తే బాగుంటుంది కదా !

·         ముందుగా అసలు కవి ఏమి చెప్పదలచుకున్నారో, ఆలోచన స్పష్టంగా ఉండాలి. స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన భావాలకు, స్పష్టమైన భావం స్పష్టమైన భాషకు, వ్యక్తీకరణకు దోహద పడుతుంది. ఏదో ఒకటి రాయాలి కదా, అని రాసి పారెయ్యడం, గొప్ప కాదు. మనం అనుకున్నది మన భావంలో వస్తోందా, అది చదివేవారి మనసుకి హత్తుకునేలా ఉందా లేదా అని సమీక్షించుకోవాలి.

·         నిజమే, కవిత్వానికి ఏ లయ, ఛందస్సు లేదు. కాని మనం వాడే వాక్యాల్లోని, చివరి పదాలు ఒక ప్రాసలో కలిసినప్పుడు ఆ కవితకు ఒక అందం వస్తుంది. ఉదాహరణకు –
o    “గాఢపు మబ్బులు గగనము కమ్మెను 
మరలక తప్పని సూర్యుడు దాగెను
ఆర్తిగ సెగలతొ అవని వేచెను
గాలుల సవ్వడి సేదను దీర్చెను
ఎప్పుడెప్పుడని ఎదసడి అడిగెను
తొలకరి తపనలు తీర్చే తరుణం !”

o    ఇందులో కమ్మెను, దాగెను, వేచెను, తీర్చెను, అడిగెను... వంటి పదాలు చివర్లో వాడడం వలన కవితకు ఒక అందం వస్తుంది. కవిత వేరు, వచన వాక్యం వేరు. కవితల్లోని వాక్యాలను ఒక దాని ప్రక్కన మరొకటి పెట్టుకు చూస్తే, అది పారాగ్రాఫ్ చదివినట్లు ఉంటే కనుక, ఆ కవిత పండనట్లే.


·         కవితల్లో ఒక వాక్యం చాంతాడంత పొడుగ్గా, మరో వాక్యం మొలతాడంత పొట్టిగా ఉంటే బాగోదు. వాక్యాలన్నీ దాదాపుగా ఒకే నిడివిలో ఉండేలా చూసుకుంటే, కవిత శిల్పంలో ఒక అందం వస్తుంది.  రేపటి రోజున ‘మనం ఏం రాసామా ‘ అని వెనుదిరిగి చూసుకున్నప్పుడు, అప్పటికీ ఇప్పటికీ మనతో మనమే పోల్చుకున్నప్పుడు, ఒక పరిణితి కనపడాలి. ఆ దిశగా సాధన చెయ్యాలి. బాగా రాయట్లేదు అని మనకి అనిపించినప్పుడు, పెద్ద పెద్ద కవులు ఎలా రాసారా అని చదివి, తెలుసుకోవాలి, నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి.


·         "నేను రాసే ప్రతి అక్షరానికి నేను బాధ్యత వహిస్తాను. ఇక్కడ ఇది ఎందుకు రాసావు? అని ఎవరైనా అడిగితే, సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానో లేదో అని, నేను రాసిన వాటికి, నేనే విమర్శకుడిగా, ఒకటికి పదిసార్లు చదువుకుని చూస్తాను." - అన్నారొక ప్రముఖ రచయత. ఒక కవితను రాసాకాఅక్కడ ఆ పదం బదులు ఇంకో పదం పెట్టవచ్చా, అలా పెడితే నడక, భావం ఇంకా బాగుంటుందా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాలి. అలాగే నేను సిరివెన్నెల గారిని కలిసినప్పుడు ‘మీ రచనలకు ఎప్పుడైనా విమర్శలు ఎదుర్కున్నారా?” అని అడిగాను. దానికి వారిచ్చిన సమాధానం – ‘లేదమ్మా, నాకు నేనే పెద్ద విమర్శకుడిని, ఒకటికి పదిసార్లు సమీక్షించుకుంటాను. అందుకే ఇంత వరకు, ఏ విమర్శా ఎదుర్కోలేదు,” అన్నారు. – అంతటి వారే ఇలా ఉంటే, మనమెంత చెప్పండి? ఆచరిద్దాం !

·         సమాజంలో ఉన్న రుగ్మతలను కవి ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిందే ! అయితే, ప్రతి భావానికి ఒక కట్ ఆఫ్ లైన్/బోర్డర్ లైన్ ఉంటుంది. మనం కవులం, కళాకారులం కాకపోయినా ముందు మంచి పౌరులవ్వడం, ఎవరినీ నొప్పించక పోవడం ముఖ్యం కదా ! కవి కోపంలో కాని, ఆందోళనలో కాని, ఆవేదనలో కాని, లేదా ఎటువంటి భావోద్వేగాలకు గురైనా ఆ ‘బోర్డర్ లైన్’ దాటకుండా జాగ్రత్త వహించాలి. దీని ద్వారా ఎవరైనా బలంగా నొచ్చుకుంటారా అని ఆలోచించాలి. లేకపోతే, పడగ్గదిని పబ్లిక్ కి తెచ్చే విచ్చలవిడి శృంగార కవితలు, క్షుద్ర కవితలు, శ్మశాన కవితలు, పైశాచిక ప్రేమ కవితలు తయారౌతాయి. దురదృష్టం ఏమిటంటే, ఇటువంటివి ప్రముఖ పత్రికలూ అచ్చు వేస్తున్నాయి. ఇటువంటి కవితలు రాయడం కంటే రాయకపోవడమే మంచిది. కవి తను రాసిన ప్రతి అక్షరాన్ని చెలియలి కట్ట దాటకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ భావావేశం ఉత్తుంగతరంగం అవుతుంది.

·         వైవిధ్యమైన కవితలు రాయడం, సమకాలీన అంశాలను స్పృశించడం, రచనల్లో చాలా ముఖ్యం. అమ్మ, ప్రేమ, ప్రేమ వైఫల్యం వంటివి చాలామంది సాధారణంగా కవితా వస్తువులుగా తీసుకుంటూ ఉంటారు. అవే తీసుకున్నా, కొత్తగా, మనదైన కోణంలో ఏమైనా చెప్పగలిగామా అని చూసుకోవాలి, విభిన్న అంశాలపై రాయాలి. వీలయితే పామర భాష నుంచి పండిత భాష వరకు విభిన్న పోకడలను, ప్రాంతీయ యాసలను వాడే ప్రయత్నం చెయ్యాలి.

·         అన్నిటికంటే ముఖ్యంగా కవికి కావలసింది నిశిత పరిశీలనా దృష్టి. ముఖ్యంగా యువతరం కవితల్లో చాలా భాషా దోషాలు కనిపిస్తున్నాయి. తాను ఏవైనా పదాలు తప్పుగా రాసానా, అని గమనించుకుని, ఒక పుస్తకంలో వాటిని రాసుకుని, మళ్ళీ రాసినప్పుడు అదే పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. అలా క్రమం తప్పకుండా చేస్తే, రోజురోజుకూ భాషా జ్ఞానం మెరుగవుతుంది.

·         పెద్దలు, అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలను స్వీకరించండి. వీలయితే దిద్దుకోండి. అంతే కాని, వారేదో అసూయతో చెప్పారన్న అపోహలో ,మూస పద్ధతిలో రాసుకుంటూ పోవడం మంచిది కాదు. కటువైన విషయమైనా మెత్తటి చెప్పుతో కొట్టినట్లు చెప్పండి. అతిగా రాసే వారికి, అతిగా తిట్టేవారికి అంతా దూరంగా జరుగుతారని మరువకండి.

ఇంకా నేను ఏవైనా మరచి ఉంటే, పెద్దలు విన్నవించగలరు. నేను ఎప్పటికీ నిత్య విద్యార్దినినే. పలక పట్టుకు వెళ్తున్న పసిపాపలా అక్షరాలు చెరిపేసి, మళ్ళీ దిద్దుకోడానికి సిద్ధమే. నాకు తెలిసిన ఈ విషయాలు భావి కవులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని
23/2/17



Wednesday, February 15, 2017

మానవ సేవే మాధవ సేవ

ప్రేమ...ఎండా వానను కలిపే హరివిల్లు. ఆ హరివిల్లు రంగులు ఇరువురి జీవితాల్లో శాశ్వతంగా నిలచినప్పుడు, పెళ్ళనే రంగవల్లిలో లక్షణంగా వొదిగినప్పుడు జీవితం రమణీయం, రాగరంజితం. కానీ, విధి వశాన ,హరివిల్లులా, ప్రేమ కేవలం కొంత కాలమే విరిసి మటుమాయమయితే....ఆ మనసులు పడే బాధ వర్ణనాతీతం. అవే హరివిల్లు రంగులను పదే పదే అన్వేషిస్తూ...జీవితం శూన్య ఆకాశంలా...ఎండమావిలా...అనిపిస్తుంది.
అయితే ...ఈ రోజుల్లో ప్రేమ అన్న పదం హాస్యాస్పదంగా మారింది. సినిమాలు, టీవీ ల ప్రభావంతో తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లలు ప్రేమను 'తిండి, బట్ట, ఇల్లు...' వంటి కనీసావసరాలలో ఒకటిగా భావించి, విధిగా ప్రేమించాలేమో అని భ్రమ పడుతున్నారు. యువత కాలక్షేపం ప్రేమలు, చీకట్లో చెరువుగట్టు ప్రేమలు, కాపురాలు కూల్చే స్వార్ధపు ప్రేమలు, అసభ్య ప్రేమలు చూస్తే 'ప్రేమ' అన్న పదం వింటేనే రోత పుడుతోంది.
ప్రేమ విఫలం అయ్యింది. విపరీతమయిన నిరాశ, నిస్పృహ....గుండెలు పిండే బాధ . అమ్మాయి మోసం చేసింది. అసలు ఈ అమ్మాయిలే అంత. అమ్మాయిల్ని నమ్మకూడదు. అసలు దానికి విలువలు లేవు. అంతే...ఆ ప్రేమికుడి ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. నాణానికి మరో వైపులా , అమ్మాయి కోణం నుంచీ ఆలోచించే వాళ్ళు ఎంతమంది. అరచేతుల్లో పసిబిడ్డగా వోదిగినప్పటినుంచీ, అపురూపంగా, కళ్ళలో వత్తులు వేసుకు పెంచిన తల్లిదండ్రులు...తనకు చిన్న కష్టం కలిగితే విలవిల్లడిపోయి ఎన్నో మొక్కులు మొక్కి, తన ముచ్చటలు తీర్చేందుకు ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేసి, వాళ్ళ గుండెల మీద తన్ని, అమ్మాయి వచ్చెయ్యాలి. తెలిసీ తెలియని యువకుడు తనను బాగా చూసుకుంటాడా ? అసలు పోషించగలడా ? ప్రేమ పేరుతో బందిస్తాడా , స్వేచ్చని ఇస్తూ గౌరవిస్తాడా ? అతని తల్లిదండ్రులు తనను నిందిస్తే....ఒక వేళ కష్టపెడితే , ఎవరితో చెప్పుకోవాలి? ఇటువంటి సందేహాలన్నీ అధిగమించి, అమ్మాయికి మీ పై సంపూర్ణ విశ్వాసాన్ని అందించగలిగినప్పుడే , ఆ ప్రేమ సఫలం అవుతుంది. ఒకవేళ ప్రేమ విఫలం అయితే, ఆ అమ్మాయి మనసులో తాను అంత నమ్మకాన్ని కలిగించలేక పోయానని అర్ధం.
సరే, అయ్యిందేదో అయిపొయింది. ఒక అల తీరం దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్తవ్యమ్? ఆ అమ్మాయిని హృదయపూర్వకంగా మీరు ప్రేమించినట్లయితే ఆమెకు మీరు ఇచ్చే కానుక....టన్నుల కొద్దీ విఫల ప్రేమ కవితలు ...అంతేనా? అదే భావంలో, అదే వేదనలో ఆగిపోవడమేనా. ఇలా అంటున్నందుకు క్షమించాలి....ఒకటో ఆరో విఫల కవితలు పర్వాలేదు...కాని మీరు అటువంటి కవితలు రాసే ప్రతీ క్షణం నిరర్ధకం. కాలం ఎంతో విలువయినది. దాన్ని ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకూడదు. మరి ఏమి చెయ్యాలి?
మన జీవితాలని తిరిగి సవ్య దిశలో మలచుకోవాలి. ఇందుకు పెట్టుబడి...' దేహం, ప్రాణం, రక్తం, సత్తువ...' ఇంతకు మించిన సైన్యాలు విజయానికి అక్కర్లేదు. ఈ లోకంలో ప్రేమకు నోచుకోని ఆనాధాలు, రోగగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు ఎందరో ఉన్నారు. వారితో రోజులో ఒక్క గంట గడపండి చాలు. వారిని ఆత్మీయంగా పలకరించండి. బ్రతుకులోని మాధుర్యం తెలిసి వస్తుంది. ఇది మీరు ప్రేమించిన మనసుకు మీరిచ్చే ముగ్ద నివాళి. మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడండి. మీరు కోల్పోయిన ప్రేమ ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ఇది నిజం....మానవ సేవే మాధవ సేవ.

Sunday, February 12, 2017

అభిజాత్యం కాదు... అభిమానం!


అభిజాత్యం కాదు... అభిమానం!
నేను ఇతర పత్రికలకు, పోటీలకు రాయను... ఎందుకంటే...
ఒక అజ్ఞాత వ్యక్తిని నడిరోడ్డు మీద నిలబెట్టి, అతని గుణగణాలు, విలువ ఎంతో తెలియని వారిని అంచనా వేసి చెప్పమంటే ఏం చెప్తారు? జీవిత సారాన్ని కాచి వడపోసిన విజ్ఞులు ముందుకొచ్చి చెప్పినా కూడా అది అసంపూర్ణ వ్యాఖ్య అవుతుందే కాని, సంపూర్ణం కాదు. అలాగే నాకు సరస్వతి అమ్మవారు పెట్టిన ఈ అక్షరభిక్షను ఏదోఒక పోటీల్లో నిలబెట్టి, ‘నా అక్షరాల విలువ నువ్వు తేల్చి చెప్పు’ అని అడగడం అంటే, నేను నాకామె ఇచ్చిన వరాన్ని తక్కువ చెయ్యటమే కదా ! (ఇది నా వ్యక్తిగత భావన). అందుకే నేను ఏ అక్షరాన్ని తక్కువగా చూడను, పత్రిక పెట్టిన మూడేళ్ళలో తిప్పి పంపిన రచనలు ఏ మూడో నాలుగో ఉంటాయి, అంతే. వాటికీ తగిన కారణాన్ని సున్నితంగా చెప్పానే కాని, దుడుగ్గా సమాధానాలు ఇవ్వలేదు. ఎప్పుడు పోటీలు పెట్టినా అందిన ప్రతి రచననూ ప్రచురించాను కాని, వృధా చెయ్యలేదు. ప్రతి అక్షరాన్ని, అక్కున చేర్చుకుని, ఆదరించాను.
అసలు పత్రికల ‘అంచనా/పోలిక’ అన్న విషయంలోనే ఎన్నో మెలికలు ఉంటాయి. వారికి సన్నిహితులు, ఆప్తులైన ప్రముఖ రచయతలకు మొదటి ప్రయారిటీ, రెగ్యులర్ గా రాసే వారికి మరో ప్రైయారిటి, ఆశాజనకమైన కధలే వెయ్యాలనీ, లేకపోతే ప్రతులు అమ్ముడుపోవన్న మరో ప్రయారిటీ, మరో కధలో వాళ్ళు రూపొందించిన కొన్ని ‘కీ వర్డ్స్’ ఉండకూడదన్న ప్రత్యేక ప్రైయారిటి, ఇలా చాలా ఉంటాయి. ఆ అభ్యంతరకర చిన్న పదం ఏమిటో, బ్రహ్మ దేవుడికి ఎరుక. ఇక వారు చెప్పే ‘సో కాల్డ్ జడ్జీల’ భావాలు కూడా వారి మనస్తత్వాలను అనుసరించి పెర్వర్టేడ్ గా ఉండడాన్ని నేను స్పష్టంగా గమనించాను.
ఇలా ఉన్నా సరే... ఈ మూసపోసిన పాత మార్గంలో వెళ్లకపోయినా సరే, నా అక్షరం ఖండఖండాంతరాలు దాటింది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారంతట వారే గుర్తుపట్టి, నావద్దకు వచ్చి, పలకరించేలా చేసింది. ‘భావరాణి’ గా నాకు పట్టం కట్టేలా చేసింది. నాకొక అస్తిత్వాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. పలువురు సాహితీ దిగ్గజాల, సినీ ప్రముఖుల మన్ననలు అందుకుంది. వారంతట వారే నాకు ఫోన్ చేసి, అభినందిస్తారంటే మీరు నమ్ముతారా? ఇవన్నీ నా బాధ్యతను మరింత పెంచాయి. నా కలానికి సంతులనం నేర్పాయి. సామాన్యుడైనా, సమ్మాన్యుడైనా, వారు చదివి, చలించి, స్పందించి చెప్పే ఆ ఒక్క మాటా చాలు నాకు. అక్షరాల మీద ఆదాయం వద్దు, సన్మానాలు, పురస్కారాల కోసం పావులు కదిపి, పళ్ళాలు కొట్టే వెంపర్లాట నాకొద్దు. అక్షరం నాకందించిన మర్యాదకి, ఆ అక్షరాన్ని అమ్మలా ఆరాధిస్తూ, సమాజానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఉపయుక్తమైన సందేశం ఇవ్వగలిగితే చాలు.
జీవితం నవరసాల సమ్మేళనం అయితే, కటువైన వాస్తవాలు కూడా ఉంటాయి, మరి కధలన్నీ తియ్యగానే, పంచదార తిన్నట్టే ఎలా ఉంటాయి? నవరసాల సంగమమే కదా జీవితం ! చివరికి కుప్పలు తెప్పలుగా వచ్చిన రచనల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కోలేక మరుగున పడుతుంది. ఆ కధ స్వీకరించబడిందో లేదో తెలుసుకునే లోపల కన్నెపిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకుని, తల్లులు కూడా అయిపోతారు. ఇలా నా కలాన్ని, కాలాన్ని వృధా చెయ్యటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పోటీలకు, ఇతర పత్రికలకు దూరం. విలువలు, కట్టుబాట్లు గురించి ‘ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి’ అని హితబోధలు చెయ్యలేదు. అలాగని, దేనికైనా తెగించే విశృంఖల సాహిత్యానికీ ఆజ్యం పోయ్యలేదు. నా మనసును స్పందింప చేసిన అంశాన్ని, నా భావాల్లో హృద్యంగా పెట్టి అందించాను. మిత్రులు ఎవరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అడిగినప్పుడు సామాజిక బాధ్యత కల ఒక రచయిత్రిగా కధలు, కవితలు ఉచితంగానే రాసిచ్చాను. ఇప్పటికీ ఇదే నియమానికి కట్టుబడి రాసిస్తాను. ఊరికే రాయించుకుని, పక్కన పారెయ్యకుండా, అక్షరానికి ఒక మర్యాద, గౌరవం ఇచ్చే వారికోసం రాస్తాను.
భావరాజు పద్మిని
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా భావాలను మీకు సుస్పష్టం చెయ్యాలనే ! నిరంకుశత్వం కాదు, నేను నమ్మిన భావాలకు కట్టుబడే నిబద్ధత ! నాది అభిజాత్యం కాదు, అక్షరం మీద ఎనలేని అభిమానం. అర్ధం చేసుకుంటారు కదూ !
మీ

Monday, February 6, 2017

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

ఫ్రెండ్స్, ఈ మధ్యనే బెంగళూరులో ఓ 18 ఏళ్ళ కుర్రాడు తాను పనిచేసే టైల్స్ షాప్ లో పనికి సైకిల్ పై వెళ్తూ, KSRTC బస్సు గుద్దెయ్యడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ కుటుంబానికి ఆ కుర్రాడే ఆధారం. అతను మరణ వేదనలో ఉండగా, చుట్టూ ఉన్న జనం ఓ 40 నిముషాల పాటు అతని ఫోటోలు, వీడియోలు తీస్తూ నిలబడి ఉన్నారట ! ఎంతటి శోచనీయమైన విషయం? అవతలి మనిషి చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతుంటే, రక్షించాల్సింది పోయి, తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఏమి చేసుకుంటాము ? రానురాను ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మనం మరచిపోతున్న విషయం ఏమిటంటే – ప్రమాదాలు అనేవి ఎప్పుడైనా ఎవరికైనా జరుగవచ్చు. అందుకే బాధ్యతగల పౌరులుగా చదవండి, షేర్ చెయ్యండి.
అసలు ప్రమాదం జరిగిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లకపోవడానికి మొదటి కారణం ఏమిటి ? తమనే అనుమానంగా చూసి, కేసులు బనాయిస్తారన్న భయమే కదా ! అందుకే కొత్తగా సుప్రీం కోర్టు ఆమోదించిన చట్టాన్ని గురించి, గోల్డెన్ అవర్ యొక్క ప్రాధాన్యతను వివరించడానికి, ఈ వ్యాసం రాస్తున్నాను.

గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ?
ఎవరికైనా, ఎటువంటి ఆరోగ్య సమస్య వల్లనైనా అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు మొదటి కొన్ని నిమిషాలు తీసుకోవాల్సిన వైద్య సంబంధమైన చర్యలు అత్యంత ముఖ్యమైనవి. వీటికి సకాలంలో, సవ్యంగా చేపడితే చాలావరకు ప్రాణహానిని లేదా సమస్య వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. ఇలా అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందాల్సిన మొదటి సమయాన్నే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు(ట్రామా), గుండెపోటు, పక్షవాతం, సెప్సిస్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మనం తప్పక ముందడుగు వేసి, బాధితులను సమీప ఆసుపత్రికి చేర్చాలి.
రోడ్డు ప్రమాదాల వల్ల ట్రామాకు గురైనప్పుడు వీలైనంత తొందరగా వైద్య సహాయం అందించగలిగితే ప్రాణహాని నుంచే కాకుండా, ఇతరత్రా శాశ్వత సమస్యలు సంభవించకుండా నివారించవచ్చు. ఉదాహరణకు వెంటనే ఆక్సిజన్ అందించడం, ఏదో ఒకవిధంగా రోగి ఊపిరి తీసుకునేటట్లుగా చేయడం, అవసరమైతే శ్వాసనాళంలోకి గొట్టం వేయడం, రక్తస్రావాన్ని ఆపడం, స్లైన్ ఎక్కించడం.. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ట్రామా లైఫ్ సపోర్టు (ఏటీఎల్‌ఎస్) చర్యలుగా చెబుతారు. వీటిని ఎంత తొందరగా అందిస్తే రోగిని బతికించుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మొదటి గంటలోనే అందించగలిగితే బతికే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా రుజువులున్నాయి. దీన్నే ట్రామా గోల్డెన్ అవర్ అంటారు. అవసరాన్ని బట్టి తొందరగా సర్జరీ చేయడం దీనిలో ముఖ్యాంశం.
ఇండియాలోని ట్రౌమా కేర్‌ సెంటర్‌లు:
వీటి లక్ష్యం ఏంటంటే ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం అందించడం, ఆ వ్యక్తి లేదా వ్యక్తులు మృత్యువాత పడకుండా కాపాడడం. రహదారి ప్రమాద బాధితులు సులభంగా దగ్గరలోని అన్ని సదుపాయలున్న వైద్య కేంద్రానికి చేర్చడమే కీలకం. మన దేశంలో ట్రౌమా కేర్‌ సెంటర్‌లు మూడుస్థాయిల్లో పని చేస్తున్నాయి.
ఒకటవ స్థాయి: జిల్లా ఆసుపత్రులు
రెండవ స్థాయి: మెడికల్‌ కాలేజి ఆసుపత్రులు
మూడవస్థాయి: అత్యాధునిక ఆసుపత్రులు (AIIMS), నిమ్స్ వంటివి
ఈ ట్రౌమా కేంద్రాలలో పనిచేసేందుకు సిబ్బందిని కూడా నియమించింది.
ఆ వ్యక్తి, వ్యక్తుల గురించి మీకు ఏ విధమైన సమాచారం దొరక్కపోతే 100, 108 లకి సమాచారం ఇవ్వండి. ఆసుపత్రిలో చేర్చండి. 108 అంబులెన్సె ఎంత చక్కటి సేవలు అందించిందో మనకి తెలుసు. ఒకవేళ అంబులెన్సె లేనట్టయితే, ప్రమాదం బారిన పడిన వారికి వెంటనే ప్రధమ చికిత్చ అందించి, దగ్గరలోని జిల్లా ఆసుపత్రికి చేర్చండి. అక్కడ చికిత్స అందుతుంది. లేదా రహదారికి దగ్గరలోని వైద్యకళాశాల ఆసుపత్రి ఉంటే అక్కడ చేర్చండి లేదా ఈ విషయాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించండి.

ఇందులో మనకు ఏమైనా రిస్క్ ఉంటుందా ?
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సాయం చేయడానికి, వారిని ఆస్పత్రిలో చేర్చడానికి అనేకమంది వెనుకడుగు వేస్తూ వుంటారు. దీనికి కారణం ఆలా సాయం చేయాలని ముందుకు వచ్చే వారిని అటు పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ అనంత ప్రశ్నలతో వేధించి చంపడమే. పైగా వారిని అనుమానంగా చూస్తూ, వారి తీరును తప్పుపడుతూ వ్యవహరించడమే ప్రధాన కారణం.


ఈ చట్టం కింద రూపొందించిన మార్గదర్శక సూత్రాలకు అటు పోలీసులు, ఇటు ఆస్పత్రి అధికారులు తప్పనిసరిగా కట్టుబడి వుండాల్సిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని ముసాయిదాను రూపొందించింది. ఒకవేళ ఎవరైనా ఈ మార్గదర్శక సూత్రాలకు కట్టుబడకుండా ఉల్లంఘిస్తే వారికి శిక్ష కూడా వుంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే 48గంటల వరకు చికిత్స అంతా ఉచితంగా జరుగుతుంది.
· రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా ఆసుపత్రిలో చేర్చవచ్చు.
· పోలీసులు మిమ్మల్ని ఏవిధమైన ప్రశ్నలు అడగరు.
· రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యులు వెంటనే వైద్యం అందించాలి.
ఈ చట్టం గురించిన మరిన్ని వివరాలను క్రింది లింక్ లో చూడండి.


గుర్తుపెట్టుకోండి ... రోడ్డు ప్రమాద బాధితుల్ని అలా వదిలేసి వెళ్ళకండి. ప్రమాదం జరిగిన మొదటి గంటలో వారికి వైద్యసహాయం అందివ్వగలిగితే మరణాన్ని నివారించవచ్చు.

Wednesday, December 14, 2016

ఓ చల్లని వెన్నెల వేళ...

ఓ చల్లని వెన్నెల వేళ...
---------------------------
భావరాజు పద్మిని - 14/12/16

వెన్నెలంటే ఎవరికి ఇష్టముండదు? వలపు మండితే వగరు వెన్నెల, వలపు పండితే అగరు వెన్నెల, విరహాలు రేపే పొగరు వెన్నల, ఏటి అద్దంలో జిలుగు వెన్నెల, సందె పొద్దులో పసిడి వెన్నల... ఇలా వెన్నెల జ్ఞాపకాలు ప్రతి మనసులో పదిలమే ! అలాగే... తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక్కటే జాబిలి... తెలుగువారి హృదయాలలో ఒక్కటే వెన్నెల -సిరివెన్నెల ! ఆ వెన్నెల కళ్ళలో ఒక్క క్షణమైనా మెరవాలని, ఆ వెన్నెల భావాల్లో ఒక్క సెకనైనా తడవాలని, పుంభావ సరస్వతి వంటి ఆ వెన్నెల కాళ్ళకు మ్రొక్కి పునీతులు కావాలని, ఎన్ని మనసులు పరితపిస్తూ ఉంటాయో ! మరా మాటలాంటిది, పాటలాంటిది... రసమయకావ్యమై చెవుల్లో మారుమ్రోగే అక్షర లాస్యాలు... నిద్రాణమై ఉన్న హృదయ కవాటాల్ని తెరిచి, భావాల సుమగంధాలు రంగరించిన అమృతవర్షం కురిపిస్తాయి. ఆ పరవశంలో డోలలూగే మనసులు... "జీవితంలో ఒక్కసారైనా, ఎలాగైనా ఈ మహానుభావుడిని కలిసితీరాలి," అని తీర్మానించుకుంటాయి. నేనూ అంతే...

మొబైల్ స్క్రీన్ మీద ఆయన పేరుతో వస్తున్న కాల్ చూసి, ఒక్కక్షణం నా కళ్ళు చుస్తున్నది నేనే నమ్మలేకపోయాను. ఆయన నాకు ఫోన్ చేస్తున్నారా? హైదరాబాద్ వచ్చే ముందునుంచి ఆయనను కలిసే అదృష్టం కల్పించమని మెసేజ్/ఫోన్ చేస్తున్నాను. కానీ, ఆయన జవాబివ్వలేదు. ఇక కుదరదేమోలే అనుకున్న సమయంలో ఈ కాల్. ఉదయం గురువుగార్ని దర్శించుకుని, ఆయన దీవెనలు పొందినందుకు జరుగుతున్న అద్భుతమా ఇది ? ఉద్వేగాన్ని అణచుకుంటూ ఫోన్ తీశాను.
"ఏమ్మా పద్మిని, ఇప్పుడు 6.30 అయ్యింది, నువ్వు కలుస్తానని అడుగుతున్నావు కదా, రాగలవా? ఇప్పుడు చీకటి పడిపోతుందని అనుకుంటే రేపు ఉదయం రావచ్చు. "
ఆయన్ను కలిసే అదృష్టం ఉండాలే కానీ, అర్ధరాత్రి అడవిలోకైనా ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. 'ఇప్పుడొచ్చేస్తానండి ' అన్నాను. ఆయన అడ్రస్ చెప్పారు. వెంటనే కాబ్ బుక్ చేస్కుని బయల్దేరాను. తలుపు ఆయనే తీసారు. ఆఫీస్ అనుకుంటా...



ఆ గదంతా నీలి వెన్నెల, నిండు వెన్నెల... నీలిరంగు పెయింట్ వేసిన గదిలో, మబ్బుల మధ్య ఎదురుగా..."నా ఉచ్వాసం కవనం, నా నిశ్వాసం గానం..." అని రాసుంది. చుట్టూ ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న చిన్న ఫోటోలు డిజైన్ చేసి అంటించారు. ఇక ఆయన వెనుక... నింగి నుంచి కోసుకొచ్చిన జాబిలి దీపంలా పెద్ద గుండ్రటి లైట్. అందులోనూ ఆయన ఫోటోలు లీలగా కనిపిస్తున్నాయి. ఆయన ఎదురుగా ఒక చిన్న లైబ్రరీలా కట్టిన అరల్లో, ఎన్నో పుస్తకాలు. ఆ గదిలో అడుగుపెట్టిన వారు ఎవరైనా సరే, ఆ డిజైనర్ ను అభినందించకుండా ఉండలేరు. ఓ పక్క ఉద్వేగం, ఓ పక్క ఆనందం... అలా చూస్తూ ఉన్నాను. ఆయనకేదో ఫోన్ వచ్చింది, మాట్లాడారు. తర్వాత ఆయనే పలకరించి, నా రచనల గురించి అడిగారు. నేను రాసిన అహోబిల నృసింహ శతకం చూపించాను, తర్వాత 'సాహితీ యుగకర్త' అంటూ ఆయన మీద రాసిన కవిత... ఇలా కొన్ని చూసి, గతంలో వాట్స్ ఆప్ లో పంపినవి కూడా బాగున్నాయని, నా తెలుగు బాగుందని మెచ్చుకున్నారు. ఆయన నుంచి అందిన ప్రశంస నా పెన్నుకి, వెన్నుకి కొండంత బలం.

పెద్ద పెద్ద కళ్ళతో నేను అచ్చంగా వారి అమ్మాయిలా ఉన్నానట. వారి కోడల్ని పిలిచి, పరిచయం చేసారు. "నీకు గురువూ నువ్వే, శిష్యుడివీ నువ్వే... నీ మార్గం నువ్వే నిర్దేశించుకోవాలి..." అంటూ, జీవితానికి, కవిత్వానికి, వాళ్ళ నాన్నగారికి సంబంధించిన కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పారు. ఆయనతో మాట్లాడుతుంటే నడిచే విజ్ఞానఖనితో మాట్లాడిన అనుభూతి కలిగింది. పై ఫ్లాట్ లో ఉన్న వారి ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడే చూసాను ఆయనలో పదిలంగా ఉన్న పసిపాపని. అప్పటిదాకా జీవితసారాన్ని కాచి వడపోసినట్లు కనిపించిన ద్రష్ట ఈయనేనా అనిపించింది.

ఆయన సాహిత్యోపాసనకు, పరవశించి ఆయన ఇంట్లో పారాడేందుకు వచ్చిన దేవేరి భారతేనేమో... మనవరాలు ఆర్యభారతి. జగద్గురువు శంకరాచార్యుల వారి తల్లి 'ఆర్యాంబ.' సిరివెన్నెల గారూ, మనవరాల్ని అలాగే పిలుస్తారు. 'బంగారూ... ఎక్కడా...' అనంగానే, ఆటబొమ్మలతో సహా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆర్యాంబ. పాపాయికి ఏం తెలుసు ఆ తాతగారు ఎవరో? ధీమాగా దబాయించేస్తుంది, ఇంటికీ, ఆఫీస్ కి మొత్తం ఆమే మహారాణి. 'ఆడుకుందాం రా తాతా...' అంటుంది. 'రాసుకోవాలి బంగారూ ' అంటారు ఈయన. 'సరే, నేనూ వస్తా పద...' అంటుంది బుజ్జి భారతి. తాతని లాగి కుర్చీలో కూర్చోపెట్టి, ఆయన ఒళ్లో కాళ్ళు పెట్టుకుని, 'ఏదీ నామీద రాసిన పాట పాడు' అని పాడించుకుంది. పరమభాగావతుడికి భగవంతుడికి ఉండే చనువు వంటిది ఆ చనువు. ఎటువంటి అరమరికలూ లేవు. మనవరాలి మీద మనసారా రాసిన పాట ఆయన నోట వింటూ నేనూ పరవశించిపోయాను. బయట లోకానికి ఎంత గొప్పవారైనా, ఇంట్లోని వాళ్ళతో, పిల్లలతో ఇలా కలిసిపోతేనే... అసలైన జీవనమాధుర్యం తెలుస్తుందని, ఆయన ఆచరణలో చూపారు. ఆర్యాంబతో నన్ను 'అత్తా, అత్తా' అని పిలిపించారు. ఫోటోలు తీసుకుంటూ ఉంటే, 'ఏదమ్మాయ్, ఓ సెల్ఫీ తీసుకుందాం రా, ఇంతవరకూ నేను ఎవరితోనూ సెల్ఫీ దిగలేదు. మొదటిది నీతోనే !' అన్నారు. నాకు లోలోపల సంబరం.



ఆ పుణ్య దంపతుల దీవెనలు తీసుకుని, వారు పెట్టిన చక్కటి పులిహోర తిని వెనక్కు బయల్దేరాను. చాలు భగవాన్ చాలు... సిరివెన్నెల గారి డైరీలో నాకోసం ఒక అరగంటని దయతో కేటాయించి ఇచ్చావు, ఈ జన్మకిది చాలు...

(11.12.2016 న అనుకోకుండా సిరివెన్నెల గారిని కలిసిన అనుభూతి మీతో ఇలా పంచుకుంటున్నాను.)

Tuesday, September 13, 2016

నా జానపద గేయాలు

ఎట్టా సెప్పేది? - జానపద గేయం
-------------------------------------
భావరాజు పద్మిని - 13/9/16

'పేమా, దోమా?' అంటే ఏందే? - అడిగాడు ఆ మొరటుబావ. ఆమెకు తెలిసింది పచ్చని ప్రకృతి ప్రపంచమే. కవితలు, కవనాలు, సినిమాల లోకాలు తెలియని ఆ గిరిజన స్త్రీ తన ప్రేమను ఎలా తెలియజేస్తుంది? ఎలా నిర్వచిస్తుంది ? ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జానపద గేయం.

మాటల్లో చెప్పమంటె మనసెట్టా సెప్పేది?
గుండెల్లో పెరిమెంతో గుట్టెట్టా విప్పేది?

నల్లమబ్బు సూడగాను నెమలి కాసుకుంటాది,
నీకోసం కాసుకున్న కళ్ళనడుగు సెబుతాయి.

గండుతేటి రొదల ఇనగ పూవు పులకరిత్తాది
నీ ఊసులింట మురిసిపొయె సెవులనడుగు సెబుతాయి.

కొండగుండె కౌగిలించి మబ్బు మిడిసిపడతాది
నిన్నల్లలేక నీరుగారు నానీడ నడుగు సెబుతాది.

కాగి కాగి నేల ఒళ్ళు నింగికేసి సూత్తాది
ఏడి సెగల ఏగుతున్న ఉసురు నడుగు సెబుతాది.

ఎన్నలంత ముద్దరేసి ఏరు ఎగసిపడతాది
గుండె మీన కుదురుకున్న నీబొమ్మ నడుగు సెబుతాది.



 ప్రేమ గురించి జానపద శైలిలో చెప్పావు కదా, మరి దోమ గురించి కూడా చెప్పవా ? అని ఒకరడిగారు. వెంటనే నాకున్న అపరిమితమైన 'అపరిచితురాలు' షేడ్స్ లోంచి ఓ నీడ నిద్దర లేచింది. సరే, జానపదుల్లో ఒక అలవాటు ఏంటంటే... కోపాన్ని తడిక మీద, బల్లి మీద, పిల్లి మీద చూపడం. చుట్టాల పోరు పడలేని ఓ ఇల్లాలు, వాళ్ళను దోమ మీద పెట్టి తిడితే ఎలా ఉంటుంది - అన్న ఊహే ఈ దోమపాట! సరదాకేనండోయ్.. :)
సెప్పపెట్టకుండ దోమ సక్కగొచ్చి కూకుంది
ఒంటిలోని సత్తువంత పీల్చి ఇరగబడతాంది!

ఏటేటో కావాలని సెవిలోన హోరంట?

తరమబోతే పోదాయే తగని తంటాలంట !

ఇల్లంతా కలతిరిగి ఎతికేది ఏందంట ?
ఇసిరికొట్టబోతే ఎనక చేరి ఇకఇకలంట !

రగతమంత తాగితాగి బలిసేది ఎందుకంట?
ఖరుసులేక ఊరిమీన బతికేందుకేనంట!

సప్పట్లు కొట్టేది సోగతాలు కాదంట ?
సాలుగాని సంబరాలు సోదిమాని పొమ్మంట!

********************************************************************

చుప్పనాతి సూరీడు
——————————
భావరాజు పద్మిని -1/ 7/16
(సరదాగా రాసిన ఓ జాన పద గేయం... )
చుప్పనాతి సూరీడు చప్పున కవ్విస్తాడే
చురచుర చూస్తావుంటే చిలిపిగ నవ్వేస్తాడే
నంగనాచి నాంచారి నేనంటే పానమైన
నువ్వెవరో నేనెవరో నన్నట్టే ఉంటాది //చుప్పనాతి సూరీడు//
ఏటికాడ నీళ్ళబిందె నోపలేక నడుస్తాంటె
ఎనకెనకే తానుకూడ తిప్పుకుంటా వస్తాడే
నడుమొంపున నీళ్ళబిందె వగలెన్నో ఒలకబోసె
ఒయ్యారం సూత్తుంటే నాగుండె జారెపిల్ల //చుప్పనాతి సూరీడు//
గిన్నెకోడి నొదిలిపెట్ట గంపనెత్త బోతాంటే
గంపకింద కోడిలాగ దాగి కూకుంటాడే
ఎర్రఎర్ర కళ్లతోనూ మిర్రి మిర్రి సూత్తవుంటే
నొసట పొద్దు పొడిసినట్టు ముద్దుగుంటవే పిల్ల //చుప్పనాతి సూరీడు//
మడిసేలో వడిసేలు వాడిసూసి యిసురుతాంటె
రాయి తనకె తాకినట్టు పిట్టలాగ ఒరుగుతాడె
నీ సేతి గాలానికి తగులుకున్న చేపలాగ
నా మనసే మతిసెదిరి గిలగిల మంటాందె పిల్ల //చుప్పనాతి సూరీడు//

******************************************************************************************************************
జానపదుల తీరు తెన్నులు విచిత్రంగా ఉంటాయి. మగడంటే ఆమెకు ప్రాణం. కాని అతను, పువ్వు పువ్వుకు తిరిగే తుమ్మెద లాంటి వాడు. భర్తంటే తనకున్న ఇష్టం ఒకప్రక్క ఆమెకు ఎంతటి అడ్డంకి అంటే, అతన్ని పల్లెత్తు మాట కూడా అనేందుకు ఆమెకు మనస్కరించదు, అలాగని, తనకే సొంతం కావాలనుకున్న అతని ప్రేమ ఇతరులకు దక్కుతుంటే చూస్తూ ఊరుకోలేదు. అందుకే చంద్రుడి వంకతో, భర్తను హెచ్చరిస్తోంది. సున్నితంగానే అనునయించాలి, ఎలాగ? ఈ సందర్భాన్నిఎలా రాయాలి, అని ఊహించి రాసిన జానపద గీతం ఇది.
నండూరి వారి "ఆనాటి నావోడు సెందురూడా' పంధాలో సాగిపోయే ఈ ఊహాత్మకమైన గీతం మీకోసం... జానపద గేయ రచన కొత్త కనుక తప్పులుంటే, పెద్దలు దయుంచి తెలుపగలరు.

సెందురూడా - జానపద గీతం
---------------------------------
భావరాజుపద్మిని- 11/7/16

ఆడఈడ తిరగమాకు ఆకతాయి సెందురూడా
మాయదారి మబ్బునిన్ను మింగుతాది సెందురూడా

నీటిమీన నీడసూసి నవ్వుతావే సెందురూడా
ఎన్నెలంత దోచిఏరు ఎగురుతాంది సెందురూడా // ఆడఈడ//

రెల్లుగడ్డి మాటుసేరి ఊసులేల సెందురూడా
తీపుముళ్ళు చీరుతాయి తాకమాకు సెందురూడా // ఆడఈడ//

సుక్కలెన్నో పక్కచేరి నిక్కుతాయి సెందురూడా
సక్కనైన సంగడేదో సూడవోయి సెందురూడా // ఆడఈడ//

కునుకుమాని కలువనిన్నె కలవరించె సెందురూడా
మనసులోని మక్కువెంతొ కొలిసిసూడు సెందురూడా // ఆడఈడ//

***************************************************************************************************************

“ఈ గోదావరిలో ఏముందో తెలీదు. మౌనంగానే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలసటను అలలతో కడిగేస్తుందో, పైరగాలి వీవెనతో సేద తీరుస్తుందో గాని, మనసు కలతగా ఉన్నప్పుడు, కాసేపు ఈ నది ముంగిట మౌనంగా కూర్చుంటే కొత్త ఊపిరి పోసుకున్నట్లుగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు నదిఒడ్డున తచ్చాడుతుంటే, చిలిపి అలల సవ్వడితో కేరింతలు కొడుతూ మనతో ఆడుతున్నట్లుగా ఉంటుంది. బేధభావాలు చూపకుండా అందరినీ సమానంగా, అమ్మలా ఆదరిస్తుంది. ఆటుపోట్లకు తలొగ్గక, పాత నీటిని, కొత్త నీటిని కలుపుకుంటూ ముగ్ధంగా సాగిపోయే ఈ నది, మౌనంగా జీవన వేదాన్ని బోధిస్తున్నట్లుగా ఉంటుంది... “ మనసులోని ఆరాధననంతా కళ్ళలో నింపి, గోదావరినే తదేకంగా చూస్తూ అన్నాడు శరత్. ఇదే పాటగా జానపద భాషలో రాయగాలవా అంది చంద్రిక సవాలు చేస్తూ...
పల్లవి : గుండె గోదారితోన ఊసులాడతాంది
         మాట గొంతు దాటక మూగవోయింది

         గోదారి అమ్మలా కుశలమడుగుతాది
         చిలిపి అలల సడితోన ఆటలాడుతాది  
         పైరగాలి పైటతో నిలువెల్లా నిమురుతాది
         నిండుమనసుతోన నన్ను సల్లగ దీవిత్తాది // గుండె //

         బతుకు పడవ ఆటుపోట్లు వాడుకేనంది
         కుంగకపొంగక సాగితె ఏడుకేనంది
         పాతనీరు కొత్తనీరు కలుపుకుపొమ్మంది
        నిండినా ఎండినా నిబ్బరంగ నవ్వమంది // గుండె //


***************************************************************************************

బెట్టు సాలుసాలు - జానపద గేయం
----------------------------------------
భావరాజు పద్మిని - 28/9/16

మరో జానపద గేయం. ఆమెకు, తన మావ అంటే ఇష్టం, అతనికీ ఇష్టమే, కాని చెప్పడు. ఒకటే బెట్టు, బింకం. అది కరిగేలా తన మావ వెంట పడుతూ కవ్విస్తోంది ఓ కోణంగి. నిండు మేఘం కురవకుండా ఆగుతుందా ? నీటివడి ఆనకట్టలకు ఆగుతుందా? నిప్పు వేడి కప్పిపెడితే దాగుతుందా, అలాగే నామీద నీకున్న ప్రేమ కూడా, ఎన్నాళ్ళో దాచాలేవు, అంటూ ఇలా వెంటపడుతోంది. తేలిగ్గా బాణీ కట్టి, పాడగలిగిన ఈ పాట మీకు నచ్చితే, సరదాగా పాడి, అప్లోడ్ చేస్తాను.


బెట్టు సాలుసాలు గాని కట్టిపెట్టు మావా
గుండెమాటు గుట్టు కాస్త విప్పిసెప్పు మావా
మంకుపట్టు పట్టి నువ్వు డొంకలెంట పోతపోత
బింకమెంత పోయినా నే నొల్లకోను మావా

నీకు నాకు దూరమెంతో కానవచ్చె మావా
సెయ్యి సాపి సూడు మల్ల సెంతనుంట మావా
నీరు నిండ నింపుకున్ననల్లమబ్బు పారకుండ
నింగి అంచు వీడకుండ ఆగబోదు మావా //బెట్టు సాలుసాలు//

గాలమేసి గుండెనేమో లాగినావు మావా
మక్కువేదొ సెప్పకుండ దాచినావు మావా
అడ్డమేసి దిడ్డమేసి నీటిఊట నాగమన్న
ఉరకలేసి దుంకకుండా ఉండబోదు మావా //బెట్టు సాలుసాలు//

పైరగాలి పైటతోని ఆటలాడె మావా
మాయదారి సెందురూడు కన్నుగీటె మావా
నిప్పురవ్వ కప్పిపెట్టి నిక్కుసూపుతున్నగాని
మనసులోన అగ్గివేడి దాగాబోదు మావా //బెట్టు సాలుసాలు//

*******************************************************************************************************************************
మరుగున పడుతున్న జానపద గీతాలను తిరిగి బ్రతికించేందుకు నేను రాస్తున్న జానపద గేయాలకు ‘మల్లి పాటలు’ అని పేరు పెట్టాను. జానపదులు కలుసుకునేది ఎక్కువగా జాతరలలో, సంతలలో. అలా ఓ జాతరలో కలిసారు ఓ జంట. కళ్ళూ కళ్ళూ కలిసాయి... వెంటనే ఆ కుర్రాడు చందమామతో మాట్లాడుతున్నట్టు ఓ పాటను అందుకున్నాడు. ఉడికిస్తూనే తన గురించి చెప్పాడు. అమ్మాయి కూడా గడుసుదే మరి. ఊరుకుంటుందా... ఎలా సమాధానం ఇచ్చిందో నేను రాసి, స్వరపరచి, పాడిన ఈ పాటలో వినండి...
తాయిరోయ్ తాయిరోయ్ సందమావ
సుక్కలాంటి సిన్నదంట సందామావ
తిప్పుకుంట వచ్చినాది సందామవ
దాని సోకు మాడ నిక్కుసూడు సందామావ

తందెరోయ్ తందెరోయ్ సందామావ
సాకులాంటి పిల్లగాడు సందామావ
జాతరంత కాపుగాసె సందామావ
వీడి మిర్రికళ్ళ సూపుసూడు సందామావ

సూరిగాడంటేను ఊరికే రాజులే
పల్లెకారోల్లంత పాణమిత్తారులే
తల్లోన నాలుకల్లె సందామావ
నేను నలుగుర్లొ మెలుగుతుంట సందామావ
మాయగాడ్ని కాదుమల్ల సందామావ
నాతొ మాటగలిపి సూడరాదె సందామావ
//తాయిరోయ్//

మల్లంటె మాటగాదు మారాణి నేనులే
సిటికేత్తె సాలంట సాలాము సేత్తరే
కోరమీసమున్న వోరు సందామావ
కోరిసుట్టు దిరిగినారు సందామావ
కొరకరాని కొయ్యనంటు సందామావ
విస్గి ఎనక మళ్ళి పోయినారు సందామావ
//తందెరోయ్//

వగరు పొగరు లేనిపిల్ల వరసనాకు కాదులే
జోరు కాస్త దించితేనె ఏడుకైన ముద్దులే
కొయ్యనంటు కొయ్యమాకు సందామావ
నీ సూపు గుట్టు విప్పుతాంది సందామావ
ఈడుజోడు నేనుగాద సందామావ
సక్క సందెకాడ సెంతసేరు సందామవ
//తాయిరోయ్//

ఆటపాటలోన నాకు సాటిపోటి లేరులే
గడుసు పిల్లనంటు మంది సెప్పుకుంట హోరులే
కాని అయ్యసాటు బిడ్డనమ్మ సందామావ
హద్దుమీరి నడవబోను సందామావ
నచ్చినావు గాని నువ్వు సందామావ
పద్దతైన తోవసూడు సందామావ
//తందెరోయ్//