Wednesday, June 14, 2017

పొదుపు, పొదుపు... మాట అదుపు...


పొదుపు, పొదుపు... మాట అదుపు...
---------------------------------------------
భావరాజు పద్మిని - 20/5/17
"నేను నీకు మరీ అంత వెర్రోడిలా కనిపిస్తున్నానా?"
"నేనంటే చులకనా?"
"మా అమ్మాయి పెళ్లి. అయినా పెళ్ళికి మీరెందుకు వస్తారులే."
"నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నాలాంటి వాళ్ళతో వేగలేరు."
"అయినా మీకు నాకంటే వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం..."
"మేవెందుకు కనబడతాంలే. మీ సర్కిల్ పెరిగిందిగా..."
ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొందరు. వీటినే మన పెద్దవాళ్ళు 'పుల్ల విరుపు' మాటలు అంటారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వేసే ముందు వీటికి ఎదుటివాళ్ళు కొంటెగా "ఔను, నిజమే" అన్న జవాబిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా మాట్లాడినప్పుడు, మనం మళ్ళీ అలా మాట్లాడకుండా ఉండాలని, గుణపాఠం నేర్చుకోవాలని, కొందరు కావాలని "ఔనని" జవాబిస్తారు. ఇది మీ మేలు కోసమే ! ఎందుకంటే మనకీ మాటతీరు ఎవరోఒకరు నేర్పాలిగా !
ఇటువంటి ప్రశ్నలకు మూల కారణం ఆత్మ న్యూన్యతా భావం. తమను తాము తక్కువని భావించుకుని, కుమిలిపోవడం. మరి ఇటువంటి ప్రశ్నలకు "ఔను" అని జవాబిస్తే... ఇలా అడిగిన వారు మరింత గాయపడతారు. ప్రపంచం మన ఆలోచనలకు ప్రతిబింబాల వంటివారని అంటూ ఉంటారు. మరి మనమే మనల్ని తక్కువ చేసే అవకాశాన్ని మన మాటల ద్వారా వాళ్లకు ఇచ్చి, తర్వాత వాళ్ళు ఔనన్నారని కృంగిపోయి... నేనన్నది, వారు ఔనన్నారని, నేను ఫీల్ అయ్యానని, వారూ ఫీల్ అవుతారని... అయ్యారని... సినిమాల్లో ఎ.వి.ఎస్ లాగా అందరి వద్దా కుమిలిపోయే ముందు... నాదో ప్రశ్న ! " అసలు మొదలు పెట్టింది ఎవరు?" ఇటువంటి దిగుళ్ళకి కారణం మాట్లాడే విధానం రాకపోవడమే !
"నోరు మంచిదైతే ఊరు మంచిది ఔతుందని" పెద్దలు అంటారు. మనం చెప్పే విషయం ఎంత కటువైనదైనా దాన్ని మెత్తగా, చెప్పే విధంగా చెప్తే ఏ స్థాయిలో ఉన్నవారినైనా మెప్పించవచ్చు. పూర్వకాలంలో మునులు మాట్లాడేముందు తమకు తాము మూడు ప్రశ్నలు వేసుకునే వారట ! మొదటిది "ఇది సత్యమేనా?" అని. అది సత్యమైతే... రెండవ ప్రశ్న... "ఈ మాటలు మాట్లాడడం అవసరమేనా?" అని. మాట్లాడబోయే మాట ఈ రేఖను కూడా దాటితే చివరి ప్రశ్న... " ఈ మాట వలన నేను గాని, ఇతరులు గాని గాయపడతారా ?" అని. తాము మాట్లాడబోయే మాట ఈ మూడు రేఖలు దాటితేనే వారు నోరువిప్పి మాట్లాడేవారట. "వారంటే మునులండి, మేమేంటే మనుషులమండి..." అనకండి. మాటలు నేర్పితే చిలుకలు కూడా తియ్యగా పలుకుతాయి. ఇక మనమెప్పుడు నేర్చుకునేది. మనిషి నిత్యవిద్యార్ధి. రానివి నేర్చుకోవడం, తమను తాము మెరుగు పరచుకోవడం ఒక నిరంతర ప్రక్రియలా జీవితాంతం కొనసాగుతుంది. కనుక, ఇకపై ఇటువంటి ప్రతికూల ప్రశ్నలు మానేసి, మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడడం అభ్యసిద్దామా?

No comments:

Post a Comment