Monday, September 2, 2013

విశ్వనాధ సత్యనారాయణ

"విశ్వనాథ కవిత మెరుపునకు శిఖరాయమానము శ్రీమద్రామాయణ కల్పవృక్షము ' అన్నారు తిరుపతి వెంకట కవులలో ఒకరయిన దివాకర్ల వెంకటావధాని గారు . ఈ పద్య కావ్యానికి 'జ్ఞాన పీఠ ' పురస్కారం లభించింది . 

మళ్ళీ రామాయణమే రాస్తారా ? ఎందుకు ? అని అడిగేవాళ్ళకోసం  విశ్వనాధ ముందుగానే ఇలా చెప్పారు ... 

మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి గాన

ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు. 

రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది . ఉదాహరణకు 

అయినవారికేమొ ఆకులయందును,
కానివారికేమొ కంచములను
ఇంటిలోన దినుచు నింటి వాసంబుల
లెక్కపెట్టునట్టి లెక్కగాక


                                                      

సాధనతో కామాన్ని జయించి, భాగవదనుగ్రహాన్ని పొందిన విశిష్ట స్త్రీ అహల్య.  అహల్యా శాప విమోచన ఘట్టాన్ని కూడా, ఈ కావ్యంలో విలక్షణంగా వర్ణించారు విశ్వనాధ వారు. శిలగా పడున్న అహల్యలో క్రమంగా వచ్చిన పాంచభౌతిక స్వరూపమయిన మార్పు, ఈ పద్యంలో సూచించబడింది.

"ప్రభు మేనిపై  గాలిపై వచ్చినంతనే 
  పాషాణ మొకటికి స్పర్శ వచ్చె 
 ప్రభు కాలి సవ్వడి ప్రాంతమై నంతనే 
  శిల కొక్కదానికి  జెవులు గలిగే 
 ప్రభు మేని నెత్తావి పరిమలించినతో న 
 యశ్శంబు ఘ్రాణేం ద్రియంబు జెందె 
 ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు 
గనవచ్చి రాతికి గనులు గలిగె 
 ఆ ప్రభుండు వచ్చి యాతిధ్యమును స్వీక 
రించినంత నుపలహృదయ వీధి 
నుపనిషద్విదితాన మొలికి శ్రీరామ భ 
ద్రాభి రామమూర్తి యగుచుదో చె "


విశ్వనాథ సాంప్రదాయకవి. రాముడు, కృష్ణుడు అతని మనసుకు పట్టే దేవతలు. దాంతో అతని రచనలలో ఆ ప్రొఢ గాంభీర్యం చోటు చేసుకుంది. భాషలో ప్రచీన కవుల పరిమళానికి, విశ్వనాథ స్వెయ్య ప్రతిభా సౌరభం తోడయింది. కానీ, ఆ పరిమళ సౌరభాలను అనుభవించేవారు లేరు. వాటిలోని సౌందర్యాన్ని గ్రహించి మెచ్చేవారులేరు. దాంతో వీలు చిక్కినప్పుడల్లా విశ్వనాథ తన కవిత్వంలో రత్నాలున్నాయని, వాటిని పరిశీలించి, అనుభవించే నాథుడు లేడని వాపోతూండేవాడు. తన రచనలలోని లోతయిన భావాలు, తాను చేసిన ప్రయోగాలు, పొందుపరచిన చమత్కారాలను తానే వివరిస్తూ బాధపడేవాడు.
ఇది నిజంగా దయనీయమైన పరిస్థితి. కవికి తన రచనను అనుభవించి, ఆస్వాదించే శ్రోత లభించక పోవటాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. దానిలోని సొంపులను, సౌందర్యాలను గ్రహించి, పాఠకులకు వివరించే విమర్షకుదు లేకపోవటం మరింత దౌర్భాగ్యం. ఇందుకు చింతించిన విశ్వనాధ 'కల్పవృక్ష రహస్యములు' పేరుతో తన కావ్యానికి తానె భాష్యం రాసారు. ఆ  మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆయన వేదన ఆయన పద్యంలోనే ... 
నా కవిత్వంబునందు రత్నములు కలవు
వాని బెకిలించి చూపెడువాడు లేడు
కాల మిట్లున్నదని మొనగాడువోలె
బలుకు కవిగాడ! యేటికీ స్వాతిశయము?



కాశీరామేశ్వర మజిలీ కధలు

కాశీరామేశ్వర మజిలీ కధలు 
----------------------------------

పవిత్ర భారతావనిలో ఎన్నో పున్యనడులూ, పుణ్యక్షేత్రాలూ ఉన్నాయి. 

ఉత్తర భారత దేశంలో కాశీ విశాలాక్షీ సామెత విశ్వనాథ స్వామి ఉన్నారు. దక్షిణ భరత దేశంలో శ్రీరాముడిచే ప్రతిష్టించబడిన రామలింగేశ్వర స్వామి ఉన్నారు. 

పూర్వకాలంలో మునులు, మహాభక్తులు వారి కుటుంబాలతో సహా కాశీ నుండీ రామేశ్వరానికి, రామేశ్వరం నుండీ కాశీకి ప్రయాణం చేసేవారు. వీటినే కాశీరామేశ్వర యాత్రలు అంటారు. రవాణా సౌకర్యాలు , సరియిన మార్గాలు లేని ఆ రోజుల్లో, ఒకదానికి ఒకటి మరీ దూరం కనుక, దారిలో యాత్రికులు మజిలీలు చేసేవారు. అటువంటి మజిలీలలో ఆయా పుణ్య క్షేత్రాల విశిష్టతలను గురించిన కధలు చెప్పుకునేవారు. వాటినే 'కాశీ రామేశ్వర మజిలీ కధలు " అంటున్నాము. అవే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాము. ఈ కధల్లో, కాశీ నుంచీ రామేశ్వరం వరకూ కల అనేక పుణ్య క్షేత్రాల విశిష్టతలు తెలియచేయ్యబడతాయి. 

చాలా కాలం క్రితం, కాశీ నగరంలో సదానందయోగి అనే మునీశ్వరుడు ఉండేవారు. ఆయన అన్ని క్షేత్రాలు తిరిగారు. ఆయనకు ఎటువంటి తాపత్రయాలు, చీకూచింతలూ లేవు. ఆయన జ్ఞాని, ఆయనలో ఎప్పుడూ ఏదో ఆనందం, నిండుదనం కనిపిస్తాయి. అందుకే ఆయనను సదానంద యోగి అనేవారు. 

ఒకరోజు ఆయన తన శిష్యుడయిన చిదానందయోగిని పిలిచి, 'నాయనా! నాకు కాశీరామేశ్వర యాత్ర చెయ్యాలన్న సంకల్పం కలిగింది. నీవు, నీ తోటి విద్యార్ధులు నాతొ రండి. నేను మీకు కాశీ నుండీ రామేశ్వరం వరకూ కల నదులు, తీర్దాలు, వనాలు, పుణ్య క్షేత్రాలు మొదలయిన వాటి విశేషాలను చెప్తాను,' అన్నారు.

అదే మహాభాగ్యమని, నమస్కరించి, చిదానందుడు తోటి శిష్యులను పిలిచి కూర్చోపెట్టాడు. అప్పుడు సదానంద యోగి ఇలా చెప్పసాగారు....

సదానందయోగి, తన చుట్టూ ఉన్న శిష్యులను ప్రసన్నంగా చూసి, "నాయనలారా! ముందు మీరు మనం ఉన్న ఈ కాశీనగర వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ వారణాసి లోని ప్రతీ క్షేత్రమూ, ప్రతీ దైవము గురించి పూర్తిగా చెప్పాలంటే, బ్రహ్మకయినా సాధ్యం కాదు. ఇక నేనెంత? అలాగని మనిషి నిరుత్సాహపడరాదు, అందుకే నేను పెద్దలవల్ల విన్నది సమగ్రంగా చెబుతాను, వినండి," అంటూ ఇలా చెప్పసాగారు.

కాశీ నగరానికి మరొక పేరు శివ రాజధాని. ఇది గంగా నదికి పడమరగా, వక్రము కలిగి, ఐదు క్రోసుల దూరాన విస్తరించి ఉన్న మహా పట్టణము. ఈ నదీ తీరము పొడవునా, అరవై నాలుగు పెద్ద తీర్ధములు ఉన్నాయి. 

పూర్వం దక్షప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఒకసారి దక్షయజ్ఞం సమయంలో దక్షుడు శివుడి మీద అక్కసుతో, సతీదేవిని పరాభవించాడు. ఆమె యోగాగ్నిలో పడి, ప్రాణాలు విడిచింది. ఆమె ప్రేతాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న శివుడిని, తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు, విష్ణువు తన యోగమాయతో ఆ దేహాన్ని పద్దేనిమిది ముక్కలు చేసాడు. అప్పుడు ఆ దేవి ముఖం ఈ కాశీలో పడినందువల్ల, ఈ ప్రదేశానికి " గౌరిముఖ " అనే పేరు వచ్చింది. ఇక్కడి దేవత పేరు, కాశీ విశాలాక్షి. 

ఈ మహాకాశీ క్షేత్రానికి రాజు విశ్వనాధుడు . మంత్రి బిందుమాధవ స్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు. గణనాయకుడు లేఖాదారుడు. ఇక్కడ లేని దేవతలు, తీర్ధములు, మహిమలు మరి వేరెందునూ లేవని పురాణాలు చాటి చెబుతున్నాయి. ప్రళయంలో కూడా నశించని, శివుడి త్రిశూలాగ్రంపై స్థితమై ఉన్న ఈ పట్టణమే కాశీ. 

ఇక ఈ క్షేత్ర యాత్రా విధానం చెబుతాను, వినండి....

కాశీ యాత్రా విధానం గురించి చెప్పసాగారు సదానందయోగి.

ఈ కాశీ యాత్రకు వెళ్ళినవారు ఉదయాన్నే మేల్కొని, స్నానాదులు ముగించుకుని, ముందుగా అన్నపూర్ణా విశ్వేస్వరులను దర్శించుకోవాలి.

తరువాత బిందుమాధవ స్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం వద్ద ఉన్న డుండిం రాజ గణపతిని ఆరాధించి, తరువాత ఉత్తరంగా ఉన్న దండపాణి స్వామిని పూజించి, కాలభైరవుడిని దర్శించి, పడమరన ఉన్న కాశీ మూర్తిని సేవించి, వాయువ్యంగా ఉన్న గుహను చూచి, గంగా పుష్కరిణిని కొలిచి, విశ్వేశ్వరం లోని అన్నపూర్నాదేవిని పూజించి, మణికర్నికకు పోయి, మణికర్ణికా మూర్తిని ఆరాధించి, అక్కడే స్నానం చేసి, తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి, వసతికి వెళ్ళాలి . దీనినే నిత్య యాత్రా విధానం అంటారు. ఇక మనం బయలుదేరి, గయా గదాధరకు వెళ్దాము , అంటూ శిష్యులతో యాత్రకు బయలుదేరారు సదానంద యోగి. 

అలా గయా గదాధర క్షేత్రం చేరి, మొదటి మజిలీ చేసారు. అక్కడ సదానందయోగి శిష్యులకు గయా క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి ఇలా చెప్పసాగారు.

"త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేయ వెళుతూ ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఒకనాడు సీతాదేవి ఏమీ తోచక, ఇసుకతో ముద్దలు చేసి పెట్టింది. ఈ క్షేత్ర ప్రభావం వల్ల ఆ ఇసుక ముద్దలు పితృదేవతలకు సంక్రమించాయి. శ్రీరాముడు ఒకసారి పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానం చెయ్యగా దాశరధ మహారాజు ఈ ఇసుక ముద్దలో కనిపించాడు. రాముడి మనసు చాలా బాధపడింది. ఈ పని చేసినది ఎవరని రాముడు అడుగగా, అక్కడి ఫల్గుణీ తీర్ధము జరిగింది చెప్పింది. రాముడు అంత తన పితృదేవతలను , దాతలను క్షమాపణ కోరి, మరలా పిండములను ఇవ్వగా పితృదేవతలు అంగీకరించారు. తన పొరపాటును రాముడికి చెప్పినందుకు, సీతాదేవి ఫల్గుణి తీర్ధంపై కోపించి,' ప్రజల కంటికి కనబడకుండా ప్రవహించు, ' అని శపించింది. అందుకే దీనిని 'అంతర్వాహిని' అంటారు.

"గయలోని ఒక పెద్ద మందిరంలో చదరమయిన కుండములో మూర పొడుగున్న నున్నటి పాదం ఒకటి ఉంటుంది. ఇది గయుడి తలపై ఉంచిన శ్రీమహావిష్ణువు కుడి పాడమని చెప్పబడుతోంది. దీని మీద పిండము పడనీ రోజే ఉండదు. అలాగే ఈ క్షేత్రంలో శివపాదం, కుమారస్వామి పాదం, బ్రహ్మ పాదం, సూర్య పాదం, చంద్ర పాదం, ఇంద్ర పాదం, క్రౌంచ పాదం, గణపతి పాదం, మతంగ పాదం, అగస్త్య పాదం, కశ్య పాదం, త్రేతాగ్ని పాదం అనేవి కూడా ఉన్నాయి.

విష్ణు పాదానికి ఈశాన్యంగా గదాధర స్వామి విగ్రహం ఉంది. దానికి పడమరగా రాతి గద  ఉంది. అందుకే ఈ క్షేత్రానికి గయాగదాధర క్షేత్రం అని పేరు వచ్చింది." అంటూ ముగించారు సదానంద యోగి.

మర్నాడు శిష్య సమేతంగా ప్రయాణం సాగించి, ప్రయాగలో రెండవ మజిలీ చేసాడు.

" నాయనలారా! ఈ ప్రయాగ అలహాబాదుకు తూర్పుగా ఉంది. దీనికి పడమరన గంగా నడి ప్రవహిస్తోంది. దీనినే ధారాగంజ లేక ధారానగరం అని అంటారు. భోజ రాజు పాలించిన నగరం ఇది. ఇక్కడ గంగాపుత్రులు అనే ఒక జాతి వారు ఉన్నారు. వారు ఇచ్చటికి వచ్చినవారికి అనేక ప్రదేశములు చూపి, యాత్రికుల నుండీ ధనం సంపాదిస్తారు. 

గంగ యమున సరస్వతి అనే మూడు నదులు కలిసిన త్రివేణి ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ రెండు నిలువుల ఎట్టు కొట్టివేయ బడ్డ ఒక మఱ్ఱి చెట్టు ఉంది. దాన్ని 'అక్షయ వట వృక్షమని 'అంటారు. మునుపు ఈ అక్షయ వటవృక్షం కొమ్మలు నదిలోకి వంగి ఉండేవట. ఎవరయినా ఈ చెట్టు కొమ్మల మీదికి ఎక్కి, వాళ్ళ కోరికలు చెప్పి, నదిలోకి దుమికి చనిపోయిన, వారు మరుజన్మలో వారి కోరికలను పొందుతారని చెబుతుంటారు. అందుకు భోజ రాజు కధే నిదర్శనము.

ప్రయాగ క్షేత్ర విశిష్టత గురించి చెబుతూ భోజ రాజు కధను ఇలా చెప్పసాగారు సదానందయోగి.

ఒకసమయంలో ముగ్గురు కన్యలు అక్షయ వట వృక్షం మీదకు ఎక్కి, నదిలో దూకబోతూ, ఒకామె  మహాపండితుడు తనకు భర్త కావాలి అని, ఇంకొకామె ధీరుడయిన పతి  కావాలని, మూడవ స్త్రీ గొప్ప కీర్తి కల రాజు తనకు భర్త కావాలని కోరుకుని, ప్రవాహంలో దూకేసారు. ఇదంతా చూసిన ఒక మంగలి, ఆ ముగ్గురూ తనకు భార్యలు కావాలని కోరుకుని, నీటబడి మరణించాడు. అతడే మరు జన్మలో భోజ రాజుగా పుట్టి, ఆ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకున్నాడని, గ్రంధాలు చెబుతున్నాయి. 

ఇదొక గొప్ప యాత్రా స్థలం, ఇక్కడ కొంత దూరంలో భరద్వాజ ఆశ్రమం ఉంది. రాముడు రావణ వధ తరువాత ఈ ముని ఆశ్రమానికి వచ్చినట్లు చెప్పబడుతోంది. ఇక్కడి గంగా పుత్రులు తేలుతూ ఉన్న బల్లల మీద త్రివేణీ పూజ, ముత్తైదువల చేత వేణీ సమర్పణ పూజలు చేయిస్తారు. భాగీరధి లో యమునా, అంతర్వాహిని అయిన సరస్వతి నదులు కలియుచుండుట చేత ఇది త్రివేణీ సంగమం అయ్యింది,' అంటూ ప్రయాగ క్షేత్ర మహత్యాన్ని వివరించారు సదానందయోగి.

మర్నాడు వారంతా యాత్రను కొనసాగించి, అయోధ్యా పురం చేరుకున్నారు. 

" నాయనలారా! మనమిప్పుడు వచ్చిన ఈ అయోధ్యా పురం పూర్వం శ్రీరామచంద్రునిచే పాలింపబడిన పుణ్య భూమి. ఒకప్పుడు అయోధ్యా పురం సరయూ నదిలో కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది. అయినా ఆ నాటి కట్టడాలు చెక్కు చెదరలేదు.

 సాక్షాత్తు విష్ణు భగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం... అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి.ఎందరెందరోమహనీయులకు జన్మనిచ్చిన అయోధ్య ‘పూర్వనామం’సాకేత. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకుల రాజులకు పుట్టిల్లుగాపరిఢవిల్లింది.  శ్రీరాముని తాతలలో ఒకరైన‘అయుధ’ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ‘యుధ్’ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ‘యుధ్’అంటే నాశనం కానిదని అర్థంగా చెబుతారు. కనుకకాశీనగరం ఎలా అయితే నాశనం లేని నగరంగా పురాణాలలో పేరుప్రఖ్యాతులుగా సాధించిందో అలాగే అయోధ్య నగరం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులలోనూ నాశనం చెందని నగరంగాప్రసిద్ధిగాంచింది.సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చిన పుణ్యప్రదేశంగా ఖ్యాతికెక్కిన ‘అయోధ్య’ గాగ్రనది ఒడ్డున అలరారుతోంది. సరయూ నదిగా పేరుప్రఖ్యాతులు పొందిన ఈ నదిలోనే శ్రీరాముడు, అవతార సమాప్తిని చాలించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. సదా శ్రీరామ నామస్మరణంతో మారుమ్రోగే అయోధ్య నగరం విశాలమైన అందమైన ఆలయాలకు వేదికగా ఉంది. ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన ఈ నగరంలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి,విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాముడి తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు,రాజసాగరుడు, భగీధుడు విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది.  సాక్షాత్తు శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన ‘అయోధ్య’ నగర సందర్శనం, స్మరణం సర్వపాపాలను హరిస్తుందట. 
ఈ నగరాన్ని సాక్షాత్తు దేవతలే నిర్మించారని, అందుకే ఇది భూతల స్వర్గమయిందని అధర్వణ వేదం చెబుతోంది. మోక్ష ధ్యానపురిగా మన పురాణాలలో ప్రఖ్యాతి చెందిన అయోధ్యా నగరం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు నెలవు. అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. ‘స్వర్గ్‌ద్వార్’గా కీర్తికెక్కిన ఇక్కడే యాత్రికులు పిండ ప్రదానాలు చేస్తారు. సాక్షాత్తు శ్రీరాముడు అవతార సమాప్తిని చాలించినపుణ్యప్రదేశంగా ఇది ఖ్యాతికెక్కింది. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు ‘కుశుడు’నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది. విక్రమాదిత్య కాలంనుంచీ చరిత్రకు నిదర్శనంగా మిగిలిన ఆలయం ఇదొక్కటేగా దీనిని చెబుతారు. మిగిలిన ఆలయాలన్నీ ముస్లింల దాడులకు అంతరించిపోయినవే. నాగేశ్వరనాధ్ మందిరానికి సమీపంలో కాలేరామ్ మందిరం ఉంది. సరయూ నదిలో దొరికిన నల్లని సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రునివిగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇక్కడకు సమీపంలోనే ‘హనుమాన్ ఘడి’ ఉంది.ఇక్కడ నవాబు షాజుద్దౌలా నిర్మించిన రామచంద్రాలయం ఉంది. అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ మందిరానికి చేరుకోవడానికి 76మెట్లున్నాయి. హనుమంతుడు ఇక్కడో గుహలో ఉండిరామజన్మభూమిని రక్షించేవాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ అంజనీమాత ఒడిలో బాల ఆంజనేయుని మూర్తి దర్శనం భక్తులకు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. దీనికి సమీపంలో‘కనక భవన్’ ఉంది. కైకేయి మాత సీతామహాసాధ్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలం ‘కనక భవన్’,బంగారు సింహాసనం ఉన్న ఈ భవనమే శ్రీరామచంద్రుని నివాస స్థలంగా చెబుతారు. బంగారు కిరీటాలు ధరించి రామలక్ష్మణ సీత విగ్రహాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతుంది. సదా శ్రీరామనామ స్మరణంతో ఇక్కడి పరిసరాలు మారుమ్రోగుతాయి. అయోధ్య నగరంలోనే మరోచోట చోటిదేవ్‌కాళీ మందిరం ఉంది. వీటితోపాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసి స్మారక భవన్,రామ్‌కిపౌరి, దతువన్‌కుండ్, జానకి మహల్,బ్రహ్మకుండ్, లక్ష్మణ్‌కిా, రామ్‌కధా మ్యూజియం,వాల్మీకి రామాయణ మ్యూజియం, సుందర సదన్,హరిహర మందిరం, తులసీదాసు మందిరం, క్షీరేశ్వరుని మందిరాలున్నాయి. ఇవన్నీ చూడదగినవి. అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. మన పురాణాలలో విశిష్టమైన పవిత్ర క్షేత్రంగా ఖ్యాతికెక్కినఅయోధ్య నగరం సప్తమోక్ష పురాణాలలో ఒకటి. ముక్తిక్షేత్రంగా, స్వర్గ్ధామ్‌గా పేర్గాంచిన ఈ నగరంలోకి అడుగిడినంత మాత్రానే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. 


ప్రస్తుతం ఈ సరయూ నదీ తీరంలో రామఘాట్, భారతఘాట్, లక్ష్మణ ఘాట్, శత్రుఘ్న ఘాట్, స్వర్గద్వార ఘాట్, వాల్మీకి ఘాట్, మొదలయినవి ఎన్నో ఉన్నాయి. అంటూ, రామాయణ కధను సమగ్రంగా వివరించి, మరునాడు యాత్ర కొనసాగించి మధురలో మజిలీ చేసారు గురుశిష్య గణం.. 

మధురా నగరాన్ని గురించి ఇంకా ఇలా చెప్పసాగారు సదానందయోగి....
 ‘మధుర’ని కృష్ణ జన్మభూమి అని కూడా పిలుస్తారు. దుష్ట శిక్షణార్థం ద్వాపర యుగంలో వసుదేవుని భార్య దేవకీదేవి అష్టమ గర్భంలో మధురలో జన్మించాడు శ్రీకృష్ణుడు. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు యదునందన రూపాన్ని ధరించి దైత్యరాజు కంసుని వధించటమే కాదు కౌరవవంశ వినాశనానికి రథ చోదకుడయ్యాడు.
ఇక్కడి ‘కట్రా మందిర’ స్థానానే్న కృష్ణ జన్మస్థలిగా వ్యవహరించటం జరుగుతోంది. స్థానిక గీతామందిరంలోనూ భగవద్గీతా మంటపంలోనూ శ్రీ కృష్ణ జనన వివర చిత్రావళి మనకు దర్శనం ఇస్తుంది. యమునా తీరంలోని రాధా మాధవ మందిరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలోని రాధాకృష్ణ చిత్రం భక్తులనెంతో పరవశింపచేస్తూ వుంటుంది. ఈ రాధా మాధవ మందిర సమీప నదీ తీరంలోని శ్యాంఘాట్, రాంఘాట్, సప్తర్షిఘాట్, మోక్ష తీర్థ, బుద్ధ తీర్థ ఘాట్ అన్ని మతాలవారి అవసరాల్ని తీర్చటమే కాకుండా మధురలోని అతి పవిత్ర తీర తీర్థస్థానాలుగా పరిగణించబడుతున్నాయి. ఇవి కాకుండా ఇక్కడి విష్ణుగుండాలనబడే ఓ నూటా అరవయ్ సరస్సులలో భక్తులు నిత్యమూ స్నానాలు చేస్తూ వుంటారు. కాని ప్రస్తుత నగర విస్తరణలో ఎన్నో సరస్సులు అంతరించిపోతున్నాయి. మధురలోని ఆ సరస్సుల సమాహారం వెనువెంటే సాగే యమునా తీరంలోని బృందావనం గురించి తెలియని భారతీయులు ఉండరు. ఈ బృందావనాన్ని తీర్చిదిద్దిన శ్రీకృష్ణుడు దాన్ని రాధకి తన కానుకగా అందజేసాడట. వారిరువురి రాసలీలలకి బృందావనమే బాటగా నిలిచింది.
ఎన్నో ఆశ్చర్యాలకు నిలయంగా ప్రసిద్ధి చెందినది మధురా నగరం. ఆ నగరంలో గోపాలకుల వంశంలో మణిదీపంలా పుట్టాడు శ్రీకృష్ణుడు. అతడు స్వచ్ఛమైన జలాలతో అలరారే యమునా నదీ తీరంలో విహరిస్తాడు. యశోదాదేవికి ఆనందాన్ని కలిగిస్తాడు. వెన్నెలను దొంగలిస్తూ, తల్లిచే బంధింపబడతాడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి మనం నిత్య కర్మానుష్ఠానాలతోనూ, రమణీయ కుసుమాలతోనూ పూజిం చాలి. నోరారా స్తోత్ర పాఠాలను చదువుతూ భక్తితో ధ్యానిం చాలి. అలా చేస్తే పూర్వం చేసిన పాపాలూ, రాబోయే రోజుల్లో చేసే పాపాలూ అన్నీ అగ్నిలో పడవేసిన దూది పింజలవలె వెంటనే కాలి బూడిదై పోతాయి. 


సదానంద యోగి మధురా క్షేత్ర వైశిష్ట్యాన్ని గురించి ఇంకా ఇలా చెప్పసాగారు. 

యమునా నడి ఒడ్డున ఉన్న ఈ సుందర నగరంలో గోకులము, బృందావనము, వేనువనము, కుమారవనము, దాళ వనము, గోవర్ధానము, మానస సరస్సు అనే పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ పేరొందిన ఘట్టాలలో విశ్రమ ఘట్టం లో కంసుడిని చంపాకా శ్రీకృష్ణుడు విశ్రాంతికై శయనించాడు అని చెబుతారు. దీనికి చేరువలో ఉన్న మందిరంలో శ్రీకృష్ణపాదాలు అనే శిలలు అనేకం ఉన్నాయి. యాత్రికులు స్నానం చేసాకా ఈ కృష్ణ పాదాలను అభిషేకిస్తారు.

మధురలోని దేవాలయాల్లో ద్వారకానాధ మందిరం గొప్పది. ఆలయ మండపం అతి సుందరంగా ఉంటుంది. గడచినా యుగాలలో మునులె కాక, ముక్కోటి దేవతలు జపతపో నియమాలతో నివసించిన అనేక  ఆశ్రమాలు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. 

మధురకు నైరుతి భాగంలో భూతేశ్వర లింగం అనే తెల్లని లింగం ఉంది. కృత, త్రేతా, ద్వాపర యుగాలలో అనేక దేవమునీంద్రులచే ఆరాధించబడింది ఈ లింగం. ఆ స్వామి దేవేరి పేరు పాతాళ సిద్దేశ్వరి. 

అక్కడికి కొంత దూరంలో శ్రీకృష్ణ జన్మ స్థానం ఉంది. కంసుడు దేవకీవసుదేవులను బంధించిన చెరసాల , శ్రీకృష్ణ జననం జరిగిన ప్రదేశం కూడా ఇదే ! 

ఇలా మధుర యాత్ర ముగించి, గురుశిష్యులంతా మర్నాడు గోకుల క్షేత్రం చేరుకున్నారు.


గోకుల క్షేత్ర మజిలీ 

"మధురకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ‘గోకులం’ ఉంది. శ్రీకృష్ణుడు గోప బాలురతో క్రీడించిన స్థలంగా దీనిని చెబుతారు. ఇక్కడే బాలుడైన శ్రీకృష్ణుడు తనను
చంపవచ్చిన పూతన అనే రాక్షసిని సంహరించిన చోటుగా "గోవింద కుండం" ను చెబుతారు. గోకులంలో రాధాకృష్ణ, బలరామ మందిరాలున్నాయి.  మధురా ,బృందావనం ,గోకులం లను మూడింటిని కలిపి ‘’వ్రజ భూమి ‘’అని పిలుస్తారు ఇక్కడ లెక్కకు మించిన తీర్దాలు ఉన్నాయి. 

కంసుడు చంపుతాడన్న భయంతో తండ్రి వసుదేవుడు అతణ్ణి గోకులాన్ని తరలించాడు. అక్కడ ఆయన యశోదా దేవి దగ్గర పెరిగాడు.. 
గోకులంలో కృష్ణుడు ఉన్నది ౩ సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే. ఈ లోగానే ఆయనపై పలు మార్లు హత్యాయత్నం జరిగింది. కంసుడు పంపిన పూతన, శకటాసురుడు లాంటి వాళ్లు జగద్గురువును మట్టుపెట్టే వెర్రి యత్నం చేశారు. ఈ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. 

వసుదేవుడు వ్రేపల్లెలో ప్రవేశించిన చోటును "నందకవాటం" అని అంటారు. గోవింద కుండంలో యాత్రికులు స్నానాదికాలు చేసిన తరువాత, పురాతన గోకులం చేరుకుంటారు. ఇదే యశోదమ్మ చల్ల చిలికిన చోటని చెబుతారు.

గోకులంలో నాటి శ్రీకృష్ణ లీలలకు సంబంధించిన దృశ్యములు అన్నీ చక్కని ప్రతిమలుగా మలిచారు. అనేక దేవాలయములు, క్షేత్రములు కల ఈ భూమి అతి పవిత్రమయినది", అని చెప్పి, సదానందయోగి మరునాడు శిష్యులతో బృందావనం చేరుకున్నారు.
బృందావన క్షేత్ర మజిలీ 

సదానందయోగి తన శిష్యులకు బృందావనం గురించి ఇలా చెప్పసాగారు. 
"మనం ఇప్పుడు మజిలీ చేసిన బృందావనం అనేది కృష్ణుడు యమునా నది ఒడ్డున తన బాల్యం గడిపిన ప్రదేశము. ఈ బృందావనంలో కృష్ణుడు రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీలల ద్వారా చెప్పెను. గోపికలు స్నానము చేస్తుంటే వారి బట్టలు దొంగిలించేను. అంతే కాకుండా అనేక రాక్షసులను నాశనం చేసెను. బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము మరియు దాని గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 దేవాలయాలు ఇక్కడ ఉండటము గొప్ప ఆశ్చర్యమునకు గురి చేస్తుంది.
క్తి ఎక్కడ ఉంటుందో రాధమ్మ అక్కడ ఉంటుంది. బృందావనంలో ఎక్కడ చూసినా రాధే... రాధే....రాధే.... ఏ గోడమీద చూసినా "రాధే....రాధే.... ఏ వాహనం వెనుక చూసినా రాధే....రాధే.... ఎవరు పలకరించినా రాధే....రాధే.... బృందావనవాసులకు అలవాటైనది ఒక్కటే రాధే....రాధే.... కృష్ణుని ప్రేమ రాధ.. బాంకీ బిహారీ ఆలయంలో మూర్తి రాధాకృష్ణుల ఏక స్వరూపం.
 నిధువన్ లో ఇప్పటికి రాసలీల జరుగుతూ ఉంటుందట. రాత్రి ఎనిమిది తర్వాత ఆ వనం తలుపులు మూసివేస్తారు. ఈ లోగా అక్కడ రాధాకృష్ణుల శయనమందిరాన్ని భక్తి నిండిన హృదయాలతో చక్కగా అలంకరిస్తారు.సుగంధాలీనే పన్నీరు అత్తరులతో పరిమళింపజేస్తారు. చక్కటి మిఠాయిలు పళ్ళెరాలలో ఉంచుతారు. ఆ చుట్టూ ఉన్న భవనాలలోని కిటికీలు ఎనిమిది తరవాత మూసి మరునాటి ఉదయంవరకు తెరవరు... మరునాటి ఉదయం నాలుగున్నరకు భక్తులతో సహా అందరూ వచ్చి చీపుళ్ళతో ఆ తోటంతా శుభ్రపరుస్తారట.. మిఠాయిలు ఎవరో తిన్నట్టు, పక్క నలిగినట్లు, భక్తులకు గోచరమవుతుందట. అక్కడ కృష్ణ సాన్నిధ్యంలో తిరిగిన గోపికల శరీరంనుండి జారిన ఆభరణాదులు కూడా చూసినవారున్నారట. మరొక వనం "సేవాకుంజ్".. ఆ లీలామానుషవిగ్రహుడు రాధమ్మకు అక్కడ సేవ చే్స్తాడట..అలాగే "వంశీ వట్", ఆ చెట్టుక్రింద మురళిగానం విన్నవారున్నారట.
 "బర్సానా" అనేది రాధమ్మ పెరిగిన చోటు చూసాం.. "నందగాఁవ్ - దాన్నే రమణ రేటీ"అంటారు. రమణ్ రేటీ అంటే రమణీయమైన మట్టి అని అర్థంచెప్పారు. అక్కడ కృష్ణుడు గోపబాలురతో కలసి ఆటలాడే వాడు, చల్దులు పంచేవాడు. ఆ అద్భుత భావంతో భక్తులు తన్మయులై ఆటలాడతారు, పాటలు పాడతారు, నృత్యం చేస్తారు.. మట్టిలో పొర్లుతారు . ఆబాల గోపాలం అక్కడ తమని మరచిన తమకంతో కేరింతలు కొడతారు. ఇక్కడి అణువణువూ కృష్ణుడి స్పర్శతో పునీతమయ్యింది.
బృందావన క్షేత్ర మజిలీ 

బృందావన క్షేత్ర ప్రాశస్త్యం గురించి ఇంకా ఇలా చెప్పసాగారు సదానందయోగి.

" ఇక్కడి చోరాఘాట్ లో కృష్ణుడు తుమ్మెదలతో ఆడిన చోటు భ్రమరఘట్టం అని పిలవబడుతుంది. హనుమంతుడు కృష్ణుడిని పూజించిన చోటు హనుమద్ఘట్టం అని చెబుతారు. గోపికలు స్నానం చేస్తుండగా కృష్ణుడు చీరలు అపహరించిన చోటు చేలా ఘట్టం అనీ, నంద బాలుడు గోపికలతో రాసక్రీడలు సలిపిన చోటు రాసక్రీడా ఘట్టం అనీ చెప్పబడుతోంది. నాడు కృష్ణుడు కాళీయుడి తల మీద తాండవం చేసిన చోటు కాళీయ ఘట్టమని చెబుతారు. ఆ ప్రదేశంలో నిలువెత్తు కాళీయుడి పుట్ట, యశోదానందుల, వేణుగోపాల విగ్రహాలు ఉన్నాయి. 

బృందావనం నుంచీ మధురకు వెళ్ళే దారిలో అక్రూర మందిరం, భైరవాలయం, వంటి దేవాలయాలు సేవాకుంజరం అనే పేరుతో  పవిత్ర స్థలం ఉన్నాయి. అక్కడ కృష్ణ పాదుకలను అమ్ముతారు." అంటూ చెప్పి, మరుసటి రోజున సదానందయోగి  శిష్యులతో కలిసి గోవర్ధనగిరిలో మజిలీ చేసారు.

" నాయనలారా! ఈ గోవర్ధనగిరి మధురా నగరానికి ఏడు క్రోసుల(21 km ) దూరంలో ఉంది. శ్రీకృష్ణుడు గోవులను కాస్తుండగా బ్రహ్మాది దేవతలు ఆయనను పరీక్షించ వచ్చిన స్థలం ఇది. ఇంద్రుడు కుండపోతగా వాన కురిపిస్తుండగా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని కాపాడాడు. ఇప్పుడు ఈ కొండ వల్ల ఒక జలాశయం రెండుగా చీలి బ్రహ్మతీర్ధం అనీ , మానసగంగ అనీ పేరు పొందింది. ఈ గ్రామంలో ఉన్న సకలేశ్వర దేవుడు, మానసదేవి ప్రతిమలు, శ్రీకృష్ణ మూర్తులు విశేషమయినవి. " అని చెప్పి, సదానంద యోగి మర్నాడు శిష్యులతో ప్రయాణం సాగించి, పాటలీపుత్రంలో మజిలీ చేసారు.

పాటలీపుత్ర క్షేత్రాన్ని గురించి ఇలా చెప్పసాగారు సదానందయోగి.

"నాయనలారా! పూర్వమొకప్పుడు పాటలీ అను యువతీ, పుత్రుడు అనే యువకుడు కలిసి భార్యాభర్తలై ఈ నగరం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. గంగానదికి దక్షిణంగా ఉన్న ఈ క్షేత్రంలో ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ శివలింగాలు అనేకం ప్రతిష్ట చెయ్యబడ్డాయి. ఎన్నో దేవాలయాలు, విశాలమైన పుర వీధులు ఇక్కడ ఉన్నాయి.

పాటలీపుత్రం యొక్క రాజధాని మొదటి పేరు కాలీకాతా. అంటే, కాళికాదేవి నివశించే చోటు అని అర్ధం. ఇక్కడ కాళికాదేవి పొడవైన నాలుకతో భయంకరంగా  దక్షిణ అభిముఖంగా ఉంటుంది. కాళి వేంచేసి ఉన్న ఈ ప్రాంతమే భువనేశ్వర స్థలం. ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయని ప్రతీతి. వీటిలో ప్రముఖమైనది భువనేశ్వర స్వామి లింగం. ఈ స్వామి స్వయంభువని కొంత మంది నమ్మకం. 
ఈ ఆలయం బహు శోభాయమానం. దేవాలయం చూట్టూ ఉన్న కోవెలలో అనేక విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగాన్ని కులంతో సంబంధం లేకుండా ఎవరయినా అభిషేకించవచ్చు. 

బిందు సరసీ తీర్ధంలో అరుదయిన బ్రహ్మ దేవాలయం ఉంది. ఈ పాటలీపుత్రంలో ఉన్నవారంతా శ్రీమంతులు. ఇక్కడి భువనేశ్వర స్వామికి భోగములు నిరాటంకంగా జేరిగేందుకు మహారాష్ట్ర ప్రభువులు ఇచ్చిన గ్రామములూ, ఇతర ఆదాయములు పుష్కలంగా ఉన్నాయి," అని చెప్పి మర్నాడు ప్రయాణం సాగించి, శిష్యులతో పురుషోత్తమ క్షేత్రాన్ని చేరి మజిలీ చేసారు సదానందయోగి. 

పురుషోత్తమ క్షేత్ర మజిలీ

"నాయనలారా! ఈ పురుషోత్తమ క్షేత్రాన్నే జగన్నాధ క్షేత్రమని కూడా అంటారు. ఇది సముద్ర తీరానికి కొంత పైభాగంలో ఉంది. సుభద్రా బలభద్ర సామెత జగన్నాధ స్వామి ఆలయం నీలాచల గ్రామ మధ్యభాగంలో ఉంది. ఇక్కడ యాత్రికులు, సాధువులు, భక్తులు బస చేసేందుకు వీలుగా అనేక సత్రాలు నిర్మించబడ్డాయి.

గ్రామానికి తూర్పుగా ఇంద్రప్రద్యుమ్న మహారాజు నిర్మించిన అనేక మందిరాలు ఉన్నాయి. జగన్నాధ స్వామి రధ యాత్రకు వచ్చనప్పుడు  ఆ మందిరంలో నివసిస్తారు. స్వామీ ఆలయం అనేక శిల్పాలతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఆలయానికి నైరుతి భాగంలో అక్షయ వట వృక్షం ఉంటుంది.

గర్భాలయం లోని వేదిక మీద ఎరుపు ముఖం కల సుభద్రాదేవి, కుడివైపు తల్లని ముఖం కల బలరాముడు, ఎడమవైపున నీలముఖం కల జగన్నాథ స్వామి దర్శనం ఇస్తున్నారు. ప్రతీ రోజూ ఇక్కడ యారవై రెండు వినియోగాలు ఇస్తున్నారు. స్వామికి నైవేద్యం ఇచ్చాకా, అదే మందిరంలో కాని,  అక్షయ వట వృక్షం క్రింద కాని, భక్తులు వరుసగా కూర్చుని, స్వామి ప్రసాదం అందుకుంటారు. అక్కడ కులమత భేదాలు ఉండవు. ఎంగిలి పట్టింపులు కూడా ఉండవు, అందుకే కాబోలు మన వారు సర్వం జగన్నాథం అంటారు. నారద సూత శౌనకాది మునులు ఈ జగన్నాథ క్షేత్ర మహత్యమును అనేక పురాణములలో కొనియాడి చెప్పినారు.

ఈ జగన్నాథ క్షేత్రం గురించిన ఇతిహాసం ఒకటి కలదు. 


పురుషోత్తమ క్షేత్ర మజిలీ - రోహిణీ కుండ మహత్యం 

"నాయనలారా! స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు .మానవులకు సధ్గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన నీలాచలం అనే కొండపై దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు.

ఈ క్షేత్రానికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉన్నది. కృత యుగంలో హిరణ్యాక్షుడనే దానవుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి కొనిపోయి సముద్రము అడుగున దాచాడు. ఆ సమయంలో లోకాలను ఉద్ధరించడానికి శ్రీమహావిష్ణువు వరాహ రూపం దాల్చాడు. హిరణ్యాక్షుని చంపి, భూమిని సంరక్షించాడు. అంతటా బ్రహ్మ దేవుడు ఈ సముద్ర తీరంలో పురుషోత్తమ క్షేత్రం నిర్మించాకే సృష్టి కార్యం మొదలెట్టాడు.

తన సృష్టి నుంచీ జనించిన జనులకు ముక్తి మార్గం చూపాలని తలచి బ్రహ్మ నారాయణ మూర్తిని ప్రార్ధించాడు. మాధవుడు దర్శనం ఇచ్చి ," ఈ సముద్ర తీరంలో నీలాచలం అనే క్షేత్రం ఉంది. దాని ప్రభావం ఎట్టిదో మునులకూ, దేవతలకూ కూడా గ్రహింప శక్యం కాదు. నేను శంఖ చక్ర గదా దారిని అక్కడ నిజ శరీరం తో నిలిచి ఉంటాను. ఇది మహా ప్రళయ కాలమున సైతం నశించదు. అక్కడి రోహిణీ కుండంలో స్నాతలై నన్ను ఆరాధించిన వారికి, నేను ఏ వరమయినా ఇస్తాను. నీవునూ అచటికి పోయి నన్ను సేవిమ్పుము,' అని చెప్పి అదృశ్యమయ్యాడు. బ్రహ్మ నీలాచల క్షేత్రానికి వెళ్లి అక్కడి జగన్నాథ మూర్తిని, రోహిణీ కుండాన్ని దర్శించి, ధన్యుడయ్యాడు.

సాధారణంగా అన్ని క్షేత్రాలలో భగవంతుడు తమ దేవేరులతో కొలువై వుంటాడు. కాని, ఇందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో 'అన్న బల భద్రుడు (బలరాముడు), చెల్లి సుభద్రతో కూడి జగన్నాథుడు కొలువై వుంటాడు! సాధారణంగా ఆలయాలలో మూలమూర్తులు నల్లరాయితో గాని, పాలరాయితో గాని మలచబడి, ప్రతిష్ఠించబడి ఉంటారు. ఉత్సవ మూర్తులు పంచలోహ మూర్తులుగా వుంటాయి. వీటికే ఉత్సవాలు... కళ్యాణాలు, ఊరేగింపులు, తిరుమంజనాలు నిర్వహిస్తారు. కాని పూరి ఆలయంలో దారునిర్మిత విగ్రహాలు (కొయ్యబొమ్మలు) పూజలందుకుంటున్నాయి. ఇక్కడ బౌద్ధ, జైన, తాంత్రిక, కొండ జాతుల రీతులలో పూజలు జరుపబడుతూ వుంటాయి. ప్రతి ఏటా జరిగే జగన్నాథ రథ యాత్రకు మూల విగ్రహాలే తరలి వస్తాయి. ఆ విగ్రహాల ఆకారం పూర్తిగా వుండదు. తల మాత్రం స్పష్టంగా వుంటుంది. విశాలమైన నేత్రాలుంటాయి. జగన్నాథునికి కాళ్లుండవు, చేతులు అసంపూర్తిగా వుంటాయి. ఇలా వుండటానికి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో వుంది...

 సదానందయోగి తన శిష్యులకు పూరీ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణాన్ని గురించిన కధను ఇలా చెప్పసాగారు....

"ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు. పని ప్రారంభించి పది రోజులైంది.
ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.
ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి. "

ఆదిశంకరాచార్యులు నిర్మించిన నాలుగు పీఠాలలో పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 214 అడుగుల ఎత్తులో కట్టడంవల్ల చాలా దూరంనుంచే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలతో, ఆలయానికి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలతో అత్యంత సుందరంగా నిర్మించారు.

జగన్నాథ ఆలయంలో దైవ దర్శనానికి ఎప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించరు. ఎల్లప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఈ ఆలయంలో ప్రతిరోజూ కొన్నివేల మందికి అన్నదానం చేస్తారు.  

జగన్నాథ ఆలయానికి ఒక ప్రత్యేకమైన వంటగది, అది కూడా ప్రపంచంలోనే చాలా పెద్దది ఉండటం విశేషం. ఇక్కడ ప్రతిరోజూ 56 రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. పురాణాల ప్రకారం స్వయంగా మాహాలక్ష్మి వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ప్రసాదం తయారు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే వంటశాల పరిసరాల్లో ఒక కుక్క కనిపిస్తుందని కూడా ఒక విశ్వాసం ఉంది. దీన్ని ఆలయ వంటవాళ్ళు (మహాసురులు అనికూడా అంటారు) అపశకునంగానూ, మహాలక్ష్మి సంతృప్తి చెందలేదని భావించి వండిన పదార్థాలన్నీ పూడ్చి వేసి మరల వంట చేస్తారు. ఈ వంటలన్నీ హిందూ ధర్మ శాస్త్రాలకనుగుణంగానే జరుగుతాయి. వంట చేయడానికి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వాడతారు. అలాగే వంటకు అవసరమయ్యే నీటిని దగ్గర్లో గల గంగజమున అనే రెండు ప్రత్యేకమైన బావుల్లోంచి మాత్రమే సేకరిస్తారు. జగన్నాథునికి నైవేద్యం సమర్పించాక మిగతా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర.   జగన్నాథ నామస్మరణతో మార్మోగుతాయి . ఉదయమే ఆలయం ఎదుట జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి,  సుభద్రల కోసం ప్రత్యేకంగా మూడు రథాలను ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల వస్త్రాలతో, పూలతో ఆలయ నిర్వాహకులు అలంకరిస్తారు . పూజా ది కార్యక్రమాల  అనంతరం 45 అడుగుల ఎత్తు.. 16 చక్రాలు కలిగిన ‘నందిఘోష్’ రథంపై జగన్నాథ స్వామి విగ్రహాన్ని, 44 అడుగుల ఎత్తు.. 14 చక్రాలు కలిగిన ‘తాళధ్వజ’ రథంపై బలభద్ర స్వామి విగ్రహాన్ని, 43 అడుగుల ఎత్తు.. 12 చక్రాలు కలిగిన ‘దర్పదళన్’ రథంపై  సుభద్ర  విగ్రహాన్ని భక్తుల జయజయ ధ్వానాల నడుమ అధిష్టింపచేస్తారు . 
ఇలా దేవతావూపతిమలను రథాలపై అధిష్టించడాన్ని ‘పహండీ’గా పిలుస్తుంటారు. ఓ వైపు మంగళహారతులు, మరో వైపు భాజాభజంవూతీలు.. వాటి మధ్య జగన్నాథుని రథ చక్రాలు పూరీ పురవీధుల్లో ఊరేగుతాయి. ముందు సుదర్శన వాహనం సాగగా దాని వెనుకే సుభద్ర, బాలభవూదస్వామి రథాలు నడిచాయి. వాటిని అనుసరిస్తూ జగన్నాథ రథం కదులుతుంది. జగన్నాథస్వామి ఎదుట పూరి సంస్థానాధీశుడు జగపతి ‘చెరా పహారా’(బంగారు విసనకపూరతో వీచడం) నిర్వహిస్తుండగా యాత్ర కొనసాగుతుంది.  దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.  ఈ యాత్ర పూరీ నుండి గుండిచాదేవాలయం వరకు సాగుతుంది.

జగన్నాథ క్షేత్రం గురించి సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన విశేషాలు ...

పూరి జగన్నాథ తత్త్వము
(సద్గురు శివానందమూర్తిగారి మాటలలో)

గుణాతీతుడైన భగవంతుడు సత్త్వగుణమును ఆధారముగా చేసుకొని జగత్తులోనిజీవులందరిలోనూ సాక్షిరూపుడుగా ఉంటున్నాడు. రజోగుణమును ఆధారముగా చేసుకొని అంతర్యామిగా జీవగతిని ప్రవర్తింపచేస్తున్నాడు. జడమైన శరీరమునందు ఆభిమానము, ఆత్మభావన తమస్సుతో నిర్వహిస్తున్నాడు.
ఇది సూచించడానికే జగన్నాథ క్షేత్రమందు బలరామ కృష్ణ సుభద్రా రూపములు ఛిహ్నితమై ఉన్నవి. ఇందులో రెండుకన్నులను ఏకదృష్టితో అంతర్ముఖముగా చూస్తున్న జ్యేష్ఠ భ్రాతయైన బలరామమూర్తి సాక్షితత్త్వమును సూచిస్తున్నాడు. (Neutrality). రెండు కన్నులు బాహ్యంగా జగత్తునందే సంపూర్ణదృష్టితో ఉన్నట్లుగానున్న నీల వర్ణపు శ్రీకృష్ణమూర్తి అంతార్యామిత్వమును సూచించుచున్నది.(Activity). వీరిద్దరితోటి జన్మించిన సుభద్ర జగత్తుయొక్క ప్రకృతి తత్త్వమును సూచిస్తున్నది. ఈ మూడూ కలిస్తేనే అది జగన్నాథ తత్త్వము ఔతున్నది. సుభద్రను జీవ చిహ్నమైన నరుడు (అర్జునుడు) వరించి పరిగ్రహించినాడు. వారికిపుత్రుడుగా దేహాభిమానమునకు చిహ్నమైన అభిమన్యుడు అన్మించడం జరిగినది. సాధకుని (శిష్యుడైన అర్జునుని) దేహాభిమానమును హృత్పద్మమందు ప్రవేశపెట్టి తిరుగులేక నిర్మూలించడమే పద్మవ్యూహములో ప్రవేశించి నిహతుడైన అభిమాన్యుని గాథకు యోగపరమైన అర్థము.

వేములవాడ భీమకవి

వేములవాడ భీమకవి 

భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట.

 ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలోసంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కానీ భీమన్నను మాత్రం ఆహ్వానించలేదు. భీమన్న పిలవకపోయినా సంతర్పణకు వెళ్ళారు. నేరుగా లోపలికి వెళ్ళి కూర్చొని, తనకు కూడా భోజనం వడ్డించమని అడిగారు. అక్కడి వారంతా భీమన్నను బయటకి పంపివేసి, నీవు లోనికి రావద్దని చెబుతూ తలుపులు వేసేశారు. బాలభీమన్న “భీమేశ్వరుని తనయుడనైన నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేరు” అని చెప్పి బయట అరుగుపై కూర్చొన్నారు. లోపల జరుగుతున్న తంతు అంతటినీ గమనిస్తూ వడ్డన ప్రారంభమయ్యేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. వడ్డన పూర్తీ అయిన వెంటనే ఈ క్రింది పద్యం చెప్పారు.  

     ఉ.    “గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ 
              ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్క మాఱ మీ 
              యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్ 
              బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”

భావము: తాము (సత్బ్రాహ్మణులమని) గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ బ్రాహ్మణులందరూ తిట్టారు. కావున ఒకసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా, అన్నము అంతా సున్నముగా మారి, పప్పు, కూరలు, పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
          తక్షణమే వడ్డింపబడిన అన్నమంతా సున్నముగా మారింది. అప్పడాలన్నీ కప్పలై బెకబెక మంటూ గెంతుతూ, అటూ ఇటూ వెళ్తున్నాయి. పప్పు, పులుసు, పచ్చడి అన్ని చిన్నచిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఈ వింత మార్పును చూసి భోజనపంక్తికి కూర్చున్న బాపలందరూ చాలా కలవరపడ్డారు. సంతర్పణ చేయిస్తున్న ఇంటి యజమాని అందరినీ  చూసి కలవరపడవద్దని చెప్పి, మళ్ళీ వడ్డించడానికి క్రొత్త విస్తరులను వేయించాడు. తీరా  అన్నపురాశి వద్దకు వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా అన్నమంతా సున్నంగా మారిపోయి ఉంది. గంపలోని అప్పడాలేమో కప్పలయ్యి బయటకు ఎగురుతూ గెంతులేస్తున్నాయి. మిగితా వంటలన్నీ రాళ్ళుగా మారిపోయి ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి ఎందుకిలా జరిగింది? ఏమి చేయాలి? అని దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతలో అక్కడి వారిలో భీమన్న చెప్పిన పద్యం విన్న ఒక బ్రాహ్మణుడు, ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి ఆరుబయట కుర్చుని భీమన్ననే ఇవన్నీ ఇలా మారాలని పద్యం చెప్పాడనీ, ఇదంతా ఆ భీమన పలుకుల మూలంగానే జరిగిందనీ చెప్పాడు. అప్పుడు తెలిసింది ఆ యజమానికి  “నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేర”ని చెప్పిన భీమన్న మాటలకర్థం. 
        అతను వెంటనే భోజనానికి వచ్చిన బ్రహ్మణులందరినీ భీమకవి వద్దకు పిలుచుకొని వెళ్ళి, వాటిని తిరిగి భోజనపదార్థాలుగా మార్చమని అడిగాడు. అలా చేసినట్లయితే భోజనానికి రానిస్తామని చెప్పారు. వారికి భీమకవి అంతరార్థం ఇంకా అర్థం కాలేదు. భీమకవి “మీరందరూ గొప్పజాతి వారే కదా! మరి మీరే మార్చుకొవచ్చుగా. నేను మీ అంతటి వాన్ని కాదు కదా! నా వలన ఏమవుతుంది? చెప్పండి?“ అని అడిగాడు. ఆ బ్రహ్మణుల కన్నులు తెరచుకున్నాయి. వెంటనే వారు "భీమన్నా! మేము తప్పుగా ప్రవర్తించాము. నువ్వు మహానుభావుడివి. నిన్ను భోజనానికి రానివ్వకుండడం మా అందరి అపరాధము. మమ్మల్ని అనుగ్రహించి యథాప్రకారము వాటిని భోజనసముదాయముగా మార్చండి. అంతేకాక మీరు కూడా మాతో పాటి భోజనానికి కూర్చొని మమ్ము కృతార్థులను చేయండి. ఇప్పటి నుంచి మీతో గౌరవాభిమానాలతో నడుచుకుంటాము” అని నమస్కరిస్తూ వేడుకున్నారు. భీమకవి తిరిగి ఇంకో పద్యం చెప్పారు.
  
          మ.     "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశ నం 
                   దనుఁడీ భీమన యంచు గుర్తెఱింగినిందల్ మానినన్ గౌరవం 
                   బుననీ విప్రులుఁ జూచిరందువలనఁ బూర్వస్థితిన్ జెంది భో 
                   జన వస్తు ప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"

భావం: ఈ బ్రాహ్మణులందరూ, గొప్పవాడువేములవాడ వంశస్థుడు, ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొనినిందించడం మాని, నను గౌరవంతో చూసారు. అందువలన ఈ భోజన, వస్తు సముదాయమంతా కూడా మునుపటి రూపు పొంది వాటి పూర్వస్థానానికి వచ్చును గాక!
           వెంటనే మునుపటిలా అన్నపురాశి ప్రకాశించింది. కప్పలన్నీ తిరిగి అప్పడాలుగా మారిపోయాయి. చిన్నచిన్న రాళ్ళన్నీ తిరిగి పప్పు, పులుసుపచ్చడులుగా మారిపోయాయి. విస్తరులన్నీ తిరిగి భోజనంతో నిండిపోయాయి. ఇది చూసిన ఆ బాపలంతా భీమకవి మహత్యానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. వెంటనే భీమకవిని తమతోపాటి భోజనానికి తీసుకుపోయి భోజనవరుసలో అగ్రస్థానాన కుర్చోబెట్టి గౌరవించారు. ఊరివారంతా ఈ భీమన్న ద్రాక్షారామ భీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకొని మసలుకున్నారు. ఇన్ని రోజులు నిందలు మోపి, వెలివేసి బాధ పెట్టినందుకు తమను మన్నించాల్సిందిగా మాచెమ్మను వేడుకున్నారు. నాటి నుంచి వారిపట్ల గౌరవాభిమానాలతో నడుచుకున్నారు.

వేములవాడ భీమకవి ఉద్దండకవీ, పండితుడనీ, తిట్లు కవియనీ ప్రసిద్ధిగాంచాడు. ఈయన రాజస్థానములకు వెళ్ళి రాజుల నుండి సత్కారములను పొంది, తనను గుర్తించని వారిని శపించి తిరిగి ఆ రాజు భీమకవిని ప్రాధేయపడితే శాపమును తిరిగి వెనుకకు తీసుకునేవాడని ప్రతీతి.

భీమకవి గొప్పతనాన్ని గురించి శ్రీనాథుడు కూడా పొగిడాడు. భీమకవి సందర్భాన్నిబట్టి పద్యాలు చెప్పడమేగానీ, నిలకడగా ఏ కావ్యమూ రాసినట్లు కనిపించదు. రాఘవ పాండవీయమనునది - కవిరాజాశ్రయమను ఛందో గ్రంథమును రాశాడని చెప్పుకుంటారు. 

 రాజసందర్శనాలను చేస్తూ కవిత్వమును చెబుతున్న భీమకవి ఒకనాడు సెజ్జనగరం వెళ్ళారు. కళింగగంగురాజు సెజ్జనగరాన్ని పాలిస్తునాడు. భీమకవి కళింగగంగు ఆస్థానానికి వెళ్ళి అక్కడి భటులతో “తమరిని కలవడానికి భీమకవి వచ్చారని కళింగగంగురాజుతో  చెప్పమని” కబురు పంపారు. కళింగగంగు నుంచి ఎటువంటి సమాధానం రాక పోగా మరుసటి రోజున కలుద్దామని ఆ రోజుకు వెనుదిరిగివెళ్ళారు.

సరస్వతీ కటాక్షమున్న కవులన్న ఎంతటి నిర్లక్ష్యభావం” అని అతని గర్వానికి కారణమైన అతని సిరిసంపదలు కోల్పోయేలా, శాపం పెడుతూ ఈ పద్యమును భటులతో రాజుకి అందించమని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

          ఉ       వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
                   సామము మాని కోపమున సందడిఁదీఱిన రమ్ము పొమ్మనెన్
                   మోమునుఁజూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్
                   జామున కర్ధమందతని సంపద శత్రుల పాలుగావుతన్

భావము: వేములవాడ భీమకవి వేగిరపాటు (తొందర) చూసిన తర్వాత కూడా కళింగ గంగు కనీసం ఉభయకుశల ప్రశ్నలు వేయకుండా, కోపముతో ఇప్పుడు వెళ్ళి సందడి తీరిన తర్వాత రమ్మన్నాడు. మోము చూడని తప్పుకు(నను ఆలకించని తప్పుకు) ముప్పది రెండు దినాల తర్వాతి వేకువజాములోపు అతని సంపద (రాజ్యం) శత్రువుల పాలు గాక తప్పదు.

        భీమకవి శాపమును తప్పించడానికి ఎవరికి సాధ్యం? శాపము పెట్టిన మరుసటి రోజే వంగదేశాన్ని పాలించు విక్రమదేవుడను రాజు నలబై వేల కాలినడక సైన్యమును, మూడు వందల ఏనుగుల బలమును, నాలుగు వందల తొంబై ఐదు గుర్రాల సైన్యమును, నాలుగు వందల శతఘ్నులను(వందమందిని చంపగల యోధులను) సమకూర్చుకొని, సెజ్జనగరముపై దాడిచేసి కోటను ముట్టడించాడు.
        కళింగగంగు తన పూర్తీ సైన్యముతో ఎదుర్కొని విక్రమదేవునితో యుద్ధము చేసాడు. దాదాపు ఇరవై ఎనిమిది రోజులపాటు ఘోరయుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో కళింగ గంగు సైన్యము ప్రాణాలొడ్డి పోరాడారు. విక్రమదేవుని సైన్యములో సగభాగము కళింగగంగు సైన్యముచే నాశనము అయ్యింది. ఇరవైతొమ్మిదవ రోజున జరిగి యుద్ధంలో అనుకోని విధంగా విక్రమదేవుని సైన్యం విజృంభించి పోరాడింది.  కళింగగంగు విక్రమదేవునికి దొరకిపోయాడు. రాజు శత్రువుల చేతికి దొరికేసరికి మిగిలిన సైన్యము నాలుగు దిక్కులా పలాయనమయ్యింది. విక్రమదేవుడు ఇక యుద్ధాన్ని ఆపివేసి, కళింగగంగును బంధించి తన శిబిరానికి తీసుకు వెళ్ళాడు. మిగిలిన సైన్యం తమ రాజును విడిపించుకోవడానికి వచ్చే అవకాశము ఉన్నందున కళింగనగరములోకి ప్రవేశించే వరకు శత్రువులను ఎదుర్కొనేవిధంగా సైన్యాన్ని  అప్రమత్తపరచి జాగ్రత్తపడ్డాడు. మరుసటి రోజున సెజ్జనగరం ప్రవేశించి, కళింగగంగును కారాగారంలో బంధించి, పట్టము కట్టుకున్నాడు.
        “రవి చంద్రులు గతి తప్పిన లవలేశము తప్పబోవు నా వచనంబుల్” అన్న భీమకవి మాటలు వ్యర్థము కావు కదా? ఖచ్చితంగా 32 రోజుల తర్వాత తెల్లవారే లోపు కళింగ గంగు రాజ్యబ్రష్టుడైయ్యాడు.



కళింగగంగు నానా దేశాలు తిరుగుతూ కూటికి, గుడ్డకు నోచుకోని పేదవాడయ్యాడు. సుఖాలకు బాగా 
అలవాటుపడిన వాడగుటచే కూలి పని చేయలేక బిచ్చమెత్తుకుంటూ జీవితం గడిపాడు. ఇతర రాజ్యాలలో తననెవరూ చూసి ఎరుగరు కాబట్టి తనకు ఎటువంటి స్వాభిమానము అడ్డురాలేదు. వంట చేసుకొనే ఓపిక సత్తువలేక అన్నమో, గంజో యాచించుకొని పొట్ట నింపుకుంటూ కాలము గడిపాడు. కళింగగంగు భార్యలు ముగ్గురూ సిరియాళుడి వద్ద ఊడిగము చేసుకుంటూ గడిపారు. 
కళింగగంగు, భీమకవిని క్షమించమని అడిగి ఈ కష్టాలనుంచి బయటపడాలని తపించాడు. శాపవిమోచనముకై ప్రార్థించి, తన తప్పును సరిదిద్దుకొనే అవకాశము కోసం ఎదురుచూసాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక కళింగగంగు ఊరూరు తిరుగుతూ పెద్దాపురం చేరాడు. ఒకనాటి రాత్రి భీమకవి బంధువుల ఇంట్లో భోజనం చేసి వీధి అరుగుపై చేయి కడుక్కోవడానికి వచ్చారు. అపుడు రాత్రి నాలుగు ఘడియల సమయం. కళింగగంగు తిండి కోసం ఇల్లిల్లూ తిరుగుతూ భీమకవి ఉన్న ఇంటి వైపుకు వచ్చాడు. వస్తుండగా మార్గమధ్యంలో జొన్నలు పాతరనేయుటకై త్రవ్వబడిన ఒక పాత గోతిలో పడ్డాడు. వెంటనే అయ్యో ఒక కాలిదివిటీ కూడా లేకపొయేనే! ” అని గట్టిగా అరిచాడు. భీమకవి ఆ చీకటిలో అతని వైపుకు చూసి బిచ్చమెత్తుకొనువాడికి కాలిదివిటీ ఎక్కడి నుండి వస్తుంది. బిచ్చగాడే అయితే కాలిదివిటీ ఎందుకు గుర్తొచ్చింది. ఇతడిట్లు అన డానికి ఏదో బలమైన కారణమే ఉంటుందని గ్రహించి, “ఎవరు నువ్వు? దివిటీ కావాలంటున్నావు?” అని అడిగాడు. కళింగగంగు “అయ్యా! నేను వేములవాడ భీమకవి చేసిన బికారిని. పూర్వము అష్టైశ్వర్యములను అనుభవించి ఉండటం వల్ల అప్రయత్నంగా దివిటీ అయినాలేదే అన్నాను. నా దర్శనార్థం సాక్షాత్తు భీమేశ్వరుని వరపుత్రుడగు భీమకవి వచ్చారు. కనీసం ఆ మహానుభావుని దర్శనం కూడా చేసుకోలేదు. అందుకు తగిన ఫలితాన్ని ఇలా అనుభవిస్తున్నాను. అయ్యా! తమరెవరో మహానుభావుడిలా ఉన్నారు. ఈ ఒక్కపూటకు నాకు భోజనము పెట్టించండి. ఆకలితో కడుపు దహించుకు పోతోంది. ” అని ధీనస్వరంతో అడిగాడు.
భీమకవికి మహారాజును ఈ పరిస్థితిలో చూడగానే ఎంతో జాలి కలిగింది. ఇక ఇతన్ని ఈ అవస్థలో చూడకూడదని తలచి, తిరిగి తన రాజ్యాన్ని పొందేలా ఆశీర్వదిస్తూ, ఈ క్రింది పద్యమును చెప్పారు.

ఉ వేయి గజంబులుండఁబది వేల తురంగములుండఁ నాజిలో
రాయలగెల్చి సెజ్జనగరంబునఁ బట్టముఁ గట్టుకోవడిన్
రాయకళింగ గంగు! కవిరాజభయంకరమూర్తిఁజూడగా
బోయిన మీనమాసమునఁ బున్నమవోయిన షష్ఠినాఁటికిన్

భావము: రాజ కళింగగంగు! మహా రాజులకు సైతం వణుకు పుట్టించగల కవి అయిన నేను, భవిష్యత్తును చూస్తూ పోతే వెయ్యి ఏనుగులు, పదివేల గుర్రములు నీ చెంత ఉన్నాయి. త్వరగా యుద్ధంలో రాయలను గెలిచి, మీన మాసములో పున్నము తర్వాత వచ్చే షష్ఠి రోజుకంతా సెజ్జనగరమున పట్టము కట్టుకో.
కళింగగంగు అమితానందభక్తి పరవశుడై, భీమకవికి సాష్టాంగ ప్రణామము చేసాడు. జరిగిన తప్పుకు మన్నించమని వేడుకొని నిలబడ్డాడు. కళింగగంగును భీమకవి లోనికి పిలుచుకు వెళ్ళి భోజనము పెట్టించారు. మరుసటి రోజున కళింగగంగునకు పెద్దాపురము నుంచి సెజ్జనగరము వెళ్ళుటకు దారి బత్తెము ఖర్ఛులకు సరిపడా డబ్బు ఇచ్చి పంపారు. కళింగగంగు ఆవస్థను బట్టి రూపము మారిపోవడం వలన సెజ్జనగరంలో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అతని తలంతా పెరిగిపోయిన జుట్టుతో, దుమ్ముధూలితో జడలుగా కట్టుకుపోయింది. గడ్డము, మీసాలు బాగా పెరిగిపోగా, బక్కచిక్కిపొయి ముడతలుపడ్డ శరీరముతో ఉన్న కళింగగంగును మహా రాజుగా, మకుటధారిగా చూసిన జనం ఇప్పుడెలా గుర్తు పట్టగలరు.
చాలా రోజులుగా పగటివేషగాళ్ళు కొందరు సెజ్జనగరానికి వచ్చి ప్రభువు విక్రమదేవుని సందర్శించి, వీధుల్లో పగటివేషాలను వేస్తూ, వారి నైపుణ్యంతో పట్టణప్రజను ఆనందడోళికల్లో ముంచెత్తుతున్నారు. రాజకళింగగంగు సెజ్జనగరము చేరునప్పటికి సిరియాళుడు ఆ నగరమును పాలించుటలేదు. సిరియాళుడు వైరాగ్యము కలగడంతో, రాజ్యమును వదిలి తపోవనాలకు వెళ్ళిపోయాడు. విక్రమదేవుడికి, సిరియాళుడి తర్వాత సరైన పరిపాలనాదక్షుడు దొరకలేదు. వంగదేశము పాలించుటకు తన పెద్దకుమారుడైన ఆనందదేవుని నియమించి సెజ్జనగరానికి తిరిగివచ్చాడు.
విక్రమదేవుడికి పగటివేషాలన్నా, వీధినాటకాలన్నా చాలా ఇష్టము. అందువల్ల ఆ పగటివేషగాళ్ళకు కావలసినంత డబ్బిచ్చి వారిచే బ్రాహ్మణ, సన్యాసి, వేశ్యాది వేషములను వేయిస్తూ సంతోషముగా కాలము గడిపేవాడు. ఒకనాడు వారిని తన వేషము వేసి వినోదింపచేయమని ఆదేశించాడు. రాజు ఆదేశము ప్రకారమే వారి నాయకుడు విక్రమదేవుని వేషమును వేయగా తక్కినవారు సభాపతుల వేషమును వేసి అందరినీ అలరించారు. ఇంకో రోజు కళింగగంగు వేషమును వేసుకురావలసినదిగా, అలా చేసి తనను అలరించినట్లయితే విశేషద్రవ్యమును బహుమతిగా ఇచ్చెదనని ప్రకటించాడు. ఆ వేషగాళ్ళు కళింగగంగు రాజసము, అతని ఠీవిని గురించి వినడమే కానీ, ఎన్నడూ చూసి ఎరుగరు. అందుకు వారి నాయకుడు “ మహారాజా! మాకు ఒక నెల రోజులు గడువు ఇవ్వండి. అభ్యాసము చేసి చక్కగా కళింగ గంగు వేషమును వేసి అలరింపచేస్తాము ” అని ప్రార్థించాడు. విక్రమదేవుడు కూడా అందుకు సరే అన్నాడు. అంతేకాక వారికి నెల రోజులకు వసతినీ, సరిపడా కావలసిన వంటపదార్థాలను ఇచ్చాడు. ఆ వేషగాళ్ళందరు కళింగగంగు వేషానికి సాధన మొదలుపెట్టారు. కానీ వారిలో ఒక్కరిలో కూడా ఆ రాజఠీవి కనపడలేదు. విక్రమదేవుడు ఇచ్చిన గడువు దగ్గరపడుతోంది, కానీ వారికి ఆ వేషం వేయగల సమర్థుడు మాత్రం దొరకనేలేదు. వారి ధైర్యము కూడా రోజు రోజుకు తగ్గిపోతోంది. చివరకు వేషము వేసే వాడికి వేయి గద్యాణములు బహుమతిగా ఇస్తామని చాటింపు కూడా వేయించారు. ఈ చాటింపు అప్పుడే సెజ్జనగరములో అడుగుపెట్టిన కళింగగంగు చెవినపడింది. ఆ వేషగాళ్ళ నివాసస్థలానికి వెళ్ళాడు. వారితో “ఈ వేషమును నేను వేయగలను. కళింగగంగును చూసిన వాడిని. అంతేకాక నేను ఆ రాజు పోలికలు కలిగినవాడిని. మా ఊరి వారంతా నేను అచ్చం కళింగగంగులా ఉంటానని చెబుతారు. ఆ ద్రవ్యమేదో నాకు ఇప్పించండి. ఆ వేషమును నేను వేస్తానని” వారిని ఒప్పించాడు. ఈ వేషమును వారు ఎందుకు వేయాల్సివచ్చిందో అడిగి తెలుసుకున్నాడు. విక్రమదేవునిపై ఎత్తువేయడానికి తగిన అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వేషగాళ్ళు కళింగగంగుకు భోజనవసతులను కల్పించారు. వారము రోజులలోనే బక్కచిక్కిన అతని దేహము పుష్ఠిగా అయ్యింది. వేషమును వేసే రోజుకంతా మునుపటి తేజస్సును పొందాడు. కోటలోనే ఉన్న కళింగగంగు దుస్తులను, ఆభరణాలను, ఆయుధాలను, గుర్రాన్ని రాజుగారికి కబురు పంపి తెప్పించుకున్నాడు. విపరీతముగా పెరిగిపోయిన గడ్డాన్ని తీసివేయించడానికి మంగలిని పిలిచించుకున్నాడు. ఆ మంగలితో కళింగగంగుకు మునుపు ఎలా క్షవరము చేసేవాడివో తనకు కూడా అలానే చేయమని చెప్పాడు. అర్ధక్షవరము అవ్వగానే ఇతను స్వయాన తన రాజు కళింగగంగేనని గుర్తుపట్టాడు. తమ రాజుపట్ల అభిమానమున్న వాడు కావున “మహారాజా నేటికి తమరి దర్శన భాగ్యము కలిగినది” అని సంతోషముతో బదులిచ్చాడు. కళింగ గంగు అతనిని ఈ విషయమును ఎక్కడా ప్రస్తావించకుండా, మనసులోనే ఉంచుకొని, జరగబోయేది చూడమని ఆదేశించాడు. స్నానాదికాల తర్వాత వస్త్రాధ్యాలంకారములు ధరించి, తన వజ్రాయుధమును తీసుకొని తాను పూర్వము ఎక్కే గుర్రమును అధిరోహించి వీధిలోకి వెళ్ళాడు. వేషగాళ్ళందరూ వాళ్లకు తగిన మంత్రి, సామంతాది వేషాలను వేశారు. గుర్రం కూడా తన యజమాని కళింగగంగును గుర్తుపట్టి మిక్కిలి ఉత్సాహముతో కదంతొక్కింది. చూసినవారందరూ అచ్చం కళింగగంగురాజులానే ఉన్నాడే అని ఆశ్యర్యపడ్డారే, కానీ ఒక్కరు కూడా అతడు కళింగగంగురాజేనని ఊహించలేకపోయారు. రాజకళింగగంగు తిన్నగా కోటలోకి ప్రవేశించి, విక్రమదేవుని ఎదుటకు వెళ్ళి, గుర్ర్రంనుంచి దిగి నిలబడ్డాడు. విక్రమదేవుడు కూడా అందరిలాగే అచ్చం రాజకళింగగంగులానే ఉన్నాడని అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. కళింగగంగు “మహారాజా! తమరు అనుమతిస్తే కళింగగంగు రాజఠీవిని, గాంభీర్యాన్ని ప్రదర్శించి చూపిస్తాను” అని చెప్పాడు. విక్రమదేవుడు మిక్కిలి ఉత్సాహముతో, అలానే త్వరగా చేసి చూపించమని అడిగాడు. కళింగగంగు నిండు సభలో తన గుర్రాన్ని ఆ వైపు నుంచి ఈ వైపుకు, ఈ వైపు నుంచి ఆ వైపుకు దుమికిస్తూ, మధ్యమధ్యలో తన వజ్రాయుధమును తీసి ఝుళిపిస్తూ, విక్రమదేవుని దగ్గరగాపోయి రెప్పపాటిలో తన ఆయుధంతో విక్రమదేవుని తల నరికేసాడు. వేషగాళ్ళందరూ తమకు ఏ శిక్ష పడుతుందో ఏమోనని భయపడగా, కళింగగంగు అక్కడివారందరినీ ఉద్దేశించి “ నేను వేషగాడిని కాదు. మీ కళింగగంగురాజును. భీమకవిని కలిసి, ఆయన్నుంచి శాపవిమోచనము పొందివచ్చాను. ఆయన ఆదేశానుగ్రహాల వలన ఈవిధంగా మన శత్రువును తుదముట్టించి మన రాజ్యమును చేజిక్కించుకోగలిగాను. ఇక అందరూ అప్రమత్తులై జరుగాల్సిన పనుల చూడమని ఆదేశించాడు. విక్రమదేవుని దహన సంస్కారాలను జరిపించాడు. ఈలోపు విక్రమదేవుని అనుచరగణము, అతని సైన్యము ఏకమై, కళింగగంగుపై యుద్ధానికి సిద్ధపడ్డారు. విక్రమదేవుని సైన్యంపోగా, భీమకవి భవిష్యత్తు చూసి చెప్పిన ప్రకారముగానే 1000 ఏనుగులు 10,000 గుర్రలసైన్యము కళింగగంగు పక్షాన నిలిచింది. ఈ సారి భీమకవి ఆశీర్వాదబలము ఉన్నందున కళింగగంగు తిరుగులేని విజయముతో షష్ఠిలోపు పట్టాభిషేకము చేసుకొని సింహాసనము అధిష్టించాడు.
పట్టాభిషేకము తర్వాత తనకు సహాయం చేసిన వేషగాళ్ళను, మంగలిని తగిన పారతోషికము ఇచ్చి సంతోషపెట్టాడు. భీమకవిని తానే స్వయంగా వెళ్ళి తన ఆస్థానమునకు సభక్తియుక్తంగా పిలుచుకువచ్చి పూజించాడు. తగిన విధంగా సత్కరించాడు. నాటి నుండి భీమకవి కొంత కాలము అతని ఆస్థానమునే ఉండి, రాజ్యపాలనలో సహాయపడుతూ కళింగగంగును అనుగ్రహించారు. ప్రజలు కూడా తమ సమస్యలకు పరిష్కారములము పొందుతూ మిక్కిలి భక్తియుక్తులతో మెలిగేవారు.