Wednesday, December 18, 2013

శ్రీశ్రీ 'సిరిసిరిమువ్వ' శతకం

'సిరిసిరిమువ్వ శతకం '

వ్యంగ్య ధోరణిలో శ్రీశ్రీ రచించిన సిరి సిరి మువ్వ శతకం యాభై కందాలతో కూడి, సామాన్య హృదయాలను దోచు కుంటుంది. సిరి అంటే సంపద. సమాసాల్లోనో, సామెతల్లోనో, జాతీయాల్లోనో మిగిలిఉంది. సిరిసంపదలు , నడమంత్ర పు సిరి మొదలైన విధంగా శతకాలలో మకుటం ఉంటుంది కాబట్టి శ్రీశ్రీ తన పేరు మీదనే ‘సిరిసిరి మువ్వ’ అని ప్రయోగించాడు.

కలలో శ్రీశ్రీకి చక్రపాణిగారు కలలోకనిపించి ,ఒకశతకం రాసి తనకంకితకీయమని అడిగాడట .శతకకన్యను పుచ్చుకొని కన్యాశుల్కంగా ఒక సిగరెట్టిస్తానన్నాడట .

నీకో సిగరెట్టిస్తా
నాకో కావ్యమ్ము రాసి నయముగనిమ్మా
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీకావ్యము వరలునోయి సిరిసిరి బాయీ ! 

సిరిసిరి మువ్వా ,సిరిసిరి మురళీ ,సిరిసిరి మౌనీ ,సిరిసిరి బాయీ ,సిరిసిరి గాగూ ,సిరిసిరి నేస్తం ,సిరిసిరి రావూ అనేవి మకుట స్థానంలో కనిపిస్తాయి (మకుట నియమోల్లంఘనం + మణిప్రవాళం అనే ప్రక్రియలకు ఆద్యుడు శ్రీశ్రీ.)

నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్‌ సద్గీతా
లాలాపించే కవితా శ్రీ
లోలుడు నహినహీతి సిరి సిరి మువ్వా!

నాలాగ కందాలు రాయగలిగిన వాళ్ళు సాహిత్యంలో అరుదు సుమా అని కూడా అనేశా డాయిన.

శుష్క చ్ఛాందస కవి జన
ముష్కరులకు సొంటి పిక్క, మూర మ్మునకా
యుష్కర్మము, తదుపరి శో
చిష్కే శున కప్పగింత సిరి సిరి మువ్వా!

ఉత్తుత్తి కవులకు తొడ పాశం పెడతాను, గుండు గీయిస్తాను... నిప్పుల్లోత్రోసేస్తాను... అక్కడుంది అసలు చమత్కారం! సాదా సీదా కవులను నిప్పుల్లో తోసేస్తాను జాగ్రత్త! అనడంలో ఉంది మహా కవి ధిక్కారం!

“కందం వ్రాసినవాడే కవి, పందిని చంపినవాడే బంటు” అని ఒక తెలుగు సామెత. దాన్నే ఇంకెవరో కసిగా “పందిని చంపినవాడే కందం వ్రాయాలి” అని మార్చారు. కందం వ్రాయక పోతే పోయారు గానీ దానికోసం పాపం పందిని చంపడం ఎందుకో మరి! ఈ భావం పలికేలా వ్రాసిన శ్రీశ్రీ పద్యం...

“పందిని చంపినవాడే
కందం రాయాల” టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!

'జరూక్ శాస్త్రి ' గారిపై వ్రాసిన పద్యమట , చదవండి...

రుక్కునకు, ఆగ్రహము గల
ము క్కునకున్‌, తెగవాగెడి
డొక్కునకున్‌ వాణీ ముఖరిత వీణా
భాక్కునకున్‌ సాటి లేని డబుడుక్కునకున్‌!

భావ కవిత్వంపై శ్రీశ్రీ విసిరిన వ్యంగ్య భాణం సిరిసిరి మువ్వ పద్యాలలోనే ఉంది-

“ఉగ్గేల తాగుబోతుకు?
ముగ్గేల తాజ్ మహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణ శాస్త్రికి?
సిగ్గేల భావకవికి?సిరిసిరిమువ్వా!”

నేటి మనుషుల తీరుపై సంధించిన వ్యంగ్యాస్త్రం...
ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరిసిరి మువ్వా!

హాస్య ధోరణిలో సాగిన క్రింది పద్యాలు చూడండి...

కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చెయకుమీ చేబదుళ్ళు సిరిసిరి మువ్వా !

బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు ?భార్యయెదుట తా
నోరెట్లా మెదిలించును
చీరెట్లా బేరమాడు ? సిరిసిరి మువ్వా !

సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది. చాటువులలోభాగంగా చివర ఫలశృతినికూడా చెప్పాడు ...

ఈశతకం యెవరైనా 
చూసి,చదివి,వ్రాసి ,పాడి .సొగసిన సిగరెట్ 
వాసనలకు కొదవుండదు 
శ్రీశు కరుణ బలిమివలన సిరిసిరి మువ్వా !

అంతా చదివారు కదా... ఇక సిగరెట్ వాసనా ప్రాప్తిరస్తు!

                                                

మాటతీరు

'నేను కూడా అదే విషయం చెప్పాను, మరి నను చెప్పింది నీకు కటువుగా అనిపించింది, అతను చెప్తే నీకు హితవుగా అనిపించిందా ?' అడిగారు ఒకరు.

వెంటనే నాకు చిన్నప్పుడు విన్న కధ జ్ఞాపకం వచ్చింది.

అనగనగా ఒక రాజుగారు. ఆ రాజు గారికి తరచుగా తన నోటిలోని పల్లన్నీ ఊడిపోతున్నట్టు కల వస్తోంది. వెంటనే జోతిష్య పండితుడిని పిలిపించి , తన కలకు అర్ధం చెప్పమన్నాడు. 

అతను, 'రాజా! ఈ కల అశుభ సూచకంగా అనిపిస్తోంది. మీ వాళ్ళంతా, మీ కాళ్ళ ముందే రాలిపోతారు...ఇదే, ఈ కలకు అర్ధం' అన్నాడు.

రాజుకు వెంటనే బోలెడంత కోపం వచ్చేసింది, మరి రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? వెంటనే ఆ జ్యోతిష్కుడిని చెరలో వేయించాడు.

మరొక జ్యోతిష్కుడు వచ్చి, 'రాజా! కొంత కటువుగా అనిపించినా, వాస్తవం చెప్పక తప్పదు. త్వరలోనే నీవు నీ ఆప్తులను కోల్పోతావని, ఈ కల తెలియజేస్తున్నది,' అన్నాడు.

ఈ జ్యోతిష్కుడికి కూడా చేరసాలే గతి అయ్యింది... ఇలా రాజు గారి కల మహిమ వల్ల చాలా మంది శిక్షలు అనుభవించారు. అప్పుడు, లౌక్యం, మాటకారితనం కలబోసిన ఒక పండితుడు రాజ సభకు వచ్చి, ' రాజా! నీవు ఎంతో అదృష్టవంతుడివి. దీర్ఘాయువువి. మీ వంశం మొత్తంలోకీ నీవే చిరకాలం బ్రతుకుతావు. పూర్ణాయువుతో , ఆరోగ్యంతో, చల్లగా ప్రజలను పాలిస్తావు. ఇదే నీ కలకు అర్ధం...' అన్నాడు.

రాజు ఉప్పొంగిపోయి, ఆ జ్యోతిష్కుడికి అనేక మాన్యాలు, బహుమతులు ఇచ్చి పంపాడు.

అంతరార్ధం ఆలోచిస్తే, జ్యోతిష్కులంతా చెప్పింది వొకటే! కాని, చెప్పిన విధానంలో తేడా! 

చివరి జ్యోతిష్కుడు రాజు మనసును, ప్రవర్తనను తెలుసుకుని, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేసి, విషయాన్ని చెప్పాడు. అందుకే, తనకు కావలసిన సంపదలని, రాజు మెప్పును పొందాడు. 

ఎవరయినా మాట్లాడే ముందు ఇలాగే ఆలోచించి, ఎదుటి వారి స్థితి అంచనా వేసి మాట్లాడితే, అసలు మనుషుల మధ్య విభేదాలే ఉండవు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థాయికి దిగి మాట్లాడాలి, స్త్రీలతో సున్నితంగా ప్రస్తావించాలి, పెద్దలతో, వారి స్థాయికి ఎదిగి మాట్లాడాలి. తొందరపాటు, దూకుడు మాటలతో కొందరు  ఇతరుల మనసులు చప్పున నొప్పించేస్తారు. వీటికే పుల్లవిరుపు మాటలని పేరు. ఇటువంటి వారికి అందరూ దూరమవుతారు. మంచి మాటతో మీరు మనసులు గెలుచుకుంటారు. మంచి మాట, చెప్పే పద్ధతిలో మీరు చెప్పగలిగితే, ఎవరినయినా మెప్పించగలరు. ఏమయినా సాధించగలరు. ఇది సత్యం. 

మన భద్రత మన చేతుల్లోనే

పోయిన సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసాము. తెచ్చి పెట్టాడు. సాయంత్రానికి బాల్కనీ నుంచీ గదంతా గ్యాస్ వాసన. ఈ దిక్కుమాలిన అపార్ట్ మెంట్ లతో వచ్చిన చిక్కేమిటంటే, వాసనలు కూడా మన ఇంటివా, పక్కింటివా, క్రింద, పైన ఇంటివా ఏమీ తెలియదు. కుక్కలా వాసన చూసి పట్టాలి. ఎక్కడో గ్యాస్ వాసన అనుకున్నాను, ఈ లోపు మా వారు 'పద్మిని,ఇక్కడ గ్యాస్ వాసన వస్తోంది చూడు,' అన్నారు. సీల్ వేసిన ఫుల్ సిలిండర్ లీక్ అవుతుందని ఎలా అనుకుంటాం ? ఎందుకైనా మంచిదని వెళ్లి చుస్తే, ఫుల్ సిలిండర్ లీక్ అవుతోంది. శనివారం సాయంత్రం ఏడు దాటింది ... గ్యాస్ కంపెనీ మూసేశారు. ఆదివారం సెలవు... అత్యవసర నెంబర్ చేసాను. అది మారిపోయిందని/ చెల్లనిదని సందేశం వచ్చింది. వెంటనే యెల్లో పేజెస్ వాళ్ళని నెంబర్ అడిగాను. వాళ్ళ దగ్గర బుకింగ్ సెల్ నెంబర్ తప్ప లేదు. ఏం చెయ్యాలి ? అపార్ట్ మెంట్ వాళ్ళ సలహాతో సిలిండర్ తీసుకెళ్ళి టెర్రస్ మీద పెట్టాము. ఇక చేసేదేముంది, సోమవారం ఉదయం వరకూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాను.

సోమవారం ఉదయం ఫోన్ చేస్తే, వాళ్ళు మధ్యానానికి సర్వీస్ అతన్ని పంపారు. అతను గ్యాస్ లీక్ అవుతోందని, సగం సిలిండర్ అయిపోయిందని, మళ్ళీ మేనేజర్ పెర్మిషన్ తీసుకుంటే, కొత్తది ఇస్తారేమో అడగాలని చెప్పాడు.సదరు మేనేజర్ అయ్యవార్ని కలిసేందుకు వెళ్తే వారు వస్తారు, వస్తారు... అంటూనే రారు, ఇక మంగళవారమే అన్నారు. సరే అక్కడ ఉన్న స్టాఫ్ తో మాట్లాడాలని వెళ్ళాను.

ప్రభుత్వ ఆఫీసుల్లో గొప్పతనం ఏమిటంటే, మనుషుల్ని పురుగుల్ని చూసినట్టు చూడడం, అవతలి వాళ్ళు గగ్గోలు పెడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. ఇలాంటి వాళ్ళని చుస్తే, 'ఫర్ ఎవరీ ఆక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అప్పోసిట్ రిఅక్షన్ 'అన్న న్యూటన్ నెత్తిన మొట్టాలని అనిపిస్తుంది.

గ్యాస్ అయ్యవారు లేరు కనుక, అమ్మగారికి ఫోన్ చేసారు. ఆవిడ ప్రపంచంలో ఎవరూ కనీ వినీ ఎరుగని అవిడియా ఇచ్చింది. మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలట. లీక్ అవుతున్న సిలిండర్ వాళ్లకు ఇస్తే, వాళ్ళు కంపెనీ కి పంపి, వాళ్ళు వప్పుకున్న రోజున మళ్ళీ నాకు సిలిండర్ ఇస్తారట. నాకు ఒళ్ళు మండింది. వెంటనే ఇంటికి వచ్చి, హెచ్ .పి వెబ్సైటు లో ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాను. క్లుప్తంగా ఇలా...

౧. లీక్ అవుతున్న సిలిండర్ ఇవ్వటం కంపెనీ తప్పు.
౨. ప్రింట్ అయిన రేసిట్ లు ఉండిపోయాయని, ఎమర్జెన్సీ నెంబర్ లు మారినా కొత్తవి వినియోగదారులకు ఇవ్వకపోవడం డీలర్ తప్పు.
౩. ఇవన్నీ ఉన్నా, కస్టమర్ కి స్పందించకపోవడం, కొత్తది మళ్ళీ డబ్బు కట్టి తీసోకోమనడం చాలా బాధాకరం.

అయ్యా, ఆలోచించండి. నా చోటులో మీ భార్య/ కుమార్తె ఉంటే... వాళ్ళు గ్యాస్ లీక్ చుసుకోకపోతే. మీ నిర్లక్ష్యం ఖరీదు, ప్రింట్ అయిన రిసీట్ లు వృధా కారాదన్న కక్కుర్తి ఖరీదు, కొన్ని జీవితాలు కావచ్చు. ఈ విషయంపై మీరు చర్య తీసుకుని, నా సిలిండర్ నాకు ఇప్పించ ప్రార్ధన.

మర్నాడు గ్యాస్ కంపెనీ వారే నాకు ఫోన్ చేసి, కొత్త సిలిండర్ ఇచ్చి వెళ్లారు. అంతే కాదు, డీలర్ కు చీవాట్లు పెట్టారు కూడా. ఈ మధ్యన ఎందుకనో, సీల్ వేసిన గ్యాస్ సిలిండర్ లీకేజ్ లు ఎక్కువ అవుతున్నాయి.  నిన్నో, మొన్నో దినపత్రికలో చదివాను. కొత్త సిలిండర్ సీల్ తీస్తుంటే, ఒక్క సారిగా గ్యాస్ లీక్ అయ్యిందట. అది వారు కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో ఉండగానే, దేవుడి ముందు వెలుగుతున్న దీపం మంటకి గ్యాస్ అంటుకుని, వంట గదిలో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ఎనిమిది నెలల పాప, ఒళ్ళు కాలిపోయి ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ దొంగతనం కోసం ప్రయత్నమో, లేక కంపెనీ వారి వైఫల్యమో, జరిగాకా ఏమీ చెయ్యలేము.

అందుకే, చికిత్స కన్నా, నివారణ మంచిది అన్న సూత్రం ప్రకారం, ఇలా చెయ్యండి. మీ ఇంటి స్త్రీలకు ఈ విషయం తెలియచెప్పండి. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే అబ్బాయి రాగానే, అతని చేతే, సీల్ తీయించి, రెగ్యులేటర్ పెట్టించి, వెలిగించి, లీకేజీ లేదని నిర్ధారించుకున్నాకే, డబ్బులు ఇవ్వండి. మన భద్రత కోసం ఇది తప్పనిసరి. మర్చిపోకండే, వెంటనే చెప్పండి.


 

భక్తి అంటే ఏమిటి ?

"భక్తి అంటే ఏమిటి?" అడిగారొక రాజుగారు.

"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.

"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"

"నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే, దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం..."

" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"

"అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు."

అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు  చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు. 

ఒక రోజు రాజుగారు అర్ధరాత్రి మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, ఖరీదయిన బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు. 



"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"

"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు. 

చూసారా! ఇది చిన్నప్పుడు నేను విన్న కధ. నా మనసులో బాగా నాటుకున్న కధ. మన జన్మ దైవాన్ని చేరేందుకే అయితే, వీలైనంతలో సేవ చేద్దాం.కొంత మంది ఉదయాన్నే, చలిలో టీ పాత్ర తెచ్చి, రోడ్డు మీద పడుకునే వాళ్లకు, బికారులకు ఇస్తుంటారు. నేను ప్రతీ గురువారం ఏదో ఒక ప్రసాదం స్వయంగా చేసి, ఓ పది మందికి పంచి పెట్టి వస్తాను. కేవలం బికారులే కాదు, రిక్షా వాళ్ళు, చెత్త ఏరుకునే వాళ్ళు, భోజన సమయంలో ఎవరు కనిపిస్తే వాళ్ళకే ఇస్తాను. అంతే కాదు, వీలున్నప్పుడల్లా, పళ్ళు, బిస్కెట్లు, బ్రెడ్ వంటివి కొని ఇస్తూ ఉంటాను. అప్పుడు వారు ఇచ్చే దీవెనలు, వారి కళ్ళలోని ఆనందం వెలకట్టలేము.

ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అందుకే దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి. పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. మీ చేత్తో పంచండి.  రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ.

బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు

జీవితంలో మనకు అనేక రకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. కొందరిని కలిసినప్పుడు, 'అబ్బా, వీళ్ళను ఎందుకు కలిసాంరా బాబూ..' అనిపిస్తుంది. మరికొందరిని కలిసినప్పుడు, 'అబ్బ, యెంత అద్భుతమైన వ్యక్తిని కలిసాము. వీరి నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉంది,' అనిపిస్తుంది.అలా నేను ముఖపరిచయం లేకుండా ముఖపుస్తకం ద్వారా కలిసిన వ్యక్తే 'బ్నిం' లేక భమిడిపల్లి నరసింహమూర్తి గారు.

'నేను ఒకటో తరగతి కూడా చదువుకోలేదమ్మా, అసలు బడికే వెళ్ళలేదు,' వినయంగా అంటారాయన. కాని చందోబద్దంగా పద్యాలు వ్రాస్తారు. 'ఇది ఎలా సాధ్యం ?' అని మీరూ నాలాగే ఆశ్చర్యపోతుంటే, నాకు ఆయన చెప్పిన సమాధానమే చదవండి. ఆయన ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ బడి పేరు - అమ్మ ఒడి. ఆయన మాతృమూర్తి శ్రీమతి భమిడిపల్లి విజయలక్ష్మి గారు తెలుగు, సంస్కృత పండితురాలు. తన బిడ్డను తెలుగుజాతికే  ఆణిముత్యంగా తీర్చిదిద్దిన ఆ స్త్రీమూర్తికి పాదాభివందనం చెయ్యవచ్చు. అటువంటి స్త్రీలు పుట్టిన పుణ్య భారతంలో పుట్టినందుకు , ఒక స్త్రీగా నేను గర్విస్తున్నాను. 

తన ఊరు ఆత్రేయపురంలోనే చిన్నతనంలో చిత్రకళను కూడా అభ్యసించారు. అనేక కార్టూన్లు, పుస్తకాలకు ముఖచిత్రాలు, లోగోలు తీర్చిదిద్దారు. బాపు గారి గీతను, దర్శకత్వ శైలిని, ఆరాధించే బ్నిం గారు 'నా హృదయం బాపూ ఆలయం' అంటారు. బ్నిం గారంటే కూడా బాపు గారికి వల్లమాలిన అభిమానం. బ్నిం గారు, నేటి తరం మరచిపోతున్న 132 మందితెలుగు ప్రముఖులు గురించి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు గీసి, క్రింద నాలుగు లైన్ల కవితలతో వారికి నీరాజనం అర్పించి, తీర్చిదిద్దిన అద్భుతమైన పుస్తకం 'మరపురాని మాణిక్యాలు'. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో మొదలుపెట్టి, పింగళి వెంకయ్య గారి దాకా అనేక మంది తెలుగు ప్రముఖుల విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో వారిలోని రచయత, కార్టూనిస్ట్, చిత్రకారుడూ కలిసి ఒకేసారి కనిపిస్తారు. 

                                                 

16 ఏళ్ళకే ఆంధ్రపత్రిక వారు ఆయన కధను 'అచ్చేసి' వదిలేసారు. తరువాత ఆంధ్రజ్యోతి కూడా అవునని రెండోసారి అచ్చేసేసారు.అలా తన రచనా వ్యాసంగం మొదలుపెట్టిన ఆయన అనేక కధలు, కార్టూన్లు,నాట్య కళాకారుల కోసం 208 నృత్యరూపకాలు (యక్షగానాలు), టీవీ సీరియల్స్, పత్రికలకు సీరియల్స్, వ్యాసాలు వ్రాసారు. ముళ్ళపూడి వారి చమత్కార శైలి ఆయన అరువుచ్చుకున్నారు. 2010 లో 'కళారత్న' పురస్కారం, నాలుగు సార్లు నంది అవార్డులు గెల్చుకున్నారు. 

మామూలుగా, కాస్త పేరు రాగానే ఫ్యాన్ ఎక్కేస్తుంటాము. ఇంకాస్త పేరొస్తే, డాబా పైకి ఎక్కేస్తాము. మరికాస్త పేరొచ్చి,గుర్తింపు వస్తే,  రెక్కలోచ్చేస్తాయి. ఒకటో రెండో అవార్డులు వస్తే, మేఘాల పైన కూర్చుంటాము. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక అవార్డులు పొందితే, తల వెనుక కనబడని విష్ణుచక్రం తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, 'నేను చాలా బిజీ' అంటారు, జనాలని గంటలు గంటలు వెయిట్ చేయిస్తారు. అలాగని బ్నిం గారు కూడా మేఘాల మీద ఉంటారని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్టే!

ఎందరికో పుస్తకాలకు బొమ్మలు గీసి ఇచ్చారు. ఆంకర్ 'సుమ' కు తెలుగు ఉచ్చారణ నేర్పారు. ఎన్నో నృత్యరూపకాలు వ్రాసి ఇచ్చారు/ ఇస్తున్నారు. అడిగితే చాలు తప్పక సహాయపడతారు.

 నిగర్వి,స్నేహశీలి, హాస్యచతురులు, బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు. చక్కటి ఆత్మీయతతో, నిరాడంబరంగా మాట్లాడతారు. మెచ్చదగిన ప్రతీ అంశాన్ని గుర్తించి, మనసారా అభినందిస్తారు. ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం కల బ్నిం గారు ఎందరికో స్పూర్తిదాయకం.

Tuesday, December 10, 2013

బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు

రచన :SVSN శర్మ గారు, 'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందం నుండీ సేకరణ.

మా నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు రచించిన వేంకటేశ షోడశోపచారపూజా స్తోత్రము:
ఈ 5 సీసపద్యాలు భావిస్తూ చదివితే శ్రీ వేంకటేశభగవానుని 16 ఉపచారలతో అర్చించినట్లే..

సీ:: విఘ్నవిధ్వంసుని విష్ణ్వాత్మకున్ విఘ్నవిభుభక్తి ప్రార్ధించి వేడుకలర,
శ్రీ వేంకటేశ్వరు శ్రితజనమందారునర్చింతుభక్తినినంతరమున
సర్వమంగళరూపు సర్వమంగళనాముశంఖచక్రహస్తు స్వర్ణభూషు,
వరదహస్తునూరుభాగస్థకరమున కష్టాబ్ధి యింతియె కనుడటంచు
తే:గీ: చెప్పునట్టులచూపెడిచిద్విలాసు శ్రీనివాసునిభక్తిని చిత్తమందు
ధ్యానమొనరింతుకలికల్మషాపహారు వేంకటాచలవాసుని వేదవేద్యు ............(1)
సీ:: నిర్మలమౌచిత్తనీరేజసౌవర్ణపీఠిపై నిలుమయోపీతవాస
భూదేవి శ్రీదేవిభూషలసవరింపకాళ్ళుకడిగెదనీకు కంజనయన
అర్ఘ్యంబునొసగెదహస్తబులకుభక్తినందుమలక్ష్మీశయఘవినాశ
ఆచమనీయంబునందుమసంప్రీతిసప్తాద్రినిలయ యోసరసిజాక్ష
తే:గీ: స్వర్ణఘటములజలమునుచక్కబోసి సకలపరిమళవస్తువుల్ చక్కచేర్చి
స్నానమాడింతుసర్వేశగానలోల గంధమలదెదనీమేనకంజనయన............(2)
సీ:: సౌర్ణతంతులచక్కనిర్మితములౌపీతవస్త్రంబులన్ ప్రేమగట్టి
యఙ్ఞోపవీతంబు యఙ్ఞరూపా నీకునర్పింతుభక్తినినందుమయ్య
మణిగణఖచితముల్ మంజులంబులునైన సౌవర్ణభూషల చక్కనుంచి
సౌర్ణభూషిత సర్వాంగసౌందర్య సందర్శనంబునచక్కనైన
తే.గీ: మనమునన్ పూలమాలలు మానితముగగూర్చిగళముననుంచెదకోర్కెలలర
ఘ్రాణతర్పణధూపముల్ కమ్రదీపపంక్తులన్ గను సంప్రీతిభక్తినిడితి.............(3)
సీ:: భక్ష్యబోజ్యలేహ్యబహువిధచోష్యముల్ సౌవర్ణపాత్రలచక్కనిడితి
నిష్టసతులగూడియిష్టంబుతోభుజియింపుమయ్య నతజనేష్టదాయి
మధురపానీయముల్ మధ్యమధ్యనుగ్రోలు శ్రీదేవియందీయ చిత్తమలర
పూగీఫలంబులు భూదేవినీకీయ తమలముల్ శ్రీదేవితవిలియొసగ
తే.గీ. విడెముగొనినీవు వేడుకన్ వేదవేద్య తూగుటూయలసతులతోనూగులాడి
నారదాదులుగానతానములుచేయ హారతిన్ గనుమిదుగొయో యఘవిదూర............(4)
సీ:: సౌవర్ణమంత్రపుష్పంబులనర్పించిసాష్టాంగములజేతుసామలోల
ఛత్రంబుబట్టుచుచామరంబునవీతు నృత్యంబునచ్చరల్నెమ్మిజూప
తుంబురునారదుల్ దోర్యుగంబునవీణగొనిపాటపాడగగూర్మివినుచు
నశ్వగజాదులనారోహణముజేసివిశ్వంబుపాలించువిశ్వవంద్య 
తే.గీ. అఖిలరూప అనంత సర్వాంతరస్థ కలుషవనదావ కవివర కావ్యజాల
సక్త మృదుచిత్త సుజనసంస్తవనరక్త భక్తజనరక్షణాయత్త పరమనతులు ............(5)
...ఇవి కాక 7 కొండల వివరములతో, దశావతారములను కూడా వివరిస్తూ `శ్రీ వేంకటేశ్వర నక్షత్రమాలా అని పుస్తకం వ్రాసారు. ఎన్నో స్తోత్రాలు, పురాణాల అనువాదాలు చేసారు. అతని గురించి చెప్పటానికి చాలా ఉంది. అందరికీ భావనకి ఉపయోగపడుతుందని ఈ పూజా స్తోత్రం పోస్ట్ చేసేను.

కదంబం

'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందంలో వివిధ సభ్యులు అందించిన అమూల్యమైన సమాచారం

శ్రీనివాస్ రావినూతల ( తెలుగు మాసములు )

మన తెలుగు మాసములు చాంద్రమానం ప్రకారము నడుస్తాయి. అయితే పౌర్ణమి రోజు ఉన్న నక్షత్రంతో ఆ మాసం పేరు ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందామా: 

"చిత్తా"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "చైత్రము"

"విశాఖ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "వైశాఖము"

"జ్యేష్ట"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "జ్యేష్ట మాసము"

"పుర్వాషాడ"లేక "ఉత్తరాషాడ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఆషాడము"

"శ్రవణ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము 'శ్రావణము"

"పూర్వాభాద్ర"లేక "ఉత్తరాభాద్ర"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "భాద్రపదము"

"అశ్వని"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఆశ్వయుజము"

"కృత్తిక"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "కార్తీకము"

"మృగశిర"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "మార్గశీర్షము"

"పుష్యమి"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "పుష్యమాసము"

"మఘ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "మాఘము"

"ఉత్తర ఫల్గుణి"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఫాల్గుణము"

***************************************************

"కవితా గౌతమి" డా.కావూరి పాపయ్య శాస్త్రి గారి సౌజన్యంతో:

ధర్మార్థకామ సాధనకుపకరణంబు 
గృహనీతి విద్యకు గృహము విమల 
చారిత్ర శిక్షకాచార్యకంబన్వయ 
స్థితికి మూలంబు సద్గతికి నూత 
గౌరవంబునకేక కారణంబున్నత 
స్థిర గుణమణుల కాకరము హృదయ 
సంతోషమునకు సంజనకంబు భార్యయ 
చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము 

లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను 
నెట్టి తీరములను ముట్టబడిన 
వంతలెల్ల బాయునింతుల బ్రజలను 
నొనర జూడగనిన జనుల కెందు 
(ఆంధ్ర మహాభారతము,ఆదిపర్వం)

దాంపత్య ధర్మంలో భార్య యొక్క విశిష్టమైన,ఉన్నతమైన స్థానాన్ని వివరించే పద్యం ఇది. పురుషుడి ధర్మార్థ కామ సాధనకు భార్య ప్రధాన హేతువు. గృహస్థ ధర్మ నిర్వహణకు ఆమె ఆటపట్టు. పురుషుడి శీల ధర్మముల విద్యలకామె ఆచార్య స్థానము. వంశ అభివృద్ధికి మూల కందము. ఉత్తమ గతులకు ఆమెయే ఆలంబనము. పురుషుని గౌరవాదరములకు ఇల్లాలే పుట్టిల్లు. స్థిరమైన గుణౌన్నత్యమునకు ఆమెయే ఆకరము. భర్త యొక్క హృదయ సంతోషమునకు భార్యయే సంజనకము. భార్య తప్ప భర్తకు ప్రియమైనది ఇంకొకటి లేదు. 

ఏ సందర్భమునందెట్టి క్లిష్టఘట్టములందెక్కడ నున్నను భర్త యొక్క ఇబ్బందులన్నింటినీ దూరము చేయగల్గునది భార్యయే. భార్యాభర్తల బంధమును,దాంపత్య ధర్మమునందలి ఆత్మీయతను సమగ్రముగా వివరించిన పద్యమిది. శకుంతల దుష్యంతునితో నుడివిన ధర్మ ప్రబోధకమైన మాటలు.

శ్రీనివాస్ మంచిరాజు (తిరుమల అమ్మవారి, అయ్యవారి గోత్రం, ప్రవర 

స్వామి వారి, అమ్మ వారి గోత్రం, ప్రవర
వాసిష్ట, 
మైత్రావరుణ , 
కౌడిన్య, 
త్రయ రిశేయ ప్రవరాన్విత వాసిష్ట గోత్రోద్భావాయ 
యాతేయ ప్రపొఉత్రాయ 
అమితతెజస్య పౌత్రాయ 
శూరసేనస్య వాసుదేవస్య పుత్రాయ వెంకటేశ్వరా నామ్నే వారే 
అంగీరస ,
భారస్పత్య ,
భరద్వాజ , 
శైబ్య ,
గార్గ్య 
పంచార్శేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భావాన్ 
సవీర మహారాజస్య ప్ర పొఉత్రీమ్ 
సుధార్మస్తూ పొఉత్రీమ్ 
ఆఆకశ రాజస్య పుత్రీం ఫద్మవతీమ్ కన్యాం

లీలా ప్రసాద్ ఎల్ వి  (శ్రీశ్రీ గురించి )

** అప్పటి ధరారమణ గౌరవాతిశయము
ఆ దినమ్ముల సౌఖ్యానుమోదరక్తి
నాటి సంపత్సమృద్ది ఏనాటికైనా
ఆంధ్ర నిర్భాగ్య ధాత్రికి నలవడునొకో?...

--- రాయల రాసిక్యాన్ని తిమ్మన వర్ణన ద్వారా గ్రహించి పరవశుడై ఆ కాలంలోకి మనోవేగంతో వెళ్లి, ఆ రాయల సభను కళ్ళారా 
చూసివస్తాడు. తానిప్పుడుoటున్న ఆంధ్రదేశం నిరుపేదగా కనిపించి, తిరిగి ఆ రాజు, ఆ సుఖం, ఆ సంపద వస్తే బాగుండునను
కుంటున్నాడు. ( అంతస్సమాధి - శ్రీ శ్రీ )

: సమరాహ్వనము -- శ్రీ శ్రీ :

1926 నవంబర్ "భారతి" లో ముద్రితమయింది. అందులో నాటకీయ శైలి, పదాల పొందిక, భాషావేగం, పద్య రచనా కౌశలం కనిపిస్తాయి. తేటగీతి మాలికలు గ్రుచ్చి,సామెతలు జాతీయాలు తెచ్చి నడిపించిన ఖండిక యిది. ఇందులో మహా భారతగాధ అంతా ప్రసక్తమవుతుంది.
ధర్మమే జయమను మాటను సుయోధనుడు మరచిపోయాడని వెక్కిరించాడు.

--- ధైర్యము త్యజించి ఘోర యుద్ధంబు సేయ
ననుచిత పలాయన పధంబు ననుసరించి
ఓ సుయోధన ! యెందేగి యుంటి విపుడు
రమ్ము ! క్షత్రియోచిత సంగరం బొనర్ప ....

: అభిసారిక (1927) -- శ్రీ శ్రీ :

తన ప్రియుడ్ని కలసుకొనుటకు అభిసారిక ఒక కాళరాత్రిలో గాలివానలో ఏకాంతంగా బయలుదేరింది. ఆమె సంకేత స్థలం ఒక దుర్గమారణ్యం. 
ఆమె సాహసి. ఈమె విషయ వాంఛలకోసం వెడుతున్నట్లు కనిపించదు. ఈ జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని విడిచి భక్తుడు పరమేస్వరాభిముఖంగా సాగిపోతున్నట్లు గా వుంది. అడవులు, చీకటి రాత్రులు ఆమెకు అవాంతరాలు కాదు.

--- అయిన నేమాయె ప్రేమ మెంతైనc జేయు
దుర్గమ భయంకరారణ్య దుర్గములను
ప్రళయ కాల సమాన విభావరులకు
ప్రణయ రాజ్య రమా ప్రా ణ పతి కొఱకయి
తరలియరిగెడు నా కవాoతరములగునే ....

: ప్రళయ నర్తనం -- శ్రీ శ్రీ :

ఈ లోకమంతటిని మూడవ కంటితో తగులబెట్టి శివుడు నర్తించాలిట ! తాండవం చేసే సమయంలో శంకరుడు అరుణా రాగ రంజితుడై 
సాక్షాత్కరించాలిట ! స్తోత్ర పరులై దేవతలంతా నిలబడి చూస్తూ వుండగా పరమానందంతో చేయవలిసిన శివనర్తనానికి 
"మాయా మేయ జగద్వినాశనం"పరమావధిగా భావించడం విచిత్ర మైన విషయం.

--- సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ
సౌందర్యరాశీ యుక్తామల దివ్యమూర్తివయి
సాక్షీభూత నానామరుత్తోయ స్తోత్ర
గభీరగాన రససంతుష్టాoతరంగంబునన్
మాయామేయ జగద్వినాశన మతిన్
నర్తింపుమా శంకరా ! .....

--- శ్రీ శ్రీ గారికి 'శివుడు' కావ్య సామాగ్రియే?!
"ఆ హరునిటల మందు దాగియడగిన అగ్నిహోత్రమును నేను" అని ప్రకటించుకుంటూ,'హరోం హరహర హరహర హర' అని కదలమని పీడితులకు ప్రభోదిస్తాడు.

( సేకరణ: శ్రీ శ్రీ కవితా వైభవం -- డా. మిరియాల రామకృష్ణ గారు.)

రమాదేవి 

యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లోనుంచి ఏరికూర్చిన సుభాషిత సంపుటం "మంచుపూల వర్షం" నుండి పాఠకుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ రేటింగ్ ఇవ్వబడిన సుభాషితాలు
మైండ్ పవర్ : నంబర్ వన్ అవడం ఎలా?

1.ప్రతీ గమ్యాన్ని చేరుకోవడంలోనూ, "నేను కష్టపడుతున్నాను" అన్న ఫీలింగ్ ఉన్నవాడు జీవితంలో ఎప్పుడూ నెంబర్ వన్ కాలేడు.
2.ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు. మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది 'కష్టం'గా మారుతుందంతే.
3.మరొకరు హీరోగా నటించే చిత్రంలో సైడ్ కారెక్టర్ కాదు. మీ జీవిత చిత్రంలో మీరే హీరో.
4.మనిషి ధ్యేయం ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కొందరు మాత్రమే అక్కడకు చేరుకుంటారు.. అడుగువేసి అలసిపోని వాళ్ళు!!! 
5.నీకు హాని చేసేది "బలహీనత" , నీ వల్ల ఇతరులకి హాని జరిగితే అది "తప్పు". నీకు గాని ఇతరులకి గాని హాని జరగని పని. నీ సంతృప్తి కోసం నువ్వేది చేసినా పర్వాలేదు.
6.తన గురించి 'మెదడు'తో ఆలోచించి. ఇతరుల గురించి 'మనసు' తో ఆలోచించగలిగిన వాడే నెం.1 కాగలడు.
7.నిన్నటి ఓటమి గురించి చింతని, రేపటి సాయంత్రంపు దిగులుగా మారనివ్వకు, ఈ రోజుని అనుభవించు.
8.నెం.1 అవడమంటే అమితమైన ధనమూ, అంతులేని అధికారమూ సంపాదించటం కాదు. కీర్తి, అధికారం, మానవ సంబంధాలు అనే అయిదు అంశాల్ని సంపాదించటానికి '...తృప్తి' నీ ఖర్చుపెడుతూ ఉంటాడు సామాన్యుడు. తృప్తిని స్టాండర్డ్ గా పెట్టుకుని, దాన్ని పెంచుకోవటానికి డబ్బు, కీర్తి, అధికారం, ప్రేమ మానవసంబంధాలని ఆధారం చేసుకుంటారు నెం.1 అదే తేడా.

దేవరకొండ సుబ్రహ్మణ్యం 


సత్తెకాలపు నాయెంకి
నండురి వెంకటసుబ్బారావు

"నీతోటె వుంటాను నాయుడు బవా!
నీమాటె యింటాను నాయుడు బావా!"

"సరుకులేమి కావాలె సంతన పిల్లా?"
"నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా'
"సక్కదనము కేమిత్తు సంతన పిల్ల?"
"నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బవా!"
"యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా?"
" నీ నీడలోనె మేడ కడతా నాయుడు బావా!"
"నీతోటె వుంటాను నాయుడు బావా!"
"నీమాటె యింటాను నాయుడు బావా!"

****************************

మున్నే జేసిన పుణ్యమూలమొ! మరే పూజాఫలంబౌనొ! లే
కెన్నో జన్మల పూర్వబంధమొ! భవత్కృత్యంబొ గానీ ప్రభూ!
నన్నీ జన్మ నొకింత గొల్చితిని; సంతృప్తిన్ సమీక్షించి నీ
ఔన్నత్యంబును చాట బ్రోవుమయ - దాక్షారామ భీమేశ్వరా!

ఆచార్య వీ.ఎల్.ఎస్. భీమశంకరం గారి "దాక్షారామ భీమేశ్వర శతకము" నుండి.

గోటేటి వెంకటేశ్వర రావు 

రాయప్రోలు మాట రతనంపు పాట!!
********************************
భాష జీవించడానికి భావుకుడైన రచయిత అవసరం.రాయప్రోలువారు బాలలకోసం రాసిన గేయం.

తెల్లపాగా పెట్టి-నల్ల గుఱ్ఱంబెక్కి
చెంగనాలెత్తేవు -చందమామా
నింగిపై కెగిరేవు చందమామా
నీ సిగల బంగారు కేసరాలాడేను
నీ రెక్కలను పసిమి నిగనిగలు చిమ్మేను
నీ పాదు చల్లగానీ మారనిలిచేను
నీ పాల పొట్టలను తీపి తునకులు తొలుకు 
వెన్నెలగు-
నీ వెన్నుపూసల్ అన్నమయి వెలసేను.

-అంటూ పిల్లలను పెద్దలను గిలిగింతలు పెట్టారు మహానుభావుడు.

-గోటేటి వెంకటేశ్వర రావు,ప్రముఖాంధ్ర.