Monday, September 29, 2014

'ఋణానుబంధ రూపేణ...'

 'ఋణానుబంధ రూపేణ...
భావరాజు పద్మిని 

నా జీవితంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన రాస్తున్నాను. 'ఋణానుబంధ రూపేణ...అంటారు కదా ! ఈ సామెతను తలచుకున్నప్పుడల్లా నాకెందుకో ఆ ముసలమ్మే గుర్తుకు వస్తుంది.


అప్పట్లో మేము విజయవాడ లో ఉండేవాళ్ళం. మా ఇల్లు వినాయక థియేటర్ ఎదురు సర్వీస్ రోడ్డు ప్రక్కనే ఉండేది. రోజూ పెద్ద పాపను ఆటో ఎక్కించేందుకు క్రిందికి రావటం అలవాటు. అలా ఆ రోజు ఆటో ఎక్కించి వెళ్తుంటే, గేటు వద్ద ఉన్న మెట్ల ప్రక్కన ఓ ముసలమ్మ కనిపించింది. మాంచి వేసవి కాలం... ఎండ... దాహం, దాహం అంటోంది. 

ఆమె వంక చూసాను. చిరిగిన, మాసిన దుస్తులు, ఎప్పుడు స్నానం చేసిందో తెలీదు. కనీసం కదలలేక పోతోంది. అంతా దూరం నుంచి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. నా మనసు ఊరుకోలేదు. నా తల్లిదండ్రులు నాకు మనిషిని మనిషిగా చూడడం మాత్రమే నేర్పారు. కులం, మతం, వేషభాషలు చూసి మర్యాద ఇవ్వడం నాకు తెలీదు. అందుకే, వెంటనే పైకి వెళ్లి, నీళ్ళు తెచ్చి ఇచ్చాను. నేను లేవలేను, నోట్లో పోయ్యమన్నట్టు సైగ చేసింది. దగ్గరకు వెళ్లి నెమ్మదిగా తల ఎత్తి, నోట్లో నీళ్ళు పోసాను. కృతజ్ఞతతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.

'అమ్మా, మూడు రోజులైంది అన్నం తిని, ఏమన్నా పెట్టావా?' అని అడిగింది. నా మనసు కరిగిపోయింది. వెంటనే వెళ్లి పాపకు వండిన అన్నం, కూరలు ఒక పళ్ళెం లో సర్ది తెచ్చి ఇచ్చాను. మళ్ళీ మామూలే... తినలేను, తినిపించమంది. నడి రోడ్డు ప్రక్కన, క్రింద కూర్చుని, నా చేత్తో కలిపి తినిపించాను. మధ్య మధ్య నీళ్ళు పట్టాను. ఆమె తృప్తిగా తిని, త్రాగి, నా చేతిని తన చేతిలోకి తీసుకుని, 'ఏ తల్లి కన్న బిడ్డవో, నువ్వు మా అమ్మవు... మా అమ్మ తర్వాత ఇంత ఆప్యాయంగా నాకు ఎవ్వరూ తినిపించలేదు...' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. రాత్రి చూస్తే, ఆమె అక్కడ కనిపించలేదు.

రెండు రోజుల తర్వాత వేరే రోడ్డు మీద వెళ్తుంటే, జనం ఓ చోట గుమికూడి ఉన్నారు. నెమ్మదిగా వెళ్తూ చూస్తే, ఆమే ! చనిపోయి ఉంది. ఆలోచిస్తే ఆమె ఎవరో... నేను ఎవరో... ఆమెకి నాకు ఎన్ని మెతుకులు రుణమో ... ఒక మనిషిగా ఆమెకు చెయ్యగలిగిన సాయం చేసాను అంతే !

ఇప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో విధంగా ఇతరులకు దానం చేస్తూనే ఉంటాను. నేను చారిటీ లను నమ్మను. పేద పిల్లలు కనిపిస్తే, వెంటనే ప్రక్కనే ఉన్న కొట్టుకు వెళ్లి, చాక్లెట్ లు, బిస్కెట్ లు కొని ఇస్తాను. నా చేత్తో వండి, పులిహోర పొట్లాలు పంచుతాను. బట్టలు, కంబళ్ళు, ఏవైనా స్వయంగా నా చేత్తో ఇచ్చి, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. అప్పుడు నాకు కలిగే తృప్తి బహుసా ఏ కొటీశ్వరుడికి కూడా కలగదేమో !

ఫేస్ బుక్ అద్దాల మేడలో కబుర్లే కాదు. బయట ప్రపంచం లోని దుఃఖాన్ని చూడాలి. వీలున్నంత ఎదుటివారికి సాయపడాలి. దానం/సాయం చేసే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటి వద్దకు వెళ్ళాలి. మనం చేతిలో ఉన్నది ఇస్తూ పొతే, భగవంతుడు మన దోసిలి మళ్ళీ నింపుతూ ఉంటాడట. గురువుగారు చెప్తారు... ఇంకా, గులాబీలు పంచే చేతులనే పరిమళం అంటి ఉంటుందని చెప్తారు. నాకా నవ్వులు కావాలి, ఒక్క క్షణమైనా ఒక్క పెదవిపై చిరునవ్వు కావాలి. మరి మీకో !

                                      



"అచ్చంగా తెలుగు " వసుధైక కుటుంబకం

"అచ్చంగా తెలుగు " వసుధైక కుటుంబకం 
("అచ్చంగా తెలుగు "ఫేస్ బుక్ బృందంపై పలువురి అభిప్రాయాలు...)

Gita Kuruganti12:23am Feb 23
వెలుగు పూలు వెలుగులని
విరజింమ్మే రోజు
అంతర్జాల మాస పత్రిక
ఆవిర్భవించే రోజు
కవితా సుమాలు పద్య రత్నాలు
మదిని మురిపించే రోజు
ముత్యాల ముగ్గులు బొమ్మలు
మనని పలకరించే రోజు
భావరాజు పద్మిని గారి
కృషి ఫలించిన రోజు
సంగీత సాహిత్య సౌరభాలు
వికసించే రోజు
అచ్చం గా మిత్రులు
అందరూ కలిసే రోజు
తెలుగింటి విందు
ఆరగించే రోజు
భావరాజు పద్మిని గారి
ఆకాంక్ష నెరవెరే రోజు !!!

ఈ రోజే ఈ రోజే ఈరోజే
ఫిబ్రవరి 23 ,2014......
కదలి రండి మిత్రులారా
సభ ను జయప్రదం చేయండి!!!

ధన్యవాదములు ......గీత కురుగంటి


అచ్చంగా తెలుగు - వసుధైక కుటుంబం - వాసుదేవ రావు కొండూరు 

చాలా మందికి ఫేస్ బుక్ అనేది కేవలం ఒక కాలక్షేపమని, ఆకతాయిలకి ఆటవిడుపని, మరొకరు మరొకవిధంగా, ఉంకొకరు ఉంకోవిధంగా కాసేపు వాడుకుని మర్చిపోతారేమో గాని, ఒక బృందం ఒక కుటుంబంగా అరమరికలు, హెచ్చుతగ్గులు, ఈర్ష్యాద్వేషాలు, పొరపచ్చాలు, అభిప్రాయబేధాలు మచ్చుకైనా లేకుండా అభిమానం, ప్రేమ, ఆప్యాయత లతో పాటు, సంగీతం, సాహిత్యం, హాస్యం, చిత్రలేఖనం, ఆధ్యాత్మికం, సంస్కృతిని పంచుకుంటూ, వండుకుంటూ, వండుకున్నది అందరూ వడ్డించుకుంటూ, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో, ఒక తాతయ్యని, ఒక పెదనాన్నని, ఒక బామ్మని, ఒక అమ్మ్మమ్మని, ఒక పెద్దమ్మని, ఒక బాబాయిని, ఒక పిన్నిని, ఒక చెల్లిని, ఒక అక్కని, ఒక బావని, ఒక మనవడిని, ఒక మనవరాలిని ఇలా అందరూ బంధువులే తప్ప ఒక్క మిత్రుడు కూడా లేని ఈ అచ్చంగా తెలుగు ఆ లోటు తీరుస్తున్నది. ఈ బృందంలోని ప్రతిసభ్యుడు ఒకరికొకరు బంధువే గాని మితృడనటం తగదేమో! నిజంగా, ఎంత అదృష్టవంతులమండి. ఇంత మంచి కుటుంబాన్ని అందించిన భావరాజు పద్మిని గారికి మనఃపూర్వక అభినందనలు, హృదయపూర్వక ఆశీర్వచనములు. గుండె నిండిపోయి మాటలు వెదుక్కోవలసి వస్తున్నది. ధన్యోస్మి.

Bharthi Kata9:28pm Mar 12
చెన్నై లో వుంటూ తెలుగు మాట్లాడటం తప్ప, చదవడం రాయడం అన్న అవసరం లేకుండా పోయింది.ఇలా అచ్చ oగా తెలుగు లో ఉంటూ అన్ని చదవడం వల్ల ,పిల్లలకి తెలుగు రాక పోయిన కనీసం నేను తెలుగు మర్చిపోను అన్న నమ్మకం నాకు కలిగింది.థాంక్స్ 2 padhimini గారు.మా మనసులో మాటని మీ మాటగా చెప్పినoదుకు రావుగారికి థాంక్స్.

Ramamurthy Rv9:16pm Mar 12
మీతో మనస్పూర్తిగా ఎకివభిస్తున్నాను వాసుదేవరావు గారు... ఎంతో దూరంలో వున్నా రోజు అచ్చంగా తెలుగు లోని టపాలతో మీ అందరి మద్య అక్కడే ఉన్నట్టుగా ఉంది. అందరికి ధన్యవాదాలు

Pavani Srinivas9:09pm Mar 12
చాలా బాగా చెప్పారండి.ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న భావన ఇది.ఎందుకో పంచుకోలేకపోయాను అనుకునేదాన్ని.కాని అక్షర రూపం లో మీరు చెప్పిన విధానం చాలా అద్బుతం గా ఉంది.నాకు కూడా ఎన్నో కోత్హ విషయాలు తెలిశాయి.ఇంతకు ముందు కాలక్షేపం కోసమో,లేదంటే స్నేహితుల విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఉపయోగించేవారు,కానీ ఇప్పుడు మనకు ఇవాళ ఏమి కొత్త విషయం తెలియబోతుందో అనే ఆత్రుత తో నేను ఎదురుచూస్తూ ఉంటాను.కొత్త పరిచయాలు,వారి విజ్ఞాన అనుభవాలు ఎన్నో విషయాలు తెలుసుకోగాలుగుతున్నాము మనం ఈ అచ్చంగా తెలుగు ద్వారా.నా స్నేహితులు ,బంధువులు చాలా మంది నన్ను చూసి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యారు.మీరన్నట్లు మనది వసుదైక కుటుంబం.అందరం ఒక్కటై ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పద్మిని గారికి ధన్యవాదాలతో మరియు మీ అందరికి శుభాభినందనల తో మీ పావని శ్రీనివాస్

Naresh Kandula11:04pm Mar 12
"ఈ బృందంలోని ప్రతిసభ్యుడు ఒకరికొకరు బంధువే గాని మితృడనటం తగదేమో! నిజంగా, ఎంత అదృష్టవంతులమండి."

Kalyani Gauri Kasibhatla5:53am Mar 13
కొండూరువారు... సత్యం,,ప్రవచించారు..చాల ఆత్మీయత.. అనుబంధాలను అచ్చంగా పూయిస్తున్నది మన ఈ అచ్చంగా తెలుగు.. అన్నివయసులవారూ..ఆత్మీయం గా కలసిపోతూచిక్కటి..తెలుగు బంధాన్ని మరింతగా..పెనవేసుకు పోతున్నారు.. సుఖాన్ని,దుఖాన్ని సమానంగా పంచుకుంటూ...ఆనందంగా సాగిపోతున్న..ఈ బృంద మిత్రులందరకు..మనఃపూర్వక..అభిననందనలు......

Ravi Thadicherla6:28am Mar 13
సాహితీ సంప్రదాయాల్ని కాకుండా ఆత్మీయ అనురాగాలను పంచుకున్న అచ్చంగా తెలుగుకు ధన్యవాదములు.
ఈ రోజు రెట్టింపు ఆనందం.

Gita Kuruganti8:37am Mar 13
మన మనసు లోని భావాలను చక్కగా నిర్వచించారు వాసు దేవరావు గారు..
ఇప్పుడు అచ్చంగా తెలుగు వారందరూ మన బంధువులు ...మన అందరిదీ వసుధైక కుటుంబం ...
ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాం.
తెలియనివి అడిగి తెలుసు కుంటున్నాం
అసలు నాకైతే ఒకే ఇంట్లో ఉండి అందరం మాట్లాడుకుంటున్నట్లు ఉంటోంది!

                          





Gautham Kashyap
12:23am May 19
భావ'రాజ' పద్మిని చెల్లీ...!.
**************************
ఇన్నాళ్ళూ ఈ వూళ్ళోనే వుంటూ
అందరి చేతా సాహిత్య పదార్చన చేయిస్తూ...
నిత్య సారస్వతార్చన చేస్తున్న భావరాజ పద్మినీ చెల్లీ..
నీ పేరులోనే సరస్వతీ పీఠం వుంది తల్లీ..!!
ఏదో బాధ ....ఏదో వెలితి ...!!
మా గుండెల్లో..!!
ఎన్నో ధార్మిక ఆలోచనలుu చేస్తున్న..
మీరిరువురూ వూరు వదిలి వెళుతున్నారని...!!.
స్వచ్చమైన మనసు, నిర్మలమైన ఆలోచనలున్న..
ఇంత మంచి దంపతులు,
ఎంత దూరం వెళ్ళిపోతున్నారూ..!
మా భాగ్యనగరానికి మీ భాగ్యం తగ్గి
ఆ భాగ్యం ఇక చండీఘడ్ కి పట్టుకుంటోంది...!!
ఈ కారణం వెనుక ఏ లోకోత్తర కారణం ఉందో..!!!
ఏది ఏమైనా ఈ దంపతులకు
నిత్యం సంతోషం కలగాలి.!!
నిరాడంబరమైన ఈ జంట ఇంట
లక్ష్మి నడయాడాలి..!!!
వేనోళ్ళ నిన్ను లోకం కొనియాడాలి..!!!
నిత్యం సకల శుభాలతో
సర్వ సౌభాగ్యాలతో నీ ఇల్లు నిలవాలి
నీ పేరు వెలగాలి..!..
నీకు శుభం కలగాలి తల్లీ.!.
నీకు శుభం కలగాలి నీకు శుభం కలగాలి !! - గౌతమ్ కశ్యప్
*************************************************************

వైజాగ్ విశేషాలు

వైజాగ్ విశేషాలు 
- రచన : భావరాజు పద్మిని 

మీరు అలా వైజాగ్ వెళ్లి వచ్చారు కదా, ఆ విశేషాలు కొన్ని చెప్పరూ... అని అడిగారు అవధానుల రామారావు గారు. సరే, ఆ చెప్పేది కాస్త సృజనతో కలిపి సరదాగా చెప్తాను. ఒక పల్లెటూరి అతనికి ఉన్నట్టుండి డబ్బు చేసింది. ఈ డబ్బు చెయ్యడం అనేది చాలా భయంకర వ్యాధి. తనకు యెంత డబ్బు చేసిందో, తను యెంత గొప్ప వాడిని అయ్యానో, అవతలి వాళ్లకి చూపించుకుంటే తప్ప వీళ్ళకి తృప్తి ఉండదు. ఆ ముచ్చట తీర్చుకోవాలని అతను తన చిన్ననాటి స్నేహితులను, విహార యాత్ర పేరుతొ పెద్ద 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్ళాడు. అలా అతని వెంట మొట్టమొదటి సారిగా పెద్ద హోటల్ కు వెళ్ళిన ఒక మిత్రుడు తన భార్యకు ఇలా లేఖ వ్రాస్తున్నాడు..

లచ్చుమి,

నేను బాగుండాను, నువ్వు బాగుండావా. మనింట్లో ఫోన్ లేదు గందా .రూపాయి డబ్బా కాడ నువ్వు అంత సేపు నిల్చోలేవని ఈ చీటీ రాస్తాఉండాను. నారిగాడు ఇప్పుడు మారిపోయాడే! 'నార్...' అని పిలుస్తా ఉండారు. ఈ నారలు, పీచులు డబ్బుతో వస్తాయేమో! అంతా మాయగా ఉండాదే!

గొప్పోళ్ళు , ఉండోల్లు అంటారు గానోసే, నాకైతే, యెంత చెట్టుకు అంత గాలని అనిపిస్తా ఉంది. ఇక్కడ నాకో పెట్టె గది ఇచ్చారు... మనూళ్ళో మిరపకాయలు ఉంచే పెద్ద చల్ల పెట్టె గది (కోల్డ్ స్టోరేజ్ ) గుర్తుకోచ్చినాది. డబ్బాలో వేసి మూత పెట్టినట్టు ఉంది. ఒక ఫ్యాన్ కూడా లేదు. బయట గాలి పీల్చుకునే వీలు లేదు. తానానికి బక్కెట్టు కూడా లేదు, ఏదో చిల్లుల పళ్ళెం లా ఉంది గందా, అదే తిప్పుకుని పోసుకోవాల. పాపం తానాలగాదికి గొళ్ళెం కూడా ఎట్టించలేదు. ఇంత పెద్ద వొటేలు కట్టేది మాటలా... ఇలా ఖర్సు తగ్గించుకు ఉంటారు. 

లచ్చీ, సదూకున్నోడి కంటే చాకలోడు మేలని అంటారు... అదెలాగో నా మట్టి బుర్రకి అప్పుడు ఎక్కలేదే! ఇప్పుడే తెల్సినాది. ఇక్కడ గుడ్డలు ఆరేసుకునే వీలు లేదు కందా! వాల్లకేసేస్తే ఉతికి తెస్తారంట ! డ్రాయరు ఉతికితే డెబ్భై, బనీను ఉతికితే వంద.... చూడగానే నాకు ఆ డబ్బెట్టి కొత్తవే కొనుక్కోవచ్చు కదా, అనిపించినాది. ఇక ఇలాగే చొక్కా, పంట్లాము... బట్టలుతికి చాకలోడు ఇంత సంపాయిస్తా ఉంటే, మరి చాకలోడే మేలు గందే! 

మన నారిగాడు ఊరంతా తిప్పినాడు. వొటేలు గది కిటికీ లోంచి సముద్రం కనిపిస్తా ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, సుడిగుండాలు ఉన్నా,యెంత గంభీరంగా ఉంటాది సముద్రం. మడిసి మనసు కలత పడితే, కళ్ళు మూసుకుని, ఆ సముద్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, గొప్ప ధైర్యం వస్తాదని అనిపించినాది. ఇక యేవో 'బొర్రా గుహలంట ' ఎల్లినాము. ఒక పెద్ద పందికొక్కు నేలలో కన్నం తవ్వేస్తే ఎలాగుంటాది ? అలాగున్నాయి ఇవి. పైనుంచి పడే నీళ్ళచుక్కలు, రాళ్ళ లో ఎన్ని రంగులో, ఆకారాలో పుట్టించాయి. గోస్తనీ నది పారడం వల్ల కొన్ని లచ్చల సంవత్సరాలుగా రాళ్ళు కరిగి ఇలా వచ్చినాయంట. ఆవు ఒకటి అడవిలో తిరుగుతూ, ఈ కంతలో పడి అరుస్తుంటే, ఇవి కనిపేట్టినారంట. భలే బాగుండాయే. దేవుడి కంటే గొప్ప కళాకారుడు ఎవరున్నారు చెప్పు. ఈ పాలి నిన్నూ తీసుకెళ్తా !

ఇక ఇక్కడ వొటేలు, తిండి ఈ గొలేంటో పెద్ద గందరగోళం అనుకో! కరువెక్కి పోయినట్టు ఇరవై ముప్ఫై రకాలు ఉంటాయి. పస లేని కూడు. ఉప్పూ కారాలు మితం. నిముసానికి ఓ పాలి ఒక మడిసి వచ్చి, 'తిండి నచ్చిందా?' అనడుగుతాడు. 'ఏం చెప్పేది ? తిండంటే ఎలాగుండాల? నోట్లో పెట్టుకోగానే ఆ రుచి నరాల్లో పాకి, హబ్బా, అదిరిపోయింది అని నోరు దానంతట అదే అనాల. అంతేగాని ఈ అడుక్కోడాలు ఏందో ! ఇక్కడికొచ్చిన తెల్లోళ్ళని చుస్తే నవ్వొస్తాది. అన్ని రకాలు ఉన్నా, రొట్టె ముక్కలే పీక్కు తింటారు.అంత తిన్నాకా అరగాలి గందా ! అందుకే వ్యాయామం చెయ్యడానికి ఇందులోనే 'జిం ' ఉండాది. మరి రాత్రైతే అంతా తాగుడే, వాగుడే ! ఆ తాగినోళ్ళ కోసం గొంతు చించుకు పాడతా ఉండారు. వాళ్ళ బుర్రకి ఏమి ఎక్కుతాది? డబ్బుంటే, ఎన్ని పన్లేని పన్లు చెయ్యాలో చూసినావా ? తినాల, అరగాల... తిరగాల, చెడ్డ అలవాట్లు మరగాల... తర్వాత ఆసుపత్రుల్లో పడి మగ్గాల. అంతా వింత లోకం !

మన ఇల్లు, పగలు పొలం పని చేసి వచ్చి అలసి మడత మంచం వాలిస్తే, చల్లగా సేద తీర్చే పైరగాలి , ప్రేమగా నువ్వు అందించే బువ్వ... పుడమి తల్లితో, పంచభూతాలతో బంధం. నాకదే బాగుందే ! ప్రకృతికి దూరమైన కొద్దీ మనిషి పశువుకు దగ్గర అవుతున్నాడని అనిపిస్తా ఉంది. నాకిక్కడ అసలు నచ్చలేదు. అంతా ఏదో తెలియని కృత్రిమత. ఇక తొందర్లోనే బయల్దేరి వెనక్కి వస్తాను... నాకోసం సూస్తా ఉండు.

శీనయ్య.



కదంబం 2

(అచ్చంగా తెలుగు ఫేస్ బుక్ బృందంలో పలువురు అందించిన మంచి పోస్ట్ లు ....)

V V S Sharma
దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ స్సనాతనః 
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ 

మానవ దేహము, నివాసగృహము, దేవాలయము, బ్రహ్మాండ నిర్మాణము - ఛందస్సులు, వేదములలోని విరాట్ పురుషుడు, వాస్తుపురుషుడు, శరీరములోని అంగుష్ఠమాత్ర పురుషుడు - ఇవన్నీ ఒకే తత్త్వము ఆధారముగా సంకల్పించి సృష్టింపబడినవి. వాస్తు, జ్యోతిషము,నిగమాగమములు, చందస్సు, వేద మంత్రములు వీని అంతర్గత సంబంధమే సనాతన ధర్మము.

________________________________________________________________________


శివ ప్రసాద్ పెనుముచు (చిన్న కధ)

ఒక యువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచాడు. అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ... తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు..
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలా అంటారు .. ప్రాణం లేని బండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనా వచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..అప్పుడు ఎవరు ముందుకు రారు..
కాసేపటి తర్వాత ఒక ముసలి అతను వచ్చి బండి లో కూర్చుంటాడు ... అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా? ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటిదగ్గర చెప్పి వచ్చావ" అని ఎగతాళి చేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి "ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. 
ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు.. మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....అవమానాలని కూడా భరిస్తారు...మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.. 

___________________________________________________________________________________________

సేకరణ :కొల్లూరు విజయా శర్మ 

ప్రేమని గురించి ఉత్ప్రేక్షలు పేనుతుంటే 
గుండెని కోకిల తన్నుకుపోయింది.
గజల్ గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వం లో తడిసిపోయింది.

గుంటూరు శేషేంద్ర శర్మ.

__________________________________________________________________________

దేవులపల్లి కృష్ణశాస్త్రి 'అన్వేషణం నుండి...

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
బడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనల పైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా చిన్ని సొనగ
పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు
కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద.

_________________________________________________________________________

ఈ సుభాషితం బాగుంది... చూడండి...
గుణవంతమైన వస్తువు సాంగత్యం వల్ల, అల్ప వస్తువుకు కూడా గౌరవం ప్రాప్తిస్తుంది. పువ్వులతో పొత్తు కుదరడం వల్లనే కదా, నిస్సారమైన దారాన్ని తలపై ధరిస్తున్నారు!

_________________________________________________________________________

'ముక్త పదగ్రస్తం ' అనే అలంకారాన్ని గురించి విన్నారా?
ముందు విడిచిన పదాన్నే (ముక్త పదం) తిరిగి గ్రహిస్తూ పోవడం దీని లక్షణం.
( ఒక వాక్యం ఏ పదం తో అంతం అవుతుందో అదే పదం రెండో వాక్యానికి మొదటి పదం కావటం ముక్త పద గ్రస్త అలంకారం )

ఉదా. 
సుదతీ నూతన మదనా !
మదనాగ తురంగ పూర్ణ మణి మయ సదనా !
సదనా మయ గజరదనా !
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా !

ముక్త పదగ్రస్తం అనే అలంకారం ఆధారం గా తెలుగు సినిమా సాహిత్యం లో ప్రయోగించబడిన సినీ పాట 'సుమంగళి ' చిత్రంలో కనులు కనులతో కలబడితే... ఇంకా మీకు ఏవైనా పద్యాలు కాని, పాటలు కాని తెలిస్తే చెప్పరూ!

జవాబులు :
గోదారి గట్టుంది... గట్టుమీన చెట్టుంది... అనే పాట - దుర్గ చెరువు 

Sridhar Hanumanthkar1:21pm Mar 11
కలనా, వ్రాయం గలనా
గలనాగము దాల్చువాని గాంచంగలిగే,
కలిగే ప్రతి మృదుచలనము
చలనము నొసగెడు హరుడిని చకితుని జేయన్.

తలచీ వ్రాయం దలచీ
దల చీరము దాల్చువాని *ధారణ దలచీ
దలచీకటి పో దలచీ
దలచీరము వంటివైన తండపు పదముల్.

Courtesy: https://groups.yahoo.com/neo/groups/telusa/conversations/topics/2380?xm=1m%3Dptidx%3D1
by: Madhava K Turumella

Naresh Kandula1:32pm Mar 11
ముక్తపదగ్రస్త్యము తో వున్న ఒక సూపర్హిట్ సినిమా పాట..

మాటరాని మౌనమిదీ
మౌనవీణగానమిదీ
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగగుండె రాగమిదీ...

అందరాని కొమ్మ ఇదీ
కొమ్మ చాటు అందమిదీ..

https://www.youtube.com/watch?v=gskC2HBfRuA

Krishna Mohan Mocherla1:39pm Mar 11
రేపంటి రూపం కంటి పూవంటి తూపులవంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ

Sridhar Hanumanthkar4:44pm Mar 11
లేమా దనుజుల గెలవగ లేమా అని ఇంకో పద్యం చదివినట్లు గుర్తు.

Naga Babu5:36pm Mar 11
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి మరులే...
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువూ...ఊ..ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...

అల్లరి ఏదో చేసితినీ చల్లగ ఎదనే దోచితివీ
అల్లరి ఏదో చేసితినీ చల్లగ ఎదనే దోచితివీ
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం
నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం

కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి మరులే...
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువూ...ఊ..ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...

Sivarama Krishna Rao Vankayala6:24pm Mar 11
ఒక సారి ఒక సభలో విశ్వనాథ వారూ, తెన్నేటి విశ్వనాథం గారూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారట. అప్పుడు విశ్వనాథ వారు తెన్నేటి వారితో, 'మనిద్దరి పేర్లూ కలిపితే ఒక మంచి ముక్తపదగ్రస్తం అవుతుతుంది కదూ' అన్నారుట!







Sunday, September 28, 2014

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు...

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు అన్న సామెత వినే ఉంటారు. దీనికి అర్ధం తెలుసా ?

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు - మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ)తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.కుండకు ప్రక్కన రంధ్రంతో ఇంకా బలహీనమౌతుంది. మంగలంలో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే.బలవంతుడు బలహీనుడి మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ సామెత వాడతారు.





గుంటూరు శేషేంద్రశర్మ రచన...

" నీ బాణానికి గురి ఎవడో శత్రువు, నా బాణానికి గురి ఏదో హృదయం;
గాలి వాలు తెలిసి ఎగిరే పక్షివి నీవు ,
గాలి కూడ భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను"

మాంగనా మాంగన్ నిక్కా

మాంగనా మాంగన్ నిక్కా

మాంగనా మాంగన్ నిక్కా ... ఏది అడగాలనుకున్నా దైవాన్ని అడుగు..

Rajendra Prasad Yalavarthy గారు ఈ పోస్ట్ మీ కోసం...

maaganaa maagan neekaa har jas gur thae maaganaa ||4||
Begging, begging - it is noble to beg for the Lord's Praise from the Guru. ||4||
( This Shabad is by Guru Arjan Dev Ji in Raag Maaroo on Pannaa 1018)

సర్దార్ లు ఎందుకు భిక్ష అడగరు... అని మునుపు మీరు వెలిబుచ్చిన సందేహం... ఇదే ఇవాళ ఒక సింగ్ గారు మా ఇంటికి వస్తే అడిగాను. ఆయన "మాంగనా మాంగన్ నిక్కా..." అంటూ మొదలు పెట్టి ఈ విధంగా చెప్పారు.

మనిషి స్వతంత్రుడు కాదు. అన్నిటికీ ఇతరులపై ఆధారపడతాడు. అది కావాలి, ఇది కావాలి అని ఇతరులను అడుగుతూ ఉంటాడు. అటువంటప్పుడు మనిషి ఆసరా అనేది అంత నమ్మశక్యం కాదు.

ఉదాహరణకు మీకు ఎంత ఆప్తులైనా సరే... మీరు ఒక రోజు అడిగితే భోజనం పెడతారు, 2,3,4 రోజులు... తర్వాత... మెడపట్టి బయటకు గెంటుతారు... వాళ్ళే వేరే వాళ్ళ వద్ద కొన్ని అడిగి తెస్తారు. అటువంటప్పుడు మనిషి పై ఆధారపడి, అడుక్కుని ఎందుకు బ్రతుకుతావు ?

నీకు ఊపిరి పోసిన వాడిని, నీలో చైతన్యమై నిలిచిన వాడిని, నీ ఉనికికి, నీ చుట్టూ ఉన్న వస్తువులకు అన్నింటికీ ఆధారభూతమైన పరమాత్మని... అడుగు. మాటిమాటికీ కాదు ఒకే సారి... దైవానుగ్రహం పొందడం ఎలాగో, దైవాన్ని కీర్తించడం ఎలాగో... నీ గురువును అడుగు. ఆ కీర్తనల ద్వారా దైవమే వచ్చి, నీ వద్ద కూర్చుంటారు. దైవమే నీ ఇంట వెలసినప్పుడు... ఇక నువ్వు అడగాల్సింది ఏమీ ఉండదు. 

అందుకే గురు గ్రంధ సాహిబ్ ప్రకారం సిక్కులు ,సాటి మనుషుల్ని అడుక్కోవడం నిషేధించారు. అడగాలనుకుంటే... దైవాన్నే అడుగు... ఇదీ ఆయన చెప్పిన సారాంశం !


Monday, May 26, 2014

ఇచ్చుటలో ఉన్న హాయి...

ఇచ్చుటలో ఉన్న హాయి...
ఆ మధ్యన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు.... ఈ మాటలు న మనోపధంలో ముద్రించుకు పోయాయి...
"చూడండి... మీరు యెంత కష్టపడి, ఎన్ని కోట్లు సంపాదించి, పిల్లలకు ఇచ్చినా... వాళ్ళు ఏమంటారంటే...
మా నాన్న ఉన్నాడు చూసారా? దొంగ వెధవ... అదిగో ఆ ఎదురుగుండా ఉన్న భవంతి ఉంది కదా, అది నాకు ఇవ్వకుండా పోయాడు, చచ్చినాడు.(అంతే కాని, ఇచ్చిన వాటి గురించి చెప్పాడట...)
మా అమ్మ ఉందే ! ఎంత చాకిరీ చేసాను, చివర్లో కాసులపేరు కోడలికి ఇచ్చి పోయింది..."
మనిషికి తృప్తి ఎక్కడండి ? ఎంత ఇచ్చినా, ఇచ్చింది గుర్తుండదు. ఇవ్వని దాన్నే చెప్తారు. అందుకే, నేనైతే నా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవట్లేదు. వచ్చిననంత వస్తుంది. ఉన్నంతలో విద్యాబుద్ధులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నేను ముప్ఫై ఏళ్ల నుంచే తీర్థ యాత్రలు చేస్తున్నాను. అదనంగా వచ్చిన సొమ్మంతా దానధర్మాలకు వాడేస్తాను. పిల్లలకు అతిగా ఆస్థులు ఇవ్వడం అంటే, వాళ్ళను కష్టం తెలియకుండా ఇంక్యుబేటర్ కోళ్ళు పంచినట్లు పెంచడమే ! ఈ విధానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. మీకు నిజంగా పిల్లలపై ప్రేమే ఉంటే, వాళ్లకు చదువుసంధ్యలతో పాటు కాస్తంత ఆస్తినే ఇవ్వండి.
వాళ్లకు బెంజి తెలియాలి... గంజి తెలియాలి. లోకం చూడాలి, అనుభవం పెంచుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. ఇక ఆస్థి తక్కువ ఇస్తే, వాళ్లకు అనుకోని అవసరాలు వస్తే... అంటారా ? నేను ఈ రోజున చేసిన దానధర్మాలు వాళ్ళను అవసరంలో ఆదుకోకపోవు. దైవానుగ్రహం ఉన్న వాళ్లకు జీవితంలో డోకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అతిగా ఆస్థులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టకండి ..."
నేనలా ఆయన చెప్తుంటే చూస్తూ ఉండిపోయాను. ఎంత చక్కగా చెప్పారు... నిజంగా 'వసుధైక కుటుంబకం ...' అన్న వారి సూత్రం అంతా పాటించగలిగితే, ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉండవు కదా !