Sunday, October 27, 2013

పోతనామాత్యుడు

పోతన భాగవతం దశమ స్కందం నుంచీ...

శ్రీకృష్ణుని చూసిన మధురలోని గోపికలు ఇలా అనుకుంటున్నారట... 

వేణునాదములమై వెలసిన మాధవుం డధరామృతము నిల్చి యాదరించు 
బింఛదామములమై పెరిగిన వెన్నుండు మస్తకంబున దాల్చి మైత్రినెరపు 
బీతాంబరములమై బెరసిన గోవిందు డంసభాగముల బాయక ధరించు 
వైజయంతికలమై వ్రాలిన గమలాక్షు డతి కుతూహలమున ఇరుత దాల్చు 
డనరు బృందావనంబున దరులమైన - గృష్ణు దానందమున చే క్రీడ సల్పు 
నెట్టి నోములనైన మున్నెట్టి విధము - లేల కామైతి మాయమ్మ ఇంక నెట్లు ?

భక్తుని హృదయంలో భగవంతుని ఎలాగైనా చేరాలన్న తృష్ణ ఈ పద్యంలో కనిపిస్తుంది. కృష్ణా వేణువునయినా, నెమలి పించామయినా, పీతాంబరము లయినా (పసుపు పచ్చని వస్త్రాలు), వైజయంతికలం అయినా, చివరికి బృందావనంలో ఒక చెట్టు అయినా బాగుండేది. ఏదో ఒక విధంగా నిన్ను చేరేవాళ్ళం. ఏదో ఒక నోములు చేసి, కనీసం వీటిలో ఏదయినా కాకపోయాము. ఇంకేమి చేయ్యగలమమ్మా, చెప్పండి?

క్షీరసాగరమధనం లో హాలాహలం పుట్టింది. దేవతలంతా ఆ హాలాహలం నుంచీ తమను రక్షించమని అనేక విధాల పరమేశ్వరుడిని వేడుకుంటారు. తన ప్రాణ నాధుడు తన బిడ్డలను కాపాడేందుకు హాలాహలం మింగేందుకు సిద్ధం అయ్యాడు. భర్త విషం మ్రింగబోతున్నాడని తెలిసి, అందరికీ మేలు జరగాలన్న కోరికతో సర్వమంగళ పార్వతి మ్రింగమని చెప్పిందట. ఆ సందర్భంలో, మనస్సులో తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్మిందో... అంటూ పోతన వ్రాసిన ఈ పద్యం చూడండి...

మ్రింగెడువాడు విభుండని 
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో 

బలి చక్రవర్తి వామనుడికి దానం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. ఏ ఏ సందర్భాలలో ఆడిన మాట తప్పవచ్చో, అబద్ధం చెప్పవచ్చో, ఇలా చెబుతున్నాడు...

వారిజాక్షులందు వైవాహికములందు 
బ్రాణ విత్త మాన భంగమందు 
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు 
బొంకవచ్చు నఘము వొండ డధిప 

"రాజా! ఆడవారి విషయంలోనూ, పెండ్లిండ్ల లోనూ, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు, భయపడిన గోవులనూ బ్రాహ్మణులనూ ఆదుకునేటప్పుడూ అబద్ధం చెప్పవచ్చు.


శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు అందించిన పద్యాలు 

భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట...పోతన భాగవతం 
-------------------------------------------------

కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి, 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ
నుఱికిన నోర్వక యుదరంలో నున్న, 
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ, 
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక, 
మన్నింపు మని క్రీడి మఱలఁ దిగువఁ

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి, 
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁగాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖవృష్టిఁ, 
దెరలి చనుదెంచుదేవుండు దిక్కునాకు

అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁబోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?

పోతనామాత్యుని భాగవతం నుండి....
-------------------------------------

శ్రీ కృష్ణుని మరణ వార్త .. అతి దుఃఖ భరిథమైనది..అర్జునుడు ధర్మరాజు తో చెప్తున్నాడు..
అయ్యో నే చేసిన అంత సేవ నిరర్ధకం. ప్రభూ ..నన్ను ప్రేమగా పిలిచే సర్వేశ్వరుడు, శ్రీ కృష్ణుడు. నిర్యాణము తరువాత కూడా, చూడు .. నా ప్రాణములు ఇంకా ఆయనతో పాటు పోవటల్లేదు. పూర్వ జన్మలో ఎన్ని పాపాలు చేసానో కదా..ఇంతటి లోభం నాకు దేహం మీద ఉంది ....

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ? భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మ దాకాంక్షామితం బైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నా పాలికిన్.

బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతున్నాడు.
బ్రహ్మచారిని ఐన నాకు .. గొడుగు , యజ్ఞోపవితం కమండలం లేక మొలతాడు ..ఉపయోగిస్తాయి 
అంతేగాని ..భూములు , ఏనుగులు , గుర్రాలు స్త్రీ లు .. వీటితో నాకు ఏమి పని..
అందువలన కాదనకుండా నేనడిగిన మూడడుగుల చోటూ ఇస్తే అదే నాకు బ్రహ్మాండం. 
.......వామనావతారం ....భాగవతం ......శ్రీ బమ్మెర పోతరాజు


                                                                                                       

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు అందించిన పద్యాలు 

పోతన భాగవతము "దశమ స్కందము" నుండి.

గజ్జెలు ఘల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షీజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా

గూడఁబారి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్ని వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతులాడక పూఁబోణి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా! యెన్నఁడును వెన్న గానరఁట కదా
చోరత్వం బించుకయును
నేరరఁట, ధరిత్రి నిట్టి నియతులుఁ గలరే

పట్టినఁ బట్టుపడని నినుఁ
బట్టెద మని చలము కొనినఁ బట్టుట బెట్టే
పట్టువడ వండ్రు పట్టీ
పట్టుకొనన్ నాకుఁగాక పరులకు వశమే

ఎక్కడ నైనను దిరిగెద
వొక్కయెడన్ గుణము గలిగియుండవు నియమం
బెక్కడిది నీకు మఱచినఁ
జక్కనఁ బోయెదవు పెక్కుజాడలఁ బుత్రా

వింజమూరి వెంకట అప్పారావు గారు అందించిన పద్యాలు 

పోతనామాత్యుడు గారి పద్యాలు...
"వారిజాక్షులందు వైవాహికములందుఁ 
బ్రాణ విత్త మాన భంగమందుఁ 
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు 
వొంకవచ్చునఘమువొందడధిప!"

అనే నీతిని వెలయించాడు. ఇదంతా శుక్రునికి బలిపై ఉన్న వాత్సల్యం. రాక్షస గురువుగా ఆయన ధర్మం. కులాచార్యుడు శుక్రుడు చెప్తున్న హితవాక్యాలను విన్న బలి – "క్షణమాత్ర నిమీలిత లోచనుడై" ఆయనతో - "మహాత్మా! మీరు చెప్పేది యధార్థమే . ఏదడిగినా ఇస్తానని చెప్పిన నేను – ఇపుడు కాదనలేను. భూదేవి బ్రహ్మతో – ఎట్టి పాపాత్ముడినైనా భరిస్తానుగానీ, సత్యహీనునిమాత్రం భరించలేను అని చెప్పిందికదా. కర్షకునకు సారవంతమైన నేల, బలమైన విత్తనాలు ఒకేచోట దొరికినట్లు దాతకు తగిన ప్రతిగ్రహీత లభించటం కూడా మహద్భాగ్యమేకదా - ఎన్నో యజ్ఞాలు, పుణ్యకార్యాలు చేసినా దర్శనభాగ్యం ప్రసాదించని గొప్పవాడైన విష్ణువు నేడు వామనుడై నన్ను దానం చేయమని చేయిచాచి అర్థిస్తున్నాడు.

ఎటువంటి చేయి అది – 

ఆదిన్ శ్రీసతి కొప్పుపై ,తనువుపై,నంసోత్తరీయంబుపైఁ 
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁబాలిండ్లపై నూత్నమ 
ర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే 
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమేకాయంబు నాపాయమే

అంతటి ప్రశస్త హస్తం క్రిందిది కావటం, నాది పైచేయి కావటంకంటె అదృష్టమా ! 

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే 
వారేరీ? సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ 
బేరైనంగలదే ?శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై 
యీరే కోర్కులు?వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా !"

అన్న బలిచక్రవర్తి యొక్క ఆనందపారవశ్యం, ధీరోదాత్తత ఎంతటిదని చెప్పగలం? "తిరుగన్ నేరదు
నాదుజిహ్వ, మేరువు తలక్రిందలైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమి పిండియైపోయినా ఈ దానాన్ని చేసితీరుతాను" అన్న బలిపై ఆగ్రహించిన శుక్రుడు "నాశాసనం ధిక్కరించావు కనుక త్వరలోనే పద భ్రష్టుడవౌతావు" అని శపించాడు.

భారత వర్ష జంతువుల భగ్యమదేమని చెప్ప వచ్చు నీ
భారత వర్షమందు హరి పల్మరు బుట్టుచు జీవ కోటికిన్
ధీరత తోడ తత్వ ముపదేశము జేయుచు చెల్మి సేయుచున్ 
ఆరయ బాంధవాకృతి కృతార్ధుల జేయుచు నుండు నెంతయున్ !!

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!
                                                                              ---పోతనామాత్యుడు.


                                                            


డి.వి లీలా ప్రసాద్ గారు అందించిన పద్యాలు 

పోతన --- భక్తి రసమయ రూపం, భక్తి వేదాంత సాహిత్య శిఖరం, తత్వక్రమ పరిణామవికాసం, ముక్తికి భక్తికి సరళసుందర లభసోపానమార్గప్రదాత, మందార మకరంద మాధురీధురీణమైన కవితాఝరి, భగవత్భక్తికి పర్యాయపదం, అక్షరాస్యులకు అర్ధసౌరభంతో, 
నిరక్షరకుక్షులకు నాదగాంభీర్యంతో తెలుగువారి ఇంటింటా నిత్యనూతననత్వమును సంతరించుకున్న పద్యం.

పోతన వారి కొన్ని పద్యములను మననం చేసుకొని తరించుదాం:

***పలికెడిది భాగవతమట !
పలికించెడి వాcడు రామభద్రుoడట ! నే
పలికిన భవహరమగు నట !
పలికెద వేఱొoడు గాథ పలుకcగ నేల ? .....

***భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన - దమ్మిచూలికైన !!
విబుధ జనులవలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు !! .....

***నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, ని తాం
తాపార భూత దయయును
తాపసమందార నాకు దయసేయcగదే ! ......

***ఉ: శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిcగానcగ నెన్నcడు గల్గు భారతీ! .....

--- తల్లీ! భారతీ! తెల్లని కాంతులు, వెల్లివిరిసే శరన్మేఘకదంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చ కర్పూరమూ, పటీరమూ, రాజ హంసలూ, 
జాజి చెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా,రెల్లుపూలు, ఆది శేషుడూ, మల్లెలూ మందారాలూ పాలసంద్రమూ, పూచిన పుండరీకాలూ, ఆకాశగంగా -- ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జ్వలమైన ఉపమానాలు, అటువంటి స్వచ్చధవళ సుందరమూర్తివైన 
నిన్ను కన్నులార మనసుదీరా ఎన్నడు దర్శింప గలుగుతానో గదా !!

***తే: చేతులార శివునిc బూజింపcడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువcడేని,
దయయు సత్యంబు లోనుగాc దలcప డేనిc,
గలుగ నేటికిc దల్లుల కడుపుc జేటు.....

--- ఈ జగత్తులో జన్మించిన వాడు - చేతులారా శివుని పూజించని , నోరార కేశవుని కీర్తించని , సత్యమూ కరుణనూ మనసున అలవరచుకోని మనుజుడు పుట్టుట- తల్లుల కడుపు చెడగొట్టుటయే కదా? ........


భగవత్ భక్తికి పరాకాష్ట శ్రీ పోతనా మాత్యులు ----

**** శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!........

--- శ్రీ కృష్ణా ! యదుకులభూషణా ! అర్జునకు ప్రియమైన వాడా !శృంగార రస రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశములను
దహించినవాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, విప్రుల,గోమందల ఆర్తిబాపికాపాడే స్వామీ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ!నీకు నమస్కరిస్తున్నాను. పరిపూర్ణ కరుణా పయోధివై నా భవబంధాలు ఖండించు!
(కుంతి శ్రీకృష్ణుని స్తుతించు సందర్భం లోనిది) -----

****త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.....

--- ముల్లోకాలను మోహింపచేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించు 
బంగారు చేలంతో, ఒయ్యారం ఒలకబోస్తూ, నల్లని ముంగురలతో ముద్దులు మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చిందిస్తూ 
మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచి పోవాలని ---- 
(భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భం లోనిది)

శ్రీ మహా భాగవత పురాణాo తెనిగించటానికి పూనుకున్న సందర్భంలో పోతనామాత్యుడు చేసిన భగవత్ ప్రార్ధనా పద్యాలలో ఒక పద్యం:

***ఉ: శీలికి, నీతి శాలికి, వశీకృత శూలికి, బాణహస్త ని
ర్మూలికి, ఘోర నీరద విముక్త శిలాహత గోపగోపికా
పాలికి, వర్ణధర్మ పరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ద మరీచి మాలికిన్....

--- శీలవంతుడూ, నీతిమంతుడూ, త్రిశూలధారియైన శివుని వశం చేసుకున్నవాడూ, బాణాసురునిబాహుదండాలు ఖండించినవాడూ, ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ళ జల్లుకు చెల్లాచెదరైనగో గోప గోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్దరంచిన వాడూ, జంట మద్ది చెట్లు పెళ్లగించిన వాడూ, వనమాలలు ధరంచిన వాడూ, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్య మండలాన్ని కప్పి వేసినవాడూ -----

***క: భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.....

---- శ్రీ హరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు! సకల పాప పరిహారాలు !మృత్యు దేవతకు భయంకరాలు! భక్త హృదయాలకు సంతోషకరాలు! నిత్య కల్యాణ కరాలు ! -----

--- నారదుడు వ్యాసుని కలసిన సందర్భం:

***ఉ: ధాతవు భారత శ్రుతివిధాతవు ! వేద పదార్ధజాత వి
జ్ఞాతవు కామ ముఖ్యరిపుషట్క విజేతవు ! బ్రహ్మతత్వ ని
ర్ణేతవు ! యోగినేతవు ! వినీతుc డ నీవు చలించి చెల్లరే !
కాతరు కైవడిన్ వగవc గారణ మేమి? పరాశరాత్మజా .....

---- పరాశ నందనా! నీవు దాతవు పంచమ వేదమైన భారతాన్ని అందించినవాడవు, వేదార్ధాన్ని చక్కగా వరించినవాడవు,  అరిషడ్వర్గాలను జయించినవాడవు, పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడవు. యోగులలో అగ్రేసరుడవు. వినయసంపన్నుడవు. అటువంటి నీవు చలించిపోయి విచారించటానికి కారణమేమయ్యా? ఆశ్చర్యంగా వున్నదే !? ......

'సహజకవి' పోతన 1

శ్రీ రావినూతల శ్రీనివాస్ గారు అందించిన పద్యాలు 

మహాకవి బమ్మెరపోతనామాత్యులవారు (1410-1470)మధ్య శ్రీమహాభాగవతమును తెనుగు భాషలో రచించి,ఆంద్రభాషాభిమానులకు శాస్వతమైన వరప్రసాదము గావించారు. వారు భగవన్నామ స్మరణలో పరవసించిపోయే పరమభక్తులు. లౌకికప్రలోభాలకు అతీతమైన నిర్వికల్పులు. సహజపాండితీ విశారదులు. వీరు రచించిన శ్రీఆంధ్రమహాభాగవతము సులలిత సుమనోహర శైలిలో,మృదుమధుర పదములతో రచింపబడిన పద్యములతో,మధుబిందువులను వర్షింపచేస్తుంది. చేసిన రచన తమ ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రప్రభువు యొక్క దివ్యస్ఫురణచే రచించినట్లు "పలికించు వాడు రామభద్రుడు"అని,పోతానగారే స్పష్టపరిచారు. 
పోతనగారు గ్రంథ రచనను ఈ కింది శ్లోకంతో ప్రారంభం చేశారు. 

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర 
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో 
ద్రేకస్తంభకు గేళిలోలవిలసద్దృగ్జాలాసంభూతనా 
నాకంజాతభవాండకుంభకు మహానందాంగ నాడింభకున్. 

ఈ పద్యముద్వారా ప్రప్రధమంగా శ్రీకృష్ణభగవానుని స్మరించదమైనది. మానవజన్మ యొక్క పురుషార్థము మోక్షప్రాప్తియే. దానినే "శ్రీకైవల్యపదంబు చేరుట"అని పేర్కొన్నారు. అదియే ఈ గ్రంథము యొక్క ప్రయోజనము. లోకరక్షాపరాయణుడు,భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు,దానవుల ఉద్దృతాన్ని అరికట్టేవాడు,లీలావలోకనమాత్రముననే అనేక బ్రహ్మాండములను ఉద్భవింపజేయువాడు,అయిన నందరాజు యొక్క ఇల్లాలి ముద్దులబిడ్డడు అయిన బాలకృష్ణుని శ్రీకైవల్యపదమును పొందుటకొరకు నేను ధ్యానిస్తున్నాను. 

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం 
పాదికి దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా 
చ్చేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్ 
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రాసాదికిన్. 

హిమగిరినందిని యొక్క హృదయానురాగాన్ని పొందినవాడు,కలిదోషాలను తొలగించువాడు,ప్రపన్నులను ఆనందింపచేయువాడు,ఆశ్రితుల విఘ్నములను చేదించువాడు,మధురభాషణములచే అశేషజనులను ఆనందింపచేయువాడు,మోదకాలను ఆరగించి ముషికమును అధిరోహించువాడు,అయిన వినాయకదేవునకు నేను మ్రోక్కుచున్నాను. 

క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత 
శ్రోణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర 
శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్ 
వాణికి నక్షదామశుకవారిజపుస్తకరమ్యపాణికిన్. 

నల్లని అందమైన శిరోజములు గల తల్లికి,దేవతలను రక్షించునామెకు,బ్రహ్మదేవుని మనస్సు వశపరచుకున్న దేవికి,రుద్రాక్షమాల,చిలుక,పద్మము,పుస్తకము చేతిలో ధరించిన వాణికి,నా నుదురు నేలను తాకునట్లు వంగి,భక్తితో నమస్కరిస్తున్నాను. 

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలాపె 
ద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్నులో 
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. 

అమ్మలందరికీ అమ్మ,ముగ్గురమ్మలలకూ మూలమైన అమ్మ,అందరికన్నా అధికురాలైన అమ్మ,అసురుల అమ్మల కడుపులకు చిచ్చుపెట్టు అమ్మ,తనను మనస్సులో నమ్ముకున్న దేవతల తల్లులకు చిత్తములో నిల్చియుండే అమ్మ,దయసాగరి ఐన మా అమ్మ దుర్గాభవాని,నాకు ధనము,పాండిత్యము,శక్తి మొదలగు సంపదలనిచ్చుగాక. 

చేతులారంగ శివుని బూజింపడేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని 
దయయు సత్యంబులోనుగాదలపడేని 
గలుగనేటికి దల్లులకడుపుచేటు. 

నిండు చేతులతో,మనస్పూర్తిగా శివుని పూజింపనివాడు,కంఠమెత్తి అలసిపోయేవరకు శ్రీహరి గుణవైభవములను కీర్తిస్తూ గానము చేయనివాడు,భూతదయ,సత్యవర్తనము ఆచరింపనివాడు మానవునిగా జన్మించడం వ్యర్థమే కదా!

పలికెడిది భాగవతమట పలికించువిభుండు రామభద్రుండట నే 
బలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ బలుకగ నేలా 

నేను చెప్పబోవునది పరమ పవిత్రమైన భాగవతమట, నాచే చెప్పించే విభుడు సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభువేనట నేనీ భాగవతగాధను చెప్తే సంసారబంధము నశిస్తుందట. అందుచేత నెనీ భాగవతమునే చెప్పెదను. మరి వేరొక గాధను చెప్పడమెందుకు?

అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రా 
వన్న!శరీరధారులకు నాపదవచ్చిన వారియాపదల్ 
గ్రన్ననదాల్చి వారికి సుఖంబులు సేయుటకంటె నొండుమే 
లున్నదెనాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా. 

శకుంతల తనయుడైన భరతుని వంశములో రంతిదేవుడను రాజున్నాడు. అతడు తన సర్వసంపదలను దానధర్మములలో వెచ్చించి,దరిద్రుడై యొక 48 దినములు భార్యతో సహా పస్తులుండవలసి వచ్చెను. ఒకనాడు అతనికి కొద్దిగా పాయసము దొరికింది. ముందర కొద్దిగా భార్యాబిడ్డలకిచ్చి తరువాత మిగిలిన కొద్దిభాగము ఇద్దరు అతిధులకు పెట్టి,కొద్దిగా మంచినీటిని సేవించుటకు సిద్ధపడగా ఒక చండాలుడు వచ్చి "దాహము,నా ప్రాణములు నిలపండి",అని ప్రార్ధించాడు. దానికి రంతిదేవుని సమాధానమును పై పద్యములో పోతనగారు వివరించారు. 

                                           

"ఓయన్నా!అన్నము లేదు గాని కొద్దిపాటి మంచినీరు మాత్రము ఉన్నది. రావన్నా రా!ఈ నీటిని త్రావుము. ప్రాణులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను తొలగించి,సుఖము కలిగించుట కంటే మనుషులకు వేరే పరమార్థమున్నదా?ఇక,నా విషయమా?నాకా పురుషోత్తముడొక్కడే దిక్కు సుమా!మానవా!అని ఆ జలమును ఇచ్చెను. అప్పుడు జరిగింది అద్భుతం :

వారల నేమియు నడుగక 
నారాయణభక్తి తనమనంబున వెలుగన్ 
ధీరుండాతడు మాయా 
పారుజ్ఞుం డగుచుబరమపదమున్ బొందెన్ 

బ్రహ్మాది దేవతలు ఆ యొక్క రంతిదేవుని దానశీలతకు ప్రసన్నులై,ప్రత్యక్షమై అన్నార్తుల రూపములో తామే వచ్చామని,అతని దానశీలతకు సంతోషించామని,వరము కోరుకోమని అడుగగా,పుణ్యాత్ముడైన రంతిదేవుడు ఏమీ కోరక,నారాయణుని యందు సంపుర్ణమైన భక్తి కోరి మాయను దాటినవాడై పరమపదమును పొందెను. 

జగదవనవిహారీ!శత్రులోక ప్రహారీ!
సుగుణఘనవిహారీ!సుందరీమానహరీ!
విగతకలుషపోషీ!వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ!సర్వదాసత్యభాషీ!

జగత్తు అను మహాసాగరములొ విహరించువాడా!శత్రులోకమును దండించువాడా!గొప్ప సుగుణములతో ప్రవర్తించువాడా!సీతాసుందరి మనోహరుడా!నిర్మల చరితులను పోషించువాడా!రణకౌశల శ్రేష్టుడా!విశ్వామిత్రుని సంతోషింపచేసినవాడా!ఎల్లప్పుడూ సత్యభాషణమే వ్రతముగా కలవాడా!ఓ రామచంద్రా నీకు ప్రణతులు!

వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 

శ్రీమద్భాగవతము వేదమనే కల్పవృక్షము నుండి ఉద్భవించినది. శుకయోగీంద్రుని ముఖము నుండి వెలువడిన అమృతఫలరసము. దివ్యమైన ఆ ఫలరసాన్ని రసికభావుకులు ఆస్వాదించి తరింతురుగాక!


శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి 

పోతనా మాత్యుని శారదా స్తుతి 
--------------------------

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం - 
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా - 
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ


బాణాసురుని శివ స్తుతి ..... పోతనామాత్యులు ... భాగవతం 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత!; వితతచారిత్ర! సంతత పవిత్ర!
హాలాహాలాహార! యహిరాజకేయూర!; బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! సద్గుణసంఘాత!; పార్వతీహృదయేశ! భవవినాశ!
రజతాచలస్థాన! గజచర్మపరిధాన!; సురవైరివిధ్వస్త! శూలహస్త!

లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!

శ్రీ వి. సత్యనారాయణ గారు 

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో 
నమ్మిన వేల్పుటమ్మల మనంబులనుండెడి యమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ధి యిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ 

మహా కవి బమ్మెర పోతన గారికి నమస్సుమాంజలులు



'సహజకవి ' పోతన

పరవస్తు నాగసాయి సూరి 

అమ్మా! మన్ను దినంగనేశిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

ఈ పద్యం పూర్తిగా తెలియకపోయినా... నా చిన్నతనం నుంచి మొదటి వాక్యం మాత్రం ఎప్పుడూ నోటి మీద నానేది. బాలకృష్ణుడు అచ్చంగా యశోదమ్మతో ఇలాగే చెప్పావాడా... కన్నయ్య అచ్చంగా తెలుగువాడేనా అన్నంతగా జనాల్లో నాటుకుపోయింది. ఈ ఘనతలో పావు భాగం చిన్ని కృష్ణుడికి, మిగతా పావుభాగం రాయించిన శ్రీరాముడికి, సగభాగం రాసిన పోతన్నకు దక్కుతుంది.

నన్నయ లాంటి మహా కవులు భాగవతం రాయకుండా ఉండడం నన్ను కరుణించడానికే అనేంత గొప్ప మనసు పోతన సొంతం. అంతేనా భాగవతం రాసింది నేను కాదు... రాయించింది ఆ శ్రీరాముడే అంటూ... అచంచల భక్తి ప్రపత్తులు ప్రదర్శించిన భక్తాగ్రేసరుడు పోతన.

"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"

అంటూ ఆ శ్రీరామ చంద్రుడే తన చేత భాగవతం రాయించాడని చెప్పకనే చెప్పాడు. ఆ దేవదేవుని కథను పలికితే భవహరమౌతుందట. వేరే ఎవరి గాధో పలకడం దేనికి అంటూ ప్రశ్నించారు కూడా.

సహజంగానే భక్తుడు, కవి అయిన పోతన భక్తి తత్వానికి పరాకాష్ట. అందుకే భగవద్భక్తుల చరిత్ర అయిన భాగవతాన్ని రాసే అవకాశాన్ని ఆ దేవుడు పోతనకు కల్పించాడేమో అనిపిస్తుంది.

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"

అంటూ నవవిధ భక్తి మార్గాలను తొలుత ప్రవచించింది వ్యాసుడే. వాటిని ఇంతకు రెండింతలుగా విస్తరించి...

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"

అంటూ ప్రహ్లాదుని నోట పలికించాడు. ఇవన్నీ అచ్చంగా కూర్చుని రాస్తే వచ్చేవి కావు. పరమేశ్వరుని జటాజూటం నుంచి పొంగి వచ్చే గంగా ధారలా... వాటంతట అవే జాలువారాలి. మనసా, వాచా, కర్మణా... భక్తి ప్రపత్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

రచయితలు అనే వారు పోతనను చూసి ఎంతో నేర్చుకోవాలి. అంతటి భాగవతాన్ని ఇంకెంతో చేసి... తెలుగు వారికి అందించిన పోతన ఏనాడూ గర్వపడలేదు. పైపెచ్చు...

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."

అంటూ... తనకేమీ తెలియదని, నిమిత్తమాత్రుడనని, పెద్దలు చెప్పిన దాన్నే మీకు అందిస్తానని ప్రకటించారు. ఇక భాగవతాన్ని రాసే విధానంలోనూ తన శైలిని పోతన స్పష్టంగా తెలియజేశారు.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

కొందరు తెలుగు నచ్చుతారు, ఇంకొందరు సంస్కృతము మెచ్చుతారు. అంతరినీ మెప్పిస్తానంటూ పోతన ప్రతిజ్ఞ చేశారు. భాగవతంలోని ఏ పద్యం చదివినా... తెలుస్తుంది పోతన అచ్చతెలుగు తనం, సంస్కృత గుణం. రాముడి మీద అచంచల భక్తిభావం గలిగిన పోతన శ్రీకృష్ణుడి గురించి రాస్తూ....

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

ఆ నల్లనయ్య అల్లరి గురించి ఇంత అందంగా చెప్పిన కవి మరొకరు కానరారు. అద్భుతానికే అద్భుతమనిపించేలా భాగవత రచన చేశారు పోతన.

ఇంత చేసీ పోతన జీవనం సాగించింది వ్యవసాయం మీదే. ఒక సారి ఎవరో ఆయనతో అన్నారట. నీ ఏ ఒక్క కవితనైనా... ఏ రాజుకైనా అంకితమిస్తే... నీకు ధనరాశుల్ని దారాదత్తం చేస్తారని. దానికి పోతన...

" బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపు(గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమల( గందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై"

అంటూ కావ్యకన్యను అమ్ముకుని... పడుపుకూటితో సమానమైన విందుని తినడం కంటే... భార్యా, సుతుల్ని పోషించుకోవడానికి నిజమైన కవి వ్యవసాయం చేసుకోవచ్చు లేదంటే... కందమూలములు తిని బతకవచ్చు అంటూ తన వైఖరిని చాటారు. అంతేనా.... పోరపాటున తాను అలాంటి పని చేస్తానేమో అనుకుని సాక్షాత్తు సరస్వతీదేవి ప్రత్యక్షమై కన్నీరు కారిస్తే... 

"కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భు రాణి! నిను నా(కటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాట కీచకుల కమ్మ(, ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!" 

అంటూ ఆమెను ఓదార్చారట. ఇక పోతన భాగవతంలోని ఆణిముత్యాల్ని ఏరడం మొదలు పెడితే... మన మనసులు బరువెక్కుతాయి. తేలికైన భాషలో... బరువైన భావాలతో అల్లిన పద్యాల దండలవి. అవన్నీ శ్రీరాముడి మెడలో చక్కగా అమరాయి.

                                          

భాగవతాన్ని ఆరంభిస్తూనే... అంత్యప్రాసలతో....

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

అంటూ మొదలు పెట్టారు. ఆ తర్వాత ముగ్గురమ్మలను కీర్తిస్తూ....

శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!.... అంటూ సరస్వతిని

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్... అంటూ లక్ష్మిదేవిని...

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్... అంటూ పార్వతి దేవికి మొక్కారు.

ఎన్నో ప్రశ్నలకు పోతన భాగవతం జవాబిస్తుంది. ఉదాహరణకు భగవంతుడు ఎవడు అన్న ప్రశ్నకు...

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

ఇది కేవలం హిందూ మతానికే కాదు... సర్వమతాలు అన్వయించుకోదగ్గ పద్యం. ఆది, అంతం లేని వాడు, అంతా తానే అయిన వాడు, అన్నింటికీ మూలకారకుడు... ఎవరు ఇంకెవరు పరమాత్ముడే. మరీ మాట్లాడితే మానవుడే. 

మరో పద్యంలో ఏకంగా వైకుంఠాన్నే కళ్ళకు కట్టారు....

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై

మరొక చోట....

ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

అంటూ వామనుడి బ్రహ్మాండ రూపాన్ని వర్ణించారు. అంతెందుకు గజేంద్రుడు... పాహి పాహి అని మనసారా పిలించినంతనే.... ఆ స్వామి బయలు దేరిన విధానాన్ని పోతన కళ్ళకు కట్టిన తీరు నభూతో...

సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.

అమ్మ వారికి కనీసం చెప్పకుండానే ఆఘమేఘాల మీద బయలు దేరారట. ఇలా చెప్పుకుంటూ పోతే పోతన ప్రతిపద్యంలోనూ ఒక విశేషం, విశిష్టత కనపడుతాయి. భగవంతుడి కోసం, భాగవతం కోసమే తెలుగు నేల మీద పోతనను భగవంతుడు సృష్టించాడా అనిపిస్తుంది. ఆ సహజకవికి శిరసా నమామి.