Monday, November 11, 2013

'పద కవితా పితామహుడు ' అన్నమయ్య

రచన: పరవస్తు నాగ సాయి సూరి 

భవసాగరాన్ని దాటించే భక్తి సాగరం, సాహితీ క్షీరసాగరం
----------------------------------------------------

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
నట్ట నడి మీ పని నాటకము
అన్నమయ్య చెప్పినట్టు. నడిమిన జరిగేదంతా నాటకమే. మరి ఆ నాటకాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దాలంటే... అందులో నవరసాలు ఉండాలి. వీటితో పాటు పదో రసం... అంటే భక్తి రసమూ ఉండాలి. జీవితాంతం అన్నమయ్య చెబుతూ వచ్చింది ఇదే. వేంకటేశ్వరుని పూజించి తరించండి. ఆ స్వామి చల్లని నీడలో సేదతీరండి అని. ఇదంతా ఓ ఎత్తైతే... అన్నమయ్య ఈ నిజాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తు. చిన్న చిన్న పదాల్లో... పండిత పామర రంజకంగా తిరుమల వేంకటేశుని పూజించి తరించాడు. 
నీ వల్ల నాకు పుణ్యము...
నా వల్ల నీకు కీర్తి 
అంటూ తిరుమల వాసుడితో బేరసారాలు ఆడగలిగిన మహాభక్తుడు అన్నమయ్య. దక్షిణా పథాన భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆ పదకవితా పితామహుడే ఆద్యుడు. భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, భావలాలిత్యాది విశేషాలను ఒకే చోట పొదిగి వెంకటేశ్వరుణ్ని సంకీర్తనా కమలాలతో అర్చించి తరించాడు. సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన నందకమే అన్నమయ్య రూపు దాల్చిందని నమ్మిక. నిజమే కామ క్రోదాది అరిషడ్వర్గములను ఖండించాలంటే... మార్గం చూపాల్సింది శ్రీహరి ఖడ్గమే కదా. బహుశా అందుకేనేమో ఎటు నుంచి నరుక్కురావాలో అన్నమయ్యకు బాగా తెలుసు. అందుకే ఆకర్షించడానికి శృంగారాన్ని, అర్థం కావడానికి సరళ పదాల్ని, ఆకట్టుకోవడానికి మంచి ప్రయోగాల్ని, మార్చడానికి భక్తిరసాన్ని రంగరించి 32వేల సంకీర్తనల్ని రాశిపోశాడు... తాళ్ళపాక అన్నమాచార్యులు.
ఆ రాయడం కూడా మామూలుగా రాశాడా. మనిషి పుట్టుక నుంచి చావు వరకూ... ప్రతి సందర్భాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో చక్కగా అమర్చాడు. తల్లిగా మారి శ్రీనివాసునికి జోలపాడాడు, యశోదమ్మగా మారి గోరు ముద్దలు పెట్టాడు, తండ్రిగా మారి పెళ్ళిచేశాడు, తాతగా మారి శృంగారాన్ని బోధించాడు, చివరకు కొడుకుగా మారి చరమాంకాన్ని రుచి చూపాడు. ఇన్ని అవస్థలను సాహిత్యంలో ఏర్చి కూర్చిన మరో కవి, రచయిత తెలుగు సాహిత్యంలోనే కాదు... మరి ఏ ఇతర భాషల సాహిత్యంలోనూ కనిపించడంటే అతిశయోక్తి కాదు.
ఉగ్గు వెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీనిదె శిశువోయమ్మా
కడుపులోని లోకమ్ములు గదలీ నొడలూచకురే వోయమ్మా
అంటూ.... ఆ చక్కనయ్యకు ఉగ్గు పెట్టాడు అన్నమయ్య. ఈ రోజుల్లో ఉగ్గు పెట్టడం ఎంత మంది తల్లులకు తెలుసు. అసలు ఉగ్గు అనేది ఒకటి ఉందని ఎవరికి తెలుసు. అన్నమయ్య ఈ కీర్తన ఉన్నంత కాలం తెలుగు లోగిళ్ళలో ఉగ్గు నిలిచిపోతుంది. అంతేనా....
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో...
అంటూ సాక్షాత్తు చంద్రుని సోదరినే అర్థాంగిగా స్వీకరించన వాడికి చందమామ అశపెట్టి గోరుముద్దలు తినిపించాడు. ఈ కీర్తనకు వెంకటేశుడి సంగతి ఏమో గానీ... తెలుగు లోగిళ్ళలో పసివాళ్ళు మాత్రం గబుక్కున తినేస్తారు. ఇంకోచోట....
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవింద
అంటూ శ్రీవారికి చక్కగా జోలపాట పాడి నిద్రబుచ్చాడు. ఈ పాటకు వెంకటేశుడి మాట అలా ఉంచితే తెలుగింట్లో ప్రతి పిల్లవాడు చక్కగా నిదరపోయాడు. శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నట్టుగా.... పిల్లలే ఈ పాటలకు పరవశిస్తే... ఆ పిల్లల స్వరూపమైన భగవంతుడు నిద్రపోడా ఏమిటి. నిద్రపుచ్చి ఆగాడా....
విన్నపాలు వినవలే వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
అంటూ... వింత వింత కోర్కెలతో తరలి వస్తున్నారు. ఇక చాల్లే మేలుకో. దేవతలంతా నిద్రలేచారు. అంటూ స్వామి వారిని హాయిగా మేలుకొలిపే బాధ్యత కూడా అన్నమయ్యదే మరి. 

                               

పుట్టుక తర్వాత వెంటనే చదువు సంధ్యలే కదా.... వాటి గురించి అన్నమయ్య చెప్పిన ఓ కీర్తనను ఇక్కడ పూర్తిగా ఉదహరిస్తాను...
వాదులేల చదువులు వారు చెప్పినవేకావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా

నాలుగువేదాలబ్రహ్మ నలి నెవ్వనిసుతుడు
వాలినపురాణాలవ్యాసుడెవ్వని దాసుడు
లీల రామాయణపువాల్మీకివసిష్టులు
ఆలకిం చెవ్వని గొల్చి రాతడే పోదేవుడు

భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన
ధీరుదైన శుకుడు యేదేవుని కింకరుడు
సారపుశాస్త్రాలు చూచిసన్యసించి నుడిగేటి
నారాయణనామపునాధుడేపో దేవుడు

విష్ణువాగ్యయని చెప్పేవిది సంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
"విష్ణుమయం సర్వ" నునేవేవేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుడే ఆదేవుడు 
చదువు... చదువు అంటూ గోల పెడుతున్నారు. అసలు చదువంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. ఆ స్వామికంటే ఎక్కువా. ఎందుకు వాదులాడుకుంటున్నారు. వేదాలు పఠించే బ్రహ్మ ఎవరి సుతుడు, పురాణాలు రాసిన వ్యాసుడు ఎవరి దాసుడు, రామయణం రాసిన వాల్మికి, రాముడికే విద్యలు నేర్పిన వశిష్టుడు ఎవరిని కొలిచారో వాడే కదా దేవుడు.
భారతం ఎవరి కథ, భాగవతాన్న చెప్పిన శుక మహర్షి ఏ దేవుడి దాసుడు, అన్ని శాస్త్రాల సారమూ ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన దాసుడే కదా దేవుడు. అంతా విష్ణు మయం, విష్ణుమాయ అయినప్పుడు వేరే దానికి చోటు ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాడే దేవుడు. వాడిని కొలవడమే చదువు అంటాడు. ఈ విశేషం మనకు పోతన భాగవతంలో భక్తప్రహ్లాదుని ఘట్టంలో కనిపిస్తుంది. 
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
అన్న ప్రహ్లాదుని మాటల్లోని అంతరార్థం ఈ కీర్తనలో కనిపిస్తుంది. చదువు తర్వాత ఇంకేముంటుంది పని చేయడం. నాలుగు డబ్బులు సంపాదించుకోవడమే. ఇక్కడే మనిషిలో మార్పులు మొదలౌతాయి. వృత్తులు, వ్యాధులు, బేధాలు ఇలా ఎన్నో పొడసూపుతాయి. వాటన్నింటి మీదా అన్నమయ్య కీర్తనలు కనిపిస్తాయి.
అప్పులేని సంసారమైన పాటే చాలు
తప్పు లేని జీతమొక్క తారమైన చాలు
అంటూ జీవితాన్ని ఎలా గడపాలో చక్కగా ఆవిష్కరించాడు అన్నమయ్య. అంతేనా ఎవడెవడి కోసమో పని చేస్తున్నావు. మానవ జన్మ సార్థకత ఇంతేనా అని ప్రశ్నిస్తూ....
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమొందనేలా
అని ప్రశ్నించాడు. మనిషిగానే పుట్టావు. మనిషి కోసమే ఎందుకు తాపత్రయ పడతావు. ఎక్కడ నుంచి పుట్టావో అక్కడే వ్యామోహాన్ని పెంచుకుని ఎందుకు బాధలు పడతావు. ఆ శ్రీహరిని చేరమంటూ జ్ఞానోదయం చేశాడు. ఇక్కడే వృత్తుల్ని కూడా ఆవిష్కరించాడు.
వాడల వాడల వెంట వాడెవో,
నీడ నుండి చీర లమ్మే నేత బేహారి
అంటూ... మానవ జీవితాన్ని చేనేత వృత్తితో పోల్చాడు. అంతేనా మరోసారి వైద్యుడిగా మారి....
కొనరో కొనరో మీరు కూరిమి మందు
వునికి మనికి కెల్ల నొక్కటే మందు
అంటూ... ధృవుడు, ప్రహ్లాదుడు, నారదుడు, జనకుడు... ఇలా ఎందరో వాడిన అద్బుతమైన ఔషదము. వాడి తరించండి. జీవితాన్ని సార్థకం చేసుకోమంటూ ఎలుగెత్తి చాటాడు. అన్నమయ్య కీర్తనల్లో కనిపించే ప్రత్యేకత ఇదే. ఇలా చూస్తూ పోతే ఎన్నో విశేషాలు. తల్లి ముందు బిడ్డలంతా ఎలా సమానమో భగవంతుడి ముందు జనులంతా అంతే సమానం ఆ విషయాన్ని ఆవిష్కరిస్తూ....
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
అంటూ... హీనం, అధికం అంటూ ఏమీ లేదు. ఆకలి, నిద్ర దగ్గర నుంచి కామ సుఖం వరకూ అన్ని జీవులకు ఒక్కటే అంటూ ప్రబోధించాడు. మానవ జాతి ఐక్యతలోని అంతరార్థాన్ని అప్పుడే ఆవిష్కరించాడు అన్నమయ్య. ఇక వృత్తులు అయ్యాక వివాహమే కదా. ఇలాంటి పాటలు చెప్పుకుంటూ పోతే అన్నమయ్య దగ్గర ఎన్నో.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వీనే పెళ్ళి కూతురు
అంటూ వివాహాన్ని చక్కగా ఆవిష్కరించిన అన్నమయ్య... ఆ సందర్భంలో ఉండే ఎన్నో సంప్రదాయాలను తన కీర్తనల్లో ఆవిష్కరించాడు. చివరకు
శోభనమే శోభనమే వై
భవములు పావనమూర్తికి
అంటూ... పవళింపు సేవను కూడా చక్కగా ఆవిష్కరించాడు. అంతేనా
ఏలే ఏలే మరదలా
వాలేవాలే వరసలా 
అంటూ యుగళగీతాలనూ అల్లారు. భక్తి పారవశ్యంలో రస పారవశ్యాన్ని రంగరించారు. 
మూసిన ముత్యాన కేలే మొరగులు
ఆశల చిత్తాన కేలే అలవోకలు
అంటూ... సరికొత్త లోకంలో విహరింప జేశారు. దర్మార్థ కామమోక్ష ప్రాధాన్యతను ఆవిష్కరించారు. 
పెళ్ళి తర్వాత ఏముంటుంది ఈ సంసార సాగరాన్ని చక్కగా ఈది చివరగా....
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితి
అంటూ... జీవితంలో అలసిపోయి, పరమాత్ముని ఒడిలోనే సేదతీరాడు అన్నమయ్య. చూస్తు పోతే అన్నమయ్య రాసిన సంకీర్తనల్లో భగవంతుని భక్తి మాత్రమే కాదు... ఎలా జీవించాలి అన్న సందేశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 

చాలా మంది అన్నమయ్య కీర్తనల్ని భక్తి కీర్తనలుగా, భజన పాటలుగా మాత్రమే చూస్తుంటారు. తరిచి చూస్తే... అందులో మనిషి చిన్నతనానికి అవసరమైన ఉగ్గు లాంటి ప్రక్రియలు ఉంటాయి. ఎలా జీవించాలో చెప్పే పెద్దల తత్వాలు ఉంటాయి. ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న సమాధానాలు ఉంటాయి. వైద్య శాస్త్రం దగ్గర్నుంచి కామ శాస్త్రం వరకూ ప్రతి ఒక్కటి ఆ కీర్తనల్ల గోచరమౌతూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది. అదే అన్నమయ్య కీర్తనల్లోని గొప్పతనం. సరళమైన భాష వల్ల పండిత పామర రంజకంగానూ ఉంటాయి. పేదలకు, ధనవంతులకూ ఒకటే సందేశాన్ని అందిస్తాయి. అందుకే అన్నమయ్య సాహిత్యం ఏ ఒక్కరి సొత్తో కాదు. తెలుగు వారి ఉమ్మడి ఆస్తి. మరి మాట్లాడితే భారతీయ సంస్కృతికి చుక్కాని. సంసార సాగరాన్ని దాటేందు.. అన్నమయ్య భక్తి సాగరం చక్కని దారి. ఆ భావదారలో తడిస్తే చాలు బతికినంత కాలం జీవితం ధన్యం అవుతుంది. ఈ కట్టె కాలిపోయిన తర్వాత మన జీవితం సార్థకమౌతుంది.

1 comment:

  1. చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

    ReplyDelete