Monday, November 11, 2013

అన్నమయ్య

తెలుగునాట 'జో అచ్యుతానంద జో జో ముకుందా !' అని ఉయ్యాల ఊపుతూ ప్రతీ తల్లీ జో కొడుతుంది. పసివాళ్ళను సైతం పరవశింపచేసే పాటలు రాసిన ఆ మహనీయుడే అన్నమయ్య.

కడప జిల్లా రాజంపేట మండలంలో ఉన్న తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు అన్నమయ్య. తిరుపతి కొండల మీద తిరుపమేత్తుకున్నా పరవాలేదని చిన్నప్పుడే ఇంట్లో నుంచీ పారిపోయాడు. పసి పాపడిగా ఉన్నప్పటి నుంచీ అతడికి పాటలంటే ఇష్టం. తల్లి లక్కమ్మ ఒడిలో మంత్రముగ్ధుని వలె పాటలు వినేవాడు. ఆమెకు తిరుపతి వెంకన్న అంటే అమిత భక్తీ. ఉగ్గుపాలతో నేర్పిన గాంధర్వ గానం అన్నమయ్యకు వంటబట్టింది. చిన్నప్పటి నుంచీ సొంతగా పాటలు కట్టి పాడుకునే వాడు. వేదాలు వల్లించక కూని రాగాలు తీస్తున్న అన్నమయ్యను అంటా చిన్న చూపు చూసేవారు. వదిన గారు అతన్ని రాచిరంపాన పెట్టేది. పశువులకు గడ్డి కోసుకు రమ్మని పంపేది.

ఒకనాడు అన్నమయ్య గడ్డి కోస్తూ ,పాటలు పాడుతూ ,కొడవలితో గడ్డి బదులు తన వేలు కోసుకున్నాడు. నెత్తురు కారింది. బాధతో 'శ్రీహరీ!' అని కేక వేసాడు. తన రక్తంలో లీనమైన కర్తవ్యమేదో అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొడవలి అక్కడే పడేసి, కట్టుబట్టలతో తిరుమలకు తరలి పోయాడు. అనేక ఊళ్లు తిరుగుతూ, గ్రామదేవతలను పూజిస్తూ తరలి పోయాడు. తిరుపతి చేరుకొని, ఏకబిగిన కొండ ఎక్కడం మొదలు పెట్టాడు. చెప్పులతో కొండ ఎక్కితే త్వరగా అలసిపోతానని తెలియదేమో, పెద్ద ఎక్కుడు చేరేసరికి సోమ్మసిల్లాడు. చల్లగాలి వీస్తూ, తుమ్మెదలు తొలచిన రంధ్రాలు పూరిస్తూ వేణుగానం చేస్తుంటే, వెదురు పొద కింద చెమటల బడలికతో ఉన్న అన్నమయ్య నల్లనయ్య లాగే ఉన్నాడట! ఎవ్వరికీ కనబడని ఆకలితో నిద్రించాడు.

అప్పుడొక చల్లని తల్లి వచ్చింది. చెప్పుల కాళ్ళతో కొండ ఎక్కరాదని చెప్పి, ప్రసాదాన్నాలు కడుపు నిండా పెట్టింది. ఆమె అతని పాలిటి అలమేలుమంగ. అన్నమయ్య గొంతు విప్పి ఆశువుగా ఒక శతకం చెప్పాడు. అదే వెంకటేశ్వర శతకం.

కడుపు నిండా అన్నం పెట్టిన తల్లిని అలమేలుమంగాగా భావించి, తనకు దేవుడిని చూపించమని ఇలా వేడుకున్నాడు.

ఓ లలితాంగీ యో కలికి యో యెలజవ్వని యో వధూటి యో 
గోల! మెరుంగుజూపు కనుగొనల నోయల మేలుమంగ మ 
మ్మేలిన తల్లి నీ విభున కించుక దెస జూపుమంచు నీ 
పాలికి జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వెంకటేశ్వరా!

ఈ శతకం అలమేలుమంగపై చెప్పినదే అని ఈ పద్యం వల్ల మనకు తెలుస్తున్నది...

అమ్మకు తాళ్ళపాక ఘను డన్నడు పద్యశతకంబు చెప్పెగో 
కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకున్ 
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్ 
సమ్మెడ మంది వర్దిలను జవ్వనలీలలు వెంకటేశ్వరా!

 
అన్నమయ్య కన్నుల కరువు తీరా స్వామిని సేవించాడు. అక్కడ నవకీర్తనలు చేసాడు. మర్నాడు ఆకాశగంగలో స్నానం చేసి, కట్టుచీర తీసి ఉతికి ఆరేసి, అది ఎందేలోగా 'కుతుకంబు సమకూర శతకంబు' ఒకటి చెప్పాడు. ఆ తరువాత దేవాలయం వద్దకు వస్తే తలుపులు మూసి ఉన్నాయి. అన్నమయ్య ఉండబట్టలేక, వేంకటేశ్వరుని మీద మరొక శతకం చెప్పాడు. నూరు పద్యాలు పూర్తీ కాగానే తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ నల్లని చిన్నవానికి వైష్ణవ దీక్ష ఇచ్చాడు వైష్ణవయతి. 



తన కుమారుడిని వెతుక్కుంటూ తిరుపతి వచ్చి, అన్నమయ్యను తనతో తీసుకువెళ్ళింది తల్లి. తిరుమలమ్మను, అక్కలమ్మను ఇచ్చి వివాహం జరిపించింది. తరువాత అన్నమయ్య అహోబిలం వెళ్లి, అక్కడి నరసింహునిపై ఎన్నో కీర్తనలు వ్రాసాడు. నారసింహావతార ఘట్టాన్ని వివరిస్తూ పదకొండు చరణాల పాటను వ్రాసాడు. అహోబిల నరసింహునిపై రచించిన ఒక  పాటను ఇప్పుడు చూద్దాం...


నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము

తాత్పర్యము
అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న నరసింహ స్వామిలో -తొమ్మిదిమంది నరసింహ మూర్తులను దర్శిస్తూ అన్నమయ్య పాడిన గీతమిది:

ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ , తొమ్మిది రూపాలు ధరించిన , నరసింహ స్వామి మన కళ్ల ఎదురుగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామి. భక్తితో చూస్తే ఈయనలో తొమ్మిది రూపాలు కనిపిస్తాయి.

1. అహోబిలం కొండమీద ఒక గుహలో అరుగు మీద పది భుజాలతో ఉన్న వీర నరసింహస్వామి ఈ కదిరి నరసింహ స్వామి. పైన అహోబిలంలో నవ్వుతున్న జ్వాలా నరసింహ స్వామి ఇతడే. చిన్న అహోబిలపు కొండపై ఉన్న యోగానంద నరసింహ స్వామి ఇతడే. వేదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఇతడే.

2. చిన్న అహోబిలానికి దగ్గరలో భార్గవ తీర్థం అనే క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి ఇతడే. పెద్ద అహోబిలానికి నాలుగు మైళ్ల దూరంలో బీభత్స మూర్తిగా వెలసిన మట్టెమళ్ల నరసింహ స్వామి ఇతడే. కానుగ చెట్టు కింద ఉన్న కానుగ నరసింహ స్వామి( వరాహ లక్ష్మీ నరసింహుడు )ఈ కదిరి నరసింహ స్వామి.

3. విజృంభిస్తూ ఎగువ అహోబిలంలో నరసింహ స్వామికి, ఉగ్ర స్తంభానికి మధ్యలో వెలసిన ప్రహ్లాద నరసింహస్వామి ఇతడే. కదిరిలో ఉన్న ఈ నరసింహ స్వామియే వేంకటాద్రి మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి.

( ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం నుంచీ... పై గీతం, భావం ఒక బ్లాగ్ నుంచీ సేకరణ - పద్మిని భావరాజు)



No comments:

Post a Comment