Saturday, September 8, 2012

తాతయ్య కబుర్లు


గొబ్బిళ్ళ పద్యం 




"సుబ్బీ! అదిఇది గొణగక గొబ్బున బొబ్బట్లు మింగి గొరగొర రా రా!

గొబ్బండుగ మన కనులకు
గొబ్బిళ్ళకు బంతిపూల గొడుగులు తోడుగన్."

అది సంక్రాంతి పండుగ. ఎక్కడ చూసినా సంబరాలే! అంతకు ముందు రొజు భోగి నాడు వేసిన భోగి మంటలు ఇంకా చల్లారలేదు. సంజ చీకట్లు

 గోరగోరా ముసురుకుంటున్నాయి. యే వీధిలో చూసినా రంగు రంగుల ముగ్గులూ, గొబ్బిళ్ళ పాటలూ కళ్ళకీ-- చెవులకీ విందు చేస్తున్నాయి.

గొంగళి కప్పుకుని గొంతుక్కూర్చుని తాతయ్య ఆ పాటలు వింటూ, ఆ ముగ్గులు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ నవ్వులు బామ్మ

హృదయానికి ముత్యాల గొలుసులు. వాళ్ళ మనవలు కాంతి, సుబ్బి... కాంతి గొబ్బెమ్మలు పెట్టుకునే ప్రయత్నంలో ఉంది. పసుపు, కుంకుమ,

ఆవుపేడ, బంతి పూలు, అటుకులు- బెల్లం, అగరొత్తులు అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో సుబ్బిగాడు, తను

వచ్చేవరకు గొబ్బిళ్ళు పెట్టడానికి వీల్లేదని చెప్పి, గొట్టం పాంటు సవరించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాడు రాకుండా గొబ్బిళ్ళు పెడితే

గొడవ చేస్తాడు. గొబ్బిళ్ళు కాళ్ళతో తొక్కేస్తాడు. వాడు అన్నింటికీ అక్కతో పోటి పడతాడు. వాడివి అన్నీ గొంతెమ్మ కోరికలే! అసలు వాడు

ఆడపిల్లగా పుడితే యే గొడవా లేకపోను. పాపం కాంతి వాడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో వాడు ఏం చేస్తున్నాడో అని

ఇంట్లోకి వెళ్లి వస్తోంది. వాడు నేతిలో ముంచుకుని తాపీగా బొబ్బట్లు తింటున్నాడు. వాడి తిండి అంత తొందరగా పూర్తవదు. తనని చూసి ఏదో

గొనుగుతున్నాడు. ఓ పక్క గొంతు దిగని బొబ్బట్టు ముక్కతో తంటాలు పడుతూ...

కాంతి స్నేహితురాండ్రు తొందర చేస్తున్నారు. కాంతితో కలిసి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర గొబ్బిళ్ళు పెట్టుకోవాలి. ఇదంతా గమనించిన

తాతయ్య గొంతెత్తి సుబ్బిగాడ్ని పిలిచాడు.

" గొబ్బిళ్ళకు బంతి పూలు గొడుగుల్లా గుచ్చిన దృశ్యం మన కళ్ళకు గొప్ప పండుగ. కడుపుకు తినడమే కాదురా సుబ్బీ..ఇంకేమి గోనక్కుండా

ఆ బొబ్బట్లు గొబ్బున మింగి గోరగోరా రారా!"

అరిటాకులో సగం మిగిలిన బొబ్బట్టు ఊరిస్తోంది. నోట్లో ముక్క ఇంకా గొంతు దిగలేదు. " తాతయ్య! నేను తరువాత చుస్తానులే! అక్కని

గొబ్బిళ్ళు పెట్టేసుకోమను.."

సుబ్బిగాడి తిండి యావ చూసి తాతయ్య గొల్లున నవ్వేసాడు. కాంతి స్నేహితురాళ్ళతో కలిసి గొబ్బిళ్ళు పెట్టుకుంది.

( శ్రీ ఎర్రాప్రగడ రామమూర్తి గారి 'తాతయ్య కబుర్లు ' పుస్తకం నుండి...)

No comments:

Post a Comment