Monday, March 24, 2014

పార్కుకు వెళదాం రండి...

రండి, అలా పార్క్ దాకా వెళ్లి వద్దాం. అందమైన పార్కులో ...

కంటికింపైన పువ్వుల్నేమి చూస్తారు? కల్మషం లేని నవ్వుల్ని చూడండి.

జారుడుబండ - 
* ఝాం అంటూ జారేస్తే ఏముంది ? తాపీగా జారితే... అనుకుంటాడు ఓ పిల్లాడు.
* పై నుంచి క్రిందకు ఎందుకు జారాలి, క్రింది నుంచి పైకేక్కుతా... అంటూ ఎక్కేస్తుంది ఓ పాప.
* మెట్లెక్కి, జారుడుబండ గూడు నుంచి ప్రపంచాన్ని జయించిన ఉత్సాహంతో, అమ్మను తొంగి చూసి, జారతాడు ఓ బాబు. అమ్మ క్రింద చేతులు పెట్టి, వాడిని పడిపోకుండా పొదివి పట్టుకుని, ముద్దు పెడుతుంది.
* జారుడుబండ గూడు లోనే దాక్కుని, తన స్నేహితురాలితో, దోబూచులాడుతుంది ఓ పాప.
* మొదటి సారి చిట్టి తల్లిని జారుడుబండ ఎక్కిస్తుంటే, అది బెదిరి ఏడుస్తోంది. నాలుగైదు సార్లు పట్టుకుని జారించాకా, ఇంకా కావాలంటూ మారాం చేస్తోంది.

ఉయ్యాల -
* ఒక్కరే కూర్చుని ఊగితే సరదా ఏముంది ? నిల్చుని ఉంటే, స్నేహితుడు ఊపాలి, అంటాడో బాబు.
* ఒకళ్ళ ఒళ్లో ఒకరు కూర్చున్న ముగ్గురు పాపలు, పచ్చని పంట చేల మీద జతగా ఎగిరే తెల్ల కొంగల్లా ఎగురుతూ నవ్వుతున్నారు.

చిన్ని రంగుల రాట్నం -
* పాపం, ఎన్నాళ్లని అది మనం కూర్చుంటే మనని తిప్పుతుంది ? దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు తిప్పి , ఋణం తీర్చుకుందాం అనుకుంటాడో బుజ్జాయి.
* అలా బాగా తిప్పాకా, చప్పున ఎక్కి కూర్చుంటాడు. వెన్నెల ఆరబోసినట్టు నవ్వుతాడు.
* అటే ఎందుకు తిప్పాలి ? అందుకే, ఇటు తిప్పుతాడు మరో కొంటె కుర్రాడు. అలా అనుకున్నది చేస్తూ, సంబరపడతాడు.



సీ -సా - 
* చిట్టి బాబును కూర్చో పెట్టి, మరోవైపు పైకి, క్రిందికి చేత్తో ఒత్తి, పిల్లాడి నవ్వుల్ని చూసి, ప్రపంచం మరచిపోతున్నాడు తండ్రి.
* అటువైపు కూర్చున్న భారీ శాల్తీ ని చూసి, నేనిలా క్రిందే పడి ఉండాల్సిందేనా, అన్నట్టు బిక్క మొహం వేసి చూస్తున్నాడు ఓ బుజ్జాయి.

స్ప్రింగ్ ఏనుగు బొమ్మ -
* ఎత్తెత్తి కొడుతుందా ? దీని అంతు చూడాలి అనుకుని, తన బలాన్ని అంతా వాడి వంచేస్తాడు ఓ బాబు. మళ్ళీ పైకి లేస్తాడు. 
* ఆ ప్రక్కనే, ఏనుగు తనకూ కావాలని మొరాయిస్తాడు మరో బాబు.


* ఇసుకలో గవ్వలు, రంగు రాళ్ళు ఏరుతున్నాడు ఓ బాబు. రాయి దొరికినప్పుడల్లా, గెంతులేస్తూ తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తున్నాడు. 
* తన చెప్పుల్ని ఇసుకలో కూరి, మళ్ళీ బయటకు తీసి చూసుకుంటోంది ఓ పాప. మళ్ళీ విదిలించి శుభ్రం చేసి వేసుకుని, మళ్ళీ దాచేస్తుంది.
* ప్రతీ వాళ్ళు తమ వంతు కోసం పోటీలు పడి పరుగులు, అలసిన పిల్లలు ఐస్ పుల్ల కొనుక్కుని  వెనుదిరగడాలు.

వీటన్నిటి పరిణామం.... చిట్టి మనసు నిండా తృప్తి, బోలెడంత ఆకలి, కంటి నిండా నిద్ర.

అందుకే మనసు ఒక్కోసారి పసిపాపై పారాడమంటుంది...
కొత్తవి చూసి బెదరద్దు, అలవాటైతే అవే ముద్దు అంటుంది.
పైకే కాదు, క్రిందికీ వెళ్ళమంటుంది.
ముందుకే కాదు, వెనక్కీ వెళ్లి చూడమంటుంది...
అటు నుంచి ఇటే కాదు, ఇటు నుంచి అటు కూడా తిరుగు అంటుంది...
పడినా, లేచినా, ఆడినా, ఓడినా, గాయపడినా.... అలుపెరుగని ప్రయత్నం చేసి, అనుకున్నది పొంది, ఆనందించమంటుంది. పసిపాపల పార్కు స్పూర్తి, పెద్దలకు కావాలి ఆదర్శం!





No comments:

Post a Comment