Monday, September 29, 2014

కదంబం 2

(అచ్చంగా తెలుగు ఫేస్ బుక్ బృందంలో పలువురు అందించిన మంచి పోస్ట్ లు ....)

V V S Sharma
దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ స్సనాతనః 
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ 

మానవ దేహము, నివాసగృహము, దేవాలయము, బ్రహ్మాండ నిర్మాణము - ఛందస్సులు, వేదములలోని విరాట్ పురుషుడు, వాస్తుపురుషుడు, శరీరములోని అంగుష్ఠమాత్ర పురుషుడు - ఇవన్నీ ఒకే తత్త్వము ఆధారముగా సంకల్పించి సృష్టింపబడినవి. వాస్తు, జ్యోతిషము,నిగమాగమములు, చందస్సు, వేద మంత్రములు వీని అంతర్గత సంబంధమే సనాతన ధర్మము.

________________________________________________________________________


శివ ప్రసాద్ పెనుముచు (చిన్న కధ)

ఒక యువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచాడు. అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ... తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు..
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలా అంటారు .. ప్రాణం లేని బండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనా వచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..అప్పుడు ఎవరు ముందుకు రారు..
కాసేపటి తర్వాత ఒక ముసలి అతను వచ్చి బండి లో కూర్చుంటాడు ... అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా? ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటిదగ్గర చెప్పి వచ్చావ" అని ఎగతాళి చేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి "ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. 
ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు.. మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....అవమానాలని కూడా భరిస్తారు...మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.. 

___________________________________________________________________________________________

సేకరణ :కొల్లూరు విజయా శర్మ 

ప్రేమని గురించి ఉత్ప్రేక్షలు పేనుతుంటే 
గుండెని కోకిల తన్నుకుపోయింది.
గజల్ గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వం లో తడిసిపోయింది.

గుంటూరు శేషేంద్ర శర్మ.

__________________________________________________________________________

దేవులపల్లి కృష్ణశాస్త్రి 'అన్వేషణం నుండి...

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
బడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనల పైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా చిన్ని సొనగ
పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు
కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద.

_________________________________________________________________________

ఈ సుభాషితం బాగుంది... చూడండి...
గుణవంతమైన వస్తువు సాంగత్యం వల్ల, అల్ప వస్తువుకు కూడా గౌరవం ప్రాప్తిస్తుంది. పువ్వులతో పొత్తు కుదరడం వల్లనే కదా, నిస్సారమైన దారాన్ని తలపై ధరిస్తున్నారు!

_________________________________________________________________________

'ముక్త పదగ్రస్తం ' అనే అలంకారాన్ని గురించి విన్నారా?
ముందు విడిచిన పదాన్నే (ముక్త పదం) తిరిగి గ్రహిస్తూ పోవడం దీని లక్షణం.
( ఒక వాక్యం ఏ పదం తో అంతం అవుతుందో అదే పదం రెండో వాక్యానికి మొదటి పదం కావటం ముక్త పద గ్రస్త అలంకారం )

ఉదా. 
సుదతీ నూతన మదనా !
మదనాగ తురంగ పూర్ణ మణి మయ సదనా !
సదనా మయ గజరదనా !
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా !

ముక్త పదగ్రస్తం అనే అలంకారం ఆధారం గా తెలుగు సినిమా సాహిత్యం లో ప్రయోగించబడిన సినీ పాట 'సుమంగళి ' చిత్రంలో కనులు కనులతో కలబడితే... ఇంకా మీకు ఏవైనా పద్యాలు కాని, పాటలు కాని తెలిస్తే చెప్పరూ!

జవాబులు :
గోదారి గట్టుంది... గట్టుమీన చెట్టుంది... అనే పాట - దుర్గ చెరువు 

Sridhar Hanumanthkar1:21pm Mar 11
కలనా, వ్రాయం గలనా
గలనాగము దాల్చువాని గాంచంగలిగే,
కలిగే ప్రతి మృదుచలనము
చలనము నొసగెడు హరుడిని చకితుని జేయన్.

తలచీ వ్రాయం దలచీ
దల చీరము దాల్చువాని *ధారణ దలచీ
దలచీకటి పో దలచీ
దలచీరము వంటివైన తండపు పదముల్.

Courtesy: https://groups.yahoo.com/neo/groups/telusa/conversations/topics/2380?xm=1m%3Dptidx%3D1
by: Madhava K Turumella

Naresh Kandula1:32pm Mar 11
ముక్తపదగ్రస్త్యము తో వున్న ఒక సూపర్హిట్ సినిమా పాట..

మాటరాని మౌనమిదీ
మౌనవీణగానమిదీ
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగగుండె రాగమిదీ...

అందరాని కొమ్మ ఇదీ
కొమ్మ చాటు అందమిదీ..

https://www.youtube.com/watch?v=gskC2HBfRuA

Krishna Mohan Mocherla1:39pm Mar 11
రేపంటి రూపం కంటి పూవంటి తూపులవంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ

Sridhar Hanumanthkar4:44pm Mar 11
లేమా దనుజుల గెలవగ లేమా అని ఇంకో పద్యం చదివినట్లు గుర్తు.

Naga Babu5:36pm Mar 11
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి మరులే...
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువూ...ఊ..ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...

అల్లరి ఏదో చేసితినీ చల్లగ ఎదనే దోచితివీ
అల్లరి ఏదో చేసితినీ చల్లగ ఎదనే దోచితివీ
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం
నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం

కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి మరులే...
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువూ...ఊ..ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే...

Sivarama Krishna Rao Vankayala6:24pm Mar 11
ఒక సారి ఒక సభలో విశ్వనాథ వారూ, తెన్నేటి విశ్వనాథం గారూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారట. అప్పుడు విశ్వనాథ వారు తెన్నేటి వారితో, 'మనిద్దరి పేర్లూ కలిపితే ఒక మంచి ముక్తపదగ్రస్తం అవుతుతుంది కదూ' అన్నారుట!







Sunday, September 28, 2014

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు...

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు అన్న సామెత వినే ఉంటారు. దీనికి అర్ధం తెలుసా ?

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు - మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ)తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.కుండకు ప్రక్కన రంధ్రంతో ఇంకా బలహీనమౌతుంది. మంగలంలో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే.బలవంతుడు బలహీనుడి మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ సామెత వాడతారు.





గుంటూరు శేషేంద్రశర్మ రచన...

" నీ బాణానికి గురి ఎవడో శత్రువు, నా బాణానికి గురి ఏదో హృదయం;
గాలి వాలు తెలిసి ఎగిరే పక్షివి నీవు ,
గాలి కూడ భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను"

మాంగనా మాంగన్ నిక్కా

మాంగనా మాంగన్ నిక్కా

మాంగనా మాంగన్ నిక్కా ... ఏది అడగాలనుకున్నా దైవాన్ని అడుగు..

Rajendra Prasad Yalavarthy గారు ఈ పోస్ట్ మీ కోసం...

maaganaa maagan neekaa har jas gur thae maaganaa ||4||
Begging, begging - it is noble to beg for the Lord's Praise from the Guru. ||4||
( This Shabad is by Guru Arjan Dev Ji in Raag Maaroo on Pannaa 1018)

సర్దార్ లు ఎందుకు భిక్ష అడగరు... అని మునుపు మీరు వెలిబుచ్చిన సందేహం... ఇదే ఇవాళ ఒక సింగ్ గారు మా ఇంటికి వస్తే అడిగాను. ఆయన "మాంగనా మాంగన్ నిక్కా..." అంటూ మొదలు పెట్టి ఈ విధంగా చెప్పారు.

మనిషి స్వతంత్రుడు కాదు. అన్నిటికీ ఇతరులపై ఆధారపడతాడు. అది కావాలి, ఇది కావాలి అని ఇతరులను అడుగుతూ ఉంటాడు. అటువంటప్పుడు మనిషి ఆసరా అనేది అంత నమ్మశక్యం కాదు.

ఉదాహరణకు మీకు ఎంత ఆప్తులైనా సరే... మీరు ఒక రోజు అడిగితే భోజనం పెడతారు, 2,3,4 రోజులు... తర్వాత... మెడపట్టి బయటకు గెంటుతారు... వాళ్ళే వేరే వాళ్ళ వద్ద కొన్ని అడిగి తెస్తారు. అటువంటప్పుడు మనిషి పై ఆధారపడి, అడుక్కుని ఎందుకు బ్రతుకుతావు ?

నీకు ఊపిరి పోసిన వాడిని, నీలో చైతన్యమై నిలిచిన వాడిని, నీ ఉనికికి, నీ చుట్టూ ఉన్న వస్తువులకు అన్నింటికీ ఆధారభూతమైన పరమాత్మని... అడుగు. మాటిమాటికీ కాదు ఒకే సారి... దైవానుగ్రహం పొందడం ఎలాగో, దైవాన్ని కీర్తించడం ఎలాగో... నీ గురువును అడుగు. ఆ కీర్తనల ద్వారా దైవమే వచ్చి, నీ వద్ద కూర్చుంటారు. దైవమే నీ ఇంట వెలసినప్పుడు... ఇక నువ్వు అడగాల్సింది ఏమీ ఉండదు. 

అందుకే గురు గ్రంధ సాహిబ్ ప్రకారం సిక్కులు ,సాటి మనుషుల్ని అడుక్కోవడం నిషేధించారు. అడగాలనుకుంటే... దైవాన్నే అడుగు... ఇదీ ఆయన చెప్పిన సారాంశం !


Monday, May 26, 2014

ఇచ్చుటలో ఉన్న హాయి...

ఇచ్చుటలో ఉన్న హాయి...
ఆ మధ్యన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు.... ఈ మాటలు న మనోపధంలో ముద్రించుకు పోయాయి...
"చూడండి... మీరు యెంత కష్టపడి, ఎన్ని కోట్లు సంపాదించి, పిల్లలకు ఇచ్చినా... వాళ్ళు ఏమంటారంటే...
మా నాన్న ఉన్నాడు చూసారా? దొంగ వెధవ... అదిగో ఆ ఎదురుగుండా ఉన్న భవంతి ఉంది కదా, అది నాకు ఇవ్వకుండా పోయాడు, చచ్చినాడు.(అంతే కాని, ఇచ్చిన వాటి గురించి చెప్పాడట...)
మా అమ్మ ఉందే ! ఎంత చాకిరీ చేసాను, చివర్లో కాసులపేరు కోడలికి ఇచ్చి పోయింది..."
మనిషికి తృప్తి ఎక్కడండి ? ఎంత ఇచ్చినా, ఇచ్చింది గుర్తుండదు. ఇవ్వని దాన్నే చెప్తారు. అందుకే, నేనైతే నా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవట్లేదు. వచ్చిననంత వస్తుంది. ఉన్నంతలో విద్యాబుద్ధులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నేను ముప్ఫై ఏళ్ల నుంచే తీర్థ యాత్రలు చేస్తున్నాను. అదనంగా వచ్చిన సొమ్మంతా దానధర్మాలకు వాడేస్తాను. పిల్లలకు అతిగా ఆస్థులు ఇవ్వడం అంటే, వాళ్ళను కష్టం తెలియకుండా ఇంక్యుబేటర్ కోళ్ళు పంచినట్లు పెంచడమే ! ఈ విధానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. మీకు నిజంగా పిల్లలపై ప్రేమే ఉంటే, వాళ్లకు చదువుసంధ్యలతో పాటు కాస్తంత ఆస్తినే ఇవ్వండి.
వాళ్లకు బెంజి తెలియాలి... గంజి తెలియాలి. లోకం చూడాలి, అనుభవం పెంచుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. ఇక ఆస్థి తక్కువ ఇస్తే, వాళ్లకు అనుకోని అవసరాలు వస్తే... అంటారా ? నేను ఈ రోజున చేసిన దానధర్మాలు వాళ్ళను అవసరంలో ఆదుకోకపోవు. దైవానుగ్రహం ఉన్న వాళ్లకు జీవితంలో డోకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అతిగా ఆస్థులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టకండి ..."
నేనలా ఆయన చెప్తుంటే చూస్తూ ఉండిపోయాను. ఎంత చక్కగా చెప్పారు... నిజంగా 'వసుధైక కుటుంబకం ...' అన్న వారి సూత్రం అంతా పాటించగలిగితే, ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉండవు కదా !

Monday, March 24, 2014

శతక పద్యాలు

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు అందించిన శతక పద్యాలు

వడ్డాది సత్యనారాయణ మూర్తి 

భాస్కర శతకము

అదర మింత లేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికిన్
భేదముచేయుటన్ దనదుపేర్మికిఁ గీడగు మూలమె ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనజుండు గుణాడ్యుఁడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా.

లోకమున తాను బలముగలవాఁడని గర్వించి సాదుజనుల కెగ్గు చేసినవాఁడు తప్పక నదించును.గుణనిది యగు ప్రహ్లాదకుమారుని భాదపెట్టి హిరణ్యకశిపుడు చావలేదా?

దాశరథీ శతకము
..................

కనక విశాలచేల,భవకానన శాతకుఠారధార,స
జ్జన పరిపాలశీల,దివిజస్తుత సద్గుణ కాండ,కాండ సం
జనిత పరాక్రమ క్రమ విదారద,శారద కంద కుంద చం
దన ఘనసార సారయశ,దాశరథీ కరుణా పయోనిదీ.

స్వర్ణమయము,విశాలమునైన వస్త్రము గలవాఁడా,సంసారారణ్యమునకు వాఁడియైన గొడ్డటివాదర యైనవాఁడా, సుజన రక్షణ స్వభావముగలవాఁడా,దేవతలచేనుతింపఁబడు సుగుణ సముదాయము గలవాఁడా,బాణ పరాక్రమమున నైపుణ్యము 
గలవాఁడా,శరత్కాలమేఘము,మొల్లలు,మంచిగందము,కర్పూరము అనువానివలెఁ దెల్లని కీర్తి గలవాఁడా, రామా,దయాసముద్రా!

భర్తృహరి సుభాషితాలు
తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!

భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.

శ్రీ మనోహర! సురార్చిత సింధు గంభీర!
భక్తవత్సల! కోటి భానుతేజ! 
కంజనేత్ర! హిరణ్యకశిపునాశక! శూర! 
సాధురక్షణ! శంఖ చక్రహస్త! 
ప్రహ్లాదవరద!పాపధ్వంస!సర్వేశ! 
క్షీరసాగరశయన! కృష్ణవర్ణ! 
పక్షివాహన! లసద్భ్రమరకుంతలజాల! 
పల్లవారుణపాద పద్మయుగళ!

చారు శ్రీచందనాగరు చర్చితాంగ! 
కుందకుట్మలదంత!వైకుంఠధామ! 
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస! 
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ లక్ష్మీపతీ!దేవతలందరిచే పూజలందుకొనువాడా!సముద్రములాంటి గంభీర స్వభావుడా!భక్తవత్సలా!కోటిసూర్య సమప్రభా!ఓ కమలాక్షా!హిరణ్యకశిపుడనే రాక్షసుని వధించిన వీరాధివీరా! అవక్రపరాక్రమవంతుడా! సాధురక్షకా! చక్రగదాధరా! ప్రహ్లాదునికి వరములిచ్చి కాపాడినవాడా! మా పాపములను బోగొట్టువాడా! ప్రపంచాధిపతీ! క్షీర సముద్రశయనా! కృష్ణవర్ణా! గరుత్మంతుడు వాహనముగా గలవాడా!తుమ్మెదల్లాంటి తల వెండ్రుకలు కల్గినవాడా! లేత ఎరుపు పాదపద్మములుగలవాడా! ఓ వైకుంఠవాసీ! ఆభరణములచే నొప్పువాడా! దుష్టసంహారా! పాపములు దరిచేరనీయనీ వాడా! ధర్మపురవాసీ! ఓ నరసింహస్వామీ! నీ కిదే నా నమస్కారము.

చిత్తసుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని, 
పుడమిలో జనుల మొప్పులకుఁగాదు; 
జన్మపావనతకై స్మరణజేసెదఁగాని, 
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు; 
ముక్తికోసము నేను మ్రొక్కివేఁడెదఁగాని, 
దండిభాగ్యము నిమిత్తంబుగాదు;
నిన్నుఁబొగడ విద్య నేర్చితినేకాని,
కుక్షినిండెడు కూటి కొఱకుఁగాదు;

పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ దుష్టసంహారా!నరశింహా!మనఃస్పూర్తిగా నిన్నే సేవింతును గాని దుష్టజనుల మొప్పునకు కాదు.నాజన్మ సాఫల్యతకై నిన్నే స్మరింతును గాని నా సాటివారిలో అనవసర గొప్పతనమునకు గాదు.ముక్తికోసమే నిన్ను మ్రొక్కి వేడుకొంటున్నాను గాని అనిత్యమైన భోగభాగ్యాదుల కొఱకు గాదు.నిన్ను ప్రస్తుతించుటకే విద్యనేర్చితినిగాని నశ్వరమైన శరీరము కొఱకుగాదు .ముక్తి కొఱకు నే
పాటుపడుతున్నాను గాని కీర్తి కొఱకుగాదు.ఓ నీలమేఘశ్యామా! కీర్తిని కోరుటలేదు. ముక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకొంటున్నాను.




పద్యాల అంత్యాక్షరి

మా 'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడాము. ఇందులో ఎంతో మంది పిన్నలూ, పెద్దలూ ఆసక్తిగా పాల్గొన్నారు. ఆ పద్యాలన్నీ మీ కోసం...

సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడదాం...

మొదట నాకు నచ్చిన ఒక పద్యంతో మొదలు పెడతాను. ఆ పద్యం చివరి పదంతో, మీరు మరొక శతక పద్యం చెప్పాలి... వీలు కాకుంటే, వేరే ఏ పద్యమైనా సరే. వారు చెప్పిన పద్యం చివరి అక్షరంతో మరొకరు మరొక పద్యం చెప్పాలి. ఇంత మంది పెద్దలూ, పిల్లలూ ఉన్నారు. చూద్దాం, ఎన్ని పద్యాలు గుర్తుకు వస్తాయో...

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
మనకు తగని ప్రదేశంలో, మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు ఎలాంటి భంగమూ కలుగదు.

కొండ ఎంత పెద్దదైననూ అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా..! అయినంత మాత్రాన కొండ చిన్నది అయిపోదు. అలాగే... మన గొప్పతనం, మనమే చెప్పుకోనంత మాత్రాన తగ్గిపోదని పై పద్యం యొక్క భావం.

మరి పెద్దలూ, పిన్నలూ మొదలుపెట్టండి...

పవిత్రా కాశ్యప్

మృగ మదంబు జూడ మీద నల్లగనుండు
బరిడవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ..!

అర్ధం : ఓ వేమా.. కస్తూరి అనే సువాసనద్రవ్యుం రంగు నల్లగా కానీ వాసన మాత్రం చాలబాగుంటుంది. అలాగే మంచి మనుషుల రూపం ఏవిధంగావున్నా మనసు మాత్రం ఎంతో చక్కగా ఉంటుంది.

సంధ్యా రాణి 

మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!

 ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

దుర్గ భమిడిపాటి (అదే సమయంలో )

ముక్కోటి దేవులందురు 
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించేనయా 
చక్కనిది ఆవకాయన 
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్

సంధ్యా రాణి గారి పద్యం చివర 'ర' కు పద్యం - కళ్యాణ్ కృష్ణ కుమార్ 

సీ . "రండిరా యిదె! కాల్చుకోండిరా" యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి!
పట్టింపువచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి!!
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు!!!
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞము నందు
హోమమ్మొనర్చిన సోమయాజి!!

అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్చిన ఏకైక నాయకుండు!
మన "ప్రకాశము" మన మహోమాత్యమౌళి!!
సరిసములు లేని "ఆంధ్రకేశరి" యతండు!!!!

-కరుణశ్రీ

                                            Kalyan Krishna Kumar's photo.

దుర్గ గారి పద్యానికి 'న ' తో వెంకట కోటేశ్వర రావు గారు అందించిన పద్యం 


                                Venkata Koteswara Rao B's photo.

సూర్యప్రభ ముత్యాల 

మేడి పండు చూడ మేలిమై ఉండు 

పొట్ట విప్పి చూడ పురుగులుండు 

పిరికి వాని మదిని బింకమీలాగురా 

విశ్వదాభిరామ వినుర వేమా!

మల్యాల పల్లం రాజు గారు 

వెన్నెముక లేని కవులకు
పెన్నెరులు, కురుల్,పగటివేషాలు కన్
సన్నలలంకారములట
విన్నావా ముళ్లపూడి వెంకటరమణా.

(శ్రీ అబ్బూరివారు - విన్నావా ముళ్లపూడి వెంకటరమణా అని ఓ శతకం రాశారట. దానిలో పద్యమిది..బాపూ రమణీయం కోతి కొమ్మచ్చి నుంచి...) గిరజాలు..వేషాలు ...ఫోజుల కవుల గురించి..

ఇక్కడ పడిందండీ అందరికీ బ్రేక్... 'ణ ' తో పద్యమే! కమల గారి సందేహం... సమాధానం చూడండి...
ణ తో మాటలే రావట్లేదండి అసలు... ణ తో ఎవరినా చెప్పేవరకు న తో చెప్పొచ్చా? లేక ఫై పద్యంలో ఆఖరి పదం లో ఆఖరి అక్షరానికి ముందు అక్షరం అయిన 'మ' తో చెప్పోచ్చ? 

ణ తో ఒక మాట దొరికిన్దండోయి... 'ణిసిధాత్వర్థము' అని ఒక మాట ఒక నిఘంటువు లో కనిపించింది... అయితే పద్యాలు మటుకు రావడం లేదు ఏమీ...

నిజానికి పల్లం రాజు గారు 'మా' తో వ్రాసే బదులు 'వ' తో వ్రాసారు కదా, అందుకని, ఇక అంతా కలిసి మళ్ళీ 'మ' తో పద్యాలు పాడేసుకున్నాము .

గోమతి రవి 

మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.

నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును దాపస మందార నాకు దయసేయగదే.


దీపము కలిగిన ఇంటను 
దాపున శ్రీలక్ష్మి జేరి ధనములనిచ్చున్ 
కాపడుచుండు మనుజుల 
పాపమ్ములు పారద్రోలి, పాలించుసుమీ!

గోమతి గారి ధాటికి 'ఆయ్... అంతా మీరే ఆడేసుకుంటారా?' అంటూ ఆవిడని అడిగారు ఒకరు. 
ఆలస్యంగా వచ్చినందుకు అందుకోవాలిగా మీతొ...:)... ఇదండీ ఆవిడ సమాధానం . మళ్ళీ ఆట కొనసాగింది...

కమల ఈవని 

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ

మనమాడిన మాటకు ప్రాణము సత్యము. కోటకు వీరభటుల సైన్యమే ప్రాణము. అదిలేని కోట శత్రువులకు సులభముగా వసమగును... ఆడవారికి శీలమే ప్రాణము. వ్రాసిన కాగితమునకు సంతకము లేనిచో విలువ లేదు... సంతకము చేసినచో దానికి ప్రాణము వచ్చి యెంత పనిఅయిన చక్కబెట్టును...

గోమతి రవి 

తొలుతనవిఘ్నమనుచు ఢూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య ఏకదంతమా నిను ప్రార్ధన చేసెద నా 
వెలుపటి ఘంటమున వ్రాక్కున నెప్పుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేదెద దేవ గణాధిప లోకనాయకా !

ఇటువంటి ఆటలు ఆడితే, విజ్ఞానం, వినోదం రెండూనూ... ఏమంటారు?







పార్కుకు వెళదాం రండి...

రండి, అలా పార్క్ దాకా వెళ్లి వద్దాం. అందమైన పార్కులో ...

కంటికింపైన పువ్వుల్నేమి చూస్తారు? కల్మషం లేని నవ్వుల్ని చూడండి.

జారుడుబండ - 
* ఝాం అంటూ జారేస్తే ఏముంది ? తాపీగా జారితే... అనుకుంటాడు ఓ పిల్లాడు.
* పై నుంచి క్రిందకు ఎందుకు జారాలి, క్రింది నుంచి పైకేక్కుతా... అంటూ ఎక్కేస్తుంది ఓ పాప.
* మెట్లెక్కి, జారుడుబండ గూడు నుంచి ప్రపంచాన్ని జయించిన ఉత్సాహంతో, అమ్మను తొంగి చూసి, జారతాడు ఓ బాబు. అమ్మ క్రింద చేతులు పెట్టి, వాడిని పడిపోకుండా పొదివి పట్టుకుని, ముద్దు పెడుతుంది.
* జారుడుబండ గూడు లోనే దాక్కుని, తన స్నేహితురాలితో, దోబూచులాడుతుంది ఓ పాప.
* మొదటి సారి చిట్టి తల్లిని జారుడుబండ ఎక్కిస్తుంటే, అది బెదిరి ఏడుస్తోంది. నాలుగైదు సార్లు పట్టుకుని జారించాకా, ఇంకా కావాలంటూ మారాం చేస్తోంది.

ఉయ్యాల -
* ఒక్కరే కూర్చుని ఊగితే సరదా ఏముంది ? నిల్చుని ఉంటే, స్నేహితుడు ఊపాలి, అంటాడో బాబు.
* ఒకళ్ళ ఒళ్లో ఒకరు కూర్చున్న ముగ్గురు పాపలు, పచ్చని పంట చేల మీద జతగా ఎగిరే తెల్ల కొంగల్లా ఎగురుతూ నవ్వుతున్నారు.

చిన్ని రంగుల రాట్నం -
* పాపం, ఎన్నాళ్లని అది మనం కూర్చుంటే మనని తిప్పుతుంది ? దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు తిప్పి , ఋణం తీర్చుకుందాం అనుకుంటాడో బుజ్జాయి.
* అలా బాగా తిప్పాకా, చప్పున ఎక్కి కూర్చుంటాడు. వెన్నెల ఆరబోసినట్టు నవ్వుతాడు.
* అటే ఎందుకు తిప్పాలి ? అందుకే, ఇటు తిప్పుతాడు మరో కొంటె కుర్రాడు. అలా అనుకున్నది చేస్తూ, సంబరపడతాడు.



సీ -సా - 
* చిట్టి బాబును కూర్చో పెట్టి, మరోవైపు పైకి, క్రిందికి చేత్తో ఒత్తి, పిల్లాడి నవ్వుల్ని చూసి, ప్రపంచం మరచిపోతున్నాడు తండ్రి.
* అటువైపు కూర్చున్న భారీ శాల్తీ ని చూసి, నేనిలా క్రిందే పడి ఉండాల్సిందేనా, అన్నట్టు బిక్క మొహం వేసి చూస్తున్నాడు ఓ బుజ్జాయి.

స్ప్రింగ్ ఏనుగు బొమ్మ -
* ఎత్తెత్తి కొడుతుందా ? దీని అంతు చూడాలి అనుకుని, తన బలాన్ని అంతా వాడి వంచేస్తాడు ఓ బాబు. మళ్ళీ పైకి లేస్తాడు. 
* ఆ ప్రక్కనే, ఏనుగు తనకూ కావాలని మొరాయిస్తాడు మరో బాబు.


* ఇసుకలో గవ్వలు, రంగు రాళ్ళు ఏరుతున్నాడు ఓ బాబు. రాయి దొరికినప్పుడల్లా, గెంతులేస్తూ తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తున్నాడు. 
* తన చెప్పుల్ని ఇసుకలో కూరి, మళ్ళీ బయటకు తీసి చూసుకుంటోంది ఓ పాప. మళ్ళీ విదిలించి శుభ్రం చేసి వేసుకుని, మళ్ళీ దాచేస్తుంది.
* ప్రతీ వాళ్ళు తమ వంతు కోసం పోటీలు పడి పరుగులు, అలసిన పిల్లలు ఐస్ పుల్ల కొనుక్కుని  వెనుదిరగడాలు.

వీటన్నిటి పరిణామం.... చిట్టి మనసు నిండా తృప్తి, బోలెడంత ఆకలి, కంటి నిండా నిద్ర.

అందుకే మనసు ఒక్కోసారి పసిపాపై పారాడమంటుంది...
కొత్తవి చూసి బెదరద్దు, అలవాటైతే అవే ముద్దు అంటుంది.
పైకే కాదు, క్రిందికీ వెళ్ళమంటుంది.
ముందుకే కాదు, వెనక్కీ వెళ్లి చూడమంటుంది...
అటు నుంచి ఇటే కాదు, ఇటు నుంచి అటు కూడా తిరుగు అంటుంది...
పడినా, లేచినా, ఆడినా, ఓడినా, గాయపడినా.... అలుపెరుగని ప్రయత్నం చేసి, అనుకున్నది పొంది, ఆనందించమంటుంది. పసిపాపల పార్కు స్పూర్తి, పెద్దలకు కావాలి ఆదర్శం!