Saturday, April 21, 2012

నిందా- స్తుతి





నిందా- స్తుతి


నిందా-స్తుతి (scolding praise ), లోపాలను ఎత్తి చూపుతూ పొగడడం, తెలుగు భాష లోని ఒక వైశిష్ట్యం.చాటువులని( humorous verses ) మరొక పేరు. సందర్భానికి, వ్యక్తుల మనస్తత్వాలకి తగినట్టుగా ఆశువుగా చెప్పే పద్యాలు. ఇవి కొన్ని మాత్రమే. మరెన్నో ఉన్నాయి అంతర్జాలం(ఇంటర్నెట్) లో. చదివి ఆనందించండి.
అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే, శ్రీ నాధుడు శివునిపై రాసిన పద్యం --

"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
...
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."

 "ఓ పరమేశా, లక్ష్మి పతి పదహారు వేల మందిని పెళ్ళాడినా, సిరి కలవాడు కనుక చెల్లింది. ఆది భిక్షువయిన నీకు ఇద్దరు ఇంతులు ఎందుకు గాని గంగ ను విడిచిపెట్టు. అంటే వర్షాన్ని కురిపించమని ప్రార్ధన. శ్రీనాధుడి చాటువుకి నిజంగానే వర్షం కురిసింది."

ఒక కన్ను పోయిన రాజు తన ఆస్థాన కవులను, అతని కళ్ళను పొగుడుతూ పద్యం రాయమన్నాడుట. రాయలేని వారందరూ శిక్షార్హులు. అప్పుడు ఒక కవి ఈ చాటువు వ్రాసారు.
"అన్నాతి గూడ హరుడవే
అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !"



 " మీ శ్రీమతి పక్కనుంటే, ఆవిడ కళ్ళతో కలిపి ముక్కంటివి, లేకపోతె, ఒక్క కంటితో శుక్రాచార్యుడంతటి వాడివి, ఆ దిక్కుమాలిన ఒక్క కన్ను మిగిలింది కాని, లేకపోతె, ద్రుతరష్టుడంతటి వాడివి అయ్యేవడివి."


ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో
"ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి)
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి(/సన్నుతాంగి)
( పార్వతి, శివుడు, మన్మథుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి,
సముద్రుడు(/అతని భార్య), జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత) )

ఆ గడుసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట !(తమలిపాకులోకి)
"ఓరి కుక్కా! ఇదుగో సున్నం!"

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో
( కమలము, సూర్యుడు, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు,
చంద్రుడు, శివుడు, గణపతి, ఎలుక, పిల్లి, కుక్క )


 సిరివెన్నెల సినిమాలో సిరివెన్నెల గారు రచించిన 'ఆదిభిక్షువు వాడినేది కోరేది' పాట మరొక ఉదాహరణ.

2 comments: