Saturday, September 8, 2012

అమరావతి కధలు 1





మరావతి- గుంటూరు జిల్లా లో ఉంది. పంచారామాల్లో ఒకటయిన 'అమరేశ్వరాలయం ' ఇక్కడ ఉంది. కార్తీక మాసంలో గుడి పక్క కృష్ణా

నదిలో కొత్త నీరు, గుడిలో బయటి ప్రాంగణం అంతా, పూల తివాసీ పరచే పున్నాగ చెట్లు, వాటి నుంచి వచ్చే పరిమళం,
గుడిలో అనేక మారేడు,

 

గన్నేరు చెట్లు, నిశ్శబ్ద మౌన సందేశాన్ని అందిస్తూ, మనసుని మైమరపిమ్పచేస్తాయి.


శంకరమంచి సత్యం గారు రెండున్నర ఏళ్ళు అక్కడి ప్రకృతి తో మమేకమయిపోయి, గాలిలో తెమలా, ఇసుకలో రేణువులా, కృష్ణలో అలలా,

మనుషుల్లో మనసులా తాదాత్మ్యం చెంది, చరిత్ర పుటలపై చెక్కిన అమర శిల్పాలు. అమరావతి క్షేత్ర పాలకుడిలా, యోగిలా చరిస్తూ, ఆ నేల

తల్లి పై కురిసిన వాన చినుకు మీద, తడిసీ తడవని ఇసుక రేణువు మీదా, అక్కడి మట్టిలోని దైవికత మీదా --సున్నితమయిన భావోద్వేగాలు,

వెన్నెలలు-ఎండలు, వానలు- వరదలు, వ్యవస్తలు- వృత్తులు , పండగలు- పబ్బాలు, కల్మషం లేని ప్రేమలు, భిన్న మనస్తత్వాలు రంగరించి,

హృద్యంగా అందించిన అమర కధలు.దాదాపు వంద కధల్లో తెలుగు జీవన విశ్వ రూపం కనిపిస్తుంది. మూడు ముక్కల్లో నూరేళ్ళ జీవితాన్ని

మనకు చూపిస్తారు. మరి, కొన్ని కధలు చూద్దామా....


*తోలికధ - వరద* : ఇందులో వరద వచ్చి మిన్ను- మన్ను ఏకమయిపోతే, సాముహిక భోజనాలు చేస్తూ, మాలవాడు- బ్రాహ్మడికి నెయ్యి

వడ్డించడం , అతడు ఆనందంగా తినడం ఇతివృత్తం. వరద వచ్చి ఒక్క పూట బురద కడిగేసినా, మర్నాటికి మళ్లీ మామూలే. ఎన్ని వరదలు

వచ్చినా మనుషుల మనసుల్లోని మాలిన్యం కడగలేకపోతోంది....అంటూ ముగిస్తారు.


*రెండు గంగలు *: ఈ కధలో మనవడికి కధ చెప్తూ, తాత తన పెళ్ళయిన కొత్తలో వాన పడ్డప్పటి అనుభూతి ఇలా చెప్తారు. గల గల వాన- జల

జల వాన. వర్ష రాణి రధచక్రాల సడి- ఉరుము, కిరీటపు తళుకులు- మెరుపులు, అంటారు. మట్టి వాసన మైమరపిమ్పచేస్తోంది,

సర్వాణువులని వాన కరిగించేస్తుంటే, పైరు పులకించినట్టు ఊగుతోంది. కృష్ణ వొడ్డున, కృష్ణలో చినుకులు పడుతుంటే, అవి అమ్మాయి సిగ్గు

పడ్డప్పుడు, బుగ్గ మీది సోట్టలా ఉన్నాయి. చినుకుపడ్డ చోట చిన్న గుంట- అంతలో మాయం. కృష్నంతా చినుకులు- పులకలు. పైనుంచి ఒక

గంగ, క్రింద కృష్ణ మరొక గంగ అయితే, రెండూ కలిసిపోతున్నట్టు, ఒకటే ధార. ఇంతలో తాతయ్యకు నాయనమ్మ గుర్తొచ్చింది. ఇంత వానలో

ఒంటరిగా, ఎక్కడుందో... అని చూస్తే, ఆవిడ పెరట్లో కృష్ణ వైపు తిరిగి, చేతులు చాపి, తలములకలుగా హాయిగా తడిసి పరవశించి పోతోంది.

వర్షం కృష్ణలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోతోంది. ఇలా కధ ముగిస్తారు.


*లేగ దూడ చదువు *: అన్నతోనూ, అక్కతోను చిన్నారి చిట్టి ఇంకా బళ్ళో వెయ్యకపోయినా, రోజూ బడికి వెళుతుంటుంది. దాని పెంపుడు లేగ

దూడంటే చిట్టికి ప్రాణం. తాటాకుతో నాలిగ్గీసుకుని, చద్దనాలు తిన్న పిల్లలంతా, బడికి వెళ్ళే దారిలో పద్యాలు వల్లె వేసుకుంటూ, ఆరేసిన నూలు

తాకుతూ, అదిలిస్తున్న పెద్దల్ని అనుకరించి ఆటపట్టిస్తూ, 'నువ్వు నాకు నిన్న జీళ్ళు పెట్టలేదుగా...' అంతే, 'ఇవాళ పెడతాలేరా...' అని

వాదులాడుకుంటూ, చివరగా గంగన్న తాత చేత విభూది పెట్టించుకుని, ' బడికేల్తున్నాం తాతా,' అని చెప్పి, బడికి చేరతారు. ఈ లోపల

లేగ దూడ పాలేరు ఎంత అదిలించినా, చిట్టి కోసం బడి ముందే నిలబడిపోతుంది. చిట్టి పరిగెత్తుకొచ్చి, చేతనున్న పలక చూపి, అ ..ఆ ... ఇటు

చూడు, ఇవి అంకెలు... ఇది నా బొమ్మ, ఇది నీ బొమ్మ అని చూపుతుంటే, లేగ దూడ చిట్టి చేతులూ, వొళ్ళు నాకేసి, చివరగా పలకకి

అటుపక్క, ఇటుపక్క నాకేసి, తల్లిని కలుసుకోవడానికి వెళ్ళిపోతుంది.

No comments:

Post a Comment