Saturday, September 8, 2012

అమరావతి కధలు 3

 
తృప్తి

 
 



 
పూర్ణయ్యని అందరూ బావగాడంటారు. బావగాడు లేకపొతే, సరదా లేదు, సందడి లేదు. పెళ్లి గానీ, పేరంటం గానీ, వంత వాళ్ళ దగ్గరనుంచి,

వద్దనల దాకా స్వయంగా
చూసుకునేవాడు.


ఒకసారి వన సంతర్పణ కి అంతా మామిడి తోపులో చేరారు. గాడిపొయ్యి వెలిగించి, వంటకాల లిస్టు చదివాడు బావగాడు. 'వంకాయ మెంతి

కారం పెట్టినా కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు

పచ్చడి, అల్లం, ధనియాల చారు, మసాల పప్పు చారు, జీడిపప్పు పాయసం, మామిడికాయ పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరు

మిరపకాయలు,' చెబుతుంటే, అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీళ్ళు ఊరిపోయాయి.

వంటలు కాక ముందే భోజనం మీద మమకారం పెరిగిపోయింది.జిహ్వ గిలగిల లాడుతుండగా ఆకలి అగ్నిలా లేచింది. మధ్య మధ్య నవ నవ

లాడే వంకాయలని, వాక్కాయలు తెచ్చి పులుపు చూడమని, పాయసంలో జీడిపప్పు రుచిని, చుక్కకూర పెసరపప్పుతో మేళ వింపుని ,

పులిహోర పోపు ఘాటుని వర్ణిస్తూ తెగ ఊరించేసాడు బావగాడు. జనాలకి ఆకలి నిలువెత్తయిపోయి, శరీరం అంతా ఆకలే అలముకుంది.

ఎప్పుడూ వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. చివరకు గంట కొట్టి, అరిటాకులు కడుక్కు రమ్మనాడు బావగాడు. అందరినీ పేరు పేరునా

అడుగుతూ, మారు వడ్డిస్తుంటే, జనాలు ఆబగా తింటున్నారు. జన్మలో ఇంత దివ్యమయిన వంత ఎరగమన్నారు. అందరికీ తాంబూలాలు

ఇచ్చకా, వంటవాల్లను కూర్చోపెట్టి, 'కష్టపడి వండారు, తినండి..' అంటూ కొసరి కొసరి వడ్డించాడు.ఆఖరున గాడి పొయ్యి పక్కన చిన్న ఆకు

వేసుకుని, అంతా తినగా మిగిలిన ఒక గరిటెడు పప్పు, కాస్త పచ్చడి, గుప్పెడు పులిహోర మెచ్చుకుంటూ తిని, అందరి భోజనం తనే తిన్నంత

తృప్తి పడ్డాడు. నలుగురూ హాయిగా తిన్నారన్న తృప్తే, బావగాడి తాంబూలపు పెదవి పైని చిరునవ్వు.

No comments:

Post a Comment