Saturday, September 8, 2012

ఉపనయనం

ఉపనయనం




రమణ మహర్షి మాటలలలో ఉపనయనం ప్రాముఖ్యత:

"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము
వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"

"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

1 comment:

  1. ramana maharshi garu ceppina daniki manam comment ceyakudadu. ikkada "pramukhyata"ani ceppi prasthuta paristhiti cepparu.

    ReplyDelete