Saturday, September 8, 2012

స్త్రీ హృదయం

స్త్రీ హృదయం 
 


పెళ్ళయితే అన్నీ కష్టాలే అని, మనశ్శాంతి ఉండదని, పెళ్ళంటే, పెళ్ళాంతో కొత్త సమస్యలను ఆహ్వానించడం తప్ప వేరే ఎలాంటి ఉపయోగం

లేదని, ఆడవాళ్ళంతా సీరియల్ లో ఆడ విల్లన్ల టైపు అని, బంధాలను విచ్చిన్నం చెయ్యడమే వీళ్ళ పని అంటూ ఆడవాళ్ళని తేలిగ్గా, కూరలో

కరివేపాకు తీసినట్టు, తీసి పడేసే మగ వాళ్ళంటే, నాకెందుకో అంత సదభిప్రాయం లేదు. పైగా అవగాహనా లోపం వల్ల విలువయిన జీవన

మాధుర్యాన్ని కోల్పోతున్నందుకు, సానుభూతి కూడా.

ఒక రకంగా, మగవాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు పుట్టి పెరిగిన ఊరిని, తల్లిదండ్రుల్ని, ఇంటిని, స్నేహితుల్ని, వాతావరణాన్ని, యే

మాత్రం మార్చుకోనక్కర్లేకుండా, వదులుకోవక్కర్లేకుండా, పెళ్లి పేరుతొ కొత్త బంధాన్ని కలుపుకుంటూ, వంశాభివృద్ధి చేసుకుంటూ

సాగిపోతారు. సంప్రదాయం వాళ్ళకు ఇచ్చిన వరం అది. మాకా అవకాశం లేదే. ఒక మొక్కను ఉదాహరణగా తీసుకుందాం. విత్తనం నుంచి

మొలకెత్తి, అక్కడి నేల, మట్టి , గాలి, నీరు, ఎండ-వాన, అన్నీ పరిస్థితుల్ని తట్టుకుంటూ, అడక్కుండానే తన అవసరాలు కనిపెట్టి తీర్చే, చక్కటి

తోటమాలి వంటి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతుంది. చక్కగా నాటుకుని, నవ్వుల పువ్వుల్ని, మమతల పరిమళాలను అందిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో, అందమయిన ఎదిగిన మొక్క లాంటి ఆ ఆడపిల్లను, తను జీవితాంతం సంరక్షించలేడు కనుక, పూర్తిగా, ఒక కొత్త

వాతావరణం లోనికి పంపించాలని అనుకుంటాడు తోటమాలి. అలా అనువయిన మొక్కను అందచందాలు, చదువుసంధ్యలు ,ఆస్తిపాస్తులు

చూసి, ఎంచుకుని, తెచ్చుకోవడం లో ఉన్న శ్రద్ధ, తెచ్చుకున్నకా, వేళ్ళు నాటుకుని, స్థిరపడే దాకా, సంరక్షణ పై పెట్టక పొతే, ఏమవుతుంది?

ఎటూ తోచక ,గాలివాటుకు, జోరు వానకు, అడ్డదిడ్డంగా పెరిగి, మిగిలిన మొక్కలకు కంటకమవుతుంది. కొత్త వాతావరణం లోకి వచ్చిన

ఆడపిల్లయినా అంతే. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, కొత్త నీరు, గాలి, పరిస్థితులు. ఒక కొత్త దారిలో వెళుతున్నాం. ఎలా వెళ్ళాలి?

నెమ్మదిగా, దారిలోని గురుతులన్నీ గమనించుకుంటూ, సాగాలి. వడివడిగా ప్రయాణిస్తే, తిరిగి వెనక్కి రాగలమా? అలాగే జీవితం ఒక కొత్త

మలుపును తీసుకుంటున్నప్పుడు, మెత్తగా, సహనంగా సాగకుండా, తమ ఆధిక్యత, దర్పం, మొదటినుంచి ప్రదర్సించుకోవాలని, ఎవరికి వారే

వారి ప్రత్యేకత ఎంత మాత్రం తగ్గించుకునే ప్రసక్తే లేదన్న పంతం తో ఉంటే ఏమవుతుంది? ఎటూ చెప్పుకోలేక, అన్నీ వైపులా సమర్ధించుకోలేక

ఉక్కిరి బిక్కిరి అయిపోతుందా భార్య పరిస్థితి. ఎదుటి వాళ్లతో పోల్చి తేలిక చెయ్యడాలు, పదే పదే లోపాలను ఎత్తి చూపే ప్రవ్రుత్తి, తనలో నిరాశ

దృక్పధాన్ని, నింపుతాయి. అప్పటిదాకా, గల గలా పారే సెలయేరు లాంటి ఆ అతివ , మందకొడి గా సాగే పిల్ల కాలువ అవుతుంది. తన

ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎదుటి వారు తనను ఎందుకు అర్ధం చేసుకోరు, అన్న ఆలోచనలతో, మీరెలా ప్రవర్తిస్తే, అలాగే బదులిచ్చే

అలవాటు చేసుకుంటుంది. స్వామీ వివేకానంద చెప్పినట్టు, ఎదుటి వారి వైపు ఒక వేలు చూపిస్తే, మిగిలిన మూడు వేళ్ళు తమ వైపే

ఉంటాయన్న సత్యాన్ని తెలియని వారు వీరంతా. ఒక చేత్తో చప్పట్లు మోగవు. ఇప్పటికయినా ఎదుటి వారిని నిందించడంలో, దిగాజార్చడంలో

ఉన్న ఉత్సాహం ఇలాంటి వారు, తమను తాము సరిదిద్దుకోవడం లో పెడితే, జీవనం సౌఖ్యమై, హ్రుద్యమవుతుంది.

శ్రీ ఇంద్రగంటి హనుమాచ్చాస్త్రి గారి కధలోని ఈ మాటలు నన్ను ఎంతో కదిలించాయి. వారు ఇటువంటి అద్భుతమయిన వాక్యాలు రచించారంటే,

అనుభవైక వైద్యమే తప్ప, వేరెలాగు సాధ్యం కాదు. మీరు చదవండి.

'నలిగిపోయిన పురుషుడిని ఓదార్చడానికి, సేద దీర్చడానికి, ఎన్ని యుగాల నుంచి భగవంతుడు స్త్రీ హృదయం అనుగ్రహించాడో కదా.

పురుషుడి మిధ్యా పౌరుషం, అహంకారం, తెచ్చి పెట్టుకున్న కరకుదనం, అన్నీ స్త్రీ సన్నిధానంలోని ,అవ్యాజ కరుణ, అనురాగం ముందు,

మంచులా కరిగి, ద్రవించిపోతాయి.'

No comments:

Post a Comment