Saturday, September 8, 2012

శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి పద్యాలు

 శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి పద్యాలు

శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి చక్కటి తెలుగు పద్యాలు కొన్ని చూద్దామా!

పరమ సుకుమార దేహయై, భారమయిన

భవుని ధనువును కదలించు బలము కలిగి

వినయ సౌశీల్య గంభీరవిజయ అయిన

దేవిసీతను బోలు నా తెలుగుభాష.


ఇక్కడున్నట్టి మట్టిని ఈసడించి

ఎక్కడెక్కడి పిచ్చినో ఇచ్చగించి

వట్టి వాజమ్మలై పోయినట్టి మీకు

దిక్కురా ఇంక నిక్కమౌ తెలుగుభాష.

పుణ్య సంస్కృతి గల యట్టి పుడమి పుట్టి

అయ్యతెలియని జాతి దెయ్యమ్ము పట్టి

చిట్టి పొట్టి బట్టలు కట్టి చెడెడి జడుల

తెగులు పోగొట్టి నిలబెట్టు తెలుగుభాష.


నిండుచెరువున స్వచ్చమౌ నీటిభాష

పందిపకపక నవ్వేడు పైరుభాష

చెట్టుచుట్టును తిరిగేది పిట్టభాష

తెనేపనసలతోట నా తెలుగుభాష.


పదునాల్గు భువనాల భాషలన్నిటిలోన 

దేవభాషకు సాటి తెలుగుభాష 

భావ ప్రకటనలోన పదముల ఒదుగులో 

దేవభాషకు దీటు తెలుగుభాష 

అమితసుందరములై అలరారు లిపి యందు 

దేవభాషను మించు తెలుగుభాష 

అచ్చులున్ హల్లుల అక్షరాసంఖ్యలో 

దేవభాషకు మిన్న తెలుగుభాష.


కనులకింపైన పదహారు కళలభాష 
లలితకలలన్ని వ్యక్తమై వెలుగుభాష
నిత్యమును సత్యపధమందు నిలుపుభాష 
ఠీవిగా చూచు వాగ్దేవి, తెలుగుభాష.

No comments:

Post a Comment