Saturday, September 8, 2012

అశ్వఘోషుని బుద్ధ చరితం

 అశ్వఘోషుని బుద్ధ చరితం 
 
 
 
 
 'బుద్ధ  చరితం ' 17 సర్గల మహాకావ్యం. ఇందులో 14 సర్గలు మాత్రమే మనకు లభించాయి. ఇక్ష్వాకు వంశంలో శుద్దోదనుడు- మాయాదేవి
 
నే రాజదంపతులకు ఉండేవారు. గర్భవతి అయిన 'మాయాదేవి' కి స్వప్నంలో తన గర్భంలోకి ఒక తెల్లని ఏనుగు ప్రవేశించినట్టుగా

అనిపించింది. 'లుంబిని' వనానికి విహారానికి వెళ్ళిన రాణి, కనీసం ప్రసవ వేదన అయినా కలిగించని, మేలిమి బంగారు చాయతో మెరిసిపోయే,

బాలుడిని ప్రసవించింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. గాలులు సుఖ స్పర్శను కలిగిస్తూ వీచాయి. అగ్నిజ్వాలలు సౌమ్యంగా

వెలిగాయి. క్రూర జంతువులు సైతం తమ క్రూర ప్రవృత్తిని మానివేసాయి. స్నిగ్ధమయిన అర్ధనిమీలిత నేత్రాలు కల, దీప్తిమంతమయిన ఆ

బాలుడి -- పాదాలలోని చక్ర చిహ్నాలు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు పరిశీలించిన 'అసితుడు' అనే మహర్షి, ' జగత్తు లోని మోహము అనే

 అంధకారాన్ని పారద్రోలడానికి ఉదయించిన జ్ఞాన మయ సూర్యుడు ఈ బాలుడు. ' అని బాలుడి భవిష్యత్తు వివరించాడు. దైవజ్ఞులు 'రాజా!

యితడు రాజ్యమే కావాలనుకుంటే, సమస్త భూమండలాన్ని న్యాయ మార్గంలో జయించి, విరాజిల్లుతాడు. లేక మోక్షగామియై వనానికి

వెల్లినట్టయితే, తత్వజ్ఞానంలో అందరినీ మించిపోయి, అన్నీ మతాలను జయించి, అందరి చేతా మన్నింప బడే మహోన్నతమయిన మేరు

పర్వతంలా భాసిస్తాడు' , అని చెప్పారు. బాలుడికి 'సర్వార్ధ సిద్ధుడని' నామకరణం చేసారు. బాలుడి చిన్నప్పుడే, మాయాదేవి

దివంగతురాలయ్యింది. సాత్వికుడయిన శుద్దోదన మహారాజు ఒక పక్క ధర్మపత్ని ఎడబాటును- మరొక పక్క అసిత మహర్షి మాటలను

మననం చేసుకుంటూ, రాకుమారుని మనసు వైరాగ్యం వైపు మళ్ళకుండా జాగ్రత్త వహించాడు. అపురూప సౌందర్యవతి అయిన 'యశోధర'

అనే రాకుమార్తెతో వివాహం జరిపించాడు. మనస్సుకు ఆందోళన కలిగించే యే విషయమూ అతడి కంట పడకూడదని, అంతఃపురంలోనే అన్ని

ఏర్పాట్లు చేసి, బయటకు వెళ్ళకుండా ఉండేటట్లు చేసాడు. అందమయిన స్త్రీ ల సంగీత నృత్యాలతో రాకుమారుడు కాలం గడపసాగాడు.

సర్వార్ధసిద్దయశోధర దంపతులకు 'రాహులుడు' అనే చంద్ర ముఖుడయిన శిశువు జన్మించాడు. పుత్రోదయం తరువాత గౌతమునిలో పుత్ర

వాత్సల్యం కలుగుతుంది కాబట్టి, అతని మనసులో వైరాగ్యం చోటుచేసుకోదు, అని వృద్ధ మహారాజు కొంత ఊరట చెందాడు. ఏదో ఒక

సందర్భంలో సర్వార్ధసిద్ధుడు వనాల సౌందర్యాన్ని గురించి విని, విహార యాత్రకు వెళ్లాలన్నాడు. రాకుమారుని మనసు తెలుసుకున్న

మహారాజు, అతడి విహార యాత్రకు ఏర్పాటు చేయిస్తూ, వ్యాధిగ్రస్తులు, అంగహీనులు, వృద్ధులు, మార్గంలో కనబడకుండా ఉండేటట్లు జాగ్రత్త

వహించాడు. అయితే, దేవతలు సర్వార్ధసిద్దునిలో మొక్షేచ్చ కలిగించాలనే సంకల్పంతో, ఒక వృద్ధ మానవుడిని సృష్టించి, అతడి మార్గంలో ప్రవేశ

పెట్టారు. తధాగతుడు రధ సారధిని అతడి గురించి ప్రశ్నించాడు. దైవప్రేరితుడై, రహస్యంగా ఉంచాలని తెలిసినా, సారధి అయిన సూతుడు ఇలా

చెప్పాడు.

 ' రూపస్య హన్త్రీ వ్యసనం బలస్య శోకస్య యోనిర్నిధనం రతీనాం, నాశః స్మ్రుతీనాం రిపురింద్రియాణామేషా జరా నామ యయైష భగ్నః" ౩-౩౦
 
'రూపాన్ని నశిమ్పజేసేది, బలాన్ని పోగొట్టేది, శోకానికి మూలము, ఆనందానికి అంతము, ఇంద్రియాలకు శత్రువు అయినది వృద్ధాప్యం.

అలాంటి వృద్ధాప్యం చేత యితడు ఇలా గావించబడ్డాడు. ' సూతుని మాటలు విన్న తధాగతుడు, తనకు కూడా ఇలాంటి దశ ఏర్పడుతుందా..

అని అమాయకంగా అడుగుతాడు. అవునని చెప్తాడు సూతుడు. రెండవ సారి, ఆర్తిగా అరిచే రోగిని, మూడవసారి మృత శరీరము చూసిన

తదాగాతుడి మనసు వికలమయిపోతుంది. 'వ్యాధి, మరణం తప్పదని తెలిసినా ఈ ప్రజలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.

అప్పుడు సూతుడు ,

 'తతః ప్రణేతా వదతి సమ తస్మై సర్వప్రజానామిదమంతకర్మ , హీనస్య మధ్యస్య మహాత్మానో వా సర్వస్య లోకే నియతో వినాశః" 3 -59

'అందరూ మానవులకు చివరికి జరిగేది ఇదే! అధముడయినా కావచ్చు, మధ్యముడయినా కావచ్చు, లేక మహాత్ముడయినా కావచ్చు.

అందరికీ వినాశం అనేది నిశ్చయం..''

మరల ఒకనాడు స్నేహితులతో విహారానికి వెళ్ళిన రాకుమారుడికి ఒక దైవపురుషుడు భిక్షువేశంలో తారసపడ్డాడు. 'ఎవరు నీవని' అడిగిన

బుద్ధుడితో, 'నేను జరామరనభాయంతో సన్యసించిన భిక్షువును, మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ తిరుగుతున్నాను' , అని చెప్పి ఆకాశానికి

ఎగిరిపోయాడు. అతని మనసులో మొక్షేచ్చ బలంగా నాటుకుపోయింది. తపోవనానికి వెళ్ళడానికి తండ్రి నిరాకరించడంతో, రాత్రికి

రాత్రే చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు.. 'అభినిష్క్రమణం ' అనబడే ఈ ప్రధాన ఘట్టంలో, ప్రగాడ మోక్షేచ్చతో సర్వార్ధసిద్ధుడు,

అర్ధరాత్రి తపోవనాలకు బయలుదేరతాడు. అతని మనసులోని ఆలోచన గ్రహించిన దేవతల చేత భావన ద్వారం తెరువబడింది. ఇదే

సన్నివేశాన్ని జంధ్యాల
పాపయ్య శాస్త్రి గారు అత్యంత మనోజ్ఞంగా ఇలా వర్ణించారు...

 

 "ఈ ప్రగాడ నిగూడ మధ్యే నిశీధి, గడియ కదిలించుచున్న సవ్వడి ఇదేమి? ఇంత యర్ధరాత్రమున ఎవ్వారు వారు? మూసియున్నట్టి

 

తలుపులు తీసినారు?"

తన అనుచరుడయిన చంధకునితో ఉత్తమాశ్వాన్ని అధిరోహించి బయలుదేరిన రాకుమారుని నిర్గామానికి దేవతలు అశ్వాపు డెక్కల సవనం
 
 బయటకు వినిపించకుండా, అదృశ్య రూపంలో ఉండి సహాయం చేసారు. భార్గావాశ్రమానికి చేరుకున్న రాకుమారుడు తన ఆభరణాలను

త్యజించి, కాషాయామ్బరాలకై చూస్తుండగా, దేవతలచే పంపబడిన ఒక కిరాతుడు, తాను ధరించిన కాషాయామ్బరాన్ని గౌతముడికి ఇచ్చి,

అతని శ్వేత వస్త్రాలను తీసుకుని అంతర్ధానమయ్యాడు. తన కోసం బాధ పడుతున్న చందకుడిని, అశ్వాన్ని అనునయించి, 'జనన

మరణాల అంతం తెలుసుకునే దాకా నేను కపిలవస్తు నగరంలో కాలు మోపను' అని ప్రతజ్ఞ చేసాడు. ఆశ్రమంలోని వృద్ధ ముని ద్వారా,

వింధ్యకోష్టంలోని ' అరాట్ ' అనే మునిపున్గవుడు తనకు మార్గోపదేశం చెయ్యగలడని తెలుసుకుని, అక్కడకు ప్రయాణమయ్యాడు. దారిలో

 మగధరాజయిన 'బింబ సారుడిని' కలుస్తాడు. ఇరువురూ మిత్రులయ్యి, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంత చిన్న వయసులోనే, మోక్షం

పట్ల తపనతో వచ్చినా గౌతముడిని చూసి, 'అరాట్' ముని ఆశ్చర్యపోతాడు. ముని కపిల మహర్షిని స్మరించి, అనేక ధ్యాన, యోగ,

సమాధులను గురించిన విషయాలు వివరిస్తాడు. అంతటితో తృప్తి చందక 'ఆత్మ భావన' ను అన్వేషిస్తూ, గయా దగ్గరి 'నగరి' అనే ఆశ్రమానికి

 చేరుతాడు. అక్కడ ఆరు సంవత్సరాలు నిరాహారియై కటిన తపస్సు చేసాడు. క్రమంగా ఉపవాసాదుల వల్ల మోక్షప్రాప్తి కలుగదు అని గ్రహించి,

ఆహారాన్ని స్వీకరించాలనుకున్నాడు. అదే సమయంలో దైవ ప్రేరితయై 'నంద బాలా' అనే గోపబాలిక గౌతముని వద్దకు పాయసాన్ని

తీసుకువచ్చింది. అశ్వద్ధ వృక్ష మూలంలో కూర్చున్నా గౌతముడిని 'కాలం' అనే ఉత్తమ సర్పం వచ్చి దీవిస్తుంది. బుద్ధుడు ఒక విశిష్ట

భంగిమలో ఆసీనుడై, సమాధి నిష్టుడయ్యాడు.

'మార విజయం' అనబడే పదమూడవ సర్గలో, బుద్ధుడి ఇంద్రియ జయాన్ని గురించి వివరిస్తాడు అశ్వఘోషుడు.

"యమ కామదేవం ప్రవదంతి లోకే చిత్రాయుధం పుష్పశరం తధైవ,

కామప్రచారాదిపతిం తమేవ మోక్షద్విషం మారముదాహరాంతి"

ఎవరినయితే లోకంలో 'కామదేవుడు' చిత్రమయిన ఆయుధం కలవాడు, పుష్పబాణుడు అంటారో, మోక్షానికి శత్రువయిన అతనిని

ముముక్షువులు 'మారుడు' అంటారు. ఒకేసారి అరిషడ్వర్గాలను జయించిన మహావీరుడు బుద్ధుడు. ఇక ఒక్కో మెట్టే అధిగమించి,

తత్వదర్శనానికై ముందుకు సాగుతాడు, వివిధ లోకాలు దర్సిన్చగలుగుతాడు. పరమార్ధం తెలుసుకున్న బుద్ధుడు సర్వజ్ఞాత్వాన్ని

 పొందుతాడు. 'బాహ్య మయిన కాని, అంతరమయిన కాని ఆత్మ అనేది లేదు. అష్టాంగ మార్గం ద్వారా శాంతి లభిస్తుంది...' అనేది అతడు

తెలుసుకున్న సత్యం. బుద్ధత్వాన్ని పొందిన అతడిని, మునులు, దేవతలు ప్రశంసిస్తారు. దిక్పాలకులు అతడికి భిక్షాపాత్ర ఇచ్చి సత్కరిస్తారు.

ఇద్దరు శ్రేష్ఠులు భిక్ష ఇస్తారు. ఇక 'బోధిసత్వుడు' కాశి నగరం వైపు తన ప్రయాణం కొనసాగించాడు...

అశ్వఘోష కృత 'బుద్ధ చరితం' సమాప్తం.


 

No comments:

Post a Comment