Saturday, September 8, 2012

కర్మ భూమి

 
 
కర్మ భూమి
 
 

 
లంక ను జయించాక, ఆ రాజ్య సౌందర్యాన్ని చూసి, లక్ష్మణుడు , కొన్ని రోజులు అక్కడే వుండి, విబీషణుని ఆతిధ్యం స్వీకరించి వెళదాం అని కొరితే, రాముడు ఇలా
అంటాడు
* " అపి స్వర్ణమయీ లంకా- న మే రోచతి లక్ష్మణా,
జనని జన్మభూమిస్చ స్వర్గాదపి గరీయసి ".*
బంగారం తో నిర్మించబడ్డది, ఎంతో ఉత్సుకతని కలిగించేది అయినా, ఈ లంకా నగరం పై నాకు ఆసక్తి లేదు. మన తల్లి వంటి మాతృభూమికి సమానమయినది, ఏది లేదు. చివరికి  స్వర్గం కూడా మాత్రు దేశం ముందు దిగదుడుపే.*

 పరాయి దేశపు పౌరసత్వం సంపాదించుకోవచ్చు, కాని కన్న తల్లిని ఎలా మార్చుకోలేమో, అలా మాతృభూమిని, మాత్రు భాషని మర్చిపోలేము. మనిషీ ఒక ప్రాంతంలో పుట్టి, అక్కడి గాలిని పీల్చుకుని, నీటిని త్రాగి, తన బ్రతుకును పండించుకుంటాడు. అతనికి తెలియకుండానే ఆ గాలి, నేల, మట్టి, తో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ఇక్కడి మన భాషని, బంధాలను కోల్పోతున్నామని బాధపడడం చూస్తుంటాం. విదేశీయులంతా , మన సంస్కృతి పట్ల, వేష భాషల పట్ల ఆకర్షితులయ్యి, అచ్చంగా ఆరు గజాల చీరలు కట్టుకుని, బొట్టు- గాజులు వేసుకుని ముచ్చటగా తిరుగుతున్నారు.సరే, భారత భూమిలో పుడితే ఏమిటి విశేషం, మిగిలిన చోట్ల ఏమిటి లోటు, అనే వాళ్ళకు, నాకు తెలిసినంతలో చిన్న వివరణ.

మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. *కర్మ*(సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము  చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది. కర్మ సిద్దాంతము ప్రకారము : పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో నుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం  భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.

విష్ణు పురాణం ప్రకారం, దేశాలు, కర్మభూమి అని, భోగ భూమి అని రెండు రకాలు. భోగ భూమిలో పుట్టే జీవులకి మొక్షార్హత ఉండదు, వీరు ఇంద్రియ లోలులయ్యి, భోగాలను అనుభవించడమే తప్ప వేరే పురోగతి ఎరుగరు. కర్మ భూమి లో పుట్టిన వారు త్రివిధ కర్మలను ఆచరిస్తూ ( నిత్యం, నైమిత్తికం, కామ్యం),ఆధ్యాత్మిక సంబందితమయిన యజ్ఞాలు, యాగాలు, నిర్వహిస్తూ, పాప పుణ్యాలకు తగిన జన్మలు పొంది, మొక్షార్హత కలిగి ఉంటారు. భారత భూమిలో చేసిన దానమయినా , యజ్ఞమయినా, తపమయినా మిగిలిన చోట్ల చేసిన వాటికన్నా, ఊహించలేనంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. భోగ భూమిలో చేసిన ఎంతటి మహాత్కార్యమయినా, చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయంగా ఈ మధ్య కొన్ని ఆశ్చర్య కరమయిన సాంకేతిక ఆధారాలు లభించాయట . క్రింది లింక్ లో చదవగలరు.
http://manasasancharare.wordpress.com/2010/07/01/india-gravity-field-is-unique/

పరాయి దేశాలు పురోగతిలో మనకంటే ముందు ఉండచ్చు. కాని ఒక్క రూపాయి ఆశించకుండా, కేవలం ధర్మ ప్రచారం, యోగ ప్రచారం, లోక శ్రేయస్సు కోసం పాటుపడే మహనీయులు ఇక్కడే
ఉన్నారు. 'లోకాస్సమస్తా సుఖినోభవంతు' అంటూ యజ్ఞాలు చేసే పుణ్యాత్ములు ఇక్కడే ఉన్నారు. మన మాత్రు భూమిని, మనమే చులకన చేయక, ఈ మట్టిలో పుట్టినందుకు, గర్వపడాలి. ఆ మట్టిలో దొరికే మాణిక్యాలం అయ్యి, మన దేశ ప్రతిష్టను అన్నీ దేశాల్లో ఇనుమడిమ్పచేయ్యాలి. ధన్యవాదాలు.

1 comment:

  1. అద్భుతం గా రాశారు పద్మిని గారు, ధన్యవాదములు

    ReplyDelete