Monday, February 4, 2013

తెలుగువాడు

శాతవాహనుల వంశాన పుట్టినవాడు 
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు 
పల్లెలోనే కాదు ఢిల్లీ లోసైతమ్ము 
పెద్ద గద్దెలనేలి పేరుకెక్కినవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .

పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు 
కండువా లేనిదే గడపదాటనివాడు 
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ 
గొంగోరకొసమై గుటకలేసేవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .


తెలుగు బాసను జుంటితేనెయని తెగపొగిడి 
పొరిగింటి పులుసుపై మరులు పెంచినవాడు 
దేశభాషలలోన తెలుగు లెస్సనిచాటి 
మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు 
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు 
తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు 
చిక్కులెరుగనివాడు చిత్తాన పసివాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .

 

No comments:

Post a Comment