Monday, February 4, 2013

సమస్యాపూరణం


సమస్యాపూరణం

  సాహిత్యంలో సమస్యాపూరణం సరస వినోదమయిన, హృదయ రంజకమయిన ప్రక్రియ. ఇవ్వబడిన పదములను, వేరే పదములతో కలిపి అర్ధవంతముగా చెప్పడమే సమస్యాపూరణం.

ఈ సమస్యాపూరణాలు భోజ రాజు కాలం నుంచీ ఉన్నాయి. భోజ రు గొప్ప ప్రభువే కాకుండా గొప్ప కవి, కవిపోషకుడు, కళాపోషకుడు, విద్వాంసుడు. అతడు ఇచ్చే సమస్యలను కాళిదాసు సరసంగా పూరించేవాడు. ఒక సారి భోజ రాజు 'టంటంట టంటంట టటం టటం టం '  
అనే సమస్యను ఇచ్చి పూరించామన్నాడట. దానిని కాళిదాసు ఈ విధంగా పూరించాడు.

"రాజ్యాభిషేకే మదవిహ్వాలయాః 
హస్తచ్చ్యుతో హేమఘటోయువత్యాః 
సోపాన మార్గేషు కరోతి శబ్దం 
టంటంట టంటంట టటం టటం టం."

భావము : రాజుగారు స్నానం చేసే సమయంలో చూచిన ఒక పరిచారిక మొహపరవశంతో తన చేతిలో ఉన్న బంగారు కలశం జారవిడిచినప్పుడు,మెట్ల మీది నుండీ 'టంటంట టంటంట టటం టటం టం' అని శబ్దం చేసుకుంటూ అది జారి క్రిందపడిందిట .


సాహితీజైత్రయాత్ర గావించిన శ్రీనాధుడికి ఒక రాజాస్తానములో ఆయనను అవమానించే ఉద్దేశముతో బండిర (ఱ) తో క్రింది సమస్యను ఇచ్చారు. మన కవులు సామాన్యులా...వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే  పొడిచి వచ్చే  మేధా సంపన్నులు .  'అందఱునందఱు మఱియు నందఱు యంద ఱందరే' అన్న సమస్యను శ్రీనాధుడు ఎలా పూరించాడో చూడండి.

కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కముల్ 
కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు క్రిష్నజన్మమున కూసిన వారలు కావునన్ మఱే 
అందఱునందఱు మఱియు నందఱు యంద ఱందరే.

భావము: ఈ సభలో ఉన్నవారు కొందరు కుక్కలు (భైరవుడి అశ్వాలు), కొందరు కోతులు ( అర్జునుడి రధంపై జండాలు) , కొందరు పందులు ( ఆది వరాహాలు), మరికొందరు దున్నపోతులు ( యమ ధర్మరాజు వాహనాలు), మరికొందరు కృష్ణుడు జన్మించినప్పుడు కూసిన వారు...అంటే గాడిదలు ...ఈ సభలో ఉన్నవారంతా అటువంటి వారే!

2 comments:

  1. Nice post. Konni vishayalu telisinave aina rasina vari shali , malli,malli chadivela chestundi. Meeru baga present chesaru. :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఉషారాణి గారు.

      Delete