Monday, February 4, 2013

బ్రతుకు విలువ

జీవితం చాలా చిత్రమయినది. నదీ జన్మ స్థానం నుంచీ ఎన్నో దశలు దాటి, ఎన్నో అవరోధాలు అధిగమించి, ఎన్నో మలుపులు తిరిగి, చివరకు సాగరాన్ని చేరి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇటువంటిదే మన జీవితం. కొన్ని ఆశ్చర్యకరమయిన మలుపుల సమాహారం. 'ఇది ఇలాగే ఎందుకు జరగాలి? ' అని ప్రశ్నిస్తే బహుశా అందుకు సమాధానం కేవలం ఆ పైవాడికే తెలుసేమో.

నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ , దాదాపు ఆరొవ తరగతి నుంచీ ,షిర్డీ సాయిని ఆరాధించేదాన్ని. ఆయనను షిర్డీ వెళ్లి చూడాలని, ఆర్తిగా తపిస్తూ పాటలు పాడుకునేదాన్ని. ఆ వయసులో ఆర్తి, భక్తీ సాధ్యమా...అంటే జన్మసంస్కారం వల్ల సాధ్యపడిందనే చెప్పాలి. నా దినచర్య తెల్లవారుఝామున ఐదు గంటలకు చన్నీళ్ళ స్నానం చేసి, శివాలయానికి వెళ్లి ప్రారంభించేదాన్ని. గుడి, ట్యూషన్, పాఠశాల, సాయంత్రం హిందీ తరగతులు, కళలు ఇలా సాగేది.  అలా పదొవ తరగతి వరకూ సాగింది. ఇక ఇంటర్ ...అప్పట్లో మేము తెనాలి లో ఉండేవాళ్ళము. మా ఇంటి దగ్గరలో ఒక బాబా గుడి ఉండేది. ఇక రోజూ బాబా గుడికి వెళ్ళడంతో దిన చర్య మొదలు. గుడికి వెళ్లి మౌనంగా కాసేపు ఒక స్తంభాన్ని ఆనుకుని కూర్చునేదాన్ని. ఆయనే నా ధ్యాన మూర్తి. అలా నాకు ధ్యానం, సత్ప్రవర్తన, వొదిగి ఉండడం , అన్నీ మౌనంగా దక్షిణామూర్తి లా నేర్పించారు. 

అలా ఆరోవ తరగతి నుంచీ బాబా దర్శనం కోసం తపిస్తూ ఉంటే , చివరకు నేను ఇంటర్ కు వచ్చాకా షిర్డీ వెళ్ళే అవకాశం దొరికింది. మా కుటుంబ సభ్యులం ఒక పద్నాలుగు మందిమి కలిసి హైదరాబాద్ నుంచీ ఒక వాన్లో బయలుదేరాము. నిజామాబాద్ సమీపంలో టిఫిన్ చెయ్యడానికి ఆగాము. 1993 వ సంవత్సరం. అప్పట్లో ఆ ప్రాంతం అంతా అడవులతో నిండి ఉండేది. కొండలు, లోయలూ...డ్రైవర్ ఫ్రంట్ గ్లాస్ తుడుచుకోవడానికి వాన్ ఆపాడు. ఉన్నట్టుండి, వాన్ కదిలి పక్కనున్న లోయలోకి పయనించడం మొదలుపెట్టింది. డోర్ దగ్గరున్న నేను దొర్లి కొంత దూరంలో పడిపోయాను. మిగిలిన కుటుంబ సభ్యులు భయపడి అరవసాగారు. మా బామ్మ 'సాయీ' అంటూ అరిచింది. హటాత్తుగా వాన్ ఒక చిన్న చెట్టుకు ఆలంబనగా ఆగిపోయింది. అంతా , ఆ ఆశ్చర్యకర సంఘటనకు ఏంటో ఉద్వేగానికి గురయ్యారు. నెమ్మదిగా వాన్ దిగి, మా ప్రాణాలు కాపాడినందుకు సాయికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాం. దగ్గరలో ఉన్న సాయి ఆలయానికి వెళ్లి పూజాదికాలు ముగించుకుని బయలుదేరాము. ఆ షిర్డీ యాత్ర ఇప్పటికీ మర్చిపోలేను. సాఠె వాడలో బస, దగ్గరలో గుడి, లెండి వనం, ప్రశాంతత ,ఇప్పుడంతా మారిపోయింది .అయినా ఆ దివ్య మూర్తి తేజం అలాగే ప్రపంచంలోని ప్రశాంతత కలబోసినట్లు....మనోవైకల్యాలు శమింప చేసేటట్లు...

అది నా జీవితంలో మొదటి సారి ప్రాణాపాయం తప్పించుకోవడం...చావు మొహం చూసి వస్తే కాని, బ్రతుకు విలువ తెలియదేమో ! క్షణికమయిన ఈ బ్రతుకులో కక్ష్యలు, పగలు, ఎత్తుగడలు, ద్వేషభావనలు విడిచి, మన మనసు మందిరాలను  సాయి నివాసానికి అనుగుణంగా మలచుకోమన్న దివ్య సందేశం కాబోలు ! ఇంకొక ప్రమాదం , గురించి మరి కొన్ని గంటల్లో రాస్తాను....

 

అలా బాబా దర్శనం, అనుగ్రహంతో ఇంటర్ పూర్తీ చేసాను. ఇంటర్ లో డాక్టర్ అవుదామన్న సంకల్పంతో బై.పి.సి తీసుకున్నాను. మొదటి సారి ఎనిమిది వెలలోరాంక్ . లాంగ్ టర్మ్ ఇప్పించి, ఒక ఏడాది వేస్ట్ చెయ్యడం తనకు ఇష్టంలేదన్నారు నాన్న. అందుకే, డిగ్రీ చేరి, విడిగా ట్యూషన్ లకు వెళ్ళమన్నారు. ఆడపిల్లలమని ఏదీ బలవంతపెట్టలేదు. ఇంటర్ లో నాకు ఇష్టమయిన గ్రూప్ తీసుకోనిచ్చారు. అయితే, ఒక పక్క డిగ్రీ, ఒక పక్క సంగీతం, ఒక పక్క ట్యూషన్ లు. వీటి మధ్య డిగ్రీ కాలేజీ ఫస్ట్ వచ్చాను కాని, ఎంసెట్ మీద దృష్టి కేంద్రీకరించలేక పోయాను. డిగ్రీ తో పాటుగా కంప్యూటర్ లో పీజీ డిప్లొమా చేసాను. 1996 మోడల్ డొక్కు కంప్యూటర్ లు, బేసిక్, కోబాల్ వంటి ప్రోగ్రామ్స్ తలచుకుంటే , ఇప్పుడు నవ్వు వస్తుంది. అలా డిగ్రీ పూర్తీ చేసాకా , ఎం.ఎస్.సి ఎంట్రన్సు పరీక్షలు రాసాను . ఇందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. బోటనీ ఎంట్రన్స్ లో 58 వ రంక్ వచ్చినా యూనివర్సిటీ లో సీట్ రాలేదు. కెమిస్ట్రీ మొదటి విడత కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు. అమ్మా, నాన్నా నా భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. విజయవాడలో ఒరాకిల్ కోర్స్ చేర్పించండి, చదువుకున్నాకా ఉద్యోగం వాళ్ళే ఇస్తారట, అని చెప్పి, అక్కడ హాస్టల్ లో చేరి చదువుకునే దాన్ని. 'బాబా, నా తెలివితక్కువ తనం వల్ల  అమ్మానాన్న బాధ పడకూడదు. ఆడపిల్లలయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, స్వతంత్రంగా బ్రతికేలా ఉండాలన్నవాళ్ళ సత్సంకల్పం దెబ్బతినకూడదు. నాకొక దారి చూపించు , ' అని ప్రార్దిన్చేదాన్ని.

అలా ఇరవై రోజులు గడిచిందో లేదో, రెండవ విడత కౌన్సిల్లింగ్ కు పిలుపు వచ్చింది. వస్తుందో, లేదో అన్న సంశయంతో బయలుదేరాను. మొదట విజయవాడ సిద్ధార్ధ కాలేజీ లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ వచ్చింది. అయితే, అప్పట్లో ఆ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో , ఏదో అసంతృప్తి. ఇంతలో సిద్ధార్ధ వాళ్ళు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ను ఆర్గానిక్ కెమిస్ట్రీ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. నాకు ఆశ్చర్యం. ఇంతలో మరో అద్భుతం ...బాపట్ల కాలేజీ లో అమ్మాయిల హాస్టల్ సౌకర్యం లేదని ఒక అమ్మాయి విజయవాడకు మారతానని ప్రకటించింది. ఆ సీట్ కోసం ఎవరయినా సుముఖంగా ఉన్నారా అని మైక్ లో అడిగారు. సొంత ఊరు, తెలిసిన మనుషులు...ఎంతో ఆనందంతో స్వీకరించాను. తన బిడ్డ కోసం బాబా ఒక సీట్ ఆట్టేపెట్టినట్టు అనిపించింది. అలా నా చదువు పూర్తి  కాగానే పెళ్లి సంబంధం కుదిరింది. సతీష్ ఎంతో మంచివారు . వారితో నా జీవితం మెత్తటి పూలపై నడకలా సాగిపోయింది. తిరిగి చూసుకునే లోగానే, నా చేతులో ఇద్దరు చిట్టి పాపాయిలు. 

అప్పట్లో మేము బెంగుళూరు లో ఉండేవాళ్ళం. చిన్న దాని అక్షరాభ్యాసం శృంగేరిలో చేయాలని బయలుదేరాం. చిక్మంగులురు నుంచీ శృంగేరి వెళ్ళే దారిలో కాఫీ తోటలు, కొండలు, కోనలు. ఎందుకో ఆ వేళ ఉదయం నుంచీ మనసు కీడు శంకిస్తోంది. వొడిలో బాబా పారాయణ పుస్తకం పెట్టుకుని మౌనంగా కూర్చున్నాను. ఇక శృంగేరి 2 కిలోమీటర్లు ఉందనగా డ్రైవర్ కు 'వచ్చేసాం కదా ' అన్న ధైర్యం వచ్చేసింది. కొండ దారులు, వాన చెమ్మ , వాన నీరు రోడ్డుపైకి రాకుండా రోడ్డుపక్క తవ్విన కాలువలు. హఠాత్తుగా మా సుమోకి అడ్డంగా రెండు ఆవులు వచ్చాయి. వాటిని తప్పించుకునేందుకు డ్రైవర్ బండిని తిప్పగానే, బాలన్స్ తప్పి, కాలువ పైనుంచి యెగిరి, ఒక చెట్టుకు కొట్టుకుని, అటు వెళ్ళే బండి, ఇటు తిరిగి, ఆ కాలువలో పక్కగా పడిపోయింది. అదృష్టం...ఆ కాలవలో బురద తప్ప నీళ్ళు లేవు. వాన్ లో మేము నలుగురం, డ్రైవర్, ఒక తెల్సినాయన. బాంబు పడ్డట్టు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరిగెత్తుకు వచ్చారు. మేము పచ్చడయిపోయి ఉంటామని, వారు భావించారు. ముందుగా మా వారి క్షేమం, తరువాత పిల్లల క్షేమం, తరువాత నా పరిస్థితి సమీక్షిన్చుకున్నాను. సాయం చేసేందుకు బండి వద్దకు వచ్చి, ఒక్కొక్కరినే దించిన వాళ్ళు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే ...మా ఎవ్వరికీ చిన్న దెబ్బ కూడా తగలలేదు. షాక్ నుంచీ కోలుకునే దాకా అనునయించారు. ఆ శారదా దేవి కాపాడింది అంటూ దీవించారు. మంచితనం, మానవత్వం...ఆ రోజే చూసాను. ఆ సుమోకి సుమారు 80,000 రిపేర్ అయ్యిందట....అంటే యెంత బలమయిన దేబ్బో ఊహించండి.

ఆ స్వామి కంటికి రెప్పలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూ రెండుసార్లు పునర్జీవితం  ప్రసాదించారు .ఆయన పెట్టిన ప్రాణభిక్ష వల్లే , మీ ముందు ఈ రోజు నేను మాట్లాడేందుకు ఆస్కారం ఇచ్చింది. తన బిడ్డను తనే రక్షించుకుని, తన సేవకు నియోగించుకున్న ఆ స్వామి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.

|| సమర్ధ సద్గురు సాయినాధాయ నమః ||

3 comments:

  1. అబ్భా...చదువుతుంటే గుండె ఝల్లు మంది ఒక్కక్షణం పద్మిని గారు!!!
    నిజమే నమ్మిన వారిని చెయి వదలనివదలని కన్నయ్య మన సాయికన్నా
    రెండుసార్లు ప్రమాదాన్ని కాపాడి తన (సాయినాధ) అక్కున చేర్చుకొన్న
    మీరు ఎంత ధన్యులో చెప్పలేను
    సదా ఆ స్వామి కృప మీకు మరియు
    మనకందరికీ ఆశీస్సులుగా ఉండాలని ఆ సాయినాథుని కోరుతు సెలవ్ మరి __/\__


    ReplyDelete
  2. అవును నన్ను ఆ నరసింహస్వామి ఓకా నోక అతి క్లిష్టమైన సందర్భం లో మరణం నుండి కాపాడినాడు

    ReplyDelete